దేవుడి కోసం సంయుక్త అన్వేషణ

సామూహిక ధ్యానం యొక్క విలువపై పరమహంస యోగానంద ఉపన్యాసాలు, రచనల సారాంశం

వై.ఎస్.ఎస్. ధ్యాన కేంద్రం, ముంబై

స్వీయ-సాక్షాత్కారం కోసం స్వయం సాధన ద్వారా ఆత్మలను భగవంతునికి చేరువ చెయ్యడానికి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ఈ ప్రపంచంలోకి వచ్చింది. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ఆత్మసాక్షాత్కారానికి దశలవారీ నిచ్చెనను అందుబాటులోకి తెస్తుంది. ఇది విశ్వవ్యాప్తంగా నిరూపితమైనది, శాస్త్రీయమైనది. మానవాళిని శాశ్వతమైన ఆనంద తీరాలకు త్వరిత మార్గంలో నడిపించగలదు. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. బోధనల అభ్యాసం, అన్ని మత విశ్వాసాల మార్గాలు కలిసే స్వతంత్రమైన స్వీయ-సాక్షాత్కార ప్రధాన మార్గాన్ని వెల్లడిస్తుంది. ఈ యోగా ధ్యానం యొక్క రాచబాట అనంతమైన ఆనందం యొక్క నివాసానికి నేరుగా దారి తీస్తుంది.

భగవంతునికి – సమాజానికి సంబంధించిన సాంకేతికత తెలిసిన వారు ధ్యానం యొక్క రహస్యాన్ని తెలిసిన ఇతర ఆధ్యాత్మిక వ్యక్తుల సహవాసంలో కూడా ఆయనను కనుగొనవచ్చు. తమను తాము, మతాన్ని అనుసరించేవారిగా విశ్వసించే చాలా మంది వ్యక్తులు దేవునితో అనుబంధం ఏర్పాటు చేసుకోలేరు. అటువంటి మతవాదులతో సహవాసం మనలో దేవుని గురించి మరియు ఆధ్యాత్మిక జీవితం గురించి అవాస్తవిక నమ్మకాలను మాత్రమే పెంచుతుంది. కొన్నిసార్లు ఇది వేదాంత సమరంగా ముగుస్తుంది. కానీ స్వాతంత్ర్యానికి విశ్వవ్యాప్త మార్గాన్ని కనుగొన్న వ్యక్తి, ఇతర లోతైన ధ్యానం చేసే భక్తులతో కలిసి శాస్త్రీయమైన, నిరంతరం ప్రగతిశీల ధ్యాన పద్ధతుల ద్వారా దేవునితో కమ్యూనికేట్ చేసినప్పుడు, అతను పరస్పర సహాయసహకారాల ద్వారా స్వీయ-సాక్షాత్కారాన్ని సాధించగలడు.

ఆధ్యాత్మిక సత్సంగం యొక్క విలువ

వై.ఎస్.ఎస్. ధ్యాన కేంద్రం, చండీగఢ్

వారి జీవితాలలో నిజమైన మతాన్ని చూసిన, అనుభూతి చెందిన, గ్రహించిన వారితో మనం సహవాసం చేసే వరకూ, మతం అంటే ఏమిటో, అది ఏ విధంగా విశ్వవ్యాపితమో, అవసరమో మనకు పూర్తిగా తెలియకపోవచ్చు.

భారతదేశంలో అనాది కాలం నుండి, భగవంతుని సాక్షాత్కారానికి నిజంగా ఆసక్తి ఉన్న అన్వేషకులు, సాధువులతో సహవాసం కోసం ప్రయత్నించారు. లేదా ఇతర ఆధ్యాత్మిక సాధకుల సహవాసంలో ధ్యాన సాధన చేశారు. ఈ తరహా అభ్యాసానికి లోతైన ఆధ్యాత్మిక కారణం ఉంది. ఇది శతాబ్దాలుగా గురువులచే ఆమోదించబడింది. దురలవాట్లు, అస్థిరమైన ఆలోచనలు, విషయ వాంఛలను తిరిగి పొందాలనే అనేక ప్రలోభాలు ప్రారంభ-యోగిని చుట్టుముడుతాయి. మాయ యొక్క భ్రమ కలిగించే శక్తి, చాలా శక్తివంతమైనది. దానిని అధిగమించడం కష్టం, ముఖ్యంగా ప్రారంభంలో. ఆ విధంగా, తమను తాము పరిపూర్ణం చేసుకోవాలనుకునే వారు తమ సరైన ఆకాంక్షలను బలపరచుకోవడానికి సారూప్య స్వభావం గల ఇతరులతో సన్నిహితంగా ఉండవలసిందిగా గురువులు ఆదేశించారు.

