“ఆత్మ యొక్క శాంతిని వెలికితీయడం” అనే అంశంపై పరమహంస యోగానంద

22 సెప్టెంబర్, 2023

ఒక పరిచయం:

మీ చుట్టుప్రక్కల, మరియు ఆన్‌లైన్‌లో చూసినప్పుడు, ఈ ప్రపంచంలో ఉన్న మనం శాంతిని పొందడం సాధ్యమేనా అని మీరు ఆశ్చర్యపోతున్నారా? జీవితం గురించి మనం వింటున్న వృత్తాంతాలు తరచుగా కలవరానికి మరియు ఆగ్రహానికి గురయ్యే విధంగా రూపొందించబడిన సమయాల్లో, సహజంగా ఆందోళన చెందుతాము. కాని ఇది తెలుసుకోండి: స్వల్పకాలమైనా వేరొక దిశలో చూడటం వల్ల, ఆంతరికంగా చూడటం వల్ల, గొప్ప ఆశను పొందవచ్చు.

ఒక్క క్షణం, పరమహంస యోగానందగారి చేత వ్యక్తీకరించబడిన ఈ వృత్తాంతాన్ని — ఈ దాగిన సత్యాన్ని — ప్రత్యామ్నాయంగా చూడండి: “శాంతి ప్రతిచోటా ఉంది. ప్రతి కణంలో రక్తం ప్రవహిస్తున్నట్లుగానే మీరు శాంతి సముద్రంలో ఈదులాడుతున్నారు. కావున శరీరంలోని ప్రతికణం ద్వారా శాంతి ప్రవహిస్తుంది.”

మీరు శాంతిలో ఈదులాడుతున్నారు, కాని మీరు దీనిని (శాంతిని) గ్రహించడానికి, పరమహంసగారు బోధించిన ఆధ్యాత్మిక శాస్త్రీయ పద్ధతులను మీ “హృదయంలో మధించి” అభ్యసించడం నేర్చుకోవాలి.

మానవాళికి శాంతిని ఆదర్శంగా నిలుపుతూ ప్రతి సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి (UN) ప్రకటించిన అంతర్జాతీయ శాంతి దినం ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడుతోంది, కాని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మొదట దాన్ని మనతోనే ప్రారంభించాలని పరమహంసగారు, మరియు గొప్ప ఆత్మస్వరూపులందరూ బోధించారు.

ఇంకా మనకు చివరిగా కావలసినది — ఆత్మలుగా మనం కోరుకొనేది — పోషక ఆహారం తరచుగా మనకు అవసరమైనట్లుగానే, ఎప్పుడో ఒకప్పుడు కాకుండా శాంతిని కూడా తరచుగా పొందాలి. మనకు మరింత శాంతి — సమృద్ధికరమైన, స్వాస్థ్యదాయకమైన, గాఢమైన, అభయదాయకమైన, శక్తిదాయకమైన, మరియు సంతృప్తికరమైన శాంతి — కావాలి; ఒక రోజు లేదా ఒక నెల మాత్రమే కాదు, ప్రతిరోజూ దాన్ని సాధ్యమైనంతగా నిలుపుకోవాలి, ఈ ప్రపంచంలో శాంతి మన జీవన విధానంగా మారేవరకూ నిలుపుకోవాలి.

పరమహంసగారి జ్ఞానాన్ని ఈ క్రింది వాక్యాలలో గ్రహించడం ద్వారా మీ ఆత్మలో నిలిచియున్న శాంతి సంపద నుండి క్రొత్త వనరులను వెలికి తీయడం ద్వారా ఈ రోజైనా — లేదా ఎప్పుడైనా — ఆందోళనలను స్పృహతో ప్రక్కనపెట్టి దివ్యమైన శాంతిని ఈ రోజే అనుభూతి చెండానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

పరమహంస యోగానందగారి వ్యాసాలు మరియు రచనల నుండి:

ప్రతిఒక్కరి హృదయాలలో శాంతి నెలకొన్నప్పుడే ప్రపంచంలో శాంతి ప్రారంభవుతుంది.

మీ హృదయంలో శాంతిని మధించడం ద్వారా దాన్ని మీరు కనుగొనాలి. ధ్యానం అనేది దానికి ప్రక్రియ. శాంతిని కనుగొనడానికి మిగిలిన అన్నిటినీ మీరు ప్రయత్నించవచ్చు, కాని మీరు శాంతిని అనుభూతిచెందలేరు; కాని మీరు ధ్యానం చేస్తే వెంటనే దివ్య ఆనందం గురించి తెలుసుకుంటారు. ధ్యానమనే ఊట నుండి దేవుని శాంతి మీ ఆత్మలోకి ప్రవహిస్తుంది.

