అనిశ్చిత ప్రపంచంలో అంతర్గత భద్రత

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి రచనల నుండి సారాంశాలు

యుద్ధాలు మరియు ప్రకృతి వైపరీత్యాలు ఇంత ఎక్కువగా ఎందుకు జరుగుతాయి?

ప్రకృతిలో సంభవించే ఆకస్మిక ఉపద్రవాల వల్ల కలిగే వినాశనం మరియు సామూహిక నష్టాలు “దేవుని చర్యలు” కాదు. ఇలాంటి విపత్తులు మనిషి ఆలోచనలు, చర్యల వల్లనే సంభవిస్తాయి. మనిషి యొక్క తప్పుడు ఆలోచనలు మరియు తప్పుడు పనుల ఫలితంగా, ఎప్పుడైతే ప్రపంచంలోని మంచి చెడుల ప్రకంపనల సమతుల్యత హానికరమైన ప్రకంపనల వృద్ధి వల్ల చెదిరినప్పుడు, మీరు వినాశనాన్ని చూస్తారు….

విధిలేని దైవ చర్యల వల్ల కాకుండా విస్తృతమైన భౌతిక స్వార్థం వల్లనే యుద్ధాలు జరుగుతాయి. వ్యక్తిగత, పారిశ్రామిక, రాజకీయ, జాతీయ — స్వార్థాన్ని బహిష్కరించండి — ఇక మీకు యుద్ధాలు ఉండవు.

భక్తిహీనమైన ఆదర్శాల ప్రకారం జీవించడం వల్ల ఆధునిక అస్తవ్యస్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడ్డాయి. స్వర్గలోకపు ఆదర్శాలైన సౌభ్రాతృత్వంతో, పారిశ్రామిక సహకారంతో, మరియు భూలోకపు ఉత్పత్తులు మరియు అనుభవాలను అంతర్జాతీయంగా ఇచ్చిపుచ్చుకొని జీవించినట్లయితే తీవ్ర విధ్వంసాల నుండి రక్షించబడతారు.

మరింత అవగాహనతో మనకు సరిహద్దులు ఉండని సమయం వస్తుందని నేను నమ్ముతున్నాను. మనం భూమిని మన దేశం అని పిలుస్తాము; మరియు మనం, న్యాయప్రక్రియ మరియు అంతర్జాతీయ అసెంబ్లీ ద్వారా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రపంచంలోని వస్తువులను నిస్వార్థంగా పంపిణీ చేద్దాం. కానీ సమానత్వం బలవంతంగా స్థాపించబడదు; అది హృదయం నుండి రావాలి….ఇప్పుడే మనం ప్రారంభించాలి. మనకు మార్గాన్ని చూపించడానికి పదే పదే భూమిపైకి వచ్చిన మహాత్ముల వలె ఉండేందుకు మనం ప్రయత్నించాలి. వారు బోధించిన మరియు ఉదాహరించిన విధంగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా మరియు మన అవగాహనను స్పష్టంగా ఉంచుకోవడం ద్వారా శాంతి స్థాపించబడుతుంది.

ప్రపంచ బాధలను తొలగించడానికి సహాయపడే ఒక విషయం ఏమిటంటే — డబ్బు, గృహాలు, లేదా మరేదైనా ఇతర భౌతిక సహాయం కంటే కూడా — మనం భావించే భగవంతుని దివ్య చైతన్యాన్ని ధ్యానించడం మరియు ఇతరులకు ప్రసారం చేయడం. వెయ్యి మంది నియంతలు కూడా నా లోపల ఉన్నదాన్నినాశనం చేయలేరు. ప్రతిరోజూ ఇతరులకు దేవుని చైతన్యాన్ని ప్రసరింపజేయండి. మానవ జాతి కోసం దేవుని ప్రణాళికను అర్థం చేసుకోండి — అన్ని ఆత్మలను తిరిగి తన వైపుకు ఆకర్షించడం — ఆయన సంకల్పానికి అనుగుణంగా పని చేయడం.

