నేడు శాంతిని అనుభవించడానికి ఒక సాధనా సామగ్రి

8 సెప్టెంబరు, 2023

మీరు శాంతిని కొనలేరు; ధ్యానంలో మీ దైనందిన సాధన యొక్క నిశ్చలత్వంలో దాన్ని ఆంతరికంగా ఎలా పొందగలరో తప్పకుండా మీరు తెలుసుకోవాలి.

— పరమహంస యోగానంద

ఈ పేజీలో మీరు పరమహంస యోగానందగారి బోధనల యొక్క జ్ఞాన-నిధి నుండి తీసుకోబడిన పద్ధతులు మరియు నిర్దేశిత ధ్యానాలను కనుగొంటారు, ఇవి మీకు ఇప్పుడే మీలో శాంతిని “సృష్టించుకోవడానికి” సహాయం చేస్తాయి:
  • శరీరాన్ని సడలించడం (కండరాల నుండి ఒత్తిడిని తొలగించడం)
  • మానసిక సడలింపు కోసం కొన్ని క్షణాలపాటు మౌనం యొక్క రక్షణా కవచాన్ని సృష్టించుకోవడం
  • ప్రశాంతతలో మిమ్మల్ని మీరు లీనం చేసుకోవడం
  • అంతర్గత శాంతిపై దీర్ఘ నిర్దేశిత ధ్యానాలలో నిమగ్నమవ్వడం
  • మీ ప్రశాంతతను స్థిరంగా నిలుపుకోవడం మీద, శ్రీ మృణాళినీమాత జ్ఞానాన్ని గ్రహించడం

మీరు ఈ పేజీలోని విషయాలను మీకు నచ్చిన క్రమంలో గ్రహించవచ్చు. శాంతిని తెలుసుకోవడం మరియు పంచుకోవడం కోసం ఇక్కడ ఇవ్వబడిన పద్ధతులు లేదా పరమహంసగారి నుండి ఇతర సూచనలను ప్రతిరోజూ వర్తింపజేయడం ఉత్తమమైన చర్య — ఎందుకంటే క్రమం తప్పకుండా పునరావృతం చేయడం మరియు సాధన చేయడం ద్వారా మరింత గాఢమైన ప్రశాంతతను మీరు అనుభవిస్తారు.

శాంతిని ఆహ్వానించేందుకు మరియు ఆంతరికంగా లోపలకు వెళ్ళేందుకు శరీరాన్ని సడలించండి

“సడలింపబడిన మరియు ప్రశాంతత కలిగిన శరీరం మానసిక శాంతిని ఆహ్వానిస్తుంది, ఈ శారీరక స్థితి ధ్యానానికి అవసరం, ఇది దేవునితో అనుసంధానం పొందే ఆధ్యాత్మిక కళ” అని పరమహంస యోగానందగారు బోధిస్తున్నారు. శరీరాన్ని సడలించడం కోసం క్రింది పద్ధతులను ఇన్నర్ పీస్: హౌ టు బి కామ్లీ ఆక్టివ్ అండ్ ఆక్టివ్లీ కామ్ అనే తన పుస్తకంలో ఆయన వివరించారు (యోగదా సత్సంగ పాఠాలలో శరీరానికి పునరుత్తేజం కలిగించే మరియు సంపూర్ణ విశ్రాంతిని ప్రోత్సహించే శాస్త్రం ఆధారంగా, సరళీకృత సూచనలను ఆయన సంపూర్ణంగా బోధించారు):

