“ఆంతరిక మార్గనిర్దేశంతో మీ సమస్యలను పరిష్కరించుకోవడం” — శ్రీ దయామాత

10 మార్చి, 2023

1955 నుండి 2010లో పరమపదించినంత వరకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షురాలిగా మరియు సంఘమాతగా సేవలందించిన శ్రీ దయామాతగారి రచన Intuition: Soul-Guidance for Life’s Decisions (ఇంట్యూషన్ సోల్-గైడెన్స్ ఫర్ లైఫ్స్ డెసిషన్స్) నుండి ఈ క్రింది సారాంశం.

శ్రీ పరమహంస యోగానంద తరచుగా ఈ హితోక్తిని వ్యాఖ్యానించేవారు: “ప్రభువు తనకు తాను సహాయం చేసుకునే వానికి సహాయం చేస్తాడు.”

ఏదైనా ఒక నిర్ణయం తీసుకొనవలసి వచ్చినప్పుడు, మనం ఏమి చేయాలో చెప్పే ఏదో ఒక దివ్య శక్తి కంటే అద్భుతమైనది మరేది ఉండదు. ఇది ఎంతో సులభంగా ఉంటుంది; ఏ క్షణమైనా మనం దేవుని ప్రత్యక్ష మార్గదర్శకత్వాన్ని పొందుతామని తెలిస్తే మనం ఇక ఎలాంటి ప్రయత్నం చేయాల్సిన అగత్యమూ ఉండదు.

కానీ అది అంత తేలికగా ఉండటానికి నిర్దేశించినది కాదు, దానికి కారణం: మనం భగవంతునిలో ఒక భాగమే, కానీ మనకు అది తెలియదు — అయితే మనం బుద్ధిహీనమైన తోలుబొమ్మలులాగా మరి ఆయన తోలుబొమ్మలు ఆడించేవాడిలాగా, మనం ఆయనపైనే భారం ఉంచి, “ప్రభూ నాకు ఏమి చేయాలో ఆదేశించు” అని అనడం వల్ల అది మనకు ఎన్నటికీ తెలియదు. అలా కాక, మనం ఆయన మార్గదర్శకత్వాన్ని కోరే వేళలో, మనకు ఇచ్చిన బుద్ధిని ఉపయోగించాలని ప్రభువు ఆశిస్తాడు.

ఉత్తమమైన ప్రార్థన

ఏసు ఇలా అత్యున్నత ప్రార్థన చేశాడు: “ప్రభూ, నీ సంకల్పమే నెరవేరనీ.” ఇప్పుడు, చాలామంది దీనిని ఎలా అన్వయిస్తున్నారంటే, ఏ సంకల్పమూ లేక ఏ యోచనా లేకుండా, కేవలం కూర్చుని ధ్యానించి, భగవంతుడే తమ ద్వారా ఏదైనా చేసేవరకు నిరీక్షించాలి. ఇది అనుచితమైనది. మనం ఆయన ప్రతిరూపంలో సృష్టించబడ్డాం.

మరే ప్రాణికీ ఒసగనన్ని తెలివితేటలు భగవంతుడు మనిషికి ఇచ్చాడు, దానిని మనం ఉపయోగించాలని ఆయన అపేక్షిస్తున్నాడు. అందుకోసమే శ్రీ పరమహంసగారు మనకు ప్రార్థన చేయడం బోధించారు:

“ప్రభూ, నేను వివేచన చేస్తాను, నేను సంకల్పిస్తాను, నేను పని చేస్తాను; కానీ నా వివేకం, సంకల్పం మరియు కార్యా చరణ సరియైన దిశలో చేసేటట్లు నాకు మార్గనిర్దేశం చెయ్యి.”

మేము దీనిని ఆశ్రమంలో భక్తిగా పాటిస్తాము. ఏదైనా పనిని గురించి మేము సమావేశమైనప్పుడు, ముందుగా కొన్ని నిమిషముల పాటు ధ్యానం చేసిన తరవాత ఈ ప్రార్థనను చేస్తాము. అటు పిమ్మటే చర్చించి నిర్ణయాలు తీసుకుంటాము.

కాబట్టి భగవంతుడే ఆవశ్యకమైన చర్యలకు శ్రీకారము చుట్టడానికి ఎదురుచూస్తూ కూర్చోవద్దు. వివేకము, సంకల్పము మరియు కార్యాచరణ యొక్క సూత్రాలను అన్వయింపజేస్తూ ఉత్తమమైన పద్ధతిగా భావించిన దానినే అనుసరించండి.

అంతరాత్మకు అనుగుణంగా మీ సంకల్పాన్ని మరియు బుద్ధిని వినియోగించి పని చేయండి, మరి అదే సమయంలో ఎడతెగక ప్రార్థించండి: “ప్రభూ, నాకు మార్గనిర్దేశం చెయ్యి; నీ సంకల్పాన్నే అనుసరించనీయి. నీ ఇచ్ఛే నెరవేరనీ.”

ఇలా చేయడం ద్వారా, ఆయన మార్గదర్శనాన్ని స్వీకరించేలా మీ మనస్సును నిలుపుకోగలుగుతారు. అప్పుడు మీరు అకస్మాత్తుగా, “లేదు, నేను ఇప్పుడు ఈ దారిలో వెళ్ళాలి” అని స్పష్టంగా గ్రహించవచ్చు. భగవంతుడు మీకు ఆ దారి చూపిస్తాడు.

