ఒమర్ ఖయ్యామ్ రుబాయత్‌లో దాగి ఉన్న సత్యాలు

ఈ సంపుటం, ఒమర్ ఖయ్యామ్ యొక్క రుబాయత్‌పై పరమహంస యోగానందగారి పూర్తి వ్యాఖ్యానాలను అందిస్తుంది, తొమ్మిది వందల సంవత్సరాల పైచిలుకు కాలంలో జీవించిన గొప్ప ప్రఖ్యాతి పొందిన ముగ్గురు వ్యక్తుల కవితా మరియు ఆధ్యాత్మిక ప్రావీణ్యమును ఒకచోట చేర్చింది. ఒమర్ ఖయ్యామ్ యొక్క పదకొండవ శతాబ్దపు పద్యాలు మరియు పంతొమ్మిదవ శతాబ్దంలో ఎడ్వర్డ్ ఫిట్జ్‌గెరాల్డ్ అనువాదం చాలా కాలం పాటు పాఠకులను ఆనందపరిచాయి. అయినప్పటికీ ఆ కవిత్వం యొక్క నిజమైన అర్థం చాలా చర్చనీయాంశమైంది. తన జ్ఞానదాయకమైన వివరణలో, పరమహంస యోగానందగారు ఈ సాహిత్య మహాకావ్యం యొక్క మార్మిక సారాన్ని ఉపమానాల యొక్క జటిలమైన గుట్టును బయటపెట్టారు.

రుబాయత్ మీద పరమహంసగారి వ్యాఖ్యానం, ప్రతి మానవునిలో దాగి ఉన్న సహజమైన దివ్యత్వం యొక్క లోతైన అవగాహనకు, తూర్పు మరియు పశ్చిమ రెండు ప్రాంతాల ప్రజలను మేలుకొలిపే జీవితకాల ప్రయత్నంలో ఒక అంశం. అన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాల యొక్క జ్ఞానసిద్ధులైన ఋషుల వలె, శ్రీ యోగానందగారు వివిధ మతాల యొక్క సిద్ధాంతాలు మరియు అభ్యాసాలకు అంతర్లీనమై ఉన్నది ఒకే సత్యమనీ, ఒకే సర్వోత్కృష్టమైన వాస్తవమనీ గ్రహించారు. ఈ సార్వత్రిక దృక్పథం మరియు విశాల దర్శనశక్తి ఆయనకు, భారతదేశపు ప్రాచీన యోగ శాస్త్ర బోధనలు మరియు ఇస్లామిక్ ప్రపంచంలో ఎంతో అపార్థానికి గురైన గొప్ప ఆధ్యాత్మిక కవులలో ఒకరైన ఒమర్ ఖయ్యామ్ యొక్క రచనల మధ్య లోతైన బంధుత్వాన్ని విశదీకరించడానికి సహాయపడింది.

వైన్ ఆఫ్ మిస్టిక్

ఈ పుస్తకం కేవలం వ్యాఖ్యానం మాత్రమే కాకుండా, జీవిత నడతకు సంబంధించిన ఆధ్యాత్మిక బోధనను అందిస్తుంది. పరమహంస యోగానందగారి ఒమర్ ఖయ్యామ్ యొక్క బాహ్య భావనల వెనుక మానవ ఉనికి యొక్క ఉత్కృష్టమైన ఉద్దేశ్యం మరియు ఆనందం గురించి అందమైన లోతైన అవగాహన దాగి ఉంది.

“ఒమర్ ఖయ్యామ్ సందేశం”
“ది వైన్ ఆఫ్ ది మిస్టిక్”కు పరమహంస యోగానందగారి పరిచయ వాక్యాల నుండి:

“చాలా కాలం క్రితం భారతదేశంలో నేను ఒక పర్షియాకు చెందిన కవిని కలిశాను, అతను పర్షియా కవిత్వానికి తరచుగా రెండు అర్థాలు ఉంటాయని చెప్పాడు, ఒకటి అంతర్గతమైనది మరియు ఒకటి బాహ్యమైనది. అనేక పర్షియా కవితల యొక్క ద్విగుణీకృతమైన ప్రాముఖ్యత గురించి ఆయన వివరణల పట్ల నేను పొందిన గొప్ప తృప్తి నాకు గుర్తుంది.

