ఆరోగ్యం మరియు స్వస్థత

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు రచించిన మానవుడి నిత్యాన్వేషణలోని "దేవుడి అపరిమిత శక్తితో రోగచికిత్స" నుండి సారాంశాలు

రోగము అంటే ఏమిటి ?

జలపాతం మనకు ప్రవహించే దేవుని స్వస్థత ప్రకంపనలను సూచిస్తుంది

అనారోగ్యం మూడు రకాలు: శారీరకం, మానసికం, ఆధ్యాత్మికం.

ఒంటికి జబ్బు, శారీరక విష పదార్థాలు చేరే పరిస్థితులవల్లా అంటురోగాలవల్లా ప్రమాదాలవల్లా వస్తుంది.

మానసిక అనారోగ్యం భయంవల్ల, వ్యాకులతవల్ల, కోపంవల్ల, భావావేశ పరమైన ఇతర అసంగతులవల్లా వస్తుంది.

ఆధ్యాత్మిక అనారోగ్యం, దేవుడితో తనకున్న నిజమైన సంబంధాన్ని గురించి మానవుడి అజ్ఞానంవల్ల వస్తుంది.

అజ్ఞానం అన్నిటికంటె పెద్ద జబ్బు. అజ్ఞానాన్ని తొలగించినప్పుడు అతడు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రోగాల కారణాలను కూడా తొలగిస్తాడు. మా గురువుగారు, శ్రీయుక్తేశ్వర్ గారు తరచుగా అంటూండేవారు, “అత్యధికంగా శుభ్రపరిచేసేది వివేకం,” అని.

భౌతిక చికిత్సాపద్ధతుల పరిమిత శక్తితో రకరకాల బాధలను తొలగించుకోడానికి ప్రయత్నించడం మనకు తరచుగా నిరాశ కలిగిస్తుంది. శరీరం, మనస్సు, ఆత్మ అన్నవాటి “అస్వస్థత” కు ఆధ్యాత్మిక పద్ధతుల అపరిమిత శక్తిలో మాత్రమే శాశ్వత చికిత్సను మానవుడు కనుక్కోవచ్చు. నయంచేసే ఆ అపరిమిత శక్తిని దేవుడిలోనే అపేక్షించాలి. ప్రియమైనవాళ్ళు చనిపోవడంవల్ల మీరు మనోవ్యథను అనుభవించినట్లయితే వాళ్ళను కూడా మీరు దేవుడిలోనే కనుక్కోవచ్చు. ఆయన సహాయంతో సాధ్యమయేవే అన్నీ. దేవుడు నిజంగా తెలిసేవరకు ఎవరయినా, మనస్సు మాత్రమే ఉంటుందనీ ఆరోగ్య సూత్రాలను తాను పాటించనక్కరలేదనీ లేదా నయంకావడానికి భౌతిక సాధనోపాయాలను ఉపయోగించుకోనక్కరలేదనీ చెప్పడం సమర్థించదగినది కాదు. యథార్థంగా సాక్షాత్కారం పొందేవరకు వ్యక్తి, తాను చేసేవాటి కన్నిటికీ లోకజ్ఞానాన్ని ఉపయోగించాలి. అదే సమయంలో, దేవుణ్ణి శంకించకుండానూ ఉండాలి; దేవుడి సర్వవ్యాప్త దివ్యశక్తిమీద విశ్వాసమూ ఉంచాలి.

జబ్బుకు కారణాలు తెలుసుకోడానికీ జబ్బులు తిరగబెట్టకుండా ఉండడం కోసం ఆ కారణాలను తొలగించడానికీ వైద్యులు ప్రయత్నిస్తూ ఉంటారు. నయంచేయడానికి, నిర్దిష్టమైన, పదార్థపరమైన పద్ధతులను ఉపయోగించడంలో వైద్యులు తరచుగా చాలా నేర్పరులయి ఉంటారు. అయినప్పటికీ ప్రతి ఒక్క జబ్బుకూ మందూ శస్త్రచికిత్సా పనిచెయ్యవు; అందులోనే ఉంటుంది, ఈ పద్ధతుల ప్రధాన పరిమితత్వం.

రసాయన పదార్థాలూ మందులూ బాహ్య శారీరక కణాల భౌతిక నిర్మాణం మీద మాత్రమే ప్రభావం చూపిస్తాయి; కాని కణాల ఆంతరిక పరమాణు సౌష్ఠవాన్ని లేదా ప్రాణతత్త్వాన్ని మార్చవు. అనేక సందర్భాల్లో, భగవంతుడి నయంచేసే శక్తి, శరీరంలోని “లైఫ్ ట్రాన్ ల” (ప్రాణకణికల) – అంటే ప్రజ్ఞావంతమైన ప్రాణం తాలూకు – సమతౌల్యరాహిత్యాన్ని లోపలినుంచి సరిచేసే వరకు ఏ జబ్బూ నయం కావడం సాధ్యం కాదు.