దేవుడే ప్రేమ; సృష్టి కోసం ఆయన ప్రణాళిక ప్రేమలో మాత్రమే పాదుకోగలదు. వివేకవంతమైన తార్కికత కంటే, ఆ సరళమైన ఆలోచన, మానవ హృదయానికి సాంత్వన కలిగించడం లేదా? సత్య గర్భంలోకి చొచ్చుకుపోయిన ప్రతి సాధువు, ఒక సార్వత్రిక దైవప్రణాళిక ఉంటుందని మరియు అది అందంగాను, ఆనందంతోను నిండి ఉంటుందని నిరూపించాడు.

దేవునిపై విశ్వాసం ద్వారా నిర్భయంగా మరియు సురక్షితంగా ఉండండి

సూర్యకిరణాలు ప్రసరిస్తున్న ఉద్యానవనంఈ ప్రపంచంలోని తుఫానుల నుండి భద్రత కలిగించగలిగేది దేవుడి ఆశ్రయం మాత్రమే. “మీ హృదయపూర్వకమైన ఆత్రుతతో ఆయనలో ఆశ్రయం పొందండి. ఆయన అనుగ్రహంతో మీరు అత్యంత శాంతిని మరియు శాశ్వతమైన ఆశ్రయాన్ని పొందుతారు.” ఆయనలోనే నా జీవితంలోని ఆనందాన్ని, నా ఉనికి యొక్క వర్ణించలేని ఆశీర్వాదాన్ని, నాలో ఉన్న ఆయన సర్వవ్యాపక అద్భుత సాక్షాత్కారాన్ని కనుగొన్నాను. మీ అందరికీ అది ఉండాలని నేను కోరుకుంటున్నాను.

భగవంతుడు ఉన్న చోట భయము, దుఃఖము ఉండవని యోగం బోధిస్తుంది. ఫెళఫెళమని బ్రద్ధలవుతున్న ప్రపంచాల మధ్య కూడా సాఫల్యవంతుడైన యోగి కదలకుండా నిలువగలడు: అతను “ప్రభూ, నేను ఎక్కడ ఉన్నానో, అక్కడికి నీవు రావాలి” అంటూ ఆత్మసాక్షాత్కారంలో సురక్షితంగా ఉంటాడు.

నిర్భయత్వం అంటే భగవంతుడి మీద విశ్వాసం: ఆయన రక్షణ మీద విశ్వాసం, ఆయన న్యాయం, ఆయన జ్ఞానం, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన సర్వవ్యాపకత్వం….

మనిషి ఆత్మ యొక్క అసాధ్యతను భయం మరుగుపరుస్తుంది. అంతర్లీనంగా ఉన్న దైవిక శక్తి మూలం నుండి ఉద్భవించే ప్రకృతి పరమైన సామరస్య పనితీరుకు భంగం కలిగించి, శారీరక, మానసిక, మరియు ఆధ్యాత్మిక అవాంతరాలకు భయం కారణమవుతుంది….ఆందోళనలో మునిగిపోకుండా అతనిలా ధృవీకరించాలి: “నీ ప్రేమ సంరక్షణ అనే కోటలో నేనెల్లప్పుడూ భద్రంగా ఉన్నాను.”

మీరు ఆఫ్రికా అడవిలో ఉన్నా లేదా యుద్ధంలో ఉన్నా లేదా వ్యాధి మరియు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నా, ప్రభువుతో ఇలా చెప్పండి, మరియు విశ్వసించండి: “నేను నీ సాన్నిధ్యమనే సాయుధ శకటంలో ఉండి జీవితమనే యుద్ధభూమిని దాటుతున్నాను. నేను రక్షించబడ్డాను.” సురక్షితంగా ఉండటానికి వేరే మార్గం లేదు. ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంచండి. నేను అసాధారణమైన దాన్ని సూచించడం లేదు; “ప్రభూ, నాకు సహాయం చేయగలిగేది నీవు మాత్రమే” అని, ఏ పరిస్థితుల్లో అయినా ఈ సత్యాన్ని ధృవీకరించి, విశ్వసించమని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.