మనం వారి బోధనల ద్వారా మాత్రమే కాక, వారి నుండి వెలువడే నిశ్శబ్ద అయస్కాంత తరంగాల ద్వారా కూడా మమేకం అవుతాము. వారి అయస్కాంతత్వం యొక్క పరిధిలోకి వచ్చినప్పుడు మనం ప్రభావితమవుతాము.

మనిషి కళాకారుడు కావాలంటే కళాకారులతో సహవాసం చేయాలి. మంచి వ్యాపారవేత్త కావాలనుకుంటే, దిగ్గజ వ్యాపారవేత్తలతో సహవాసం చేయాలి. ఆధ్యాత్మిక దిగ్గజం కావాలనుకుంటే, అతను భగవంతుని భక్తులతో సహవాసం చేయాలి.

భగవంతుని తెలుసుకునే లక్ష్యం

వై.ఎస్.ఎస్. ధ్యాన కేంద్రం, అహ్మదాబాద్

భక్తులను భగవంతునితో అనుసంధానించటమే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సెంటర్ల లక్ష్యం. తండ్రి (భగవంతుడు) పేరు మీద భక్తులు గుమిగూడినప్పుడు అది ఆయనకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో మీకు తెలియదు. భారతదేశంలో భక్తులు ఎటువంటి భవనాన్ని నిర్మించరు. ఆయనను ధ్యానించడానికి వారు ఎక్కడైనా కలుసుకుంటారు.

యోగాదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/ సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ భారతదేశంలోని సాధువులు శాస్త్రీయంగా అభివృద్ధి చేసిన స్వీయ-సాక్షాత్కార పద్ధతుల అభ్యాసాన్ని నొక్కి చెబుతుంది. ఆత్మసాక్షాత్కారం యొక్క అంతర్గత రహదారిలో ప్రయాణించడానికి అవసరమైన ఆధ్యాత్మిక అన్వేషకుల సహవాసాన్ని ఇది నొక్కి చెబుతుంది.

ఒక కారణాన్ని లేదా నాయకుడిని కీర్తించడం కోసం కాకుండా ఏకీకృత, ఏకాగ్ర ధ్యాన సాధన ద్వారా భగవంతుడిని తెలుసుకోవాలనే స్పష్టమైన, ఏకైక ఉద్దేశ్యంతో మాత్రమే సత్సంగాలు, సామూహిక ధ్యాన తరగతులు నిర్వహించబడాలి.

ప్రతి ఆత్మ, భగవంతుని సంతానమే. భగవంతుని ఆత్మ స్వరూపమే. కానీ అహంభావం ద్వారా మనిషి తన ఇష్టాన్ని దైవిక సంకల్పం నుండి వేరుచేసి దానిని పరిమితం చేస్తాడు. ఇతర అన్వేషకులతో కలిసి లోతైన ఏకాగ్రతతో సాధన చేసి, ఒక భక్తుడు తన సంకల్పాన్ని భగవత్సంకల్పంతో అనుసంధానిస్తాడు. భగవంతునితో తన బంధాన్ని గుర్తుచేసుకుంటూ, అతను తన దైవిక వారసత్వాన్ని తిరిగి పొందుతాడు. ప్రతి భక్తుడు ప్రార్థన ద్వారా, ధ్యానంలో భగవంతుని సహవాసం ద్వారా, సత్సాంగత్యం ద్వారా దైవిక సంకల్పం యొక్క సాక్షాత్కారాన్ని బలపరచుకోవాలి.

ఏసు ఇలా అన్నాడు: “ఎదుటన ఇద్దరు లేక ముగ్గురు నా పేరున కూడియున్న చోట నేను వారి మధ్యనే ఉంటాను” (మత్తయి 18:20, బైబిల్). ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి భగవంతునిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు, ఒక వ్యక్తి యొక్క బలమైన దైవిక ఏకాగ్రత మరొక వ్యక్తి యొక్క బలహీనమైన ఏకాగ్రతను బలపరుస్తుంది. కానీ భగవంతుని పేరుతో సమావేశమై కబుర్లు చెప్పుకునే వ్యక్తులు, ఇతర విషయాల గూర్చి ఆలోచిస్తూ కేవలం బాహ్యంగా ప్రార్థిస్తున్నప్పుడు, దేవునితో అంతర్గతంగా సంభాషించకుండా ఏదో యాంత్రికంగా పూజలను, పవిత్ర కర్మలను ఆచరించడం ద్వారా, సృష్టికర్తయైన క్రీస్తు (భగవంతుని) స్పృహను [కూటస్థ చైతన్యాన్ని] అనుభవించలేరు.

