సహజావబోధం

పరమహంస యోగానందగారి రచనలలోంచి సంగ్రహించినవి

సహజావబోధం అంటే ఆత్మబోధ, మానవుడి మనసు నిశ్చలంగా ఉన్న సందర్భాలలో అతడిలో సహజంగా సంభవిస్తుంది…. యోగ శాస్త్ర లక్ష్యం మనసుని నిశ్చలం చేయడం, తద్ద్వారా వక్రీకరణ లేకుండా అంతరాత్మ బోధను వినగలగడం.

“ధ్యానం ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకో౦డి.” [అని లాహిరీ మహాశయులు అన్నారు]. “చురుకైన ఆంతరిక మార్గదర్శిత్వంతో మిమ్మల్ని అనుసంధానం చేసుకో౦డి; జీవితంలో ప్రతి సందిగ్ధస్థితికీ దివ్యవాణి దగ్గర సమాధానం ఉంది. తనకి తాను చిక్కులు తెచ్చిపెట్టుకోడంలో మనిషి కున్న చాతుర్యానికి అంతులేనట్టు కనిపిస్తున్నప్పటికీ, అనంత సహాయరూపుడైన భగవంతుడు, చాతుర్యంలో మనిషికన్న తక్కువవాడేమీ కాడు.”

ధ్యానంలో బుద్ధుడు.తనమీదే ఆధారపడాలని మనను కోరడంలో ఈశ్వరుని భావం మీకు మీరు ఆలోచించవద్దని కాదు. మీరు మీ చొరవ చూపాలి. ఇక్కడ విషయం ఏమిటంటే, ముందుగా మీరు ఈశ్వరుడితో సచేతన సంపర్కంలో ఉండకపోతే, మూలంతో సంబంధం తెంచేసుకొన్నట్టు, మీరు ఆయన సహాయం అందుకోలేరు. అన్ని విషయాలకూ ముందుగా ఆయన వంక చూస్తే ఆయన మీకు దారి చూపిస్తాడు. మీ తప్పులేమిటో మీకు చూపిస్తాడు తద్ద్వారా మిమ్మల్ని మీరు మార్చుకొని మీ జీవన గతిని మార్చుకోగలుగుతారు.

గుర్తుంచుకోండి. వేయి విధాల మనసులో తర్కించే కన్నా, కూర్చుని నీ లోపల శాంతి అనుభూతమయ్యేవరకూ ఈశ్వరుడిపై ధ్యానం చేయడం ఉత్తమమైనది. అప్పుడు ఈశ్వరుడికి చెప్పండి. “నేను కోటి భిన్నమైన ఆలోచనలు చేసినా కూడా నా సమస్యను నేనొక్కడినే పరిష్కరించుకోలేకపోతున్నాను. కానీ దాన్ని నీ చేతుల్లో పెట్టి, ముందు నీ మార్గదర్శకత్వం కోసం ప్రార్థించి అప్పుడు వేరు వేరు కోణాల్లో తగిన పరిష్కారం కోసం ఆలోచించి ముందుకెళ్ళడం ద్వారా పరిష్కరించుకోగలుగుతాను.” తమకు తాము సహాయపడేవారికే ఈశ్వరుడు సహాయపడతాడు. ధ్యానంలో భగవంతుడికి ప్రార్థన చేశాక మీ మనసు ప్రశాంతంగాను, ఈశ్వరుడిపై విశ్వాసంతోను నిండి ఉన్నపుడు మీ సమస్యకు వివిధ పరిష్కారాలను మీరు చూడగలుగుతారు. అప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉన్నందున ఉత్తమమైన పరిష్కారాన్ని మీరు పట్టుకోగలుగుతారు. ఆ సమాధానాన్ని అనుసరించి ముందుకెళితే మీకు విజయం లభిస్తుంది. మీ నిత్య జీవితానికి మత ధర్మ శాస్త్రాన్ని అన్వయించుకోవడం ఇదే.

సహజావబోధనాత్మక నిశ్చలత్వాన్ని సాధించాలంటే ఆంతరిక జీవన వికాసం జరగాలి. తగినంతగా అభివృద్ధి చెందిన సహజావబోధం సత్యాన్ని వెంటనే గ్రహింపుకు తెస్తుంది. ఈ అద్భుతమైన సాక్షాత్కారాన్ని మీరు పొందగలరు. ధ్యానం దానికి మార్గం.