“ఒకరోజు నేను ఒమర్ ఖయ్యామ్ యొక్క రుబాయత్ పేజీలపై గాఢంగా దృష్టి కేంద్రీకరించినప్పుడు, దాని బాహ్య అర్థాల గోడలు అకస్మాత్తుగా కూలిపోవడాన్ని నేను చూశాను మరియు ఆధ్యాత్మిక స్వర్ణసంపదతో కూడిన విశాలమైన అంతర్గత దుర్గం నా దృష్టిలో నిలిచింది.

“అప్పటినుండి, రుబాయత్‌లో అంతకుముందు కనిపించని గుప్త జ్ఞాన దుర్గము యొక్క అందాన్ని నేను ఆరాధిస్తాను. చొచ్చుకొని పోగల ఏ కంటికైనా కనిపించే ఈ స్వాప్నిక సత్య-కోట అజ్ఞానపు శత్రు సైన్యాలచే ఆక్రమించబడి ఆశ్రయం కోరే అనేక ఆత్మలకు స్వర్గధామం అవుతుందని నేను భావించాను….

“నేను రుబాయత్ యొక్క ఆధ్యాత్మిక వివరణపై పని చేస్తున్నప్పుడు, అది నన్ను అంతులేని చిట్టడవి వంటి సత్యంలోనికి నేను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేంతగా తీసుకువెళ్ళింది. ఈ శ్లోకాలలో ఖయ్యామ్ యొక్క తర్క-సంబంధమైన ప్రయోగాత్మక తత్వపు నిగూఢత నాకు ‘ది రివిలేషన్ ఆఫ్ సెయింట్ జాన్ ది డివైన్’ని గుర్తు చేస్తుంది. రుబాయత్‌ను సరిగ్గా ‘ది రివిలేషన్ ఆఫ్ ఒమర్ ఖయ్యామ్’ అని పిలుస్తారు.”

పరమహంస యోగానందగారి ది వైన్ ఆఫ్ ది మిస్టిక్ (Wine of the Mystic) నుండి సారాంశాలు

ధ్యానం మరియు భగవత్ సంసర్గం గురించి…

Here with a Loaf of Bread beneath the Bough,
A Flask of Wine, a Book of Verse—and Thou
Beside me singing in the Wilderness—
And Wilderness is Paradise enow.

ధ్యానములో గాఢమైన నిశ్శబ్దంలో కూర్చొని, నా మనస్సు మస్తిష్క మేరుమండల జీవ వృక్షముపై మరియు ఆధ్యాత్మిక చైతన్యంపై కేంద్రీకరించి, నేను శాంతి నీడలో విశ్రాంతి తీసుకుంటాను. జీవం ఇచ్చే ప్రాణ శక్తి [జీవ శక్తి] అనే ‘రొట్టె’తో పోషించబడి, నేను నా ఆత్మ పాత్రను నింపే దివ్య మైకపు మధుర ద్రాక్షారసాన్ని తాగుతాను. నా హృదయం శాశ్వతమైన దివ్య ప్రేమ యొక్క కవితా ప్రేరణలను నిరంతరం పఠిస్తుంది. అత్యంత లోతైన ఆంతరంగిక నిశ్శబ్దమనే నిర్జన ప్రదేశంలో—ఇక్కడ అన్ని కోలాహలమైన కోరికలు చనిపోయాయి—నాకు పరమప్రియమైన, గాన పారవశ్యమైన నీతో అనుసంధానం పొందుతాను. కోరికలను తీర్చే జ్ఞానమనే సంగీతాన్ని నువ్వు నాకు మధురంగా ​​వినిపించావు. ఆహ్, నిర్జన ప్రదేశం, భౌతిక వాంఛలు మరియు ఉద్రేకాలు అనే ఘోషల నుండి స్వాతంత్ర్యం! ఈ ఒంటరితనంలో నేను ఒంటరిని కాదు. నా ఆంతరిక మౌనమనే ఏకాంతంలో నేను అంతులేని ఆనందపు స్వర్గాన్ని కనుగొన్నాను.”

అంతః శాంతి మరియు సాఫల్యంపై…

 స్త్రీ వెనుక పురుషుడు (ప్రాపంచిక కోరికలను వర్ణన).

The Worldly Hope men set their Hearts upon
Turns Ashes—or it prospers; and anon,
Like Snow upon the Desert’s dusty Face
Lighting a little Hour or two—is gone.