మీ సమస్యలన్నింటికీ పరిష్కారం కోసం దేవుణ్ణి ఆశ్రయించండి. విపరీతమైన కష్టాలు అకస్మాత్తుగా హిమపాతంలా మీపైకి వచ్చి పడినప్పుడు మీ ధైర్యం మరియు నేర్పరితనము స్తంభించి పోవడానికి అనుమతించవద్దు. మీ సహజమైన ఇంగిత జ్ఞానాన్ని మరియు భగవంతునిపై మీ విశ్వాసాన్ని మెలకువగా ఉంచండి మరియు తప్పించుకోవడానికి అత్యంత సన్నని మార్గాలను కూడా కనుగొనడానికి ప్రయత్నించండి, మీరు ఆ మార్గాన్ని కనుగొంటారు. అంతిమంగా అన్నీ సకాలంలో బయటకు వస్తాయి, ఎందుకంటే దేవుడు తన మంచితనాన్ని మర్త్య అనుభవాల వైవిధ్యం యొక్క ఉపరితలం వెనుక దాచి ఉంచాడు.

అంధకారం సమయాలలో దేవుని ప్రేమపూర్వక మార్గదర్శకత్వాన్ని ఎంచుకోండి

ప్రభువును మీ ఆత్మకు కాపరిగా చేయండి. మీరు జీవితంలో నీడలేని మార్గంలో వెళ్ళినప్పుడు దేవుణ్ణి మీ అన్వేషక దీపంలా చేసుకోండి. అజ్ఞానపు రాత్రిలో ఆయన మీ చంద్రుడు. మేల్కొనే సమయంలో ఆయన మీ సూర్యుడు. మరియు చీకటి సముద్రపు మర్త్య స్థితిలో ఆయన మీకొక ధ్రువతార. ఆయన మార్గదర్శకత్వం కోరండి. ప్రపంచం తన ఎత్తుపల్లాలలో ఇలాగే సాగిపోతుంది. ఒక దిశానిర్దేశం కోసం మనం ఎక్కడ వెతకాలి? మన అలవాట్లు మరియు మన కుటుంబాలు, మన దేశం లేదా ప్రపంచం యొక్క పర్యావరణ ప్రభావాల ద్వారా మనలో రేకెత్తిన దురభిమానాలకు కాదు; కానీ అంతర్గత సత్యం యొక్క మార్గదర్శక స్వరాన్ని ఆలకించాలి.

ప్రతి క్షణం నేను భగవంతుని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. నేను నా హృదయాన్ని ప్రభువు ఆశ్రయంలోకి ఇచ్చాను. నా ఆత్మ బాధ్యతను ఆయనకు అప్పగించాను. నా ప్రేమను, నా భక్తిని శాశ్వతమైన ఆయన పాదాల వద్ద సమర్పించాను. దేవుణ్ణి తప్ప దేనినీ నమ్మవద్దు. ఆపై, దేవుని అంతర్గత దిశానిర్దేశంలో, ఆయన కాంతిని వ్యక్తపరిచే వారిని విశ్వసించండి. ఆ వెలుగే నా మార్గదర్శి. ఆ వెలుగే నా ప్రేమ. ఆ వెలుగే నా జ్ఞానం. మరియు తన ధర్మం ఎలా గెలుస్తుందో, ఎప్పటికీ ఎలా గెలుస్తుందో ఆయన చెబుతాడు.

ఈ యుద్ధం గురించి నేను ఆందోళన చెందాను. కానీ నేను ఇలా ప్రార్థించినప్పుడు నాకు ఎంతో ఓదార్పు లభించింది: “ప్రభూ, నేను తీర్పు ఇచ్చేవాడిని కాదు. నీవు మనుషులకు మరియు జాతులకు న్యాయమూర్తివి. అందరి కర్మలు నీకు తెలుసు. మరియు నీ తీర్పు ఏమిటి, అది నా కోరిక.” ఈ ఆలోచన భారతదేశం పట్ల కూడా నా ఆందోళనను దూరం చేసింది, ఎందుకంటే దేవుడు ఆ దేశాన్ని రక్షిస్తాడని నాకు తెలుసు. మనం ప్రభువు తీర్పుపై ఎక్కువగా ఆధారపడటం నేర్చుకోవాలి. అది ప్రపంచ నాటకంలో ప్రతి అంకం ముగిసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. యుద్ధ సమయంలో ఆయన తీర్పు అర్థం కాకపోవచ్చు; కానీ కాలక్రమేణా ఈ వివాదంలో ఆయన హస్తం ఉందని మనం తెలుసుకుంటాము. తక్షణ ఫలితంగా మరియు ఆ తర్వాత జరగబోయేది – ఆయన తీర్పు ప్రకారం, ప్రతి దేశం మరియు ఆ దేశంలోని ప్రతి వ్యక్తి సంపాదించిన కర్మ ప్రకారం జరుగుతుంది. ఈ యుద్ధ మంటల నుండి ఒక గొప్ప ప్రపంచం వస్తుంది. దీన్ని గుర్తుంచుకోండి: క్రూరమైన బలం అంతిమ విజేత కాదు. ఈ యుద్ధంలో భగవంతుని ధర్మం విజేతగా అవతరిస్తుందని మీరు తెలుసుకొంటారు.