మీ సహజ రోగనిరోధక శక్తిని పెంచుకోండి

నయంచేసే సహజ పద్ధతి ఉపవాసం. అనారోగ్యంగా ఉన్నప్పుడు జంతువులు ఏమీ తినవు. ఆటవికులు లంకణం చేస్తారు. ఆ విధంగా శరీరయంత్ర సముదాయం, దాన్ని అది శుభ్రపరుచుకోడానికీ అత్యవసరమైన విశ్రాంతి పొందడానికీ దానికి అవకాశం ఉంటుంది. చాలా జబ్బులను తెలివిగా లంకణాలు చేసి నయంచేసుకోగలం. గుండెకాయ బలహీనంగా ఉన్నవాళ్ళయితే తప్ప, నియమానుసారంగా స్వల్పకాలిక ఉపవాసాలు చేయడం ఆరోగ్యానికి అద్భుతమైన ఉపాయమని యోగులు సిఫార్సు చేస్తూ వస్తున్నారు. భౌతిక చికిత్సలో మరొక మంచి పద్ధతి, తగిన ఓషధులతో కాని ఓషధుల కషాయాలతో కాని చేసేది.

మందుల వాడకంలో, అవి నయంచేసేటంత శక్తి ఉన్నవికాకపోవడమో, నయం చేయడానికి బదులుగా అవి శారీరక కణజాలాలను రేపెట్టడమో జరుగుతూండడం గమనిస్తాం. అదే విధంగా కొన్ని రకాల “నయంచేసే కిరణాలు” పడితే కణజాలాలు కాలిపోతాయి. భౌతిక చికిత్సాపద్ధతులకున్న పరిమితులు ఎన్నెన్నో!

మందులకంటె ఉత్తమమైనవి సూర్యకిరణాలు. వాటిలో ఉంది, నయంచేసే అద్భుత శక్తి. ప్రతి దినమూ పది నిమిషాలసేపు ఆతప స్నానం [ఒంటిమీద ఎండ పడేటట్లు ఉండడం] చెయ్యాలి. అప్పుడోసారి ఇప్పుడోసారి ఎక్కువ సేపు ఎండలో ఉండడంకంటె దినానికి పదేసి నిమిషాల చొప్పున ఎండలో ఉండడం మంచిది. ఆరోగ్యపరమైన మంచి అలవాట్లు ఏర్పరుచుకోడంతో బాటు ప్రతి రోజూ కొద్దిసేపు ఆతప స్నానం, హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేయడానికి తగినంత ప్రాణశక్తిని శరీరానికి సరఫరాచేస్తూ ఉంటుంది.*

ఆరోగ్యవంతులయినవాళ్ళకు సహజమయిన రోగనిరోధకశక్తి ఉంటుంది; ముఖ్యంగా అంటువ్యాధుల విషయంలో. సరిగా తినకపోవడంవల్లనో, అతిగా తినడం వల్లనో రక్తంలో వ్యాధినిరోధక శక్తి తగ్గినప్పుడు కాని, అధిక సంభోగంవల్ల ప్రాణాధార శక్తి తగ్గినప్పుడు కాని జబ్బుచేస్తుంది. శారీరక సృజనశక్తిని సంరక్షించుకోడమంటే కణాలన్నిటికీ స్పందమాన ప్రాణాధారశక్తిని సరఫరా చేయడం; అప్పుడు శరీరానికి అత్యంత వ్యాధినిరోధకశక్తి ఉంటుంది. అధిక సంభోగం శరీరాన్ని బలహీనపరిచి జబ్బుచేయడానికి అవకాశమిస్తుంది.

[*గమనిక: ఆతప స్నానాన్ని తొలిపొద్దు వేళకూ పొద్దుగూకుల వేళకూ పరిమితం చేసుకోడం తెలివయిన పని. సున్నితమైన చర్మాన్ని ఎండకు అతిగా గురిచేయకుండా కాపాడడానికి ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎండ తాకిడిని గురించి ఏవయినా తెలుసుకోదలచినవాళ్ళు తమ వైద్యుడు కాని, చర్మవ్యాధిచికిత్సా నిపుణుడు కాని ఇచ్చిన సలహాను పాటించాలి.]