అజ్ఞాని మాత్రమే ఈ భూమి నుండి పరిపూర్ణతను మరియు శాశ్వతమైన సాఫల్యాలను ఆశిస్తాడు; మరియు ముక్కలైన హృదయంతో అతను శ్మశాన ద్వారాలలోకి ప్రవేశిస్తాడు. జ్ఞానోదయం పొందిన మానవుడు, ప్రపంచంలోని భ్రాంతికరమైన స్వభావాన్ని తెలుసుకొని, తన ఆశలను ఇక్కడ నిర్మించుకోడు. భూసంబంధమైన కోరికలచే చలించకుండా, జ్ఞానులు శాశ్వతమైన సత్యాన్ని కోరుకుంటారు; వారు శాశ్వత సాఫల్యపు బ్రహ్మాండంలోకి ప్రవేశిస్తారు.

Ah, my Beloved, fill the Cup that clears
TO-DAY of past Regrets and future Fears—
To-morrow? —Why, To-morrow I may be
Myself with Yesterday’s Sev’n Thousand Years.

ఓ నా ఆత్మా! ఆనంద పారవశ్యపు పీపా నుండి ప్రవహించే ఆనందామృతంతో నా చైతన్యమును నింపుము. ఆ దివ్య సంసర్గం తప్ప మరేదీ, గత తప్పిదాల వెంటాడే జ్ఞాపకాలను మరియు భవిష్యత్తులో జరిగే తప్పుల భయాలను వాటి దుష్ఫలితాల పంటతో దూరం చేయలేదు.

ధ్యానం ద్వారా ఒకరు సూక్ష్మమైన, నిశ్శబ్ద అంతః శాంతిని అనుభవించవచ్చు, ఇది జీవిత విధుల నిర్వహణకై ఆవశ్యకమయ్యే అన్ని సామరస్యపూర్వకమైన లేదా కష్టసాధ్యమైన కార్యకలాపాలకు ఉపశాంతి నేపధ్యం శాశ్వత ప్రాతిపదికగా ఉంటుంది….ఒక ఇసుక ముద్ద సముద్రపు అలల కోత ప్రభావాన్ని తట్టుకోలేదు; అంతరాయం కలిగించని అంతః శాంతి లేని వ్యక్తి మానసిక సంఘర్షణ సమయంలో ప్రశాంతంగా ఉండలేడు. కానీ వజ్రం దాని చుట్టూ ఎన్ని అలలు తిరుగుతున్నా మారకుండా ఉంటుంది, అలాగే శాంతి-సృష్టించుకున్న వ్యక్తి అన్ని వైపుల నుండి పరీక్షలు వచ్చినప్పుడు కూడా ప్రకాశవంతంగా నిర్మలంగా ఉంటాడు. మారుతున్న జీవన జలాల నుండి, ఆత్మ యొక్క శాశ్వతమైన ఆనందంతో మెరుస్తున్న మార్పులేని ఆత్మ-చైతన్యం అనే వజ్రాన్ని ధ్యానం ద్వారా రక్షించుకుందాం.

ఆధ్యాత్మిక అన్వేషణలో…

With them the Seed of Wisdom did I sow,
And with my own hand labour’d it to grow:
And this was all the Harvest that I reap’d—
“I came like Water, and like Wind I go.”

జ్ఞానం యొక్క బీజం గురువు లేదా ఆత్మ-సాక్షాత్కార నిపుణుని ద్వారా ఇవ్వబడుతుంది; కానీ నేల, లేదా గ్రహణశక్తి, మరియు ఆ విత్తనం యొక్క సాగును భక్తుడు తప్పనిసరిగా సమకూర్చుకోవాలి….స్వీయ-క్రమశిక్షణ అనేది ఆత్మ-హింస కాదు; మనకు నిజమైన ఆనందాన్ని కలిగించే నిర్దిష్ట జీవన అలవాట్లపై మనస్సు యొక్క వికృత శక్తులను నిర్వహించడానికి మరియు కేంద్రీకరించడానికి ఇది మార్గం. స్వీయ-క్రమశిక్షణ యొక్క పద్ధతులను కఠినంగా అనుసరించడం ద్వారా మనం చంచలత్వం, చెడు అలవాట్లు మరియు దుఃఖాన్ని కలిగించే కోరికలను వదిలించుకోవచ్చు మరియు నిజంగా సంతోషంగా ఉండవచ్చు. మనం బలహీనంగా, చంచలంగా మరియు మానసికంగా అస్థిరంగా ఉన్నప్పుడు, మనం నీటి వలె భూమిపైనే ఉంటాము. కానీ మనం స్వీయ-క్రమశిక్షణ మరియు గాఢమైన ధ్యానం ద్వారా ఆధ్యాత్మికంగా మారినప్పుడు, మన నిజమైన ఆత్మ స్వభావం యొక్క సర్వవ్యాపకత్వంలో గాలిలా ఎగురుతాము.

