“ఆత్మగౌరవం యొక్క మూలస్థానంతో యోగులు సంబంధాన్ని ఎలా పెట్టుకొంటారు” అనే అంశంపై శ్రీ స్వామి చిదానంద గిరి

జూన్ 9, 2023

ఈ బ్లాగ్ పోస్ట్, రాబోయే 2023లో ప్రచురించబడే యోగదా సత్సంగ పత్రిక కోసం వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు అయిన స్వామి చిదానంద గిరి గారు వ్రాసిన “మెయింటెయినింగ్ అవర్ డివైన్ కనెక్షన్ వైల్ లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్” అనే వ్యాసం నుండి తీసుకోబడినది.

ప్రాథమికంగా మనం ఇంద్రియాల ద్వారా సమాచారాన్ని పొందుతాము: మనం విషయాలను చూస్తాము, మనం విషయాలను వింటాము, రుచి చూస్తాము, స్పర్శిస్తాము, అనుభూతి చెందుతాము — మన అంతర్గత చైతన్యం మరియు బాహ్య ప్రపంచం మధ్య పరస్పర మార్పిడి అది.

ఇది నిష్క్రియాత్మక ప్రక్రియ లేదా సచేతనా ప్రక్రియ కావచ్చు. యోగి దాన్ని చైతన్యంలోకి తెచ్చుకోవాలని కోరుకుంటాడు, ఎందుకంటే యోగికి — భక్తుడికి — ఇంద్రియాలను నియంత్రించకపోవడం వల్ల, మన చైతన్యాన్ని ప్రపంచం శాసించేలా చేయడం వల్ల కలిగే అతి విచారకరమైన, వాస్తవానికి విషాదకరమైన ఫలితాలు ఏమిటో తెలుసు.

చాలా మందిలో, అనర్హులమని లేదా ప్రేమించబడటం లేదని, ఒక ఒంటరివారమనే భావన ఉంటుంది. ఇంతటి అసాధారణమైన ఒంటరితనానికి కారణం ఏమిటి? ఈ వ్యక్తులందరిలో ఇంత గొప్ప నిస్సారమైన “శూన్యత” ఎందుకు ఉంది?

సమాధానం చాలా సులభం. ప్రజలకు ఒంటరిగా ఉన్నట్లుగా ఎందుకు అనిపిస్తుందంటే, తమతో తాము స్నేహం చేయడానికి వారు ఎప్పుడూ సమయం తీసుకోవడం లేదు.

వాస్తవానికి, నేను ఉన్నతమైన అంతరాత్మను సూచిస్తున్నాను — దాని అన్ని విలక్షణతలు, అలవాట్లు మరియు పరిమితులతో కూడిన చిన్న అహం కాదు, కాని నిజమైన అంతరాత్మ, అదే ఆత్మ.

మన బలం మరియు ఆత్మాగౌరవానికి మూలం

మన నిజమైన అంతరాత్మతో సంబంధాన్ని పెంపొందించుకోనప్పుడు, ఫలితం ఎలా ఉంటుంది? నిజమైన ప్రేమకు, మన బలానికి మరియు మన ఆత్మాగౌరవానికి మూలం ఆత్మ. మనం దాని నుండి విడిపోయినట్లయితే, మరియు ఆ ఉన్నతమైన ఆత్మతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయనప్పుడు, దాని ఫలితం ఏమిటంటే, ఆ ప్రాథమిక మానవ అవసరాలు మరియు కోరికలు అన్నీ — ప్రేమ కోసం, ధ్రువీకరణ కోసం, మనం యోగ్యతగల వారమని ఎవరైనా చెప్పడం అనేవి—నెరవేరకుండానే ఉంటాయి. ఇది దుఃఖించదగిన అంశం.

ప్రతి మానవునిలో ఉండే ఆ అద్భుతమైన దివ్య లక్షణాల గురించి అవగాహన లేకపోవడంతో, ప్రజలు లక్షలాది విభిన్న మార్గాల్లో కోరికలు నెరవేర్చుకోవడం కోసం పరుగులు పెడుతున్నారు.

