ది డివైన్ రొమాన్స్ తమిళ అనువాదం చెన్నైలో విడుదలైంది

18 మార్చి, 2017

గురుదేవుల చర్చల సంకలనమైన ది డివైన్ రొమాన్స్ పుస్తకం యొక్క తమిళ అనువాదం, వై.ఎస్‌.ఎస్. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా, చెన్నైలో ఫిబ్రవరి 4, 2017న జరిగిన ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో విడుదల చేయబడింది. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, దయాళువు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, మరియు యోగదా భక్తుడు శ్రీ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెన్నైలోని రాఘవేంద్ర మండపంలోని హాలు, దాదాపు 1,500 మంది ఈ కార్యక్రమానికి హాజరవడంతో పూర్తి స్థాయిలో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో వై‌.ఎస్‌.ఎస్.కు చెందిన స్వాములు స్మరణానందగారు, శుద్ధానందగారు, పవిత్రానందగారు, బ్రహ్మచారులు నిష్ఠానందగారు, నిరంజనానందగారు పాల్గొన్నారు.

శ్రీ రజనీకాంత్ (ఎడమ నుండి రెండవవారు) వై‌.ఎస్‌.ఎస్. స్వాములు మరియు ఒక భక్తునితో కలిసి కొత్తగా విడుదల చేసిన ది డివైన్ రొమాన్స్ పుస్తకం యొక్క తమిళ అనువాదాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో స్వామి సుద్ధానందగారు మాట్లాడుతూ గురుదేవ పరమహంస యోగానందగారు 1917లో పశ్చిమ బెంగాల్‌లోని దిహికా అనే గ్రామంలో కేవలం ఏడుగురు విద్యార్థులతో “హౌ-టు-లివ్” పాఠశాలగా వై‌.ఎస్‌.ఎస్.ను ఎలా ప్రారంభించారని మరియు అది ఇప్పుడు భారతదేశంలో రెండు వందలకు పైగా ధ్యాన కేంద్రాలు మరియు ప్రాథమిక స్థాయి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు అనేక విద్యా సంస్థలు ఉన్న ప్రపంచవ్యాప్త సంస్థగా ఎదిగిందని వివరించారు.

స్వామి స్మరణానందగారు నిత్య జీవితంలో దైవిక ప్రేమను వ్యక్తపరచడం మరియు అనుభవించడం అనే అంశంపై ప్రసంగించారు. దైవ ప్రేమ ప్రతిచోటా, ఎల్లవేళలా ఉంటుందని, భగవంతుడిని అనుభవించాలని, తప్పకుండ చూడాల్సిన అవసరము లేదని ఆయన వివరించారు.

ముఖ్య అతిథి శ్రీ రజనీకాంత్ గారు 1998లో ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని చదివినప్పుడు తన గురువు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారిని ఎలా కనుగొన్నారో అన్న విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. అప్పటి నుండి ఆయన తన జీవితంలో గురూజీ బోధనల పరివర్తన శక్తిని చూశారు. ది డివైన్ రొమాన్స్ అనే పుస్తకం గురించి ఆయన మాట్లాడుతూ, “ఈ పుస్తకం నా జీవితకాలంలో నేను విడుదల చేస్తున్న మొదటి పుస్తకం. పుస్తకాన్ని సమీక్షించేటప్పుడు, ప్రతి పేజీ, ప్రతి పంక్తి, పరమహంస యోగానందగారి ప్రేమ మరియు జ్ఞానం అనే రత్నాలతో నిండి ఉందని నేను వెంటనే గ్రహించాను. ఆయన ప్రసంగాన్ని పెద్ద చప్పట్లతో స్వాగతించారు. స్వామి సుద్ధానందగారు శ్రీ రజనీకాంత్‌కు యోగేశ్వర కృష్ణుడి పటము కట్టిన చిత్రాన్ని బహుకరించారు.

ప్రింట్, టీవీ మరియు ఆన్‌లైన్ మీడియా ఛానెల్‌లలో ప్రెస్ ద్వారా ఈ కార్యక్రమము విస్తృతంగా కవర్ చేయబడింది. కార్యక్రమం ముగిసిన వెంటనే ది డివైన్ రొమాన్స్  (తమిళం) ప్రతులు దాదాపు ఐదు వందలు అమ్ముడయ్యాయి. దాదాపు నలభై మంది వ్యక్తులు గురూజీ బోధనలపై ఆసక్తిని వ్యక్తం చేశారు మరియు యోగదా సత్సంగ పాఠాల కోసం నమోదు చేసుకున్నారు. పూర్తి ఉత్సాహంతో, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో తమ సేవను అందించి, విజయవంతం చేసిన భక్తులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

ఇతరులతో షేర్ చేయండి