“ఒక శాంతియుత జీవన మార్గం — యోగాన్ని మరియు ఒక దివ్య మార్గదర్శకాన్ని అనుసరించడం” అనే అంశంపై శ్రీ దయామాత

8 సెప్టెంబర్, 2023

పరమహంస యోగానందగారి ఇన్నర్ పీస్: హౌ టు బి కామ్లీ ఆక్టివ్ అండ్ ఆక్టివ్లీ కామ్ (Inner Peace: How to Be Calmly Active and Actively Calm) అనే పుస్తకంలోని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క ప్రియతమ మూడవ అధ్యక్షురాలు శ్రీ శ్రీ దయామాతగారి — పరిచయ వాక్యాల నుండి సేకరించబడిన సారాంశం.

శాంతి, స్థిమితము, ఆంతరిక సమతుల్యత వంటివి మనం కలుసుకున్న వారి వైఖరిలో మనం నిజంగా గమనించే వరకు, లేదా మనలో ఆ లక్షణాలు ప్రతిబింబించే వరకు అవి కేవలం వట్టిమాటలు మాత్రమే.

పరమహంస యోగానందగారితో ఉన్న నా ఇరవై సంవత్సరాల పర్యంతం, ఆయన నుండి ఉద్భవించే వర్ణనాతీతమైన శాంతి సౌరభాన్ని ప్రతి దినమూ ఆస్వాదించే ఆశీర్వాదం నాకు లభించింది; ఆయన వద్దకు వచ్చిన వారందరికీ తమ స్వీయ ఆత్మల్లోని గాఢమైన శాంతిని వెలికితీసే అసాధారణ సామర్థ్యాన్ని ఆ శక్తి ఆయనకు కలుగజేసింది.

సాంకేతిక పరిజ్ఞానం నేటి యుగంలో అద్భుతమైన పురోగతి సాధించింది, కాని తరచుగా అవి మన వ్యక్తిగత జీవితాలలో పెరిగిన ఒత్తిడి మరియు సంక్లిష్టతలు అనే అధిక మూల్యముతో మాత్రమే బాహ్య పరిస్థితులను మెరుగుపరుస్తాయి. సమతుల్యత కోసం అన్వేషించడమనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బహుశా అత్యంత ఆవశ్యకమైన “నూతన” శాస్త్రం నిజానికి ప్రాచీనమైనమైనదని తెలుసుకుంటున్నారు: యోగం యొక్క సనాతనమైన పద్ధతులు శరీరం, మనస్సు మరియు ఆత్మను సమన్వయపరిచే ఆంతరిక శాంతిని సాధించడానికి నిజమైన ప్రభావవంతమైన విధానాన్ని అందిస్తాయి.

పరమహంస యోగానందగారి జ్ఞాన-నిధి నుండి, మనకు అత్యంత విలువైన యోగ “భంగిమలు” బోధించబడ్డాయి: ఆయన తరచుగా బోధించే “ఫెళఫెళమంటూ విరిగిపడుతున్న ప్రపంచాల మధ్య” అంతర్గత భద్రతలో నిశ్చలతతో స్థిరంగా ఉండటం, “సమస్త అవగాహనను అధిగమించే శాంతిలో స్థిరంగా పాదుకొనడం” — అదే నిజమైన ఆధ్యాత్మికత నెరవేర్చే వాగ్దానం.

ప్రశాంతమైన అంతర్గత స్థిమితము కోసం, శక్తివంతమైన మరియు క్రియాశీల కార్యకలాపాల నుండి పిరికితనంగా ఉపసంహరణ అవసరం లేదని పరమహంస యోగానందగారు బోధించారు. నిజానికి, పాశ్చాత్య దేశాలలో భారతదేశ ధ్యాన బోధనలను విజయవంతంగా నడిపించడంలో ఆయన సాధించిన అసాధారణ బాహ్య విజయాలకు ఒక చైతన్యవంతమైన, సృజనాత్మక వ్యక్తిత్వం అనేది చాలా అవసరం.

వారు తమ కార్యాన్ని ప్రధానంగా ఏదో ఏకాంత రహస్య ప్రదేశంలో కాకుండా, న్యూయార్క్, షికాగో, లాస్ ఏంజిలిస్ వంటి నగరాల గందరగోళంలో — భూమి మీద అత్యంత గందరగోళం మరియు అత్యంత వ్యాకులమైన ప్రదేశాలలో కూడా కొనసాగించారు! అయినప్పటికీ ఆయన ఎల్లప్పుడూ ఆత్మ యొక్క స్వాభావికమైన ప్రశాంతతలో సంతోషంగా కేంద్రీకృతమై ఉండేవారు.

ఆ ప్రశాంత శక్తి యొక్క ఆకస్మిక ప్రదర్శన (అదృష్టవశాత్తూ అది ఎప్పుడూ పునరావృతం కాలేదు) కు సంబంధించిన ఆయన కథ, పరమహంసగారి అనుయాయులలో ఒకరికి ఇష్టమైనది.

న్యూయార్క్ నగరంలో, ముగ్గురు దొంగలు తుపాకీలతో వీధిలో ఆయనపై దాడి చేశారు. ఆయన వారి వైపు చూస్తూ ఇలా అన్నారు: “మీకు డబ్బు కావాలా? తీసుకోండి.” ఆయన తన పర్సుని బయటకు తీశారు.

అనూహ్యంగా ఆ ముష్కరులు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. వారి సాన్నిధ్యంలో ఆయన ప్రసరించిన ఆధ్యాత్మిక స్పందనలతో వారు పూర్తిగా పరివర్తన చెందారు.

చివరికి వారిలో ఒకరు ఇలా అన్నారు: “క్షమించండి. మేము అది చేయలేము,” అని వారు వెనుదిరిగి పారిపోయారు.

ఆయన బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడల్లా, దారినపోయే వ్యక్తులు ఆగి, ఆయన వైపు రెప్పవాల్చకుండా చూస్తూ, ఆయనతో ఉన్న మమ్మల్ని ఇలా అడిగేవారు, “ఆయన ఎవరు? ఆ వ్యక్తి ఎవరు?”

ఆయన చుట్టూ ఎప్పుడూ నిశ్శబ్దమైన, ప్రశాంతతా ప్రకంపన ఉండేది, అదే ప్రజలను ఆయన వైపు ఆకర్షించేది.

ఆత్మశాంతి అనేది విచ్ఛిన్నమైన వ్యక్తిగత మరియు కుటుంబ సామరస్యాన్ని, విచ్ఛిన్నమైన మన సమాజాల నిర్మాణాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఇది ఒక జీవన విధానంగా తీసుకుంటే, మీ ఉనికికి సమతుల్యతను మరియు స్వస్థతను తీసుకువచ్చే శక్తిని కలిగి ఉంటుంది; మీకు తారసపడిన వారందరినీ మీ ప్రశాంతతా స్పందనలు స్పృశిస్తాయి, అంతేకాక మన వసుదైక కుటుంబంలో శాశ్వత శాంతి ఏర్పడడానికి లోతైన రీతిలో దోహదపడతాయి.

ఇతరులతో షేర్ చేయండి