ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడంపై పరమహంస యోగానందగారి పరిచయ వాక్యాలు — అంతర్ముఖం నుండి బహిర్ముఖానికి

ఒక పరిచయం:

మన రోజువారీ కార్యకలాపాల నిర్వహణలో, మనమందరం మన విశ్వాసం మరియు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడంలో ఉచ్ఛ స్థితులను, నీచ స్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది.

మన జీవితాల్లో మనం మెరుగుపరచుకోవలసిన అంశాలు ఉన్నాయి — మన ఉత్తమ భావాలను మరింత మెరుగ్గా వ్యక్తీకరించడానికి మార్గాలు ఉన్నాయి. కానీ భౌతికంగా, మానసికంగా లేదా ఆధ్యాత్మికంగా — పరిపూర్ణత అంటే ఏమిటి లేదా ఎలా ఉండాలనే దాని గురించి లేదా ప్రశంసలు లేదా అర్థాన్ని కనుగొనడానికి మనం ఎక్కడ వెతకాలి అనే దాని గురించి బయట ప్రపంచం నుండి తప్పుడు అభిప్రాయాలను మనం ఎదుర్కొంటాము.

మనం జీవితంలో సవాళ్లను లేదా మన స్వంత ఆధ్యాత్మిక లక్ష్యాలను ఎదుర్కొనేటప్పుడు, “కొలవడం” సాధ్యంకాదు అనే పొరపాటు భావాన్ని పొందడం జరుగుతుంది.

కానీ పరమహంస యోగానందగారు మనకు ఈ విధంగా గుర్తుచేస్తారు: “మిమ్మల్ని మీరు మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, మీ స్వంత ధర్మాలు మరియు స్వీయ-విలువలతో సురక్షితంగా స్వయంగా నిలబడటం నేర్చుకోండి.”

దీన్ని చేయగల సామర్థ్యం​​ నిజంగా ఒక్క చోట నుండి వస్తుంది — అదే అంతర్ ముఖంగా, మన ఉన్నత ఆత్మ సాక్షి నుండి అని గొప్ప వ్యక్తులు సహస్రాబ్దాలుగా మనకు తెలిపారు. అంటే, మన ఉనికి యొక్క సహజ స్వభావమైన, మన నుండి భిన్నంగాలేని దివ్యత్వం నుండి మద్దతు, మార్గదర్శకత్వం మరియు ప్రేమ కోసం చూడండి.

“మీరు అమరమైన ఒక దివ్య కాంతిపుంజం,” అని పరమహంసగారు మనకు తెలిపారు. “మీరు ఆ కాంతి పుంజాన్ని దాచవచ్చు, కానీ మీరు దానిని ఎప్పటికీ నాశనం చేయలేరు.”

వినడం మాత్రం చేతనే అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది కదా? నిజమైన ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని గడపడానికి మీరు మరింత ప్రోత్సాహకరమైన జ్ఞానాన్ని గ్రహించాలనుకుంటున్నారా?

పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:

ప్రతి చిన్న విద్యుత్ బల్బు యొక్క కాంతి వెనుక గొప్ప క్రియాశీలకమైన విద్యుత్ ఉంటుంది; ప్రతి చిన్న అల క్రింద అనేక అలలుగా మారిన విశాలమైన సముద్రం ఉంటుంది. మానవుల విషయంలోనూ అలాగే ఉంటుంది.

పెద్ద కెరటాలచే మోదబడినా కూడా చిన్న అల యొక్క శక్తిని ఏ విధంగానూ తగ్గించకూడదు. దానికి ఎవరైనా ఇలా చెప్పాలి, “చిన్న అలా, నీ సంగతి ఏమిటి? సముద్రం మొత్తం నీ వెనుక ఉన్నట్లు నీకు కనిపించడం లేదా? నీవు మహా సముద్రపు ఉబ్బెత్తువు.” అదే విధంగా మీ చిన్న శరీరాన్ని చూడకండి; అంతర్ముఖులై దర్శించండి.

మీరు దేని కోసమైనా లేదా ఎవరి కోసమైనా ఆరాటపడినా, వాటికంటే మీ అస్తిత్వం చాలా గొప్పది. దేవుడు మరే ఇతర మానవునిలో కనిపించని విధంగా మీలో వ్యక్తమై ఉన్నాడు. మీ ముఖం ఇతరులకంటే భిన్నంగా ఉంటుంది, మీ ఆత్మ ఎవరికన్నా కూడా భిన్నంగా ఉంటుంది, మీరు మీకే సరిపోతారు; ఎందుకంటే మీ ఆత్మలో అన్నింటికన్నా గొప్ప నిధి ఉంది — అదే పరమాత్ముడు.

మీలో ఉన్న భగవంతుడిని సాక్షాత్కరించుకోవడం ద్వారా, మీ మర్త్య బలహీనతలను జయించడం మరియు నిజమైన పెరుగుతున్న విజయాలపై స్థాపించబడిన దివ్యమైన, వినయపూర్వకమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి — మీ విజయాలన్నీ మీరు దేవుని నుండి అరువు తెచ్చుకున్న శక్తి నుండి వచ్చాయని స్పృహ కలిగి ఉండండి. ఈ విధంగా మీరు అన్ని న్యూనత మరియు ఆధిపత్య వైఖరుల నుండి విముక్తి పొందుతారు.

[సాధన చేయడానికి ఒక దివ్యసంకల్పం]: “నేను నిర్జీవమైన నిరాశలను నిన్నటి దినం అనే శ్మశానవాటికలో పాతిపెట్టాను. ఈ రోజు నేను కొత్త సృజనాత్మక ప్రయత్నాలతో నా జీవితమనే తోటను దున్నుతాను. అందులో నేను జ్ఞానం, ఆరోగ్యం, శ్రేయస్సు మరియు ఆనందం అనే విత్తనాలను నాటుతాను. నేను వాటికి ఆత్మవిశ్వాసం మరియు విశ్వాసం అనే నీళ్ళు పోస్తాను. తరువాత భగవంతుడు నాకు సరైన పంటను ప్రసాదించే వరకు వేచి చూస్తాను.”

వై.ఎస్.ఎస్. బ్లాగ్‌లో కొనసాగినప్పుడు “ఆత్మగౌరవం యొక్క మూలస్థానంతో యోగులు సంబంధాన్ని ఎలా పెట్టుకొంటారు” అనే వ్యాసాన్ని మీరు అక్కడ చదవగలరు — ఇది యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా / సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులైన స్వామి చిదానంద గిరి గారిచే రచించబడి, రాబోయే 2023 యోగదా సత్సంగ పత్రికలో ప్రచురించబడే “భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు మన ఆధ్యాత్మిక దివ్య సంబంధాన్ని కొనసాగించడం” అనే వ్యాసం నుండి ఈ సారాంశం గ్రహించబడింది.

ఇతరులతో షేర్ చేయండి