గురుశిష్య సంబంధం

దేవునిలో మీ ఆనందాన్ని తప్ప నేను మీ నుండి ఏమీ కోరుకోను. దేవుని జ్ఞానాన్ని మరియు ఆనందాన్ని తప్ప మీరు నా నుండి ఏమీ కోరుకోరు.

— పరమహంస యోగానంద

Paramahansa Yogananda the Guru

గురువు: “అంధకారాన్ని పారద్రోలేవాడు”

సద్గురువు ఒక సాధారణ ఆధ్యాత్మిక గురువు కాదు, అనంత పరమాత్మతో సంపూర్ణ ఐక్యతను పొంది, ఇతరులను అదే ఆనందకరమైన గమ్యం వైపు నడిపించే అర్హతను కలిగి ఉంటాడు.
 
సంస్కృత గ్రంథాలు గురువును ఇలా వర్ణిస్తాయి “చీకటిని పారద్రోలేవాడు” (గు, “అంధకారం,” మరియు రు, “పారద్రోలేది”). మనలో ప్రతి ఒక్కరూ “దేవుని స్వరూపంలోనే రూపొందించబడిన” అమరత్వం కలిగిన దివ్య జీవులమని తెలుసుకోకుండా నిరోధించే వాటిని మనందరికీ అర్థం అయ్యేలా—గురువు యొక్క సార్వత్రిక చైతన్యం అనే కాంతి ద్వారా, అజ్ఞానం అనే చీకటి తొలగించబడుతుంది.
 
ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేదా సాధన యొక్క నిర్దిష్ట మార్గంలోగల ధ్యానం మరియు రోజువారీ జీవనానికి సంబంధించిన నియమాల ద్వారా సద్గురువు తన అనుచరులకు మార్గదర్శనం చేస్తాడు. గురువు యొక్క బోధనలను అధ్యయనం మరియు అన్వయించకోవడం ద్వారా చిత్తశుద్ధిగల ఆధ్యాత్మిక సాధకుడు జీవితం యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని, దైవ కాంతికి మరియు ప్రేమకు నిదర్శనంగా ఉన్న, ఆత్మసాక్షాత్కారం పొందిన గురువుకు తనకు మధ్య ఉన్న నిజమైన సంబంధాన్ని అర్థం చేసుకుంటాడు. శిష్యుడు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, భగవంతునికి దూతగా లేదా సాధనంగా ఉన్న గురువు వ్యక్తిగతంగా ప్రసాదించే ఈ ఆశీస్సులను అతడు లేదా ఆమె అనుభవిస్తారు.
 
క్రియాయోగ మార్గం యొక్క విస్తారమైన సమృద్ధి శిష్యుడి జీవితంలోకి కేవలం బోధనల ద్వారా ప్రవహించడం మాత్రమే కాకుండా, అనంతమైన ఆత్మను తెలుసుకొని, ఇతరులను కూడా అదే విధమైన ఆధ్యాత్మిక అవగాహనకు తప్పకుండా చేర్చగల పరమహంస యోగానంద మరియు దైవసాక్షాత్కారం పొందిన ఆయన గురుపరంపర యొక్క మార్గదర్శకత్వం మరియు ప్రత్యక్ష ఉనికి కూడా అనుభవపూర్వకంగా పొందుతారు.

గురుశిష్యుల బంధం

పరమహంస యోగానందగారు గురుశిష్య సంబంధాన్ని ఈ విధంగా వర్ణించారు “చాలా వ్యక్తిగతమైన మరియు ఆంతరంగికమైన ఆధ్యాత్మిక బంధం… శిష్యుని పక్షాన నమ్మకమైన ఆధ్యాత్మిక ప్రయత్నం మరియు గురువు అందించే దివ్యమైన ఆశీర్వాదాల కలయిక.”

గురువు యొక్క విధేయతకు ప్రతిజ్ఞ చేయడం ద్వారా అతడు లేదా ఆమె తమ స్వీయ విధేయతను గురువుకు పరస్పరం వ్యక్తం చేస్తారు. వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థిగా చేరిన వ్యక్తికి బాహ్యంగా లేదా అంతర్గతంగా అటువంటి వాగ్దానం చేయవలసిన అవసరం లేదు. పరమహంసగారు ధ్యానం యొక్క శక్తివంతమైన ప్రక్రియల జ్ఞానాన్ని—మతపరమైన అనుబంధం లేదా అభ్యాసాలతో సంబంధం లేకుండా—వాటిని చిత్తశుద్ధితో నేర్చుకోవాలనుకొని, ఆ జ్ఞానాన్ని గోప్యంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేసేవారికి ఉచితంగా అందించారు.

అయినప్పటికీ, క్రియాయోగ శాస్త్రాన్ని దేవుణ్ణి చేరే వ్యక్తిగత మార్గంగా భావించేవారికి, పరమహంస యోగానందగారు క్రియాయోగ ప్రక్రియను అభ్యసించడానికి ఉపదేశం ఇచ్చారు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా అందించే ఆ పవిత్ర ఉపదేశం (సంస్కృతంలో దీక్ష) విద్యార్థి మరియు పరమహంస యోగానందగారి మధ్య గురుశిష్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది.

ఒక సద్గురువు భౌతిక శరీరంలో నివసించనప్పటికీ ఎప్పటికీ సజీవంగా ఉంటాడు. భగవంతుని సర్వవ్యాపకత్వం మరియు సర్వజ్ఞత్వంతో తన ఏకత్వం ద్వారా, సద్గురువు ఎల్లప్పుడూ శిష్యుడి గురించి తెలుసుకుంటూ, అతడికి లేదా ఆమెకు నిరంతరం ప్రేమ మరియు రక్షణనిచ్చి గమనిస్తుంటారు.

పరమహంస యోగానంద — వై.ఎస్.ఎస్. గురు పరంపరలో చివరివారు

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. గురు పరంపరలో తానే చివరి గురువుగా ఉండాలనేది భగవదేచ్ఛ అని తన దేహత్యాగానికి ముందు పరమహంస యోగానందగారు తెలియజేశారు. తరువాత వచ్చిన ఏ శిష్యుడూ/శిష్యురాలూ లేక నాయకుడూ ‘గురువు’ అనే పాత్రను పోషించరు.మత చరిత్రలో ఈ రకమైన దివ్య ఆజ్ఞ అసాధారణమేమీ కాదు. సిక్కు మత సంస్థాపకుడైన గొప్ప సంత్ మహానుభావుడు గురునానక్ గతించిన తరువాత సాధారణంగా జరిగే గురు పరంపర ప్రారంభమయింది. అయితే ఆ పరంపరలో పదవ గురువు, తానే ఆ గురు పరంపరలో ఆఖరి వాడినని, అప్పటి నుండి బోధనలే గురువుగా భావించబడాలని ప్రకటించాడు.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అనే తాను స్థాపించిన సంస్థ ద్వారా తన పని కొనసాగిస్తానని పరమహంసజీ వాగ్దానం చేశారు. “నేను గతించిన తరువాత, నా బోధనలే మీకు గురువు…. ఈ బోధనల ద్వారా మీరు నాతోనూ, నన్ను పంపిన మహా గురువులతోనూ అనుసంధానంలో ఉంటారు,” అని ఆయన పేర్కొన్నారు.

తదుపరి అన్వేషణ

ఇతరులతో పంచుకోండి