  • సంకల్పంతో బిగించండి: సంకల్ప శక్తి యొక్క ఆదేశం ద్వారా, ప్రాణశక్తిని ఏదైనా శరీర భాగానికి (బిగింపు ప్రక్రియ ద్వారా) నిర్దేశించండి. అక్కడ శక్తి ప్రకంపిస్తున్నట్లుగా, శక్తి పొందుతున్నట్లుగా, పునరుజ్జీవం పొందుతున్నట్లుగా, అనుభూతి చెందండి.
  • సడలించి అనుభూతి చెందండి: బిగింపుని సడలించి, పునరుత్తేజం చేయబడిన ప్రదేశంలో నూతన జవసత్వాన్ని మరియు చైతన్యం యొక్క ఉపశమనంతో కూడిన జలదరింపును అనుభూతి చెందండి. మీరు శరీరం కాదని భావించండి; శరీరాన్ని నిలబెట్టే ప్రాణం మీరే. ఈ ప్రక్రియని అభ్యాసం చేయడం ద్వారా కలిగే ప్రశాంతతతో వచ్చే శాంతిని, స్వేచ్ఛని, అధికమైన అవగాహనను అనుభూతి చెందండి/li>
  • ఏ సమయంలోనైనా నిస్పృహగా మరియు ఉద్రిక్తతంగా ఉన్నట్లు మీరు భావిస్తే, ఈ క్రింది ప్రక్రియను 3 సార్లు చెయ్యండి:
    (అ) శ్వాస తీసుకొని, శ్వాసను నిలిపి ఉంచండి.
    (ఆ) మొత్తం శరీరాన్ని, అన్ని కండరాలను ఒకేసారి నెమ్మదిగా బిగించండి.
    (ఇ) మొత్తం శరీరంపై గాఢమైన శ్రద్ధతో, 1 నుండి 20 లెక్కపెట్టే వరకు బిగింపును నిలిపి ఉంచండి.
    (ఈ) బిగింపుని సడలిస్తూ శ్వాసను వదలండి.

తీరికలేని దినచర్యతో తలమునకలుగా నిమగ్నమై ఉన్నప్పటికీ, ఒక్క క్షణం పాటు ఆధ్యాత్మికంగా మౌనాన్ని సృష్టించుకోండి — మానసిక సడలింపు

ఈ వీడియోలో, ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసిని బ్రహ్మాణి మాయి మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి మరియు ఒక క్షణం నిశ్శబ్దాన్ని సృష్టించుకోవడానికి పరమహంస యోగానందగారి వై.ఎస్.ఎస్. పాఠాల నుండి చాలా చిన్న వ్యాయామాన్ని పంచుకున్నారు; మనం తీరిక లేకుండా ఉండే రోజువారీ కార్యకలాపాల మధ్య ఒక రక్షణాత్మక విరామం, తద్ద్వారా మనం మన మానసిక స్థితి మరియు శ్రేయస్సుపై స్థిరమైన ప్రభావంగా మారగల దైవంతో శాంతియుత సంబంధాన్ని — ఒక నిమిషం లేదా అంతకంటే తక్కువ సమయంలో కూడా అనుభవించవచ్చు.

ప్రశాంతతలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోండి (Anchor Yourself in Calmness) — ఇంగ్లీషులో నిర్దేశిత ధ్యానం (సుమారు 15 నిమిషాలు)

ధ్యానం యొక్క శాంతిలో తనను తాను నిమగ్నం చేసుకోవడం కోసం సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సన్యాసిని కరుణా మాయి ఒక నిర్దేశిత ధ్యానాన్ని నిర్వహించారు. ఈ ధ్యానం ఇన్నర్ పీస్: హౌ టు బి కామ్లీ ఆక్టివ్ అండ్ ఆక్టివ్లీ కామ్ అనే పరమహంస యోగానందగారి పుస్తకంలోని ఒక దివ్యసంకల్పం మరియు మానసిక ఊహా చిత్రణను కలిగి ఉంటుంది.

గాఢమైన నిశ్శబ్దం మరియు ప్రశాంతతను పొందారని మీరు భావించినప్పుడు, మరింత గాఢంగా వెళ్ళండి.

— పరమహంస యోగానంద

అంతర్గత శాంతిలో లోతుగా వెళ్ళండి (Dive Deep Into Inner Peace) — ఇంగ్లీషులో నిర్దేశిత ధ్యానం (సుమారు 30 నిమిషాలు)

పరమహంస యోగానందగారు బోధించిన ధ్యానం మరియు దివ్యసంకల్పంలో వ్యక్తమయ్యే గాఢమైన శాంతిని అనుభవించడానికి, సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సన్యాసి స్వామి సేవానంద గిరి, అంతర్గత శాంతిపై ఒక నిర్దేశిత ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. పరమహంసగారు చెప్పినట్లుగా: “మీ ఆత్మ యొక్క సహజావబోధం ద్వారా భగవంతుడు మీ అశాంతి యొక్క మేఘాల నుండి గొప్ప శాంతి మరియు ఆనందంగా విస్ఫోటనం చెందుతున్నట్లు అనుభూతి చెందండి.”