చిరునవ్వుకున్న శక్తి

ప్రాణాధార శక్తిని పదిలపరుచుకుంటూ సంతులిత ఆహారాన్ని తీసుకోండి. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ సుఖంగా ఉండండి. తనలో తాను సంతోషాన్ని పొందేవాడు, తన దేహం ఆహారంవల్ల కాక, భగవంతుడివల్ల విద్యుత్ ప్రవాహంతోను ప్రాణశక్తితోను నిండి ఉందని కనిపెడతాడు. చిరునవ్వు నవ్వలేనని మీకు అనిపిస్తే అద్దంముందు నించుని మీ నోటిని వేళ్ళతో [పక్కలకు సాగదీసి] లాగి చిరునవ్వు తెప్పించుకోండి. అంత ముఖ్యమైనది అది.

ఆహార విషయంలోను, ఔషధులతోనో, ఉపవాసంతోనో శరీరాన్ని శుద్ధిచేసే విషయంలోను నేను కొద్దిగా ప్రస్తావించిన చికిత్సాపద్ధతులు వాటి ఫలిత విషయంలో పరిమితమైనవి. కాని, వ్యక్తి సంతోషభరితుడయి ఉన్నప్పుడు అతడు భగవంతుడి అక్షయశక్తి సహాయాన్ని అర్థిస్తాడు. అంటే నా ఉద్దేశం, హృదయపూర్వకమైన ఆనందమే కాని, లోపల అనుభవించకపోయినా బయటికి కనబరిచే కపటనటన కాదు. మీ సంతోషం హృదయపూర్వకమయితే మీరు చిరునవ్వుల శ్రీమంతులు. స్వచ్ఛమైన చిరునవ్వు, శరీరంలోని ప్రతి కణానికీ ప్రాణమనే విశ్వశక్తి ప్రవాహాన్ని పంపిణీ చేస్తుంది. సంతోషవంతుడు వ్యాధిగ్రస్తుడు కావడం తక్కువ. కారణమేమంటే, సంతోషమనేది అధికాధిక విశ్వప్రాణశక్తి సరఫరాను శరీరంలోకి నిజంగా ఆకర్షిస్తుంది.

నయంచేయడానికి సంబంధించిన ఈ విషయంమీద చెప్పుకోవలసిననవి చాలా ఉన్నాయి. ప్రధానమైన సంగతి ఏమిటంటే, మనం అపరిమితమైన మనశ్శక్తి మీద ఎక్కువగా ఆధారపడాలి. జబ్బుచేయకుండా కాపాడుకోడానికి పెట్టుకోవలసిన నియమాలు: ఆత్మనిగ్రహం, వ్యాయమం, సరిగా తినడం, పళ్ళరసాలు పుష్కలంగా తాగడం, అప్పుడప్పుడు ఉపవాసం చేస్తూ ఉండడం, ఎల్లవేళలా అంతరంగంలోనుంచి చిరునవ్వు వెలారుస్తూ ఉండడం. ఆ చిరునవ్వులు ధ్యానంనుంచి వస్తాయి. అప్పుడు మీరు భగవంతుడి శాశ్వత శక్తిని కనిపెడతారు. మీరు ఆయనతో పరమానందంలో ఉన్నప్పుడు మీరు ఎరుకతో, స్వస్థతాకారకమైన ఆయన సాన్నిధ్యాన్ని మీ శరీరంలోకి తెస్తారు.

మనశ్శక్తి దేవుడి అమోఘశక్తిని తనతో తెస్తుంది; మీ శరీరంలో మీకు కావలసింది ఆ శక్తే. ఆ శక్తిని తీసుకువచ్చే మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం, ధ్యానం ద్వారా దేవుడితో ఏర్పరుచుకునే సంసర్గం. ఆయనతో మీ సంసర్గం పరిపూర్ణంగా ఉన్నప్పుడు, నయంకావడమనేది తక్షణమే జరుగుతుంది.

