మీ జీవిత మార్గనిర్దేశానికి సహాజావబోధాన్ని గ్రహించడం అనే అంశంపై శ్రీ పరమహంస యోగానంద

20 మార్చి, 2023

యోగ్యమైన మన లక్ష్యాలను సాధించడానికి, మనం అనేక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మనం జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మనం ఆధారపడగల ఉత్తమ సాధనము ఏమిటి?

ముందుకు సాగే మన మార్గాన్ని స్పష్టంగా చూడగల మన సామర్థ్యాన్ని సవాలు చేస్తూ — అనుదినం మన దృష్టిని ఆకర్షించే ఇంద్రియ పరధ్యానాల శ్రేణిని ఎదుర్కొంటాము — “నాకు మనశ్శాంతిని అందించే సరైన మార్గాన్ని కనుక్కోవడం ఎలా? అని అనుకోవడం సహజం.”

సహజావబోధం యొక్క శక్తివంతమైన కాంతి “ఆరవ ఇంద్రియం” మనందరిలో నిగూఢంగా దాగి ఉందని శ్రీ పరమహంస యోగానందులు బోధించారు. “సహజావబోధం ఆత్మకు తన గురించిన జ్ఞానాన్ని (ఆత్మ-సాక్షాత్కారాన్ని) ఇస్తుంది” అని ఆయన అన్నారు. “ప్రపంచంలోని గందరగోళాల మధ్య సత్యం గురించి మరియు కర్తవ్యాల గురించి కూడా స్పష్టమైన అవగాహనను సహజావబోధం ప్రసాదిస్తుంది.”

నిర్దుష్టమైన సహజావబోధం పెంపొందించుకోవడానికి సమయం పట్టినప్పటికీ, “మీరు ధ్యానాన్ని అభ్యసిస్తూ, మరియు ఈ అభ్యాసం ద్వారా లభించే ఆంతరిక ప్రశాంతత స్థితిలో ఎక్కువగా జీవిస్తున్నప్పుడు, మీ సహజావబోధ శక్తిలో మరింత అభివృద్ధిని కనుగొంటారు,” అని వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. మూడవ అధ్యక్షురాలైన శ్రీ దయామాత హామీ ఇచ్చారు.

కాబట్టి, దీని గురించి మరింతగా తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే, ప్రశాంతపరిచే శ్వాసను గాఢంగా తీసుకోండి మరియు సహజావబోధం ద్వారా మీ జీవితానికి మార్గనిర్దేశం చేయడానికి ఆత్మ-పరిజ్ఞానం ఎలా పొందవచ్చనే దానిపై శ్రీ పరమహంసగారి జ్ఞానాన్ని గ్రహించండి మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీలోని దైవసాన్నిధ్యాన్ని అనుభూతి చెందండి.

శ్రీ పరమహంస యోగానందుల ప్రసంగాలు మరియు రచనల నుండి:

మీరు ఎంత ఎక్కువగా ధ్యానం చేసి దివ్య చైతన్యానికి అనుశృతిలో మీ మనస్సును ఉంచగలిగితే, అంతగా మీ సహజావబోధం బలపడుతుంది. అంతేగాక, తమ భావోద్వేగాలను నియంత్రించుకున్నవారు మరియు ఆంతరికంగా ప్రశాంతంగా ఉండే వ్యక్తులు తీక్షణమైన సహజావబోధ శక్తులను ఎక్కువగా కలిగి ఉంటారు.

సదా గుర్తుంచుకోండి: అంధకారపు మార్గంలో మీ జీవితం పయనిస్తున్నప్పుడు, ఈ సహజావబోధ శక్తిని అభివృద్ధి చేసుకోవడం ఒక అద్భుతమైన విషయం. అది ధ్యానం ద్వారా మాత్రమే లభిస్తుంది; వేరే మార్గం లేదు. నేను సహజావబోధాన్ని ఉపయోగించినప్పుడు అది ఎల్లప్పుడూ నాకు సరైన నిర్ణయాన్ని చూపుతుంది. అది ఎన్నడూ విఫలం కాదు.

ఈ సహజావబోధం మీకు ఆంతరిక వాణిగా లేదా గుసగుసగా వస్తుంది. ఆ ఆంతరిక మార్గదర్శకత్వానికీ, అవచేతనా మనస్సు యొక్క భ్రమ కలిగించే కాల్పనిక స్వరాల మధ్య వ్యత్యాసాన్ని గ్రహించడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి.

సహజావబోధం అనేది ఆత్మ యొక్క మార్గదర్శకత్వం, మానవుడి మనస్సు ప్రశాంతంగా ఉండే క్షణాలలో సహజంగా స్ఫురిస్తుంది….యోగ శాస్త్రం యొక్క లక్ష్యం మనస్సును ప్రశాంతపరచి, వక్రీకరణ లేని ఆ ఆంతరిక వాణి యొక్క దోషరహిత సలహా వినడమే.

పరమేశ్వరుని గురి౦చి మనం తెలుసుకొన్నప్పుడు, స్వీయ సమస్యలకే కాదు, లోకాన్ని చుట్టుముట్టిన సమస్యలకు కూడా సమాధానాలు లభిస్తాయి. మనం ఎందుకు జీవిస్తున్నాము, ఎందుకు మరణిస్తాము? ఎందుకీ గత, వర్తమాన సంఘటనల పరంపర? మానవ జాతి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే సాధువు ఈ భూమి మీదకు ఎవరైనా వస్తారా అనేది నా సందేహం. కాని ధ్యాన మందిరంలో మన హృదయాలను వేధిస్తున్న జీవితపు ప్రతి చిక్కుముడి పరిష్కారమవుతుంది. జీవితంలోని మన సమస్యలకు సమాధానాలను గ్రహిస్తాము. భగవంతునితో సంపర్కం ఏర్పడినప్పుడు మన కష్టాలన్నింటికీ పరిష్కారం కనుగొంటాం.

[యోగదా సత్సంగ పాఠాలలోని ప్రార్థన-దివ్యసంకల్పం నుండి:] “ప్రియతమ ప్రభూ, నా మనో ఏకాంతంలో నేను నీ స్వరాన్ని వినాలని కాంక్షిస్తున్నాను. నీ పెదవుల మౌనాన్ని వీడి నా ఆత్మకు నిరంతర మార్గదర్శక ఆలోచనలతో గుసగుసలాడు.”

సహజావబోధంపై మరింత సుగమమైన మరియు ఉన్నతిని కలిగించే శ్రీ పరమహంస యోగానందుల “జీవించడం ఎలా” మార్గదర్శకత్వాన్ని మీరు మా వెబ్‌సైట్‌లో పొందవచ్చు. శాశ్వత నిత్య అవగాహన అనే ఊట నుండి గ్రహించి, ఆ ప్రేరణను మీ ధ్యాన సాధనతో జోడించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

ఇతరులతో షేర్ చేయండి