పశ్చిమ దేశాల యోగా పథ నిర్దేశకుడు

కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిలిస్ లోని ఫిల్‌హార్మోనిక్ ఆడిటోరమ్‌లో ఉపన్యాసం ఇస్తున్న యోగానందగారు.

1924–1935 మధ్యకాలంలో పరమహంస యోగానందగారు అమెరికా అంతటా పర్యటిస్తూ, న్యూయార్క్ ‌లోని కార్నెగీ హాల్ నుండి లాస్ ఏంజిలిస్ ఫిల్‌హార్మోనిక్ ఆడిటోరియం వరకు అమెరికాలోని అనేక పెద్ద ఆడిటోరియంలలో — పెద్ద సంఖ్యలో హాజరైన ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. “ఫిల్ ‌హార్మోనిక్ ఆడిటోరియం ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. 3000 మంది పట్టే సామర్థ్యం ఉన్న ఆడిటోరియం అది. యోగానందగారి ఉపన్యాసం ప్రారంభమవడానికి కేవలం ఒక గంట ముందు ప్రకటన వెలువడింది. ఆశ్చర్యకరంగా ఆ ఆడిటోరియం మొత్తం ఆ గంట వ్యవధిలోనే క్రిక్కిరిసిపోయింది,” అని లాస్ ఏంజిలిస్ టైమ్స్ పత్రిక ప్రచురించింది.

శాంటా రోసాలో లూథర్ బర్బ్యాంక్ యోగానందగారు.

యోగానందగారు ప్రపంచంలోని గొప్ప మతాలన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న ఐక్యతను నొక్కిచెప్పారు. భగవంతుడ్ని ప్రత్యక్షంగా, వ్యక్తిగతంగా అనుభూతి పొందేందుకు అవసరమైన, విశ్వవ్యాప్తంగా వర్తించే పద్ధతులను బోధించారు. తన బోధనలను క్రమం తప్పకుండా అనుసరించే తన ప్రియ శిష్యులకు ఆయన క్రియాయోగా ద్వారా ఆత్మను జాగృతం చేసే పద్ధతులను బోధించారు. తన ముప్పై సంవత్సరాల ప్రస్థానంలో పాశ్చాత్య దేశాలలో ఒక 100,000 మందికి పైగా స్త్రీ పురుషులకు ఆయన ఆ దిశగా ప్రేరణనిచ్చారు.

మెక్సికో అధ్యక్షుడు డాక్టర్ ఎమిలియో పోర్టెస్ గిల్ తో యోగానందగారు.

ప్రముఖ హార్టికల్చరిస్ట్ లూథర్ బర్బ్యాంక్, ప్రముఖ గాయని ఒపెరాటిక్ సోప్రానో అమెలిటా గల్లీ-కర్సీ, జార్జ్ ఈస్ట్‌మన్ (కోడాక్ కెమెరా యొక్క ఆవిష్కర్త), కవి ఎడ్విన్ మార్కమ్ మరియు సింఫనీ నిర్వాహకుడు లియోపోల్డ్ స్టోకోవ్ స్కీ తో సహా సైన్స్, వ్యాపార, కళా రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖులు ఆయన అనుంగు శిష్యులైన వారిలో ఉన్నారు. 1927లో, శ్రీ యోగానంద కార్యకలాపాల గురించి వార్తాపత్రికలలో వచ్చిన వార్తలను చూసి అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ ఆయన్ను వైట్ హౌస్ కు అధికారికంగా ఆహ్వానించారు.

1929లో, తన రెండు నెలల మెక్సికో పర్యటనలో, లాటిన్ అమెరికాలో తన భవిష్యత్ కార్యాచరణకు ఆయన పునాది వేశారు. మెక్సికో అధ్యక్షుడు డాక్టర్ ఎమిలియో పోర్టెస్ గిల్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆయన తన జీవితాంతం శ్రీ యోగానంద బోధనలను అభిమానించి, ఆరాధించారు.

1930వ దశకం మధ్య నాటికి, సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పనిని నిర్మించడంలో, తన తదనంతరం క్రియాయోగ మిషన్ ‌ను ముందుకు తీసుకెళ్ళడంలో సహాయపడగలిగే చాలా మంది ప్రారంభ శిష్యులను పరమహంసజీ కలుసుకున్నారు. వీరిలో ఇద్దరిని తన ఆధ్యాత్మిక వారసులుగా ఆయనే స్వయంగా నియమించారు. వారిద్దరిలో 1932లో కాన్సాస్ నగరంలో తనను కలిసిన రాజర్షి జనకానంద (జేమ్స్ జె. లిన్) ను అంతకు ముందు ఏడాది సాల్ట్ లేక్ సిటీలో తన తరగతులకు హాజరైన శ్రీ దయామాతలను సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులుగా నియమించారు.

లాస్ ఏంజిలిస్ లోని YSS-SRF అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో ధ్యానం చేస్తున్న గురువు (పరమహంస యోగానందగారు) మరియు శిష్యుడు (జేమ్స్ జె. లిన్).

1920లు మరియు 30వ దశకంలో ఆయన ఉపన్యాస కార్యక్రమాలకు హాజరైన ఇతర శిష్యులు అనేకులు తదనంతర కాలంలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కార్యానికే పూర్తిగా అంకితమయ్యారు. 1920లో బోస్టన్‌లో ఆయనను కలిసిన డా. శ్రీమతి M. W. లూయిస్; జ్ఞానమాత (సీటెల్, 1924); తారామాత (శాన్ ఫ్రాన్సిస్కో, 1924); దుర్గామాత (డెట్రాయిట్, 1929); ఆనందమాత (సాల్ట్ లేక్ సిటీ, 1931); శ్రద్ధామాతా (టాకోమా, 1933); మరియు శైలసుతమాతా (శాంటా బార్బరా, 1933) లు వారిలో ఉన్నారు.

శ్రీ యోగానంద గతించినప్పటి నుండి, ఇప్పటివరకూ కూడా పరమహంస యోగానందగారి ద్వారా వ్యక్తిగత ఆధ్యాత్మిక శిక్షణ పొందిన శిష్యుల మార్గాదర్శనంలోనే సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ముందుకు సాగుతోంది.

పరమహంస యోగానందగారు మరియు ఫే రైట్, ఇప్పుడు ఎస్.ఆర్.ఎఫ్. ఎన్సినీటస్ హెర్మిటేజ్‌లో శ్రీ దయామాత.

శ్రీ యోగానంద తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు చేసిన అనేక చర్చలు, నిర్వహించిన తరగతులు అడపాదడపా మాత్రమే రికార్డ్ చేయబడ్డాయి. అయినప్పటికీ, శ్రీ దయామాత (తరువాత ప్రపంచవ్యాప్త సంస్థకు అధ్యక్షురాలయ్యారు) 1931లో శ్రీ యోగానంద ఆశ్రమంలో చేరినప్పుడు, ఆమె యోగానందగారి వందలాది ఉపన్యాసాలు, తరగతులు మరియు అనధికారిక ప్రసంగాలను పకడ్బందీగా రికార్డ్ చేసే పవిత్రమైన పనిని స్వీకరించారు. తద్ద్వారా ఆయన ప్రపంచానికి పంచిన జ్ఞానాన్ని, స్ఫూర్తిని ఆమె పదిలపరచారు. పరమహంస యోగానందగారి అమేయ శక్తిని, స్వచ్ఛతను భావి తరాలకు అందించే సత్సంకల్పంతో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ వాటిని ప్రచురించింది.

ఇతరులతో పంచుకోండి