స్వామి చిదానందగిరి గారి నుండి 2023 గురుపూర్ణిమ సందేశము

June 24, 2023

“మీరు గురుశిష్య సంబంధము యొక్క నియమములను నిలకడగా పాటించినప్పుడు ఆధ్యాత్మిక మార్గము సులభమవుతుంది. అప్పుడు దారి తప్పలేరు. మాయ మిమ్మల్ని పక్కకు లాగాలని ఎంతగా ప్రయత్నించినా, దైవసాక్షాత్కారము పొందిన గురువుకు మీ కష్టములు తెలుసు కనుక, మీరు ఆధ్యాత్మిక మార్గములో నిలదొక్కుకోవడానికి సహాయపడతాడు. మీరు గురువుతో అనుసంధానంలో ఉంటే ఆయన చేసే మేలు అదే. మీరు గురువుకి వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ, ఆయన సహాయం మీకు అందుతుంది. మా గురుదేవులు ఇప్పుడు శరీరంలో లేనప్పటికీ, ఆయన ఎల్లప్పుడూ నాతోనే ఉండడాన్ని అనుభూతి చెందుతున్నాను. గురువు యొక్క మార్గదర్శకత్వము, కృప మీతో ఉండడమే ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణించడానికి అతి సులభమైన విధానము.”

—శ్రీ శ్రీ పరమహంసయోగానంద

ప్రియతములారా,

దైవసాక్షాత్కారం పొందిన గురువు — ప్రతి శిష్యునిలోను, నిద్రాణమై ఉన్న భగవంతుని మేల్కొల్పడమే తన ఏకైక లక్ష్యంగా కలిగినటువంటి మూర్తీభవించిన నిర్నిబంధ ప్రేమ మరియు స్నేహం — వద్దకు నడిపించబడడమే, ఈ ప్రపంచంలో ఎవరైనా భగవంతుని నుండి పొందగల అత్యంత విలువైన బహుమతి. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. మార్గములోని మనమందరము అటువంటి సద్గురువు అయిన మన ప్రియతమ పరమహంస యోగానందగారి వద్దకు ఆకర్షించబడ్డాము. భారతదేశమంతటా జరుపుకునే ఈ పవిత్రమైన రోజున మన గురుదేవులకు — ఎవరైతే మనకు ముక్తిదాయక బోధనలు ఇచ్చారో మరియు ఎవరి పూర్తి జీవితం అందరి ఆత్మలలో భగవంతుని పట్ల ప్రేమను మేల్కొల్పడానికే అంకితమైనదో ఆయనకు — కృతజ్ఞతతో మన హృదయపూర్వక ప్రేమను, భక్తిని అర్పించడానికి ఏకమౌదాము.

నిర్మలమైన, దోషరహితమైన జ్ఞానంతో భగవంతుని తిరిగి చేరుకోవడంలో తనకు దారి చూపించిన తమ గురుదేవులు స్వామి శ్రీయుక్తేశ్వర్ గారిని కలుసుకునే వరకు నిజమైన ఆనందం మరియు జ్ఞానం కనుగొనలేదని పరమహంసగారు చెప్పారు. మన దివ్య గురుదేవులు మనకోసం ఏర్పరచిన మార్గంలో పయనిస్తూ నిజాయితీతో ఈ పవిత్ర సాధనను ఆచరిస్తున్నప్పుడు మీ జీవితాలలో ఇంకా ఎక్కువ గాఢంగా పరమహంసగారి మార్గదర్శనంతో కూడిన రక్షణను మరియు ప్రేమపూరిత సాన్నిధ్యాన్ని తప్పకుండా అనుభవిస్తారు. ఉత్తేజపరచే ఆయన జ్ఞానం మరియు ప్రేమతో మన అనుసంధానం ద్వారా మన జీవితాలు పరివర్తన చెందుతాయి.

మీరు ప్రతిరోజూ ధ్యానపు లోతులలో మునక వేస్తున్నప్పుడు భగవంతుడు మరియు గురుదేవులు మీకు ఎప్పుడూ దగ్గరగా ఉండి, మార్గదర్శనం చేస్తూ, ప్రేమిస్తూ ఉద్ధరిస్తున్నారని మీరు స్పష్టంగా గ్రహించాలని ప్రార్థిస్తాను.

దివ్యప్రేమ మరియు ఆశీస్సులతో,

స్వామిచిదానంద గిరి

ఇతరులతో షేర్ చేయండి