యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పదకోశం (అ – అః)

అంతర్ జ్ఞానం (లేదా సహజావబోధం). అన్నిటినీ తెలుసుకొనే ఆత్మకున్న నిగూఢమైన శక్తి; ఇంద్రియాల మధ్యవర్తిత్వం అవసరం లేకుండానే మానవుడిని సూటిగా సత్యాన్ని గ్రహించడానికి సమర్థుడిగా చేసేది.

అధిచేతన. శుద్ధమయిన, సహజావబోధాత్మకమయిన, అన్నిటినీ చూడగల, ఆత్మ యొక్క నిత్యమైన దివ్యానంద చైతన్యం. ఒక్కోసారి, సాధారణంగా, ధ్యానంలో అనుభూతమయ్యే సమాధి (చూ.) స్థితిలోని అన్ని విభిన్న స్థితులను తెలపడానికి కాని; విశేషించి ఒకరు తమ అహం-చేతనను అధిగమించి తమను తాము ఆత్మగాను, భగవంతుడి ప్రతిరూపంగాను తయారయ్యామని గ్రహించగలిగే ప్రథమ స్థాయి సమాధి అనుభవానికి కాని దీన్ని వాడతారు. అక్కణ్ణించి మరింత ఉన్నతతర సాక్షాత్కార స్థితులయిన కూటస్థ చైతన్యం లేదా క్రీస్తు చైతన్యం, విశ్వ చైతన్యం (చూ.) వరుసగా వస్తాయి.

అధిచేతనా మనస్సు. సత్యాన్ని నేరుగా గ్రహించే ఆత్మకున్న అన్నిటినీ తెలుసుకొనే సామర్థ్యం; సహజావబోధం లేక అంతర్ జ్ఞానం.

అర్జునుడు. కృష్ణ భగవానుడు అమరమైన భగవద్గీతా (చూ.) సందేశాన్ని అందించిన, ఉన్నత స్థితి నందుకొన్న శిష్యుడు; పంచ పాండవులలో ఒకరయిన ఈయన గొప్ప హిందూ ఇతిహాసమైన మహాభారతం లో ఒక ముఖ్యమయిన వ్యక్తి.

అవతారం. దైవ అవతారం; సంస్కృతంలోని అవతార శబ్దానికి మూలాలు అవ “క్రిందికి,” తృ “దిగడం.” పరమాత్మలో ఐక్యమయి, అటుమీదట మానవ జాతికి సహాయపడడానికి తిరిగి వచ్చిన వ్యక్తిని అవతారం అంటారు.

అవిద్య. యథార్థంగా “జ్ఞానం-కానిది,” అజ్ఞానము; మానవుడిలో వ్యక్తమయ్యే మాయ, విశ్వభ్రాంతి (చూ.). ముఖ్యంగా చెప్పాలంటే, అవిద్య అంటే తన దివ్య స్వభావాన్ని గురించి, ఏకైక సత్యమయిన పరమాత్మ గురించి ఎరగని అజ్ఞానం.

అహంకారం. అహంకారం, “నేను చేస్తున్నాను” అనేది ద్వైత భావన, లేదా మానవుడికి అతడి సృష్టికర్తకు మధ్య భేదమున్నట్లుగా కనబడటానికి మూలకారణం. అహంకారం మానవులు మాయా (చూ. మాయ) ప్రభావానికి లోబడేటట్లు చేస్తుంది. తద్ద్వారా మనస్సు (అహం) అంతా తానే చేస్తున్నానని తప్పుగా అనుకుంటుంది; జీవులు తమను తాము సృష్టికర్తలుగా భావించుకుంటారు. అహంకార చేతనను విడిచిపెట్టేయడం ద్వారా మానవుడు తన దివ్య అస్తిత్వానికి — అంటే అన్నిటికీ ఏకైక ప్రాణం అయిన భగవంతునితో తన ఏకత్వంలో — మేల్కొంటాడు.