నిద్రలో ప్రతిరాత్రి మీరు శాంతి మరియు ఆనందాలను చవిచూస్తారు. మీరు గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు, దేవుడు మిమ్మల్ని ప్రశాంతమైన అధిచేతనావస్థలో నివసించేలా చేస్తాడు, ఆ స్పృహలో ఈ ఉనికి యొక్క అన్ని భయాలను మరియు ఆందోళనలను మరచిపోతాము. ధ్యానం ద్వారా మీరు మేల్కొని ఉన్నప్పుడు కూడా ఆ పవిత్రమైన స్థితిని అనుభవించవచ్చు మరియు స్వస్థతను చేకూర్చే శాంతిలో నిరంతరం మునిగిపోవచ్చు.

అంతర్గతంగా మీరు ఆ శాంతిని కనుగొన్న తరువాత, అది మీ పరిసరాలకు మరియు ప్రపంచానికి ఒక ఆశీర్వాదంగా ప్రవహిస్తుంది. అంతర్గతంగా సామరస్యం, వెలుపలా సామరస్యం, అంతటా సామరస్యం!

మీ మనస్సును ఆంతరికముగా భ్రూమధ్యములో [ధ్యానంలోవలెనే] అపారమైన శాంతిసాగరం మీద నిలిపివుంచండి. మీ చుట్టూ ఉన్న శాశ్వతమైన శాంతి కెరటాల వలయాన్ని గమనించండి. మీరు శ్రద్ధతో గమనిస్తున్నకొద్దీ, శాంతి అలలు కనుబొమ్మల నుండి నుదురుకి, నుదుటి నుండి హృదయానికి, మీ శరీరంలోని ప్రతి కణమునకు వ్యాపించడాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు శాంతిజలాలు మీ శరీరపుటంచుల నుండి పొంగిపొరలి మీ మనస్సనే విశాల ప్రదేశాన్ని ముంచెత్తుతున్నాయి. శాంతి వెల్లువగా మీ మనస్సు సరిహద్దులను దాటి అన్ని దిశలకూ ప్రవహిస్తుంది.

మీరు మీ శాంతిని నిలుపుకొని, మీరు చేసే పనులన్నిటిలో ప్రశాంతమైన క్రియాశీలతతోను మరియు క్రియాశీలకమైన ప్రశాంతతోను ఉన్నప్పుడు, మీ ప్రశాంత ఆంతరంగిక మందిరంలో ఎల్లప్పుడూ నివసించే మీ నిజమైన ఆత్మతో తాదాత్మ్యం చెందినట్లే.

అన్నిటినీ మీరు శాంతియుతంగా చేయాలి. అది మీ శరీరం, మనస్సు మరియు ఆత్మకు ఉత్తమమైన ఔషధం. జీవించడానికి అది చాలా అద్భుతమైన మార్గం.

వై.ఎస్.ఎస్. బ్లాగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాలలో ఒకటి ఏమిటంటే, పరమహంస యోగానందగారి దూరదృష్టి మరియు అన్నిటినీ అక్కునజేర్చుకొనే ఆయన జ్ఞానాన్ని వెంటనే ఆచరణలో పెట్టడానికి మీకు కావలసిన సామగ్రిని అందజేయడమే. భారతదేశం యొక్క ఆచరణాత్మకమైన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రపంచానికి అందజేసేటప్పుడు పరమహంసగారి ఉద్దేశ్యం ఇది: సరళమైనవే కాకుండా శక్తివంతమైన మరియు సమర్థవంతమైన, యోగ పద్ధతులను సాధన చేయటము ద్వారా ప్రతి వ్యక్తి తన ఆత్మ యొక్క శాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని తెలుసుకోవడం.

క్రింద మీరు “నేడు శాంతిని అనుభవించడానికి ఒక సాధనా సామగ్రి,” అనే లింక్‌ను చూస్తారు, ఇందులో సడలింపుపై సూచనలు మరియు నిర్దేశిత ధ్యానాలకు సంబంధించిన అనేక వీడియోలను మీ అనుకూల సమయంలో సాధన చేసి, మీలో ఉన్న అంతులేని శాంతిని తెలుసుకోవచ్చు.

ఇతరులతో షేర్ చేయండి