సామూహిక ధ్యానం ద్వారా లభించే ఆశీస్సులు

వై.ఎస్.ఎస్. ధ్యాన కేంద్రం, ధార్వాడ్

సామూహిక ధ్యానం అనేది కొత్త ఆధ్యాత్మిక సాధకులను, అలాగే అనుభవజ్ఞులైన ధ్యానులను ఇరువురినీ రక్షించే కోట. ‘సమూహ అయస్కాంతత్వం యొక్క అదృశ్య తరంగ మార్పిడి’ సిద్ధాంతం కారణంగా సమూహంలోని ప్రతి సభ్యుని స్వీయ-సాక్షాత్కార స్థాయి సామూహిక ధ్యానం ద్వారా పెరుగుతుంది.

నేను శిక్షణ కోసం శ్రీయుక్తేశ్వర్ వద్దకు వెళ్ళినప్పుడు వారి సలహా నాకు బాగా గుర్తుంది. “మంచి సహచరులతో ధ్యానం చేయండి. అవి మీ మనస్సులోని పాల నుండి ఆత్మసాక్షాత్కారపు వెన్నను తీయడానికి మీకు సహాయం చేస్తాయి. ప్రాపంచిక మాయా జలాలతో కలిసిన పాలపై వెన్న తేలలేదు. ఆ మాయాభరితమైన నీళ్లపై వెన్న తేలిపోతుంది.” అని ఆయన అన్నారు.

గురువుగారి హెచ్చరిక ఎంత నిజమో! నేను ప్రారంభించిన సమూహానికి దూరంగా ఉన్న వారంతా, క్రియాయోగాలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినప్పటికీ, తర్వాత ప్రాపంచిక ప్రభావాలకు, వారి గతంలోని భౌతిక ధోరణుల ప్రేరేపణలకు లొంగిపోయారు.

బలహీన, ఉదాసీన క్షణాలలో ఒకరికొకరం సహాయం చేసుకున్న కారణంగా సమూహంతో ఉన్నవారు దైవసాక్షాత్కారంలో స్థిరంగా అభివృద్ధి చెందారు. స్పష్టమైన ఆకాశంలో మేఘాలు త్వరగా వ్యాపించినట్లుగా ఆధ్యాత్మిక నిశ్చలత వున్నచోట కొన్నిసార్లు మబ్బులు ఆత్మ కాంతిని కప్పివేస్తాయి. సత్సాంగత్యం అనే సూర్యకాంతి ద్వారా మనం ఆ మేఘాలను పారద్రోలాలి.

స్వీయ-సాక్షాత్కారాన్ని కోరుకునే వ్యక్తులతో సహవాసం చేయడం ద్వారా, వారితో సామూహిక ధ్యాన సాధన ద్వారా మీరు మీ స్వీయ అయస్కాంత తరంగాలను ఎందుకు బలోపేతం చేసుకోకూడదు? ఈ అభ్యాసం మీ స్వంత ఆధ్యాత్మిక విశ్వాసాలను బలపరుస్తుంది. మీ జీవితంలో అనంతంగా కనిపించే అనేక అడ్డంకులు ఈ ధ్యాన జలధిలో కరిగిపోతుండడాన్ని మీరు గుర్తిస్తారు. దేవుని పట్ల మీ భక్తి, ప్రేమ, శ్రద్ధలు ఇతరుల భక్తి, ప్రేమ, శ్రద్ధలతో కలిసిపోతాయి. మీ నుండి దైవిక ఆనందం ప్రసరిస్తుంది. మీరు కలిసే వ్యక్తులందరికీ సహాయం చేస్తుంది.

