యోగదా సత్సంగ విద్యాలయం, రాంచీ — నూతన ప్రాంగణానికి తరలింపు

8 సెప్టెంబర్, 2023

జూలై 25, 2023 న, పవిత్రమైన మహావతార్ బాబాజీ స్మృతి దినం సందర్భంగా రాంచీలోని జగన్నాథ్‌పూర్‌ వై.ఎస్.ఎస్. విద్యాలయానికి చెందిన విద్యార్థులు, తమ కోసం నిర్మించిన నూతన పాఠశాల సముదాయానికి తరలించబడ్డారు. పాత పాఠశాల భవనం ఉన్న ప్రాంగణంలోని పాఠశాల మైదానం యొక్క వేరొక భాగంలో ఈ కొత్త భవనాలను నిర్మించడం జరిగింది. విశాలమైనవి, చక్కగా వ్యవస్థీకృతమైనవీ, విద్య మరియు అభ్యాసనకు ఆధునిక సౌకర్యాలు కల్పించబడిన నూతన తరగతి గదుల పట్ల విద్యార్థులు సంతోషంగా ఉన్నారు.

నూతన పాఠశాల సముదాయములో ఏర్పాటయిన సౌకర్యాలు

పరమహంస యోగానందగారు ప్రతిపాదించిన పురాతన గురుకుల సూత్రాలు  ప్రకృతికి దగ్గరగా ఉండే వాతావరణంలో తరగతులు నిర్వహించడం  విద్య కోసం మరియు సర్వతోముఖాభివృద్ధి కోసం అత్యాధునిక సౌకర్యాలను మేళవించడమే కొత్త పాఠశాల సముదాయ రూపకల్పన యొక్క ఉద్దేశ్యం. బాగా వెలుతురు వచ్చే ఆధునిక తరగతి గదులు; పూర్తిగా సన్నద్ధమైన సైన్స్ మరియు భాషాప్రయుక్త ప్రయోగశాలలు; నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్.సి.సి) మరియు నేషనల్ సోషల్ సర్వీస్ (ఎన్.ఎస్.ఎస్) కార్యకలాపాల కోసం భవనాలు; విశాలమైన, సంపూర్ణమైన గ్రంథశాల; (వై.ఎస్.ఎస్. కాలేజీతో పంచుకున్న) ఒక సమావేశ మందిరం; ఒక పరిపాలనా భవనం; మధ్యాహ్న భోజన కార్యక్రమం కోసం వంటగది, భోజనశాల; మరియు ఒక సైకిల్ షెడ్డుతో కూడిన సౌకర్యాలు వీటిలో ఉన్నాయి.

తరలింపు సందర్భంగా ఒక ఉత్సవ వేడుక

నూతన పాఠశాల సముదాయానికి మారిన సందర్భాన్ని పురస్కరించుకొని తొలి సంధ్య ఊరేగింపు, గురుపూజ, ధ్యానంతో కూడిన కార్యక్రమాన్ని ఒక సన్యాసి నిర్వహించారు. తొలి సంధ్య ఊరేగింపుతో కార్యక్రమం ప్రారంభమైంది, ఇందులో విద్యార్థులు పల్లకిలో గురుదేవుల చిత్రపటాన్ని ఉంచి ఊరేగింపుగా పాత పాఠశాల సముదాయము నుండి బయలుదేరారు. అందంగా అలంకరించబడిన పల్లకి నేపథ్యంలో విద్యార్థులు ఒక సమూహంగా కొత్త సముదాయము వైపు సాగుతుండగా, విశ్వ గీతాల మధురమైన స్వరాలతో వాతావరణం మారుమోగింది.

నూతన సముదాయము వద్దకు చేరుకోగానే విద్యార్థులు గురుస్తుతి ఆలపించారు. అనంతరం సాంప్రదాయకంగా దీపం వెలిగించి, విద్యార్థులు విశ్వగీతాలను ఆలపిస్తుండగా పుష్పాంజలి (గురుదేవుల పాద పద్మాల వద్ద పుష్పాలు సమర్పించడం) నిర్వహించారు. ఆయా తరగతి గదుల్లో విద్యార్థులకు ప్రసాదం పంపిణీతో కార్యక్రమం ముగియగా, ఆ తరువాత మొదటి అధ్యయన తరగతి ప్రారంభమయ్యింది.

కొత్త సౌకర్యాల యొక్క ఆధ్యాత్మిక సమర్పణ

ఇంతకుమునుపు, జనవరి 29, 2023 న, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి ఈ కొత్త సౌకర్యాలను మన గురుదేవులయిన శ్రీ శ్రీ పరమహంస యోగానంద కి అంకితం చేశారు. ఈ చిరస్మరణీయ కార్యక్రమంలో 1100 మంది ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాంచీ విద్యా సంఘానికి చెందిన ప్రముఖులు, వై.ఎస్.ఎస్. సన్యాసులు, భక్తులు పాల్గొన్నారు.

నూతన సౌకర్యాల ప్రారంభోత్సవం

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ (భారత ప్రభుత్వం), జాతీయ అమలు కమిటీ (ఎన్.ఐ.సి) ద్వారా ఈ పథకం కోసం గణనీయమైన ఆర్థిక సహాయాన్ని అందించింది. అందువల్ల, జగన్నాథ్‌పూర్‌లోని వై.ఎస్.ఎస్. విద్యా ప్రాంగణంలోని నూతన పాఠశాల సముదాయం మరియు సమావేశ మందిరాలను జూలై 01, 2023 న ఎన్.ఐ.సి. సభ్యుడైన కేంద్ర కార్మిక మరియు ఉపాధి, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రివర్యులు శ్రీ భూపేందర్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, శ్రీ శ్రీ పరమహంస యోగానంద విద్యా ఆదర్శాలను పెంపొందించడంలో యోగదా సత్సంగ విద్యా సంస్థలు చేస్తున్న కృషిని, అదే సమయంలో దిగువ సామాజిక-ఆర్థిక వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడాన్ని ఆయన ప్రశంసించారు. విద్యార్థుల సమగ్ర శ్రేయస్సును నొక్కిచెప్పే విద్యా పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో వారు పోషించిన పాత్రను ఆయన ప్రశంసించారు, తద్ద్వారా ఆకట్టుకునే యువ మనస్సులను ప్రపంచంలోని ఆదర్శ పౌరులుగా మార్చడాన్ని ప్రోత్సహించారు.

ఇతరులతో షేర్ చేయండి