ప్రస్తుత ప్రపంచ పరిస్థితిలో అనుసరించవలసిన ఆధ్యాత్మిక విధానం ఏమిటి?

ప్రస్తుత ప్రపంచ సంక్షోభం, ద్వాపర యుగం పైకి అధిరోహించడం వల్ల ఏర్పడింది; ప్రపంచం బాగుపడాలంటే చెడును నిర్మూలించాలి. దుష్టశక్తులు తమ స్వంత వినాశనాన్ని కలుగజేసుకుంటాయి, తద్ద్వారా నీతిమంతమైన దేశాల మనుగడకు భరోసా కలుగుతుంది. చరిత్ర ఆవిర్భవించినప్పటి నుంచి మంచి చెడుల మధ్య సంఘర్షణ కొనసాగుతూనే ఉంది. కానీ ప్రపంచం విద్యుత్ లేదా పరమాణు యుగమైన ద్వాపర యుగం ద్వారా అధిరోహణలో ఉన్నందువల్ల, మంచి సంభవించడం మాత్రమే కాకుండా, సాంకేతికతను దుర్వినియోగం చేసే అత్యాశాపరుల వల్ల మరియు అధికారాన్ని కోరుకునేవారి వల్ల వినాశనానికి కూడా ఎక్కువ సంభావ్యత ఉంది. ద్వాపర యుగం యొక్క ప్రభావానికి అనుగుణంగా, సాంకేతికత సాధారణ ప్రజలను ఉన్నత స్థాయికి చేర్చుతుంది. కానీ ఈ పురోగతి, సాధించినవారి మధ్య మరియు సాధించని వారి మధ్య ఎక్కువ అంతరాన్ని కూడా సృష్టిస్తుంది. ఇది అసూయలను మరియు సామాజిక, ఆర్థిక, మరియు రాజకీయ సమస్యలను రేకెత్తిస్తుంది.

పరస్పర ప్రేమ, అవగాహన మరియు సహకారంతో సృష్టించబడిన మానవుల సోదరభావాన్ని నేను నమ్ముతాను. అన్ని విలువైన లక్ష్యాలు మరియు గొప్ప ఆదర్శాలను ఆధ్యాత్మిక నిదర్శనాలు మరియు మంచి పద్ధతుల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలి, క్రూరమైన బలం మరియు యుద్ధం ద్వారా కాదు. ఆధ్యాత్మిక సూత్రాలు లేని రాజకీయ అధికారం ప్రమాదకరం. ఆధ్యాత్మిక సూత్రాల ద్వారా నేను నిర్దిష్ట మతాల సిద్ధాంతాలను సూచించను — అవి విభజన కూడా కావచ్చు — కానీ ధర్మం లేదా మానవాళి యొక్క శ్రేయస్సు కోసం వర్తించే ధర్మం లేదా సార్వత్రిక సూత్రాలను సూచిస్తాను. చెడు వ్యాపించకుండా నిరోధించడానికి, కొన్నిసార్లు ధర్మబద్ధమైన యుద్ధం కూడా అవసరం. క్రూరమైన పులికి అహింస మరియు సహకారం గురించి మీరు బోధించలేరు, ఎందుకంటే మీరు మీ తత్వాన్ని వివరించే దానికంటే ముందే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. చెడుకు పాల్పడే కొందరు మానవ నేరస్థులు కూడా హేతుబద్ధంగా స్పందించరు. హిట్లర్ వలె యుద్ధంలో దూకుడుగా పందెం వేసే ఎవరైనా ఓడిపోతారు. చెడుకు వ్యతిరేకంగా ధర్మ యుద్ధం చేయాలని ఒత్తిడి చేయబడిన వారు గెలుస్తారు. యుద్ధం న్యాయమైనదా కాదా అనేది దేవునిచే నిర్ణయించబడుతుంది.