మీ ఆధ్యాత్మిక పురోగతి నిలిచిపోతూనో, క్షీణిస్తూనో ఉన్నట్లయితే, ఇతర భక్తులతో కలిసి భగవంతుడిని, లేదా మహానుభావులలో ఎవరినైనా ధ్యానించడం మిమ్మల్ని, మీ అస్థిర స్థితి నుంచి ఉద్ధరిస్తుంది. ఇతరుల ఆధ్యాత్మిక తరంగాల సామీప్యత మీ స్వీయ ఆధ్యాత్మిక తరంగాలను కూడా పెంచే శక్తిని కలిగి ఉంటుంది. ఇతర భక్తులతో కలిసి ధ్యానం చేయడం, మీ ఆధ్యాత్మిక పురోగతిని వేగవంతం చేయడానికి మీకు సహాయపడుతుంది. స్వీయ-సాక్షాత్కార నిచ్చెనను అధిరోహించటానికి అవి మీకు స్ఫూర్తినిస్తాయి. మీరు, మీ ఉదాహరణల ద్వారా కూడా వారికి సహాయపడగలరు.

తేనె తుట్టెలను సృష్టించడం, వాటిని ఆధ్యాత్మిక మకరందంతో నింపడం

వై.ఎస్.ఎస్. ధ్యాన కేంద్రం, హైదరాబాద్

తేనెకు తేనెతుట్టె అవసరం. తేనె లేని తేనెతుట్టెల వల్ల ఉపయోగం లేదు. తూర్పు, ఆధ్యాత్మిక మకరందాన్ని సేకరించడానికి ఇష్టపడుతుంది. తేనెపట్టుల వంటి పెద్ద ఆధ్యాత్మిక సంస్థలను నిర్మించడానికి పాశ్చాత్యులు ఇష్టపడతారు. వ్యక్తిగత ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మిక మకరందాన్ని పొందడం, తేనెతుట్టెల వంటి సంస్థలను నిర్మించడం కంటే చాలా ముఖ్యమైనది. కానీ భగవదన్వేషణకై భక్తులను ఒకచోట చేర్చడానికి ఒకానొక సంస్థ అవసరం. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సంస్థ లేకుంటే, మీరు లేదా ఇతరులెవరైనా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. బోధనల ప్రయోజనాన్ని పొంది ఉండేవారు కాదు కదా?

మొదట మీ కోసం వ్యక్తిగత స్వీయ-సాక్షాత్కారాన్ని పొందండి. కానీ మీ ఆధ్యాత్మిక సంస్థ యొక్క పనిని నిర్లక్ష్యం చేయవద్దు. అలా చేయడం చాలా స్వార్థపూరితమైనది. అలాంటి నిర్లక్ష్యం మీ ఆత్మ పురోగతికి హానికరం కూడా. ఆధ్యాత్మిక శోధకులైన భవిష్యత్ తరాల సోదరసోదరీమణుల దాహార్తిని తీర్చటానికి సామూహిక సత్యం యొక్క తేనె నిల్వ చేయబడే తేనెతుట్టె వంటి సంస్థ అవసరం. కానీ గుర్తుంచుకోండి, వ్యక్తిగత లేదా సామూహిక ధ్యానం లేని ఆధ్యాత్మిక సంస్థ అర్థరహితం. మీలోని భగవంతుడ్ని గుర్తించడం, స్వీయ-సాక్షాత్కారాన్ని పొందటం మీ మొట్టమొదటి ఆకాంక్ష కావాలి. అదే సమయంలో మీ ఆధ్యాత్మిక సంస్థలోని అందరి ఐక్య హృదయాలలో ఆ భగవంతుడ్ని స్థాపించడం కూడా మీ ప్రధాన లక్ష్యం.

ఎవరైనా సరే, భగవంతుని విశ్వసించి, ఆయన కోసం ఆన్వేషిస్తున్నారంటే…. అది నాకు సంతోషాన్నిస్తుంది. మీరు ఆయన అనంతమైన ప్రేమను సాధించడానికి, నిస్వార్థంగా ఆయనకు సేవ చేయడానికి ఈ జీవితంలోకి పంపబడ్డారు. విముక్తికి, నిజమైన ఆనందానికి ఇదే ఏకైక మార్గం. దేవుని కోసం పని చేయండి. ప్రతి రాత్రి ఆయనను ధ్యానించండి. సామూహిక సమావేశాల సమయంలో, సభ్యులతో కలిసి సామూహిక ధ్యానం చేయండి. నివాసంలో ఉన్నప్పుడు, ఒంటరిగానో లేక భగవంతుడిని అన్వేషించే ఇతర భక్తులతోనో కలిసి ధ్యానం చేయండి.