ఈ‌ ధ్యానం, క్రింద పొందుపరచబడిన దివ్యసంకల్పంతో కూడి ఉంటుంది, మీ జీవితంలోను మరియు ప్రపంచంలోను మరింత శాంతిని వ్యక్తపరచుకోవాలనుకునే ఏ సమయంలోనైనా మీరు కూడా దీనిని ఆచరించవచ్చు:

శాంతి నా శరీరాన్ని నింపుతుంది; శాంతి నా హృదయాన్ని నింపుతుంది మరియు నా ప్రేమలో నివసిస్తుంది; లోపల, బయట, అంతటా శాంతి.

అనంతమైన శాంతి నా జీవితాన్ని చుట్టి ఉంది మరియు నా ఉనికి యొక్క అన్ని క్షణాలలో అది వ్యాపించి ఉంది.

నాకు శాంతి, నా కుటుంబానికి శాంతి; నా జాతికి శాంతి; నా ప్రపంచానికి శాంతి; నా అనంత విశ్వానికి శాంతి.

మీ శాంతిని నిలుపుకొని ఉండండి — మీరు దానిని మరచిపోయినప్పుడు, మళ్ళీ తిరిగి వెనక్కు తెచ్చుకోవడానికి ఒక మార్గం

జీవితాన్ని మనం గడుపుతున్నప్పుడు, మనం తరచుగా రోజువారీ సవాళ్లను ఎదుర్కొంటాము, అది ధ్యానంలో మనం పొందిన శాంతిని భంగపరుస్తుంది, బదులుగా నిరాశ లేదా గందరగోళ భావాలతో నింపుతుంది.

కాని మన ప్రియతమ నాలుగవ అధ్యక్షురాలైన శ్రీ శ్రీ మృణాళినీమాతగారు, 2011 ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచ సమ్మేళనం సందర్భంగా నిర్వహించిన సత్సంగంలో, ఈ చిన్న వీడియోలో (ఇంగ్లీషులో) వివరించినట్లుగా, ఆ క్షణంలో మనకు ఎల్లప్పుడూ శక్తివంతమైన ఎంపిక మరియు దైవ సాన్నిధ్యాన్ని అభ్యసించే మార్గం ఉంటుంది, మన శాంతియుత స్థితి నుండి మనం జారిపోయినప్పుడల్లా, మనల్ని మనం పునరుద్ధరించుకోవడానికి అది అనుమతిస్తుంది.

Play Video

మీరు ఈ చిన్న సాధనా సామగ్రి ద్వారా, అంతర్గతంగా మీకు ఎంత శాంతి అందుబాటులో ఉందో ఇప్పుడే దర్శించవచ్చు. దైనందిన సాధన ప్రతిరోజూ చెయ్యడం ద్వారా గతంలో దాగి ఉన్న మరియు స్పృశించబడని శాంతి అనే జలాశయము మీ జీవితంలో స్థిరమైన సానుకూల మరియు ప్రవహించే శక్తిగా మారగలదు.

పరమహంస యోగానందగారి బోధనలను ఆచరణలో పెట్టడం ద్వారా అనుభవించగలిగే శాంతి యొక్క అగాధమైన లోతులకు వెళ్ళడానికి ఈ సాధనా సామగ్రి ఉపకరిస్తుంది. మీరు మరింత గాఢంగా వెళ్ళాలనుకుంటే, యోగదా సత్సంగ పాఠాల గురించి మరింతగా తెలుసుకొని, వాటికి నమోదు చేసుకోవడాన్ని పరిగణించాలని, మేము మీకు సూచిస్తున్నాము. ఈ పాఠాలలో పరమహంసగారు బోధించిన ధ్యాన పద్ధతులు మరియు సమగ్ర జీవన విధానంపై వారి సంపూర్ణమైన సూచనలు మీ ఆత్మలోని అంతులేని ప్రశాంతత మరియు ఆనందపు ఊట వద్దకు మిమ్మల్ని నేరుగా నడిపించగలవు.

నా స్థిరమైన శాంతి అనే పీఠంపైన మరియు గాఢమైన ధ్యానం నుండి ఉద్భవించే ఆనందంలో నీ ఉనికిని కనుగొనడం నాకు నేర్పించు.

—పరమహంస యోగానంద

ఇతరులతో షేర్ చేయండి