నేను ఇప్పుడొక భవిష్య సంఘటన చెబుతున్నాను: ప్రపంచం వినాశనం చెందబోవడం లేదు. కాబట్టి భయపడవద్దు. మీ తండ్రిని నమ్మండి. ఆయన ఆశయాలను గుర్తు పెట్టుకుంటే, ఆయనపై నమ్మకం ఉంచితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. మనం అధిరోహణలో ఉన్నాం. భౌతిక చక్రం యొక్క పన్నెండు వందల సంవత్సరాలు గడిచిపోయాయి మరియు అణుయుగం యొక్క రెండు వేల నాలుగు వందల సంవత్సరాలలో మూడు వందలు గడిచి పోయాయి. అప్పుడిక మానసిక మరియు ఆధ్యాత్మిక యుగాలు ఉంటాయి. మనం దిగజారడం లేదు. ఏది జరిగినా ఆత్మ గెలుస్తుంది. ఇది నా భవిష్య వాక్యం….ఎవరైతే యుద్ధం వలన ప్రేరేపించబడి బాంబులను ఉపయోగిస్తారో, ఆ బాంబులకే వారు బలైపోతారు. కానీ అమెరికా మరియు భారతదేశ హృదయాలలో హింసకు తావు లేదని నాకు తెలుసు. హిట్లర్ తన శక్తితో పతనమైనట్లే, ఏ నియంత అయినా, అతను ఎక్కడ ఉన్నా పడగొట్టబడతాడు. ఇది నా భవిష్యవాక్యం.

ప్రపంచంలోని నా సోదర, సోదరీమణులారా: దేవుడే మన తండ్రి అనీ మరియు ఆయన ఒక్కడేనని దయచేసి గుర్తుంచుకోండి. మనమందరం ఆయన పిల్లలం, కాబట్టి మనం ఒకరికొకరు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, మరియు ఆధ్యాత్మికంగా ప్రపంచ రాజ్యంలో ఆదర్శ పౌరులుగా మారడానికి నిర్మాణాత్మక మార్గాలను అవలంబించాలి….

ప్రతి ఆత్మ నిజమైన ఆధ్యాత్మిక అవగాహనలో చిన్న విభజనలను అధిగమించినప్పుడు, భగవంతుని విశ్వవ్యాపకత్వంలో మరియు మానవ సోదరభావం యొక్క సాక్షాత్కార అగ్నిలో ప్రపంచ దుఃఖం దహించబడుతుంది.

రేడియో, టెలివిజన్ వంటి ప్రసార సాధనాలు మరియు విమాన ప్రయాణం మనందరినీ మునుపెన్నడూ లేని విధంగా ఒకచోటకు చేర్చాయి. ఇది ఇకపై ఆసియావాసులకు ఆసియాగా, యూరప్‌వారికి యూరప్‌గా, అమెరికన్లకు అమెరికాగా ఉండదని, కానీ భగవంతుని పాలనలో ఉన్న ఐక్యరాజ్యమని మనం నేర్చుకోవాలి. దీనిలో ప్రపంచంలోని ప్రతి మానవుడు శరీరం, మనస్సు, మరియు ఆత్మలో పరిపూర్ణత పొందే అవకాశాలతో ఆదర్శ పౌరుడిగా ఉండగలడు.

భూమి యొక్క అస్థిరమైన నీడల వెనుక, దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను అన్వేషించండి

ఏ మనిషి, ఏ ప్రవక్త, కూడా ఈ భూమిపై ఉన్న అన్ని అసమానతలను మరియు విభజనలను ఎప్పటికీ రూపుమాపలేరు. కానీ భగవంతుని చైతన్యంలో మిమ్మల్ని మీరు కనుగొన్నప్పుడు, ఈ తేడాలు మాయమవుతాయి మరియు మీరు ఇలా అంటారు:

నీ పాట నాలో ప్రవహిస్తున్నప్పుడు, జీవితం మధురం మరియు మరణం ఒక కల. నీ పాట నాలో ప్రవహిస్తున్నప్పుడు, ఆనందం మధురం, దుఃఖం ఒక కల. నీ పాట నాలో ప్రవహిస్తున్నప్పుడు, ఆరోగ్యం మధురం, అనారోగ్యం ఒక కల. నీ పాట నాలో ప్రవహిస్తున్నప్పుడు, ప్రశంస మధురం మరియు నింద ఒక కల.

