“మొదట దివ్యత్వాన్ని అన్వేషించండి మరియు ప్రతిదానిలో సమతుల్యతను కనుగొనండి అని యోగం బోధిస్తుంది” — శ్రీ శ్రీ పరమహంస యోగానంద

సెల్ఫ్-రియలైజషన్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో జులై 11, 1940 న చేసిన ప్రసంగం “సఫలత కోసం అవధానతాశక్తిని కేంద్రీకరించడం,” నుండి సారాంశాలు, పూర్తి ప్రసంగాన్ని వై.ఎస్.ఎస్. ప్రచురించిన ఆత్మసాక్షాత్కారం వైపు ప్రయాణం, అనే పరమహంసగారి ప్రసంగాల, వ్యాసాల మూడవ సంపుటంలో కనుగొనవచ్చు.

యోగసాధన ప్రపంచంలో మీకున్న విధుల నుంచి మిమ్మల్ని దూరంగా వెళ్ళమని సలహా ఇవ్వడం లేదు. భగవంతుడు మిమ్మల్ని ఉంచిన ఈ ప్రపంచంలో మీ పాత్రను నిర్వహిస్తూ మిమ్మల్ని మీరు భగవంతుని గురించిన ఆలోచనతో పూర్తిగా నింపుకోండి అని చెప్తోంది.

మీ విధులను చేయకపోవడం వల్ల లభించిన స్వేచ్ఛలో మీరు భగవంతుడిని కనుగొనగలరని భావిస్తూ, అరణ్యంలోనో, కొండలమీదో ఒక ఏకాంత జీవితం గడపాలని మీరు కోరుకొంటే, రోజు తరువాత రోజు, రోజంతా ధ్యానంలో కూర్చోనే సంకల్పం మీకుండాలి.

అటువంటి ప్రయత్నం చేయడం తప్పకుండా మెచ్చుకోదగినదే. కాని ఈ ప్రపంచంలోనే ఉంటూ దానికి చెందకుండా ఉండగలగడం ఇంకా గొప్ప విషయం — మీ మనస్సును భగవంతునిపై ఉంచుతూ, ఇతరుల ప్రయోజనం కోసం మీరు చేసే మీ వాస్తవమైన విధులు. “కర్మను త్యజించడం వల్ల ఎవ్వరూ పరిపూర్ణులు కాలేరు….ఓ అర్జునా, కర్మ ఫలాసక్తి విడిచి, యోగయుక్తుడవై కర్మలన్నిటినీ నిర్వర్తించు” (భగవద్గీత III:4 మరియు II:48).

మీరు ప్రధానమైన, అప్రధానమైన విధుల గురించి సరియైన దృష్టి కోణం నుంచి ఆలోచించాలి. ఒక విధి ఇంకొకదాన్ని వ్యతిరేకించడానికి అనుమతించకండి. సంస్కృత పవిత్ర గ్రంథాలలో ఒక దివ్యనియమం ఉంది, ఇది ప్రపంచానికి ఇప్పటివరకూ ఇచ్చిన నియమాలన్నిటిలో అత్యంత సుందరమైనది: “ఒక విధి ఇంకొక విధిని వ్యతిరేకిస్తే, అది వాస్తవమైన విధి కాదు.”

ఆరోగ్యం పాడుచేసుకుని ఆర్థిక విజయాన్ని సాధిద్దామని మీరు అనుకుంటే, మీ శరీరం పట్ల మీకు గల బాధ్యతను మీరు నిర్వర్తించడం లేదన్నమాట. మీ ప్రాపంచిక కర్తవ్యాలను నిర్లక్ష్యం చేసేంతగా మీరు మతపిచ్చిలో పడితే, మీలో సమతుల్యత కొరవడింది; మీ శరీరం, కుటుంబం పట్ల మీకుగల బాధ్యతను ఇంకొక బాధ్యత వ్యతిరేకించడానికి మీరు అనుమతించారు. మీ ధ్యాసంతా కుటుంబం గురించి హడావుడి చేయడానికి వినియోగిస్తూ భగవంతుడి గురించి మీకుగల బాధ్యతను మర్చిపోవడం, కర్తవ్యమనిపించుకోదు.

చాలామంది అడుగుతారు, “మా ప్రాపంచిక బాధ్యతలను నిర్వర్తించడానికి మేము మొదట భౌతిక విజయాన్ని పొంది, ఆపైన భగవంతుడిని అన్వేషించాలా? లేక మొదట భగవంతుడిని పొంది తరువాత విజయం వెనుక వెళ్ళాలా?” ఏ విధంగా చూసినా భగవంతుడే మొదట వస్తాడు. గాఢధ్యానంలో ఆయనతో అనుసంధానంలో ఉండకుండా మీ రోజును మొదలుపెట్టడం కాని, ముగించడం కాని చేయకండి.

భగవంతుడి వద్ద నుంచి అరువు తెచ్చుకున్న శక్తి లేకుండా మనం ఏ విధులనూ నిర్వర్తించలేమని గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం మొదట విధేయత చూపించవలసినది భగవంతుడికే….