తన నిజమైన ఆత్మ స్వభావం యొక్క సర్వవ్యాప్తిలో గాలిలా ఎగురుచున్న స్త్రీ

కర్మ నియమాన్ని అధిగమించడంపై…

చెకర్‌బోర్డ్‌లోని మానవులు గత, వర్తమానం మరియు భవిష్యత్తు యొక్క జైలు గోడల వెనుక పరిమితులను సూచిస్తారు.

‘Tis all a Chequer-board of Nights and Days
Where Destiny with Men for Pieces plays:
Hither and thither moves, and mates, and slays,
And one by one back in the Closet lays.

చదరంగం బోర్డు తెలుపు మరియు నలుపు చతురస్రాలను మార్చి-మార్చి కలిగి ఉంటుంది, దానిపై ప్రభువు వలె, వారి కింకరుల వలె చదరంగం పావులు కదులుతుంటాయి, అదే విధంగా తిరిగే భూమి దాని వైకల్పిత పగలు రాత్రులతో మానవ పావుల జీవితాలను పోషించే గొప్ప చదరంగం బోర్డును ఏర్పరుస్తుంది. వారి జీవితమంతా ఒక స్థితి లేదా స్థితి నుండి మరొక స్థితికి మార్చబడతారు, వారి ప్రణాళికలను అమలు చేయలేక తరచుగా ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకోబడతారు. చివరగా, మరణం అనే పరివర్తన ద్వారా వారి అస్తిత్వాలు త్రుంచివేయబడతాయి….

పురోగతులు, ప్రతిష్టంభనలు మరియు తిరోగమనాల ద్వారా విధి మీ జీవితమనే ఆటలో కుయుక్తులు పన్నినప్పుడు, ఈ ప్రభావాలు గత జన్మలలో మీరే సృష్టించుకున్న కారణాల వల్లనే అని గుర్తుంచుకోవాలి. మీకు కలిగిన ధుఃఖాల వల్ల విధిని శపించకూడదు లేదా మీ భాగ్యానికి మూలకర్తగా అదృష్టాన్ని స్తుతించకూడదు, కానీ మీ జీవితంలోని సంఘటనలను మలుపు తిప్పిన మీ స్వహస్తాన్ని గుర్తించండి. మీరు, మీ స్వయం-సృష్టి అయిన విధి పట్ల అసంతృప్తిగా ఉన్నట్లయితే, ఆ విధిని మార్చుకోవడానికి దేవుడు మీకు ఎంచుకొనే స్వేచ్ఛాశక్తిని ఇచ్చాడని గుర్తుంచుకోండి. సరియైన చర్యలతో చేసే సుదీర్ఘ ప్రయత్నాలు క్రమంగా ప్రయోజనాలను అందిస్తాయి; కాని అదనంగా మీరు గాఢమైన ధ్యానం ద్వారా దివ్యజ్ఞానంతో మీ సంకల్పాన్ని ఏకం చేస్తే, స్వేచ్ఛ యొక్క నిజమైన అర్థం మీకు తక్షణమే తెలుస్తుంది.

సమయం మరియు విధి మన అదృష్టాన్ని శాసించనివ్వకుండా, ఒకదాని తర్వాత మరొక జన్మ యొక్క ఉల్లాసమును అణిచివేసే బదులు, దేవుడు తన దివ్యమైన స్పర్శతో మనల్ని ఎందుకు అమరులను చేయకూడదు? అప్పుడిక, మనం విశ్రాంతి తీసుకోవడానికి మరణానంతర జీవితం యొక్క ఒడిలోకి వెళ్ళవలసిన అవసరం లేదు, దైవ సాన్నిధ్యం వల్ల, మనం నిత్యజీవులమవుతాం, గతం, వర్తమానం మరియు భవిష్యత్తు పరిమితులనే జైలు గోడల వెనుక బానిసలుగా ఉండనక్కర్లేదు.