ఇదే అత్యున్నత జ్ఞానం. దేనికి భయపడకు. తుఫానులో అల పైకి తోసివేసినప్పుడు కూడా, మీరు సముద్రపు ఒడ్డునే సురక్షితంగా ఉంటారు. భగవంతుని అంతర్లీన సాన్నిధ్యం యొక్క చైతన్యాన్ని ఎల్లప్పుడూ పట్టుకోండి. నిశ్చింతగా ఉండండి మరియు ఇలా చెప్పండి: “నేను నిర్భయుడిని; నేను భగవంతుని పదార్థంతో తయారయ్యాను. నేను ఆత్మ యొక్క అగ్ని కణాన్ని. నేను విశ్వజ్వాలం యొక్క పరమాణువును. నా తండ్రి యొక్క విస్తారమైన సార్వత్రిక శరీర కణాన్ని నేను. ‘నేను మరియు నా తండ్రి ఒక్కటే.'”

కేవలం దేవునికి మీరు పాదాభివందనం చేయండి. ఆయనకు శరణాగతి చేయడానికి ఇప్పటికంటే మంచి సమయం లేదు. భగవంతుడిని కనుగొనడానికి మీ ఆత్మ యొక్క మొత్తం శక్తిని ఉపయోగించండి….మాయ యొక్క పొగ తెర మనకు మరియు ఆయనకి మధ్య వచ్చింది మరియు మనం ఆయనను కోల్పోయినందుకు ఆయన చింతిస్తున్నాడు. బాంబులు పడడం వల్ల, భయంకరమైన వ్యాధుల వల్ల మరియు తప్పుడు జీవన అలవాట్లతో చనిపోవడం — తన పిల్లలు చాలా బాధలు పడటం చూసి ఆయన సంతోషించడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మరియు తిరిగి రావాలని కోరుకుంటూ ఉన్నందున ఆయన చింతిస్తున్నాడు. మీరు ధ్యానం చేయడానికి మరియు ఆయనతో ఉండడానికి రాత్రిపూట ప్రయత్నం చేస్తే, ఆయన మీ గురించి చాలా ఆలోచిస్తాడు. నీవు వదిలివేయబడలేదు. మిమ్మల్ని విడిచిపెట్టింది మీరే…. దేవుడు మీ పట్ల ఎప్పుడూ ఉదాసీనంగా లేడు….

పర్వతాలతో కూడిన అందమైన ప్రకృతి దృశ్యం

సృష్టి యొక్క ఏకైక ఉద్దేశ్యం, దాని రహస్యాన్ని ఛేదించడానికి మరియు అన్నిటి వెనుక ఉన్న భగవంతుడిని గ్రహించమని మిమ్మల్ని బలవంతం చేయడమే. మీరు మిగతావన్నీ మరచిపోయి ఆయనను మాత్రమే అన్వేషించాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు భగవంతుని ఆశ్రయం పొందిన తర్వాత జీవన్మరణాలు వాస్తవాలనే స్పృహ ఉండదు. భగవంతుడి శాశ్వత స్థితిలోకి రావడం పోవడం వంటి ఈ ద్వంద్వాలన్నీ నిద్రలో కల లాంటివని తెలుసుకొంటారు. ఈ జ్ఞానోపదేశాన్ని మరచిపోకండి. నా స్వరం ద్వారా ఆయన చేస్తున్న ఈ జ్ఞానోపదేశాన్ని మరచిపోవద్దు! ఆయన ఇలా చెబుతున్నాడు:

“నేను మీలాగే నిస్సహాయంగా ఉన్నాను, ఎందుకంటే నేను, మీ ఆత్మగా, మీతో శరీరంలో ముడిపడి ఉన్నాను. మిమ్మల్ని మీరు విడిపించుకొనకపోతే, నేను మీతో పంజరంలో చిక్కుకొని ఉన్నాను. ఆలస్యం చేయవద్దు. బాధ మరియు అజ్ఞానమనే బురదలో పొర్లాడవద్దు. రండి! నా వెలుగులో స్నానం చెయ్యండి.”