“దైవసంకల్పంతో ఐక్యానుసంధానం చెయ్యడమెలాగో తెలుసుకునేవరకు మానవజీవితం దుఃఖభూయిష్టంగానే ఉంటుంది; ఆయన నిర్ణయించిన ‘సరయిన దారి’ అహంభావ పూరితమైన తెలివిని తరచుగా గాభరా పెడుతూ ఉంటుంది,” [అని శ్రీయుక్తేశ్వర్ గారు అన్నారు] “దేవుడొక్కడే తప్పులేని సలహా ఇస్తాడు; ఆయన తప్ప మరెవ్వరు మొయ్యగలరు ఈ బ్రహ్మాండ భారాన్ని?”

ప్రతీ ఉదయమూ, రాత్రీ నిశ్శబ్దంలోకి, లేదా గాఢమైన ధ్యానంలోకి వెళ్ళండి, ఎందుకంటే సత్యానికి, పొరపాటుకు మధ్య భేదాన్ని తెలియచెప్పే విచక్షణ ధ్యానమే నేర్పుతుంది.

మీలోని దైవిక విచక్షణా శక్తి అయిన మీ అంతరాత్మ మార్గదర్శకత్వాన్ని అనుసరించడం నేర్చుకోండి.

మీ అంతరాత్మ దేవాలయంలో మీతో గుసగుసలాడే స్వరం ఈశ్వరుడు, ఆయనే సహజావబోధనా ప్రకాశం. మీరు పొరపాటు చేస్తుంటే మీకు తెలిసిపోతుంది; మీ మొత్తం అస్తిత్వం మీకు ఆ విషయం చెబుతుంది. ఆ భావనే ఈశ్వరుడి స్వరం. మీరాయనను వినకపోతే, ఆయన మౌనంగా ఉండిపోతాడు. కానీ మీరు మాయలోంచి మేలుకొని సరైనదే చేయాలనుకుంటే, ఆయన నడిపిస్తాడు.

సదా మీ అంతరాత్మ వాణిని అనుసరించడం వల్ల — అదే ఈశ్వరుడి వాణి — మీరు నిజమైన నీతిమంతుడు, అత్యధిక ఆధ్యాత్మికత నిండిన వ్యక్తి, శాంతియుత మానవుడు అవుతారు.

మనం కనుక పరమేశ్వరుణ్ణి ఎరిగి ఉంటే మనకు మన సమస్యలకే కాకుండా ప్రపంచాన్ని బాధపెడుతున్న సమస్యలకు కూడా జవాబు తెలుస్తుంది. మనమెందుకు జీవిస్తున్నాం, ఎందుకు మరణిస్తాం? జరిగేవి ఎందుకు జరుగుతున్నాయి, జరిగినవి ఎందుకు జరిగాయి? అందరి మానవుల అన్ని ప్రశ్నలకూ సమాధానాలిచ్చే ఒక ఋషి ఎవరైనా ఈ భూమి మీదకు ఎప్పుడైనా వస్తాడని నేననుకొను. కానీ ధ్యానం అనే ఆలయంలో మన హృదయాలను కలవరపెడుతున్న ప్రతీ జీవిత సమస్యకూ పరిష్కారం దొరుకుతుంది. దేవుడితో సంబంధమేర్పరచుకొన్నపుడు జీవితపు చిక్కుప్రశ్నలకు సమాధానం తెలుసుకొంటాము. కష్టాలకు పరిష్కారం కనుగొంటాము.

ప్రార్థనలు, దివ్య సంకల్పాలు

హే పరమేశ్వరా, నీ విశ్వ ప్రాణం, నేనూ ఒకటే. నీవు సముద్రానివి, నేను కెరటాన్ని; మనిద్దరం ఒకటే. మొత్తం జ్ఞానమూ, శక్తీ ఇప్పటికే నా ఆత్మలో ఉన్నాయని ఆంతరికంగా గుర్తించి, నా దివ్యజీవితపు హక్కును నాకిమ్మని కోరుతున్నాను. ఈ రోజూ, ప్రతీ రోజూ కూడా నా వివేకానికి సరిగ్గా వెనుకే ఈశ్వరుడు ఉండి ఎల్లప్పుడూ నేను సరైన పనులే చేసేలా నడిపిస్తున్నాడు.

తల్లీ, తండ్రీ, ఆప్తుడవూ, మిత్రుడవూ అయిన జగత్పితా! నేను వివేచిస్తాను, నేను సంకల్పిస్తాను, నేను ఆచరిస్తాను; కాని నా వివేచనను, సంకల్పాన్ని, ఆచరణను ప్రతి విషయంలోనూ నేను చేయవలసిన సరియైన పని వైపు నడిపించు.

మరింతగా అన్వేషించడానికి

ఇతరులతో షేర్ చేయండి