ఆత్మ. ఇది మానవుడి దివ్యసారం; సాధారణ అహం నుండి, మానవ వ్యక్తిత్వం నుండి భిన్నంగా ఉండేది. ఆత్మ అనేది ప్రత్యేకంగా విడిపడి విభిన్న వ్యక్తిత్వమున్నట్లుగా కనపడే పరమాత్మే. దాని ముఖ్య తత్వం నిత్య-స్థిత, నిత్య-చైతన్య, నిత్య-నవీన దివ్యానందం [సచ్చిదానందం; సత్-చిత్-ఆనందం]. మానవుడిలోని ప్రేమ, జ్ఞానం, శాంతి, ధైర్యం, కరుణ, ఇంకా ఇతర దివ్య గుణాలన్నింటికీ అంతర్లీనమయిన మూల స్రోతస్సు అతడిలోని ఈ దివ్యమైన ఆత్మ.

ఆత్మసాక్షాత్కారం. పరమహంస యోగానందులు ఇలా నిర్వచించారు: “ఆత్మసాక్షాత్కారమంటే మనం పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వంతో ఏకమై ఉన్నామనీ, అది మనకు రావాలని మనం ప్రార్థించనక్కరలేదనీ, మనం అన్నివేళలా కేవలం దానికి సమీపంలో ఉండడమే కాదు, భగవంతుని సర్వవ్యాపకత్వమే మన సర్వవ్యాపకత్వమనీ; ఎప్పుడూ ఉండేటట్లే ఇప్పుడుకూడా మనం ఆయనలో ఒక భాగమేననీ — శరీరంలోనూ, మనస్సులోనూ, ఆత్మలోనూ — తెలుసుకోవడం. మనం చెయ్యవలసినదల్లా మన ఎరుకను మెరుగు పరచుకోవడమే.”

ఆధ్యాత్మిక నేత్రం. కనుబొమల నడుమ కూటస్థ (క్రీస్తు) కేంద్రం (ఆజ్ఞాచక్రం)లో కనిపించే సహజావబోధక, సర్వవ్యాపక గ్రహణశక్తినిచ్చే (ఏక) నేత్రం. గాఢంగా ధ్యానిస్తున్న భక్తుడు, ఆధ్యాత్మిక నేత్రాన్ని బాహ్యంలో బంగారు వలయం, దానిలోపల నీలివన్నె కాంతి వర్తులం, కేంద్రంలో అయిదు మొనల తెల్లటి నక్షత్రంగా దర్శిస్తాడు. సూక్ష్మ జగత్తుకు సంబంధించినంత వరకు, ఈ రూపాలు, వర్ణాలు వరుసగా, సృష్టి స్పందనాత్మక స్తరాన్ని (విశ్వ ప్రకృతి, పరిశుద్ధాత్మను); కుమారుడు లేదా సృష్టిలో ఉన్న భగవంతుడి ప్రజ్ఞను (కూటస్థ చైతన్యం లేదా క్రీస్తుచేతనను); స్పందనారహితమై సృష్టికంతకూ ఆవలనున్న పరమాత్మను (తండ్రి అయిన భగవంతుణ్ణి) సంగ్రహంగా సూచిస్తాయి.

ఆధ్యాత్మిక నేత్రం దివ్యచైతన్యపు చరమ స్థితులలోకి ప్రవేశద్వారం. గాఢమయిన ధ్యానంలో, భక్తుడి చైతన్యం ఆధ్యాత్మిక నేత్రం గుండా చొచ్చుకుపోయినప్పుడు, అందులో సంగ్రహంగా ఉన్న మూడు స్తరాలగుండా పోతున్నప్పుడు అతడు వరుసగా ఈ క్రింది స్థితులను అనుభవంలోకి తెచ్చుకొంటాడు — అధిచేతన లేదా ఆత్మసాక్షాత్కారపు నిత్య నవీన ఆనందం; పరిశుద్ధాత్మ లేదా ఓంకార రూపంలోని (చూ.) భగవంతుడితో ఏకత్వం; సృష్టిలో అంతటా ఉన్న భగవంతుడి విశ్వ మేధస్సుతో, కూటస్థ లేదా క్రీస్తు చైతన్యంతో ఏకత్వం; విశ్వచేతనతో (అంటే స్పందనాత్మక సృష్టి లోపల అదే విధంగా దానికి ఆవల ఉన్న సర్వవ్యాపక భగవంతుడితో) ఏకత్వం. చైతన్యం, వాటి స్థితులు; అధిచేతన; క్రీస్తు చైతన్యం కూడా చూడండి.