విశ్వ నాటకం యొక్క అర్థంపై…

దేవుడు దర్శకత్వం వహించిన దైవ లీల ముగింపును మానవుడు చూస్తాడు.

Ah, Love! could thou and I with Fate conspire
To grasp this sorry Scheme of Things entire,
Would not we shatter it to bits—and then
Re-mould it nearer to the Heart’s Desire!

ఈ విధంగా ప్రతి జీవి ఎప్పుడో ఒకసారి తాను సృష్టికర్త పాత్రను పోషించాలని మరియు ఈ ప్రపంచాన్ని తాను కోరిన విధంగా మార్చాలని కోరుకుంటాడు. నిష్కల్మష ఆనందం యొక్క అభిలాష ఆత్మ అంతరాళం నుంచి ఊరుతుంది, దీని నుంచే దివ్య పరిపూర్ణత మరియు శాశ్వతానందం ఉద్భవిస్తుంది.

ప్రపంచం ఒక దివ్య చిక్కుముడి–మంచితో చెడు, ఆనందంతో దుఃఖం, జీవితంతో మృత్యువు కలగలిసి ఉంటుంది…. ప్రకృతిలో ఆనందం మరియు దుఃఖం, ధనిక మరియు పేద, ఆరోగ్యం మరియు అనారోగ్యం, తెలివితేటలు మరియు మూర్ఖత్వం, శాంతి మరియు యుద్ధాలు, దయ మరియు క్రూరత్వం, మంచి చెడుల విరుద్ధమైన నాటకాలన్నింటినీ మనం అర్థం చేసుకోలేకపోయినా మనం మన మెదడులను హింసించుకోవటమో లేదా సృష్టిలోని దివ్య పథకం పట్ల అవిశ్వాసులుగా ఉండకూడదు.. ఒక సఫలమైన నాటకం ఉత్కంఠతను కలిగి ఉంటుంది, ఆసక్తిని కలిగిస్తుంది, భ్రమింపజేస్తుంది లేదా చిక్కులను కలిగి ఉంటుంది మరియు సంతృప్తికరమైన నాటకీయ అభివృద్ధితో ముగుస్తుంది….అదే విధంగా, దేవుడు అధిరోహణలో ఉన్న ప్రతి ఆత్మకు అకస్మాత్తుగా తెరను తీసివేస్తాడు, విశ్వనాటకం యొక్క చివరి భాగాన్ని బహిర్గతం చేస్తాడు. అనేక విషాదాలు మరియు హాస్యాలు, దాని అద్భుతమైన ఘనమైన ముగింపును బహిర్గతం చేయడానికే.

దేవుని ప్రేమ మీద…

Said one—“Folks of a surly Tapster tell,
And daub his Visage with the Smoke of Hell;
They talk of some strict Testing of us—Pish!
He’s a Good Fellow, and ’twill all be well.”

అజ్ఞానం మరియు శిక్ష అనే పొగతో మనిషిని దురహంకారంతో పరీక్షించే వ్యక్తిగా, మరియు హృదయం లేని పరిశీలనతో మనిషి చర్యలను నిర్ధారించే వాడిగా తమ సృష్టికర్తను చిత్రీకరించే వ్యక్తులు ఉన్నారు. ప్రేమగల, కరుణామయమైన దివ్యమైన తండ్రిగా దేవుని యొక్క నిజమైన భావనను వారు కఠినమైన, కపటమైన మరియు ప్రతీకార నిరంకుశుని యొక్క తప్పుడు ప్రతిరూపంగా వక్రీకరిస్తారు. కానీ భగవంతునితో సంభాషించే భక్తులకు, ప్రేమ మరియు మంచితనం యొక్క అనంతమైన భాండాగారం అయిన కరుణామయుడు అని కాక ఆయన గురించి వేరే విధంగా ఆలోచించడం అవివేకమని తెలుసు. విశ్వానికి తండ్రి అయిన దేవుడు మంచివాడు కాబట్టి, అతని పిల్లలతో అన్ని విషయాలు బాగా ముగుస్తుండాలి; అవి మరియు సమస్త సృష్టి అతనిలో అద్భుతమైన ముగింపు మరియు పునస్సమాగమానికి కదులుతున్నాయి.

Wine of the Mystic: ఒమర్ ఖయ్యామ్ రుబాయత్ మీద పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక వివరణము నుండి మరింత చదవండి

ఇతరులతో పంచుకోండి