నిజంగా, ఇదంతా చాలా ప్రాథమికమైన, భావోద్వేగంతో కూడిన అరుపులు: “ఎవరూ నన్ను ప్రేమించరా? నేను యోగ్యుడిననే భావన నాకు కలుగజేసేవారు ఎవరూ లేరా? నేను ప్రేమించబడతానని, నేను నచ్చుతానని, నేను విలువైనవాడిననే భావాన్ని ఎవరైనా నాకు కలిగించగలరా?” వ్యక్తులు బయటి మూలాల నుండి ధృవీకరణ కోసం వెంబడిస్తున్నంత కాలం, ఇది ఎల్లప్పుడూ అంతుచిక్కనిదిగా ఉంటుంది; ఆంతరికంగా ఆ ఒంటరితనం మరియు ఆ శూన్యత ఎప్పుడూ ఉంటుంది.

ధ్యానం వలన వచ్చే గొప్ప మార్పు (మరియు ఆశ!)

అయితే ఒక మంచి విషయం ఏమిటంటే, ఒకరు తీవ్రమైన, క్రమశిక్షణతో కూడిన, క్రమబద్ధమైన మరియు శాస్త్రీయమైన ధ్యానాన్ని అభ్యసించడం ప్రారంభించినప్పటి నుండి కాలానుగుణంగా ఇది మారవచ్చు—తద్ద్వారా నిజమైన ఆత్మను తెలుసుకోవడం ప్రారంభమవుతుంది. అక్కడ నుండి నిజమైన ఆత్మాగౌరవం వస్తుంది.

ప్రసార మాధ్యమాల్లోను మరియు సమాజంలోని మన విద్యావేత్తలు మరియు నాయకుల నుండి, ముఖ్యంగా జీవితంలో ఇంకా తమ నడక ప్రారంభించని లేదా దిశను కనుగొనని యువకులలో ఆత్మాగౌరవమనే సమస్య గురించి మనం వింటున్నాము. ప్రేమ మరియు దివ్యత్వం యొక్క మూలస్థానం తమలోనే ఉందని వారికి తెలియకపోతే, ఒక శూన్యత ఉంటుంది మరియు ఆ శూన్యత—సామాజిక ప్రసార మాధ్యమాలతో, వినోదంతో, ఈ విధమైన పరధ్యానంతో అంతులేకుండా ఆ బాహ్య అన్వేషణలో నిమగ్నమై అంతులేని అన్వేషణకు దారి తీస్తుంది.

వారు చేసే ఆ కార్యకలాపాలు తప్పు అని కాదు; అందులో మాత్రమే తమనుతాము నిమగ్నం చేసుకోవడం ఉపయోగం లేనిది— ఇది ఆంతరిక శూన్యత యొక్క ఖాళీని పూరించడంలో ఉపయోగం లేనిది.

మీలో ధ్యాన సాధన చేస్తున్నవారు, ప్రపంచానికి ఆశాజనకమైన మూలస్థానంగా నాకు అనిపిస్తారు, ఎందుకంటే ఆత్మతో, లోపల ఉన్న ఆ దివ్య సాన్నిధ్యంతో కొంత సంబంధాన్ని పొందడానికి ధ్యానం యొక్క ఆ పద్ధతులను ఉపయోగించే ప్రతి ఒక్కరూ, నేడు ప్రపంచంలో అంటువ్యాధిగా ఉన్న శూన్యత, ప్రతికూలత, ఒంటరితనం మరియు పరాధీనతకు ప్రత్యామ్నాయంగా శక్తివంతమైన ఉదాహరణను చూపుతున్నారు.

ఆధ్యాత్మిక చైతన్యమే పరిష్కారం; ధ్యానం చేయడమే పరిష్కారం.

ఇతరులతో షేర్ చేయండి