ఎజికియెల్ (43:1-2, బైబిలు) నుంచి ఒక భాగాన్ని వివరిస్తూ పరమహంస యోగానందగారు ఇలా రాశారు: “నుదిటి (‘తూర్పు’)లో ఉన్న దివ్యనేత్రం ద్వారా, యోగి తన చైతన్యాన్ని సర్వవ్యాపకత్వంలోకి నడిపిస్తాడు. ఓంకారం లేదా శబ్దం, ‘అనేక నీటి ప్రవాహాల’ దివ్యశబ్దాన్ని, ఈ సృష్టి అంతటినీ ఏర్పరిచే ఒకే ఒక యథార్థమయిన కాంతిస్పందనల శబ్దాన్ని వింటాడు.” ఎజికియెల్ మాటలలో: “తర్వాత నన్ను ఆయన ఆ ద్వారం వద్దకు తీసుకువచ్చాడు, అదే తూర్పువైపు చూసే ద్వారం: అప్పుడు, చూడండి, ఇజ్రాయేలు దేవుని వైభవం తూర్పు దారిలోంచి వచ్చింది: ఆయన కంఠస్వరం అనేక జలప్రవాహాల సమ్మిళిత ధ్వని (సముద్ర హోరు) లా ఉంది: పృథ్వి ఆయన వైభవంతో మెరిసిపోయింది.”
ఏసుక్రీస్తు కూడా ఆధ్యాత్మికనేత్రం గురించి మాట్లాడాడు: “నీ కన్ను ఒక్కటే అయినప్పుడు, నీ శరీరమంతా వెలుగుతో నిండుతుంది….అందుచేత జాగ్రత్త పడు, నీలో ఉన్న వెలుగు చీకటి అయిపోకుండా చూసుకో.” (లూకా11:34-35, బైబిల్).

ఆశ్రమం. ఒక అధ్యాత్మిక సాధన చేసే మునుల కుటీరం; తరచుగా, సన్యాసుల మఠం.

ఈథర్. సంస్కృతంలో ఆకాశం. భౌతిక విశ్వస్వభావానికి సంబంధించిన ప్రస్తుత శాస్త్ర సిద్ధాంతాలలో ఈథర్ ఒక అంశంగా పరిగణించబడనప్పటికీ, వేల సంవత్సరాలుగా భారతీయ జ్ఞానులు ఆకాశాన్ని (ఈథర్) ఒక ప్రధాన మూలకం (తత్త్వం)గా ప్రస్తావిస్తూ వచ్చారు. భగవంతుడు సృష్టి అనే ఈ విశ్వచలన చిత్రాన్ని ప్రదర్శించే తెర (నేపథ్యం) ఈ ఆకాశం (ఈథర్)అని పరమహంస యోగానందగారు అన్నారు. దేశం (space) వస్తువులకు ఆకారాన్నిస్తుంది; ఆకాశం (ఈథర్) ఆ చిత్రాలను విడమరిచి చూపుతుంది. దేశ సంబంధమయిన స్పందనలన్నిటినీ సమన్వయం చేసే క్రియాశీలకశక్తి అయిన ఈథర్ అనబడే ఈ నేపథ్యం, ఆలోచనలు, ప్రాణాలు వంటి సూక్ష్మతర శక్తుల గురించీ, భౌతిక పదార్థపు మరియు భౌతిక శక్తుల మూలాల గురించి విచారించేటప్పుడు తప్పనిసరిగా పరిగణించవలసిన అంశం. తత్త్వాలు చూడండి.

ఉపనిషత్తులు. ఉపనిషత్తులు లేదా వేదాంతం, నాలుగు వేదాలలోని కొన్ని భాగాలలో తటస్ధిస్తాయి (శబ్దత: వేదాల ముగింపు) ఇవి హిందూమతం యొక్క సిద్ధాంతపరమైన ఆధారాలను రూపొందించే అతి ముఖ్యమైన సారాంశాలు.

