“ప్రపంచం మొత్తానికి యోగా ఒక శాస్త్రమెలా అయ్యింది” అనే అంశంపై పరమహంస యోగానంద

9 అక్టోబర్, 2023

ఒక పరిచయం:

“మత విజ్ఞాన శాస్త్రం” అనే అంశంపై అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన ‘కాంగ్రెస్ ఆఫ్ రిలిజియస్ లిబరల్స్‌’కు భారతదేశ ప్రతినిధిగా హాజరైన పరమహంస యోగానందగారు అక్టోబరు 6, 1920న తన తొలి ప్రసంగం చేశారు.

పరమహంసగారు తన ప్రఖ్యాతి గాంచిన గురు పరంపర ఆదేశానుసారం, యోగా అనే ఉత్కృష్టమైన ఆత్మ-విజ్ఞాన శాస్త్రాన్ని ప్రపంచానికి తీసుకువచ్చిన కొన్ని వారాల ముందు మాత్రమే అక్కడకు చేరుకున్నారు. గ్రహణశీలగల విద్యార్థులు ఆయన బోధించిన యోగా ధ్యానం యొక్క పద్ధతులను ఆచరణలో పెట్టినప్పుడు, దాని గొప్ప విలువ గాఢంగా స్పష్టమవుతుంది మరియు ఆధునిక ప్రపంచానికి భారతదేశ జ్ఞానాన్ని విశదపరచిన ఆయన విధానం అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రశంసించబడింది.

పరమహంసగారి తరువాత వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు, ఋషితుల్యులుగా మారిపోయిన అమెరికన్ వ్యాపారవేత్త, రాజర్షి జనకానంద ఇలా అన్నారు: “భారతదేశం, తన మహాఋషులందు ఒకరైన పరమహంస యోగానందగారి ద్వారా మనకు ఈ ఆత్మ సాక్షాత్కారమనే అమూల్య జ్ఞానాన్ని తెచ్చి ఇచ్చింది….పరమహంసగారి బోధనల ద్వారా మనకు భారతదేశం ఇచ్చిన దానికి ప్రతిఫలంగా మనం ఏమి ఇచ్చినా అది, ఆయన బోధనలంత విలువ చెయ్యదు.”

యోగా గురించి మీరు లోతైన అవగాహన పొంది, అది అందరికీ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?

పరమాత్మతో ఏకత్వానికి సంబంధించిన భారతదేశపు ప్రాచీన విజ్ఞాన శాస్త్ర విశ్వజనీన స్వభావాన్ని గురించి, మరియు దానిని అమెరికా తీరాలకూ, ప్రపంచానికీ అందించడం ద్వారా పరమహంసగారు సాధించినది — సంస్కృతి, మతం మరియు కాలం యొక్క పరిమిత సరిహద్దులను అధిగమించడం — ఈ అంశంపై, పరమహంసగారు ఉదహరించినవాటి నుండి సంగ్రహావలోకనం దిగువన ఇవ్వడమైనది.

పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:

ప్రాచీన కాలంలో భారతదేశ ఋషీశ్వరులచే కనుగొనబడి ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన వరం, ఇదే మత విజ్ఞాన శాస్త్రం — యోగా, “దైవ సంసర్గం” — దీని ద్వారా దేవుణ్ణి వేదాంత భావనగా కాకుండా వాస్తవమైన వ్యక్తిగత అనుభవంగా గ్రహించవచ్చు.

చపలచిత్తంతో కూడి సంకుచితమైన గుర్తింపుగల మర్త్య శరీర తాదాత్మ్యత నుండి ఎదిగి, మనల్ని మనం ప్రశాంతమైన అమర ఆత్మగా గుర్తించగలిగే నిజమైన పద్ధతులను యోగా కలిగి ఉంటుంది.

సన్యాస జీవితం వైపు మొగ్గు చూపే కొన్ని రకాల మరియు స్వభావాలు గల కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే దీని పద్ధతులు ఉద్దేశించబడలేదు….ఎందుకంటే యోగ శాస్త్రం సార్వత్రిక ఆవశ్యకతను నెరవేరుస్తుంది. కాబట్టి, దీనికి సహజమైన సార్వత్రిక ఆకర్షణ ఉంది.

మత విజ్ఞాన శాస్త్రం అందరికీ సాధారణమైన సార్వజనీన సత్యాలను తెలియజేస్తుంది — మతానికి ప్రాతిపదిక — ఆచరణాత్మక విధానాలను అనుసరించడం ద్వారా వ్యక్తులు దివ్య ప్రణాళిక ప్రకారం తమ జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవచ్చో బోధిస్తుంది. భారతదేశంలో బోధించబడ్డ రాజయోగం, “రాజోచిత” ఆత్మ శాస్త్రం, జాతి లేదా మతంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి యొక్క పరిపూర్ణత కోసం విశ్వవ్యాప్తంగా ఉపయోగపడే పద్ధతులను క్రమపద్ధతిలో ఆచరించడం ద్వారా మతం యొక్క సనాతన ధర్మాన్ని అధిగమింపజేస్తుంది.

పాశ్చాత్య దేశాలలో విద్యుత్తును కనుగొంటే, భారతదేశంలోని మనం దాని నుండి ప్రయోజనం పొందుతాము; అదే విధంగా దేవుణ్ణి తెలుసుకునే మార్గాలను భారతదేశం కనుగొన్నది, పశ్చిమ దేశాలు వాటి ద్వారా లబ్ధి పొందాలి. పరిశోధనల ద్వారా మతంలోని సత్యాలను భారతదేశం నిరూపించింది. భవిష్యత్తులో, మతం ప్రతి చోటా ప్రయోగాత్మకంగా ఉంటుంది; ఇది కేవలం నమ్మకం మీద ఆధారపడి ఉండదు.

మతాన్ని ఆచరణలో పెట్టడం సాధ్యమే, దాన్ని శాస్త్రంగా ఉపయోగించుకోవడం ద్వారా మీ మీద మీరు ప్రయోగాలు చేసుకోవచ్చు. సత్యం కోసం అన్వేషించడమనేది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన అన్వేషణ అవుతుంది….ఆధ్యాత్మిక ఆదర్శాల చుట్టూ మీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో నేర్చుకోండి.

ఆత్మ ఖచ్చితంగా పరిపూర్ణమైనది, కాని శరీరంతో తాదాత్మ్యం చెంది అహంకారంగా గుర్తించబడినప్పుడు, దాని వ్యక్తీకరణ మానవ లోపాలతో వక్రీకరించబడుతుంది…. మనలోను మరియు ఇతరులలోను ఉన్న దివ్య స్వభావాన్ని గ్రహించడమెలాగో యోగా బోధిస్తుంది. యోగా ధ్యానం ద్వారా మనం దేవుళ్ళమని గ్రహిస్తాము.

1920లో పాశ్చాత్య దేశానికి వచ్చిన తర్వాత పరమహంస యోగానందగారు, సార్వజనీనమైన ఆధ్యాత్మికతకు చెందిన కీలకమైన విషయాలను ప్రపంచానికి అందించారు — ఆ విప్లవాత్మకమైన ఆలోచనలు ఇప్పటికీ వేళ్లూనుకుంటున్నాయి, కాలం గడుస్తున్న కొద్దీ ఎన్నో జీవితాలలో పరివర్తన తెస్తున్నాయి. దీని గురించి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులైన స్వామి చిదానంద గిరి గారు వెలువరించిన ఒక బ్లాగ్ పోస్ట్ ను వై.ఎస్.ఎస్ వెబ్‌సైట్‌లో మీరు చదవగలరు.

ఇతరులతో షేర్ చేయండి