ప్రతిజ్ఞలకు సూచనలు

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి "సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్" నుండి
ప్రతిజ్ఞల యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకోవడం

మానవుడు యొక్క మాటే మానవుడిలోని స్ఫూర్తి. నిజాయితీ, నిశ్చయత, విశ్వాసం మరియు అంతర్ దృష్టితో నిండిన పదాలు అత్యంత పేలుడు ప్రకంపనలు కలిగిన బాంబుల వంటివి, ఇవి ఉపయోగించినప్పుడు, కష్టాల బండలను పగలగొట్టి, కోరుకున్న మార్పుని తీసుకు వస్తాయి.

నిరాశ లేదా ఆనందం, చిరాకు లేదా ప్రశాంతత గురించి చేసే ప్రతి ఆలోచన మెదడు కణాలలో సూక్ష్మమైన గాడిని చేస్తుంది మరియు అనారోగ్యము లేదా ఆరోగ్యము వైపు మన ధోరణులను బలపరుస్తుంది.

అవచేతనలో అలవాటుగా చేసే, ఆరోగ్యము లేదా అనారోగ్యము యొక్క ఆలోచనలు మానవుడి మీద బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మొండి పట్టుదలగల మానసిక లేదా శారీరక వ్యాధులు ఎల్లప్పుడూ అవచేతనలో లోతైన మూలాన్ని కలిగి ఉంటాయి. దాగి ఉన్న మూలాలను బయటకు తీయడం ద్వారా అనారోగ్యం నయమవుతుంది. అందుకే చేతన మనస్సుతో చేసే అన్ని ప్రతిజ్ఞలు అవచేతనలోకి చొచ్చుకుపోయేటంత ఆకట్టుకునేలా ఉండాలి, ఇది స్వతసిద్ధంగా చేతన మనస్సును ప్రభావితం చేస్తుంది.

బలమైన చేతన ప్రతిజ్ఞలు మనస్సు మరియు శరీరంపై అవచేతన మాధ్యమం ద్వారా ప్రభావం చూపుతాయి. ఇంకా బలమైన ప్రతిజ్ఞలు అవచేతనానికి మాత్రమే కాకుండా అద్భుత శక్తుల నిలయమైన అధిచేతన మనసుని కూడా చేరుతాయి.

సత్యానికి సంబంధించిన ప్రకటనలు ఇష్టపూర్వకంగా, స్వేచ్ఛగా, వివేకంతో మరియు భక్తితో సాధన చేయాలి. ఒకరి ధ్యాస ప్రక్కకు మళ్ళనీయ కూడదు. అప్పచెప్పిన పని చేయకుండా తప్పించుకుని తిరిగే పిల్లవాడిలా, చంచలమైన మనసును మళ్ళీ మళ్ళీ వెనక్కి తీసుకురావాలి మరియు ఇచ్చిన పనిని నిర్వర్తించే వరకు మనసుకు పదే పదే ఓర్పుతో శిక్షణ ఇవ్వాలి.

సహనంతో, శ్రద్ధతో, మరియు వివేకముతో చేసే పునశ్చరణలు అద్భుతంగా పనిచేస్తాయి. దీర్ఘకాలిక మానసిక లేదా శారీరక బాధలను నయం చేయడానికి ప్రతిజ్ఞలు తరచుగా, గాఢంగా మరియు నిరంతరంగా (మార్పులేని లేదా విరుద్ధమైన పరిస్థితులు ఉన్నా, వాటిని పూర్తిగా విస్మరిస్తూ) ఒకరి అగాధమైన అంతర్ దృష్టి నిశ్చయంలో భాగమయ్యే వరకు పునశ్చరణ చేయాలి.

ఓ దేదీప్యమానమైన కాంతి! నా హృదయాన్ని మేల్కొలుపు, నా ఆత్మను జాగృతం చేయి, నా చీకటిని పారద్రోలు, నిశ్శబ్దం యొక్క ముసుగును చింపివేయు, మరియు నా మందిరాన్ని నీ వైభవంతో నింపు.

మీ ప్రతిజ్ఞలు ఎంచుకోండి మరియు మొదట బిగ్గరగా, తర్వాత మృదువుగా మరియు మరింత నెమ్మదిగా, మీ స్వరం గుసగుసలాడే వరకు మొత్తం పునశ్చరణ చేయండి. ఆ తరువాత మీరు నాలుక లేదా పెదవులను కదల్చకుండా, మానసికంగా లోతైన, ఎడతెగని ఏకాగ్రత పొందారని మీకు అనిపించే వరకు మానసికంగా పునశ్చరణ చేయండి, ఇది అపస్మారక స్థితి కాదు, కానీ నిరంతరాయమైన ఆలోచన యొక్క గాఢమైన కొనసాగింపు.

మీరు మీ మానసిక ప్రతిజ్ఞను కొనసాగిస్తూ, ఇంకా లోతుగా వెళితే, మీకు ఆనందం మరియు శాంతి పెరుగుతున్న అనుభూతి కలుగుతుంది. గాఢమైన ఏకాగ్రత స్థితిలో, మీ ప్రతిజ్ఞ అవచేతన ప్రవాహంతో విలీనమవుతుంది, తరువాత అలవాటు అనే సూత్రం ద్వారా మీ ప్రతిజ్ఞ శక్తితో బలోపేతమై మీ చేతన మనస్సును ప్రభావితం చేయడానికి తిరిగి వస్తుంది.

మీరు నిరంతరం పెరుగుతున్న శాంతిని అనుభవిస్తున్న సమయంలో, మీ ప్రతిజ్ఞ అధిచేతన రాజ్యంలోనికి లోతుగా వెళ్తుంది, అలా వెళ్ళిన ప్రతిజ్ఞ అపరిమిత శక్తితో మీ చేతన మనస్సును ప్రభావితం చేయడానికి మరియు మీ కోరికలను నెరవేర్చడానికి తర్వాత తిరిగి వస్తుంది. మీరు సందేహ పడకుండా ఉంటే ఈ శాస్త్రీయ విశ్వాసం యొక్క అద్భుతాన్ని చూస్తారు.

ప్రతిజ్ఞలను ఎలా సాధన చేయాలి

మరింత చదవడానికి

Scientific Healing Affirmations – శ్రీ శ్రీ పరమహంస యోగానంద

ఇతరులతో పంచుకోండి