ఋషులు. జ్ఞానులు, దివ్య జ్ఞానాన్ని వెల్లడిచేసే ఉన్నతమైన వ్యక్తులు; విశేషించి సహజావబోధం ద్వారా వేదాలను దర్శించిన ప్రాచీన భారతదేశపు సాక్షాత్కారం పొందిన జ్ఞానులు.

ఏకాగ్రతా ప్రక్రియ. హాంగ్-సా ప్రక్రియగా వ్యవహరించే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ఏకాగ్రతా ధ్యాన ప్రక్రియ; యోగదా సత్సంగ పాఠాలలో బోధిస్తారు. ఈ ప్రక్రియ మన దృష్టిని మరల్చే అన్ని విషయాలనుంచి శాస్త్రీయంగా దానిని వెనుకకు మరలించి దాన్ని ఒక సమయంలో ఒక్క విషయం మీదే కేంద్రీకరించడానికి సహాయం చేస్తుంది. ఆ విధంగా అది ధ్యానానికి, అంటే భగవంతుడి మీద దృష్టి ఏకాగ్రం చేయడానికి అమూల్యమైన ధ్యాన ప్రక్రియ. క్రియాయోగ (చూ.) శాస్త్రంలో హాంగ్-సా ధ్యాన ప్రక్రియ ఒక ప్రధాన అంతర్భాగం.

ఓం. అన్నిటినీ సృష్టించే, పోషించే పరమేశ్వర తత్త్వానికి ప్రతీక అయిన సంస్కృత మూలపదం లేదా బీజాక్షరం; విశ్వ స్పందన. వేదాల్లోని ఓంకారం టిబెటన్లకు హుమ్ గాను, ముస్లింలకు ఆమీన్ గాను, ఈజిప్టు వారికి, గ్రీకులకు, రోమన్లకు, యూదులకు, క్రైస్తవులకు ఆమెన్ గాను పవిత్ర పదం అయింది. సృష్టి అయినవన్నీ ఓం లేదా ఆమెన్ అనే శబ్దం లేదా పరిశుద్ధాత్మ యొక్క విశ్వ స్పందనశీల శక్తి నుంచి పుట్టాయని ప్రపంచంలోని గొప్ప మతాలు చెబుతాయి. “ఆదిలో శబ్దం (మాట) ఉండేది, ఆ శబ్దం భగవంతునితో ఉండేది, ఆ శబ్దం స్వయంగా భగవంతుడే…. అన్ని వస్తువులను ఆయనే [శబ్దం లేదా ఓం] సృష్టించాడు; సృష్టించబడిన వస్తువు ఏదీ ఆయన లేకుండా సృష్టించబడలేదు.” (యోహాను 1:1, 3, బైబిలు).

హిబ్రూ భాషలో ఆమెన్ అంటే నిశ్చయమైన, విశ్వసనీయమైన అని అర్థం. “విశ్వాస పాత్రమూ, నిజమైన సాక్షీ, భగవత్ సృష్టికి ఆరంభమూ అయిన ఆమెన్ (ఓంకారం) ఈ విషయాలు చెబుతుంది.” (ప్రకటన గ్రంథము 3:14, బైబిలు). నడుస్తున్న యంత్రం ప్రకంపనలు శబ్దాన్ని పుట్టిస్తున్నట్లే, స్పందనాత్మక శక్తి ద్వారా సమస్త జీవమునూ, సృష్టిలోని ప్రతి అణువునూ నిలిపిఉంచే “విశ్వ యంత్రం” యొక్క చలనమును సర్వవ్యాప్త ఓంకారం నమ్మకంగా ఋజువు చేస్తుంది. యోగదా సత్సంగ పాఠాలలో (చూ.) పరమహంస యోగానందగారు ధ్యాన ప్రక్రియలను బోధించారు. వాటి అభ్యాసం ఓం లేదా పరిశుద్ధాత్మ రూపంలో భగవంతుడి ప్రత్యక్షానుభూతిని తీసుకొస్తుంది. అగోచరమయిన ఆ దివ్యశక్తితో దివ్యానందదాయకమైన అనుసంధానం (“సాంత్వనప్రదాత, పరిశుద్ధాత్మ” — యోహాను 14:26, బైబిలు) నిజంగా ప్రార్థనకు శాస్త్రీయ ప్రాతిపదిక.

ఇతరులతో పంచుకోండి