దైవాన్వేషణ, భౌతిక విజయం, రెండిటినీ కలిపి మాట్లాడడం వినడానికి బావుంటుంది; కానీ మీరు గాఢంగా క్రమబద్ధంగా ధ్యానం చేసి, మొదట మీ చైతన్యాన్ని భగవంతుడిలో స్థిరపరచుకోకపోతే, ప్రపంచం మీ ధ్యాసనంతటినీ తనవైపు లాక్కుంటుంది, అప్పుడు మీకు భగవంతుడి కోసం సమయమే మిగలదు.

భగవంతుడు మీతో ఉన్నాడన్న స్పృహ లేకపోతే, మీ ప్రాపంచిక విధులన్నీ సాధారణంగా హింసపెట్టే పద్ధతులుగా మారిపోతాయి. కాని ఎల్లవేళలా భగవంతుడు మీతో ఉండి, దైవస్పృహతో మీ విధులను మీరు నిర్వర్తిస్తూ ఉంటే మీరే అందరికన్నా ఆనందభరితుడైన వ్యక్తి కాగలరు. “తమ ఆలోచనలు పూర్తిగా నాపై ఉంచి, తమ అస్తిత్వాలను నాకు శరణాగతి చేసి, ఒకరితో ఒకరు జ్ఞానాన్ని పంచుకుంటూ, ఎల్లప్పుడూ నన్నే భగవంతుడిగా ప్రకటిస్తూ, నా భక్తులు సంతృప్తులై ఆనందభరితులై ఉంటారు” (భగవద్గీత X:9).

ఆ దైవచైతన్యాన్ని నాకు ప్రసాదించిన నా గురువు స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి శిక్షణే నాకు లేకపోయుంటే, మనుష్యులకు సహాయం చేయడానికై, ఈ సంస్థను నిర్మించడానికి ప్రయత్నిస్తూ, ఒక్కోసారి వారినుంచి సహకారానికి బదులు చెంపదెబ్బలు తింటూ, చాలాకాలం క్రితమే నాకు దీనిపై కోరిక నశించి ఉండేది….

పవిత్ర గాంథాలన్నీ ఇలా బోధిస్తున్నాయి: “మొదట దైవ సామ్రాజ్యాన్ని అన్వేషించండి” (ముత్తయి 6:33, బైబిలు). కాని జనులు తాము చదివిన, లేదా చర్చిలో విన్న ఆధ్యాత్మిక సిద్ధాంతాలను తమ దైనందిన జీవితాల నుంచి ఎలా వేరు చేస్తున్నారో చూడండి. సత్యము యొక్క సిద్ధాంతాలను అభ్యసించి ఆచరణలో పెట్టినప్పుడు ఆధ్యాత్మిక, మానసిక, శారీరక నియమాలన్నీ ఎంత ఆచరణయోగ్యమైనవో మీరు గ్రహిస్తారు.

పవిత్ర గ్రంథాలను పైపైన చదివితే, వాటినుంచి మీరేమీ ప్రయోజనాన్ని పొందలేరు. కాని మీరు సత్యాన్ని గురించి ఏకాగ్రతతో చదివి, చదివినదాన్ని నిజంగా నమ్మితే ఆ సత్యాలు మీకోసం పనిచేస్తాయి. మీరు నమ్మాలని అనుకోవచ్చు, నమ్ముతున్నారని భావించవచ్చును కూడా; కాని మీరు నిజంగా నమ్మితే, తక్షణమే ఫలితం కనిపిస్తుంది.

విశ్వాసం రకరకాల స్థాయిల్లో ఉంటుంది. కొంతమంది అసలు నమ్మరు. కొంతమంది నమ్మాలనుకుంటారు. మరికొంతమంది కొంచెం నమ్ముతారు. ఇంకొంతమంది తమ విశ్వాసానికి పరీక్ష పెట్టేవరకు నమ్ముతారు. మన నమ్మకాలకు విరుద్ధంగా జరిగేవరకూ మనం వాటి గురించి ఎంతో తిరుగులేకుండా ఉంటాం; తరువాత మనం తికమకపడి భద్రత లేనట్టుగా తయారవుతాం. విశ్వాసం అన్నది అతీంద్రియ జ్ఞానం నుండి వచ్చే నమ్మకం. ఆత్మ నుంచి వచ్చే జ్ఞానం; ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా అది చలించదు.

భగవంతుడిని మొదట అన్వేషించండి అనే ఆధ్యాత్మిక ఆదేశం వెనుకనున్న ప్రత్యక్షమైన ప్రయోజనం ఏదంటే — ఒకసారి మీరాయనను కనుగొన్నాక, మీ లోకజ్ఞానం మీకు సరైనవని చెప్పిన వస్తువులను పొందేందుకు మీరాయన శక్తిని ఉపయోగించగలరు. ఈ సూత్రంలో విశ్వాసముంచండి.

భగవంతుడితో అనుసంధానంలో ఉండడం వల్ల మీరు నిజమైన విజయానికి మార్గాన్ని కనుక్కుంటారు; ఆధ్యాత్మిక, మానసిక, నైతిక, భౌతిక విజయాల మధ్య సమతుల్యతను సాధించడమే నిజమైన విజయం.

ఇతరులతో షేర్ చేయండి