ధ్యాన సమూహాల వైపు పయనం

వై.ఎస్.ఎస్. ధ్యాన కేంద్రం, లక్నో

ఈ యుగంలో యోగ శాస్త్రమే అన్నింటికంటే ఎక్కువగా పట్టు సాధిస్తుంది. మొత్తం మతపరమైన ధోరణి మనకు తెలిసిన చర్చిలకు దూరంగా ఉంటుంది. పాఠశాలలు మరియు నిశ్శబ్ద ప్రదేశాల్లోకి వెళ్తుంది. ప్రజలు కేవలం ఉపన్యాసం వినడానికి మాత్రమే కాదు, ధ్యాన సాధన ద్వారా నిజంగా భగవంతుడిని అన్వేషించటానికి, సాక్షాత్కరింపజేసుకోవటానికి ఇక్కడకు వెళతారు.

ఎక్కువ మంది మతపరమైన “కస్టమర్లను” చేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో, మేథో శిక్షణ పొందిన మతాధిపతులతో కూడిన, ధనిక, భారీ చర్చిలకు బదులుగా, నిశ్శబ్ద ప్రదేశాలలో చిన్న ధ్యాన కేంద్రాలను మనం ప్రారంభించాలి. ఇక్కడ కొంతమంది ఆరంభ దశలో ఉన్న సత్యాన్వేషకులు, మరికొంత మంది లోతైన శ్రద్ధతో, తీవ్రమైన ధ్యానం చేసే వ్యక్తులతో కలిసి ధ్యానాన్ని, భగవంతునితో అనుబంధం ఏర్పరచుకునే మార్గాన్ని సాధన చేస్తారు.

అటువంటి సమూహాలలోని వ్యక్తులు, సత్యం గురించిన వారి ఆలోచనలు, ఊహలను ఒకరికొకరు చెప్పుకుంటూ తమ సమయాన్ని వృధా చేసుకోకూడదు, కానీ ప్రగతిశీల వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పద్ధతులను ఉపయోగించి కలిసి ధ్యానం చేయాలి. తద్ద్వారా భగవంతుని సాన్నిధ్యాన్ని పొందాలి. భగవంతుని యొక్క శాంతి, జ్ఞాన వాక్కును వినాలి.

లోతైన ధ్యానం యొక్క నిశ్శబ్దాన్ని అన్ని కేంద్రాలలో ఎక్కువగా అభ్యసించాలి. అందరూ తక్కువ మాట్లాడాలి. భారతదేశంలో నా సన్యాస శిక్షణ సమయంలో నా గురువు శ్రీయుక్తేశ్వర్ ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉపన్యసించేవారు. చాలా సార్లు మేము మాట్లాడకుండా, నిశ్శబ్దంగా ఆయన చుట్టూ కూర్చునేవాళ్ళం. మేం ఏవైనా కదలికలు చేస్తే, ఆయన మమ్మల్ని గద్దించేవారు.

కేవలం మంచి పుస్తకాలు చదివి, ఉపన్యాసాలు, వినోదభరిత సంగీతం వింటూ సమయాన్ని గడిపే మతపరమైన సమూహాలు, వేదాంతపరమైన సామాజిక క్లబ్బు‌లు, ఆ ప్రియమైన ప్రభువు ఉనికిని ఎప్పటికీ తెలుసుకోలేవు. భగవంతుని పేరు మీద కలుసుకుని, తదేక ధ్యానం ద్వారా మనో మందిరంలోకి ఆయనను ఆహ్వానించే సమూహాలు మాత్రమే ఆయన ఉనికి ద్వారా నిజంగా ఆశీర్వదించబడతాయి.

భగవత్సాక్షాత్కార వార్త దానంతటదే వ్యాపిస్తుంది. అందుకే ధ్యానం యొక్క పద్ధతులను అభ్యసించడానికి సామూహిక సమావేశాలు చాలా ముఖ్యమైనవి. మన నివాసంలో వ్యక్తిగతంగా సంపాదించుకున్న వ్యక్తిగత స్వీయ-సాక్షాత్కారాన్ని సామూహిక సమావేశాలు బలపరుస్తాయి. సామూహిక సమావేశాలు సభ్యులకు కొత్త మేల్కొలుపును ఇస్తాయి. స్వీయ అన్వేషణకు బదులుగా, సామూహిక అన్వేషణకు వారిని ప్రేరేపిస్తాయి.

