దేశవ్యాప్తంగా జరుగుతున్న కోవిడ్-19 సహాయక చర్యలలో వై.ఎస్.ఎస్. పాలుపంచుకుంటోంది

26 మే, 2021

ప్రియమైన దివ్యాత్మ స్వరూపా, కోవిడ్-19 మహమ్మారి యొక్క రెండవ వేవ్ భారతదేశాన్ని ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సంక్షోభంలో ముంచెత్తివేసింది. దేశం పెను సవాళ్ళను అధిగమించడానికి పోరాడుతోంది. అవి ఏవంటే — వైద్య సదుపాయాలు, పరికరాలు, వైద్య సరఫరాలు, మున్నగువాటి కొరత; అత్యవసరమైన, తరచుగా ప్రాణాంతకమైన అవసరాలు ఉన్నవారికి వ్యక్తిగత ఉపశమనాన్ని అందించలేక పోవడం మొదలైనవి. కోవిడ్-19 ప్రభావం వల్ల ప్రత్యక్షంగా కలుగుతున్న ఈ అనుభవం — ఆత్మీయులను కోల్పోవడం, ఆదాయ నష్టం, ప్రతి ఒక్కరి భద్రత, ఆరోగ్యం గురించి అనిశ్చితి — నుంచి కొద్దిమంది మాత్రమే తప్పించుకోగలిగారు. అటువంటి నష్టాలకు గురైనవారి కోసం మా హృదయం ద్రవిస్తోంది; వారు జగన్మాత యొక్క సర్వోపశమన కారకమైన ప్రేమతో నిండి పోవాలని మేము గాఢంగా ప్రార్థిస్తున్నాము. ప్రభావితులైన వారికి — ముఖ్యంగా దురదృష్టవంతులు, దీనివల్ల ఎక్కువగా నష్టపోయే స్థితిలో ఉన్నవారికి భౌతిక సహాయం, సేవలు అందించడం ద్వారా యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోడానికి సహకరిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలలో చేయి కలిపింది. 20 రాష్ట్రాలలోని 25 పట్టణాల్లో ఈ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి; ప్రతిరోజూ మరిన్ని పట్టణాలు వీటికి జోడించ బడ్తున్నాయి. మేము ఇప్పుడు చేపట్టిన కార్యక్రమాల గురించి, మన దేశంలోని ఈ విపత్కర సమయాల్లో సహాయం అందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో మేము వేటిని అందించాలని అనుకుంటున్నామో, వీటి గురించి మీతో పంచుకోడానికి మేము ఇప్పుడు మీ ముందుకు వచ్చాము.

భౌతిక సహాయం, సేవలు

మేము మన ఆశ్రమాలు, కేంద్రాలు, మండలులను మన సహాయ కార్యక్రమాల కేంద్రాలుగా మన సేవలు విస్తరించేందుకు ఉపయోగిస్తున్నాము. ఈ సేవలు అవసరమైన వ్యక్తులకు, కుటుంబాలకు నేరుగా చేరుతున్నాయి. దీనికి తోడుగా కోవిడ్-19 పేషంట్లకు చికిత్సను, ఆరోగ్య సంరక్షణను, అందిస్తున్న ఆస్పత్రులకు, ఎన్జీఓలకు మేము సహకారాన్ని అందిస్తున్నాం. వై.ఎస్.ఎస్. కార్యక్రమాలలో ఉన్నవి:

ఆంబులెన్స్ లు, అంత్యక్రియల వాహనంతో రాంచీలోని యోగదా సత్సంగ సేవాశ్రమ సభ్యులు.
రాజమండ్రిలోని స్వచ్ఛంద సేవకులు PPE కిట్లు ధరించి కోవిడ్ రోగులకు నిత్యావసర వస్తులతో సహాయం అందిస్తున్నారు, వారికి ఆహారం కూడా పంచుతున్నారు.
  • మేము వారికి అదనంగా మంచాలు, స్ట్రెచర్లు, వీల్ ఛైర్లు, ప్రాణాధార ఔషధాలు, మరియు బైపాప్ మిషిన్లు (నాన్-ఇన్వేసివ్ వెంటిలేటర్) ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు వంటి పరికరాలు, తీవ్ర కొరత ఉన్న ఆస్పత్రులకు అందిస్తున్నాం. వీటిలో రాంచీ, కోయంబత్తూరు, మధురై, ముంబయి, నాగ్ పూర్, హరిద్వార్, శ్రీరాంపూర్, వెల్లూరు, విజయవాడ లోని ఆస్పత్రులు ఉన్నాయి.
  • మేము మందులు, పల్స్ ఆక్సీమీటర్లు, పిపిఇ కిట్లు, ఫేస్ షీల్డులు, వైద్య గ్లోవ్స్, శానిటైజర్లు, ఎన్ 95 మాస్కులు, థర్మామీటర్ల వంటి అవసరమైన సామాగ్రిని, ప్రత్యక్షంగా కోవిడ్-19 రోగులకు వైద్యపరంగా ముందుండి సేవ చేసే ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులకు అందజేస్తున్నాం. మేము ఈ సహాయ కార్యక్రమాన్ని దక్షిణేశ్వర్, ద్వారాహాట్, అర్శికెరి, బళ్ళారి, బెంగుళూరు, ఛండీగర్, చెన్నై, కోయంబత్తూరు, లక్నో, మంగళూరు, మైసూరు, రాయ్ పూర్, తంజావూరు నగరాలకు విస్తరిస్తున్నాము.
  • ద్వారాహాట్ లో ఉన్న చిన్న స్థానిక ఆసుపత్రి వారి వద్ద దగ్గరలో ఉన్న హల్ ద్వానీ లో పెద్ద ఆసుపత్రికి ఆధునిక వైద్యసంరక్షణ అవసరమైన రోగులను రవాణా చేయడానికి ఎంతగానో అవసరమైన ఆంబులెన్స్ లేదు. ఈ అవసరాన్ని తీర్చడానికి ఒక వాన్ ను కొన్నాము. దానిలో ఆంబులెన్స్ కి అవసరమైన ప్రత్యేక పరికరాలు అమరుస్తున్నాము.
  • ఉడిపిలో ప్రభుత్వాసుపత్రులకు వేడినీటి డిస్పెన్సర్లు, చెన్నైలో ప్రభుత్వాసుపత్రులకు కాడవర్ సంచులు అందజేశాము.
  • మా రాంచీ ఆశ్రమ ఆసుపత్రి లోని వైద్య సిబ్బంది ఆంబులెన్స్ సేవలు, అంత్యక్రియల వాన్ సేవ, ఆక్సిజన్ సిలెండర్ల సరఫరా, మెడికల్ కిట్లు, ఉచిత వైద్య సలహాలు — వీటన్నిటినీ ఇరవై నాలుగు గంటలూ అందిస్తున్నారు.
  • ఐసియు లో ఉన్న నిరుపేద రోగులకు ఖర్చులకు కావలసిన ధనాన్ని సమకూర్చుకోడానికి మేము ఆర్థిక సహాయాన్ని అందజేశాము; కొన్ని సందర్భాలలో మరణించిన వ్యక్తి కుటుంబంలో ఏకైక ధనార్జన చేసే వ్యక్తి అయినప్పుడు వారి సమీప బంధువులకు మేము ఆర్థిక సహాయాన్ని అందజేశాము.
  • లాక్ డౌన్ల వలన జీవనోపాధిని కోల్పోయిన వారికి పొడి దినసరి సామాన్లు అందజేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఇది ద్వారాహాట్, రాంచీ, ఢిల్లీ మరియు NCR, అహమ్మదాబాదు, బళ్ళారి, బెంగుళూరు, బెలగావి, హరిద్వార్, హస్సన్, కైగా-కార్వర్, మాండ్యా, ముజఫర్ పూర్, ఒంగోలు, రాజమండ్రి, తిరుకజు కుండ్రం ప్రాంతాలలో నిర్వహించ బడుతోంది.
YSDK బెంగుళూరు భక్తుడు కోవిడ్-19 వల్ల ప్రభావితులైన 80 పేద కుటుంబాలకు పంచడం కోసం ఒక స్వచ్ఛంద సంస్థకు పొడి దినసరి సామాగ్రి విరాళంగా ఇచ్చారు.
వైద్య సామాగ్రితో స్వచ్ఛంద సేవకులు, ద్వారాహాట్

ఎవరికి సహాయం అవసరమో గుర్తించి, మా కోవిడ్-19 సహాయ కార్యక్రమాలకు సహకరించడంలో సాధనాలుగా ఉన్న వై.ఎస్.ఎస్. భక్తులు, స్నేహితులకు మేము ఎంతగానో ఋణపడి ఉన్నాము. వారి నిస్వార్థ సేవాస్ఫూర్తిని మేము గుర్తిస్తున్నాము; అది మన ప్రియతమ గురుదేవులు మనకు అందించిన వై యస్ యస్ ఆశయాలు, ఆదర్శాలలో ఒకటి: “మానవాళిని తన పెద్ద స్వరూపంగా భావించి సేవించడం.”

కోయంబత్తూరులో ఆక్సీమీటరు, ధర్మామీటరు, ఎన్ 95 మాస్కులు, పిపిఇ కిట్లు మొదలైనవి శివాంజలి ట్రస్టు వారికి అందజేశారు.
చెన్నైలోని కోవిడ్ ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను విరాళమిచ్చారు.
నాగపూరులో జి ఎమ్ సి హెచ్ కు 2 బిపాప్ మిషిన్లు విరాళమిచ్చారు.
మధురై, తొప్పూర్ లోని కోవిడ్ ఆసుపత్రికి వీల్ ఛైర్లు, స్ట్రెచెర్లు విరాళమిచ్చారు.

సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ, స్వచ్ఛందంగా సేవ చేస్తున్న మన ఇద్దరు భక్తులు దిగువ ఇచ్చిన సందేశాలను మనతో పంచుకున్నారు:

“బాధపడ్తున్న వారికి, వారికి సంరక్షణను అందిస్తున్న వారికి సహాయం చేయడం, “మేము మీతో ఉన్నాము, మీకు చేయూతను అందిస్తున్నాము” అని తెలియజేయడం ప్రగాఢమైన సంతృప్తిని ఇస్తోంది.”

— కె. బి. రాజమండ్రి

“మేము ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి, వారికి బిపాప్ వంటి అత్యవసరమైన పరికరాలు అందజేస్తూ మా స్నేహ హస్తాన్ని చాచగలిగినందుకు నేను కృతజ్ఞుణ్ణి. ఒక వైవిధ్యాన్ని చూపించగలగడం, మన గురుదేవుల క్రియాశీల హస్తాలు కాగలగడం ఎటువంటి దీవెనో కదా!”

— ఆర్. ఆర్. నాగపూర్

మీ సహాయం ఎంతో ముఖ్యమైనది. కోవిడ్ సహాయం యొక్క అవసరం ఇంకా తీరలేదు. ప్రజలకి మీ సహాయం కావాలి. మా ప్రయత్నాలను కొనసాగించడానికి, కోవిడ్-19 సహాయ కార్యక్రమాల కోసం విరాళ మివ్వగలిగిన వారందరినీ మేము ఆహ్వానిస్తున్నాము. మీ హృదయపూర్వక ఉదాత్త సహాయం మేము సేవ చేయడానికి దోహదపడ్తుంది. అదనంగా, అంతే ముఖ్యమైనది ఇంకొకటి ఏదంటే, ఆర్తుల కోసం ప్రార్థించాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. మన ప్రార్థనలు తప్పక పరిస్థితులను మెరుగుపరుస్తాయని చెబుతూ గురుదేవులు మనకి సరియైన విధానంలో ప్రార్థించడమెలాగో నేర్పించారు. ఇటువంటి గొప్ప అత్యవసర సమయాల్లో వై.ఎస్.ఎస్. సన్యాసులు రోజువారీ ఆన్ లైన్ రోగనివారక ప్రార్థనా సమయాలతో పాటు రాత్రి 9.40 నుండి 10.00 గంటల వరకూ (భారత కాలమానం ప్రకారం) ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు. మీకు కుదిరినప్పుడల్లా వారితో కలవండి.

మన గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందులవారు అన్నారు: “మీ చుట్టుపక్కల ఎవరైనా భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అస్వస్థులైతే మీకు కాని, మీ కుటుంబానికి కాని సహాయం చేసుకున్నట్టుగానే, ప్రతిరోజూ వారిని ఉద్ధరించడానికి ప్రయత్నించండి.అప్పుడు జీవిత రంగస్థలంపై మీ పాత్ర ఏదైనా ఫరవాలేదు, దానిని మీరు అందరి భవితవ్యాల దివ్య రంగస్థల నిర్వాహకుని దర్శకత్వంలో సరిగానే పోషిస్తున్నారని తెలుసుకుంటారు.”

మనం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి మనం చేయగలిగిన సహాయాన్ని, తోడ్పాటును అందించడానికి మన సమైక్యకృషిలో మీరు కూడా మాతో కలిసి రావాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము, స్వాగతం పలుకుతున్నాము. భగవంతుడు, గురువులు మన హృదయపూర్వక ప్రార్థనలు, మానవతా దృక్పథంతో చేపట్టిన సహాయ కార్యక్రమాలను తమ దయాపూర్వక రోగనివారక కాంతితో, దివ్యప్రేమతో పరివేష్టిస్తున్నారు.

దివ్య స్నేహంతో,

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా

ఈ సేవా కార్యక్రమానికి తోడ్పడాలని మీరు కోరుకుంటే ఆన్ లైన్ విరాళం ఇవ్వడం గురించి ఆలోచించండి.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా 1961 ఆదాయపన్ను యాక్టు నిబంధనలను అనుసరించి స్వచ్ఛంద సంస్థగా గుర్తించబడిందని తెలుసుకోగలరు. సంస్థకు పంపిన విరాళాలు (పాన్: AAATY0283H) పైన చెప్పిన యాక్టులోని సెక్షన్ 80-G కింద ఆదాయపన్ను నుంచి మినహాయించబడినవి.

విరాళాల గురించి కాని, మా సహాయ కార్యక్రమాల గురించి కాని మీకేవైనా ప్రశ్నలు ఉంటే రాంచీ హెల్ప్ డెస్క్ ను ఈమెయిల్ ద్వారా helpdesk@yssi.org లేదా ఫోను: +91(651)6655 555 (సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9.00 గం.ల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు) ద్వారా దయచేసి సంప్రదించండి.

Media Coverage of Charitable Activities

ఇతరులతో షేర్ చేయండి

Facebook
X
WhatsApp
This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.
This site is registered on Toolset.com as a development site.