“స్వస్థత ప్రార్థనలు” యొక్క ప్రపంచవ్యాప్త వ్యవస్థ

తన శిష్యులను ఆశీర్వదిస్తున్న యోగానందగారు

ప్రపంచ శాంతి కోసం, ఇతరుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రుగ్మతలను స్వస్థ పరచడం కోసం ప్రార్థించడం ద్వారా పరమహంస యోగానందగారు మానవ జాతికి అమూల్యమైన సేవ చేశారు. ప్రతి ఉదయం, గాఢ ధ్యానంలో, ఆయన సాయం అడిగిన వారందరి కోసం భగవంతుని ఆశీస్సులకై ప్రార్థించి, ఒక ప్రభావశాలియైన చిన్న ప్రక్రియను ఉపయోగించి వారికి స్వస్థత చేకూర్చే శక్తిని పంపేవారు. కాలం గడిచేకొద్దీ, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఆశ్రమాల్లోని సన్యాసులందరినీ ప్రార్థన ద్వారా ప్రపంచానికి తానందిచ్చే ఈ కృషిలో పాల్గొనమని కోరారు. ఆ విధంగా యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రార్థనా వలయము ఆవిర్భవించింది.

పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక వారసుల సారధ్యంలో ఈ “ప్రార్థనా వలయము” యొక్క పని నిరంతరాయంగా కొనసాగుతూ వచ్చింది. ఈ ప్రార్థనా మండలి సభ్యులు గాఢంగా ధ్యానం చేసి ప్రతి ఉదయం, సాయంత్రం ఇతరుల కోసం ప్రార్థన చేస్తారు, మరియు పరమహంస యోగానందగారు ఆచరించి, బోధించిన స్వస్థత ప్రక్రియను ఆచరిస్తారు. ఈ ప్రార్థనా మండలిని అభ్యర్థించి, సహాయం పొందిన వారు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు రాసే అనేకానేక ఉత్తరాలు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థత కోసం అపరిమితమైన దైవ శక్తి ఈ మండలి ద్వారా ప్రభావ శీలంగా పంపబడుతోందన్న విషయాన్ని ధృవీకరిస్తాయి.

అన్ని దేశాలలోని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు మరియు స్నేహితుల యొక్క ప్రార్థనలు కూడా కలిసి ఈ ప్రార్థనా మండలి చేసే స్వస్థత సేవలు బాగా వృద్ధి చెందాలని; ఆ విధంగా సానుభూతిపరుల ఆత్మిక కలయిక — ఒక ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయం—నిర్మాణం అవ్వాలని పరమహంస యోగానందగారు తమ అభిలాషను తరచు వ్యక్తపరచేవారు.

“ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయం” స్థాపన జరిగిన దగ్గర నుండి ప్రపంచం నలుమూలలనుండి ఇందులో పాల్గొనే సభ్యులు చేసే ప్రార్థనలు ఈ మన భూగోళాన్ని చుట్టివచ్చే, శాంతిసామరస్యాలతో కూడిన ఒక శుభకరమైన దివ్యశక్తి ప్రవాహాన్ని నిర్మాణం చెయ్యడంలో సాయపడ్డాయి.

ఈ స్వస్థత చేకూర్చే ప్రవాహానికి మీ ప్రార్థనల యొక్క ఆత్మ శక్తిని కూడా జోడించి మరింత శక్తివంతం చెయ్యడంలో మీరు సహాయపడతారని ఆశిస్తున్నాము. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క ఆశ్రమాల్లోనూ, కేంద్రాలు మరియు మండలులలోనూ ఈ ప్రార్థనా సేవలు నిర్వహించబడతాయి. అయితే, ఈ సేవా సమావేశాల్లో మీరు హాజరు కాలేక పోయినా, మీరు వేరే ఏదైనా ఆధ్యాత్మిక సంస్థ బోధలు అనుసరించేవారైనా, మీ ఇంట్లోనే మీరు వారానికి ఒకసారి ఈ స్వస్థత ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. ఇంత క్రితమే పేర్కొనట్లు, ఏ మతావలంబియైన వ్యక్తి ఐనా, ఈ పుస్తకంలో వర్ణించిన ప్రార్థన మరియు స్వస్థత ప్రార్థన యొక్క ప్రాథమిక సూత్రాలను ఆచరించవచ్చు.

అంతరిక్షం నుండి కనిపించే భూమి

ఇతరులతో పంచుకోండి