దివ్య స్వస్థత

సూర్యుని స్వస్థత కిరణాల క్రింద మనిషి

సర్వోన్నత శక్తిని సంతత విశ్వాసంతోను నిర్విరామ ప్రార్థనతోను ఆవాహన చేయవచ్చు. మీరు సరిగా తినాలి; శరీరానికి మరేది కావలసినా చెయ్యాలి. కాని ఎడతెరిపి లేకుండా ఆయన్ని ప్రార్థిస్తూ ఉండాలి: “ఈశ్వరా, మందులతో వైద్యులు చేరలేని ప్రాణపరమాణువులనూ శరీర సూక్ష్మస్థితులనూ నియత్రించే వాడివి కాబట్టి నువ్వు నయం చేయగలవు.” మందులకూ ఉపవాసానికీ సంబంధించిన బాహ్యకారకాలకు భౌతిక శరీరంమీద ఒక నిశ్చిత ప్రభావమయితే ఉంటుంది కాని అవి, కణాలను పోషించే అంతశ్శక్తిని మార్చలేవు. మీరు దేవుణ్ణి ఆశ్రయించి నయంచేసే ఆయన శక్తిని పొందినప్పుడు మాత్రమే ప్రాణాధార శక్తిని శరీర కణాల పరమాణువుల్లోకి పంపడం, తక్షణమే స్వస్థత కలిగించడం జరుగుతాయి. మీరు దేవుడిమీద ఎక్కువగా ఆధారపడరూ?

కాని భౌతిక పద్ధతులమీద ఆధారపడటాన్ని ఆధ్యాత్మిక పద్ధతులమీద ఆధారపడటంగా మార్చే ప్రయత్నం క్రమక్రమంగా జరగాలి. అమితంగా తినడానికి అలవాటుపడ్డవాడు జబ్బుపడి మానసికంగా నయంచేసుకుందామని హఠాత్తుగా ఉపవాసం మొదలుపెట్టినప్పుడు, సఫలత కలిగేటట్లు కనిపించకపోతే అతడు నిరాశపడవచ్చు. ఆహార పదార్థంమీద ఆధారపడ్డంనుంచి మనస్సుమీద ఆధారపడ్డంమీదకి ఆలోచనా విధానం మారాలంటే కొంతకాలం పడుతుంది. నయంచేసే దేవుడి శక్తికి ప్రతిస్పందించేలాగ ఉండాలంటే, దైవసహాయాన్ని నమ్ముకోడానికి మనస్సుకు తర్ఫీదు ఇవ్వాలి.

ఆ మహాశక్తివల్లనే పరమాణు శక్తి అంతా స్పందిస్తోంది; వ్యక్తమవుతోంది; భౌతిక విశ్వంలోని ప్రతి ఒక్క కణాన్నీ పోషిస్తోంది. సినిమా హాలులో ప్రొజక్షన్ గదిలోనుంచి వచ్చే కాంతికిరణపుంజం చలన-చిత్రాలను పోషిస్తున్నట్లే మననందరినీ నిత్యత్వమనే ప్రొజక్షన్ గదిలోనుంచి వెలువడే విశ్వకిరణ పుంజం పోషిస్తోంది. మీరు చూపు సారించి ఆ కిరణ పుంజాన్ని కనుక్కున్నప్పుడు, “స్వస్థత తప్పి” ఉన్న శరీర కణాల్లోని పరమాణువులనూ ఋణ విద్యుదణువులనూ (ఎలక్ట్రాన్ లను), ప్రాణకణికలనూ (లైఫ్ ట్రాన్ లను) పునర్నిర్మించే అపరిమిత శక్తిని మీరు దర్శిస్తారు. ఆ మహా స్వాస్థ్యకారుడితో సత్సంగ మేర్పరుచుకోండి.

స్వస్థత కోసం ప్రతిజ్ఞలు

ప్రతిజ్ఞ యొక్క సిద్ధాంతం మరియు సూచనలు

దేవుడి పరిపూర్ణ ఆరోగ్యం నా శరీర అనారోగ్యపు చీకటి సందుల్లో వ్యాపిస్తుంది. నా కణాలన్నిటిలో ఆయన స్వస్థతా-కాంతి మెరుస్తున్నది. అవి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి, ఎందుకంటే ఆయన పరిపూర్ణత్వం వాటిలో ఉంది.

నా శరీర కణాలు అన్నిటి గుండా నయం చేసే పరమాత్ముడి శక్తి ప్రవహిస్తుంది. నేను ఆ ఒకేఒక విశ్వ భగవత్ సారంతో తయారయ్యాను.

నా శరీర భాగాలన్నిటిలో నీ సర్వవ్యాపక పరిపూర్ణ ప్రకాశం ఉంది. ఎక్కడ ఆ స్వస్థతా శక్తి వ్యక్తమవుతుందో అక్కడ పరిపూర్ణత్వం ఉంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఎందుకంటే పరిపూర్ణత నాలో ఉంది.

నేను మార్పులేనివాణ్ణి. నేను అనంతుణ్ణి. నేను విరిగే బొమికలున్న, నశించే శరీరమున్న చిన్న మర్త్యమానవుణ్ణి కాను. నేను అమరమైన, నిర్వికార, అనంతాన్ని.

మరిన్ని విషయాల కోసం

ఇతరులతో పంచుకోండి