కానీ గుర్తుంచుకోండి, మీరు భగవంతుడి మార్గదర్శనాన్ని కోరేటప్పుడు, మీ మనస్సును మూసి ఉంచకండి; పరిగ్రహణకు అనుకూలంగా ఎల్లప్పుడూ దానిని తెరచి ఉంచండి. ఈ విధంగా తనకు తాను సహాయం చేసుకొనేవారికి భగవంతుడు సహాయం చేస్తాడు. ఇది తప్పక సాధ్యపడుతుంది, అయితే ఆ చొరవ, ప్రయత్నం మన నుండే రావాలి.

భగవంతునికి సేవ చేయడానికి మరియు ఆయన సంకల్పాన్ని అనుసరించడానికి మీరు ఆశ్రమంలోనే నివసించనవసరం లేదు. మనలో ప్రతి ఒక్కరం భగవంతుడు మరియు మన గత చర్యలు మనలను ఉంచిన ఈ క్షణంలో ఉన్నాము. మీ ప్రస్తుత పరిస్థితుల పట్ల మీకు సంతృప్తి లేకపోతే, ధ్యానం చేసి భగవంతుడి మార్గనిర్దేశం కోసం ప్రార్థించండి. అలా చేస్తున్నప్పుడు, భగవంతుడిచ్చిన బుద్ధిని ఉపయోగించండి. మీ జీవితానికి మరియు మీ భవిష్యత్తుకి
సంబంధించి మీకు ఉన్న ఇచ్ఛికాలను విశ్లేషించండి.

అంతరాత్మ మరియు సహజావబోధం: మీలోని దివ్య వాణి

మనకున్న అన్ని సమస్యలను పరిష్కరించుకొనేందుకు మనలో ఉన్న ఆ దివ్య వాణి సహాయం చేస్తుంది. ప్రతి మానవునిలో ఉన్న ఆ అంతరాత్మ స్వరమే దివ్య మార్గనిర్దేశం చేయడానికి భగవంతుడు ఒసగిన-సాధనం.

కానీ చాలామంది దానిని వినలేరు, ఎందుకంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జీవిత కాలాల్లో వీరు దానిపై దృష్టి సారించటానికి నిరాకరించారు. పర్యవసానంగా వారిలో ఆ వాణి మౌనంగా లేదా అతి బలహీనమౌతుంది. కానీ ఒక వ్యక్తి తన జీవితంలో సరైన నడవడిని ఆచరించడం మొదలు పెట్టినప్పుడు ఆ అంతర్గత గుసగుసలు మరల శక్తివంతమగుతాయి.

మనస్సాక్షి యొక్క పాక్షిక సహజావబోధం వెనుక నిర్మలమైన సహజావబోధం ఉంది, సత్యాన్ని అవగతం చేసుకొనే ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానము — సర్వజ్ఞమైన దివ్య వాణి.

మనమందరం సహజావబోధాన్ని కలిగి ఉన్నాం. మనకు భౌతికంగా ఐదు ఇంద్రియాలు ఉన్నాయి, అంతేకాక — అన్నిటినీ గ్రహించే ఆరవ ఇంద్రియమైన, సహజావబోధం కూడా ఉంది. బాహ్య పంచేంద్రియాల ద్వారా మనం ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్నాం: మనం స్పృశిస్తాం, వింటాం, వాసన చూస్తాం, రుచి చూస్తాం మరియు దర్శిస్తాం. చాలా మందిలో వినియోగ లేమి వల్ల, ఈ ఆరవ ఇంద్రియం, సహజావబోధం, అభివృద్ధి చెందదు.

చిన్నప్పటి నుండి కళ్ళకు గంతలు కట్టి ఉంచి, కొన్ని ఏళ్ళ పిమ్మట వాటిని తొలగిస్తే, సర్వమూ సమతలంలా కనిపిస్తుంది. లేదా చేతిని కదలకుండా చేస్తే, సరియైన వాడుక
లేకపోవడం వల్ల వృద్ధి చెందదు. అలాగే, సరిగ్గా వినియోగించక పోవడం వల్ల చాలా మందిలో ఈ సహజావబోధం పనిచేయదు.

ధ్యానం సహజావబోధ శక్తిని పెంపొందిస్తుంది

సహజావబోధాన్ని పెంపొందించుకొనేందుకు ఒక మార్గం ఉంది. శరీరాన్ని , మనస్సు నిశ్చల స్థితిలో ఉంచే వరకు మన అంతర్దృష్టి పనిచేయదు. సహజావబోధాన్ని పెంపొందించుకొనే మొదటి సోపానం ధ్యానం, ఆంతరిక నిశ్చలత స్థితిలోకి ప్రవేశించడం. ఏదైనా సమస్యపై లోతుగా ధ్యానించి మీ మనస్సును గాఢంగా కేంద్రీకరించినప్పుడు, అంతే గాఢంగా మీ సహజావబోధ శక్తి దానంతట అదే వ్యక్తీకరించబడుతుంది. ఆ శక్తి క్రమేణా వృద్ధి చెందుతుంది, ఒక్కసారిగా రాదు; ఒక కండరానికి లేక ఒక అవయవానికి వ్యాయామంతో క్రమేణా శక్తి సమకూరినట్లుగా — అంతే కాని రాత్రికి రాత్రి అలా జరుగదు…

దైనందిన ధ్యాన సాధనను ఆరంభించడం లేదా బలొపేతం చేయడం గురించి మీరు మరింతగా అభ్యసించి — మీ చైతన్య ప్రశాంతతలో మరియు శాంతిలో మీ “ఆరవ ఇంద్రియమైన సహజావబోధం” మీ చైతన్యంలో మరింతగా వ్యక్తమవడానికి, దానిని మీ జీవితంలో మరింతగా వినియోగించుకోవడానికి — నిర్దేశిత మరియు సామూహిక ధ్యానాల అనుభవం పొందడానికి దయచేసి క్రింద ఉన్న లింకులను అనుసరించండి.

ఇతరులతో షేర్ చేయండి