నాయకుడి వ్యక్తిత్వం, సంగీత కార్యక్రమాలు, ఉత్సవాల ద్వారా కాకుండా, వారి స్వీయ సాధన, సాక్షాత్కారం కారణంగా సామూహిక ధ్యానం ప్రజలను కలిపి ఉంచుతుంది. అప్పుడు, వారు స్వయంగా వారికై వారే తమ సమ్మిళిత భక్తి వేదికపై దేవుణ్ణి ఆరాధించడానికి తరచుగా కలిసి ఉండాలని కోరుకుంటారు. భగవత్భక్తి వ్యక్తిగత ఆత్మలకు, శక్తివంతమైన మార్గంలో ప్రవహించడానికి ఏకీకృత హృదయాలు గొప్ప మార్గాలు.

వై.ఎస్.ఎస్. సమూహంతో కలిసి భగవంతుని అన్వేషించు

వై.ఎస్.ఎస్. ధ్యాన కేంద్రం, బెంగళూరు

ప్రతిచోటా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ధ్యాన కేంద్రాలు ఉండాలి.

నా పరమగురువు లాహిరీ మహాశయులు కుటుంబ జీవితానికి సంబంధించిన అన్ని బరువుబాధ్యతలనూ మోశారు. అయినప్పటికీ సర్వవ్యాపకమైన ఆ పరమాత్మతో సంభాషించడం మాత్రం మానలేదు. భారతదేశంలో క్రియాయోగాన్ని పరిచయం చేసి, సాధకులకు దానిని గురించి బోధించిన ఆ గొప్ప యోగి పుంగవుడు, ఆధ్యాత్మిక విముక్తికి కావలసినవి క్రీస్తులాంటి ఆత్మతో సహవాసం చేయడం లేదా ఆయనను గూర్చి ధ్యానం చేయడం, ఇతర ఆధ్యాత్మిక అన్వేషకులతో సహవాసం చేయడమే ధ్యానం యొక్క స్థిరమైన, నమ్మకమైన అభ్యాసం అని చెప్పారు.

మీరు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ఆలయానికి లేదా కేంద్రానికి వెళ్ళినప్పుడు, భగవంతుని సాన్నిధ్యాన్ని అనుభవించండి. మాటల జోలికి వెళ్ళొద్దు. గానం జోలికి వెళ్ళొద్దు. ధ్యానం ద్వారా ఆయన ఉనికిని అనుభూతి చెందడానికి వెళ్ళండి!

భక్తుడు మొదట ఆధ్యాత్మిక అన్వేషణను ప్రారంభించినప్పుడు, అతని సంకల్ప శక్తి కంటే అతని చుట్టూ ఉన్న వాతావరణం ప్రభావమే అతనిపై బలంగా పనిచేస్తుందన్న విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి!

మీ హాజరు, మీ కృషి అవసరమని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి, మీరు ఇప్పుడనే కాక, అన్ని సమయాల్లో మీ సమూహము లేదా కేంద్రం యొక్క సేవలకు హాజరు కావొచ్చు కదా? కేంద్ర అధికారులకు అన్ని విధాలుగా మీ నమ్మకమైన మద్దతును అందించవచ్చు కదా? మీ ఆలోచనలలో, మీ మనస్సులలో నేనున్నాను. అందుకే ఆ భగవంతుడు మిమ్మల్ని ఉద్దేశించి ఈ విధంగా వ్రాయడానికి నన్ను ప్రేరేపించాడు. మీ మనస్సును నాతోనూ, మహాత్ములతోనూ అనుసంధానించండి. తదనుగుణంగా మీ జీవితం తప్పక మెరుగుపడుతుంది.

సామూహిక ధ్యానం కొత్త ఆధ్యాత్మిక అన్వేషకులను, అలాగే అనుభవజ్ఞులైన ధ్యానులను ఇరువురినీ రక్షించే కోట. కలిసి ధ్యానం చేయడం కారణంగా, సామూహిక సాధన వల్ల ఉత్పన్నమయ్యే అదృశ్య అయస్కాంత తరంగాల మార్పిడి సిద్ధాంతం ద్వారా సమూహంలోని ప్రతి సభ్యుని స్వీయ-సాక్షాత్కార స్థాయి పెరుగుతుంది.

మరికొన్ని ఇతర వై.ఎస్.ఎస్. ధ్యాన కేంద్రాలు/మండళ్ళు

సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
హైదరాబాద్, తెలంగాణ
నాగర్ ‌కోయిల్, తమిళనాడు
బెంగళూరు, కర్ణాటక
బిలాస్ ‌పూర్, ఛత్తీస్ ‌గఢ్
కొచ్చిన్, కేరళ
హిస్సార్, హర్యానా
జమ్మూ, జమ్మూ - కాశ్మీర్

ఇతరులతో పంచుకోండి