ఈ భ్రాంతికరమైన ప్రపంచం నుంచి మనం తప్పించుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన మన కోసం రోదిస్తున్నాడు, ఎందుకంటే ఆయన విముక్తస్థితిని పొందడం మనకు ఎంత కష్టమో ఆయనకు తెలుసు. కానీ మీరు ఆయన బిడ్డ అని మాత్రమే గుర్తుంచుకోవాలి. మీ మీద మీరు జాలిపడకండి. దేవుడు కృష్ణుడిని మరియు జీసస్ ను ప్రేమించినట్లే మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. మీరు ఆయన ప్రేమను అన్వేషించాలి, ఎందుకంటే అది శాశ్వతమైన స్వేచ్ఛ, అంతులేని ఆనందం మరియు అమరత్వాన్ని కలిగి ఉంటుంది.

ఈ ప్రపంచం యొక్క భయానక కల గురించి భయపడవద్దు. దేవుని అమర కాంతిలో మేల్కొనండి! ఒకప్పుడు నాకు జీవితం, భయంకరమైన చలనచిత్రాన్ని నిస్సహాయంగా చూడటం లాంటిది, అందులో చిత్రీకరించబడిన విషాదాలకు నేను చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడిని. అప్పుడు, ఒక రోజు నేను ధ్యానం చేస్తున్నప్పుడు, నా గదిలో ఒక గొప్ప కాంతి కనిపించింది మరియు దేవుని స్వరం నాతో ఇలా చెప్పింది: “నువ్వు దేని గురించి కలలు కంటున్నావు? అనేక పీడకలలు వచ్చిపోతున్న ప్రపంచంలో నా శాశ్వతమైన కాంతిని దర్శించు. అవి నిజమైనవి కావు.” అది ఎంత గొప్ప ఓదార్పు! పీడకలలు భయంకరమైనప్పటికీ అవి కేవలం పీడకలలు మాత్రమే. చలనచిత్రాలు ఆనందించేవి లేదా కలవరపరిచేవి అయినప్పటికీ అవి కేవలం చలనచిత్రాలు మాత్రమే. ఈ జీవితంలోని విచారకరమైన మరియు భయపెట్టే నాటకాలలో మన మనస్సులను అంతగా లీనం చేయకూడదు. నాశనం లేని మరియు మార్పులేని ఆ శక్తి పై దృష్టి పెట్టడం తెలివైన పని కాదా? ఈ ప్రపంచమనే చలనచిత్ర కథాంశంలోని చెడ్డ సంఘటనల గురించి ఎందుకు చింతించాలి! మనం ఇక్కడ కొద్దిసేపు మాత్రమే ఉంటాము. జీవిత నాటకం యొక్క పాఠాన్ని నేర్చుకోండి మరియు మీ స్వేచ్ఛను కనుగొనండి.

ఈ జీవితం యొక్క నీడల కింద దేవుని అద్భుతమైన కాంతి ఉంది. విశ్వం ఆయన సాన్నిధ్యపు విశాల దేవాలయం. మీరు ధ్యానం చేస్తే, ప్రతి చోట ఆయన వైపు ద్వారాలు తెరవబడుతున్నట్లు మీరు కనుగొంటారు. మీరు ఆయనతో అనుసంధానం పొందినప్పుడు, ప్రపంచంలోని ఏ వినాశనాలు ఆ ఆనందాన్ని మరియు శాంతిని తీసివెయ్యలేవు. ధృవీకరణ: “జీవితంలో మరియు మరణంలో, వ్యాధిలో, క్షామములో, పీడలలో లేదా పేదరికంలో ఎప్పుడైనా నేను నిన్నే అంటిపెట్టుకుని ఉండుగాక. బాల్యము, యవ్వనము, వయస్సు, మరియు ప్రపంచ కల్లోలాల మార్పులచే తాకబడకుండా, నేను అమరమైన ఆత్మనని గ్రహించడానికి నాకు సహాయం చేయి.”

మరింతగా అన్వేషించడానికి :

ఇతరులతో పంచుకోండి