గురు పూర్ణిమ విజ్ఞప్తి — 2023

1 జూలై, 2023

గురువు మరియు శిష్యుడి మధ్య ఉండే సంబంధం, స్నేహంలో ప్రేమ యొక్క గొప్ప వ్యక్తీకరణ; అది పరస్పరం, ఒకే లక్ష్యంపై ఆధారపడి ఉన్న బేషరతైన దివ్య స్నేహం: అన్నిటికంటే మిన్నగా భగవంతుణ్ణి ప్రేమించాలనే కోరిక.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

ప్రియమైన దివ్యాత్మస్వరూపా,

ఈ ఏడాది జూలై 3న వచ్చే గురు పూర్ణిమ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు. మన ప్రియతమ గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానంద మరియు పవిత్రమైన యోగదా గురు పరంపర పట్ల మీ ప్రేమను మరియు భక్తిని వ్యక్తపరచడానికి మాతో చేరాలని ఎంతో సంతోషంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము, వారి దివ్య ఆశీస్సులు నిరంతరం మన జీవితాలను ఉద్ధరిస్తాయి. భారతదేశం యొక్క ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి, శిష్యులు ఈ పవిత్రమైన రోజున తమ గురువులకు భక్తి మరియు కృతజ్ఞతలను సమర్పించడానికి సమావేశమవుతారు.

భారతదేశమంతటా ఆధ్యాత్మిక అన్వేషకులు పరమహంస యోగానందగారి “జీవించడం ఎలా” బోధనలను కనుగొని వాటిని స్వీకరించడం కొనసాగిస్తున్నందున, మేము యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) తరఫున, ఈ ఆత్మలకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ, ఈ వేగవంతమైన ఆధునిక ప్రపంచంలో సమతుల్య జీవితాన్ని గడపడానికి గురుదేవులు బోధించిన ఆధ్యాత్మిక సూత్రాలను నేర్చుకోమని ప్రోత్సహిస్తున్నాము. కొత్త అన్వేషకులు మరియు దీర్ఘకాలంగా ఉన్న భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణంలో వివిధ కార్యక్రమాల ద్వారా మద్దతు ఇవ్వడానికి వై.ఎస్.ఎస్. కట్టుబడి ఉంది, వీటిలో:

  • వై.ఎస్.ఎస్. పాఠాలు మరియు ఇతర ప్రచురణలను బహుళ భారతీయ భాషలు మరియు వివిధ రూపాలలో అందుబాటులో ఉంచడం

  • అన్ని వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో దైనందిన సామూహిక ధ్యానాలు మరియు ఆదివారం సత్సంగాలు అందించడం

  • సన్యాసుల పర్యటనలు, ఏకాంత ధ్యానవాసాలు మరియు, సాధనా సంగం లను నిర్వహించడం

  • బహిరంగ ప్రవచనాలు, సమావేశాలు (అంతర్జాతీయ యోగా దినోత్సవం వంటి సందర్భాలలో) మరియు చర్చాగోష్టి వంటి కార్యకలాపాలను నిర్వహించడం

  • వివిధ భారతీయ భాషలలో ఆన్‌లైన్ ధ్యానాలు మరియు ప్రవచనాలను అందించడం

  • మా వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్లలో సౌకర్యాలను మెరుగుపరచడం

కొన్ని యోగ్యతాపత్రాలను పంచుకుంటున్నాం

“నేను ఇటీవల వై.ఎస్.ఎస్. మార్గాన్ని అనుసరిస్తున్నాను మరియు అమూల్యమైన కానుకగా నాకు ప్రసాదించబడిన వై.ఎస్.ఎస్. పాఠాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఈ పాఠాలను పొంది నేను సాధన చేస్తున్నప్పటి నుండి, ఒక ప్రగాఢమైన ప్రశాంతత నన్ను ఆవరించింది. ఈ పాఠాలు కేవలం పదాలు మాత్రమే కావని అవి దైవత్వ సారాన్ని మరియు జ్ఞానోదయం పొందిన గురువుల జ్ఞానాన్ని కలిగి, నా అస్తిత్వాన్ని స్పృశించే శక్తివంతమైన ప్రకంపనలను ప్రతిధ్వనిస్తాయని నాకు స్పష్టమయ్యింది.”        

—బి. ఎన్., ఝార్ఖండ్

“వై.ఎస్‌.ఎస్. ఆశ్రమం లేదా ధ్యాన కేంద్రానికి దూరంగా నివసిస్తున్నప్పటికీ, వై.ఎస్.ఎస్. సన్యాసులతో మరియు ఇతర భక్తులతో కలిసి సామూహిక ధ్యానాలలో పాల్గొనాలని, అలాగే వారి ఆధ్యాత్మిక ప్రవచనాలను వినాలని నేను ఎప్పుడూ కాంక్షించాను. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం నా ఈ ఆకాంక్షలను నెరవేర్చింది. ధన్యవాదాలు!”

—పి. కె., తమిళనాడు

గురుదేవుల కార్యం నిరంతరం విస్తరిస్తూ, సంతోషకరమైన సవాళ్లను మరియు సేవ చేయడానికి పుష్కలమైన అవకాశాలను అందిస్తోంది. వై.ఎస్.ఎస్. కార్యకలాపాలకు తోడ్పడే మార్గాల గురించి పలువురు భక్తులు తరచూ ఆరా తీస్తుంటారు. గురు పూర్ణిమ సందర్భంగా, గురుదేవుల పరివర్తనాత్మక “జీవించడం ఎలా” బోధనల వ్యాప్తికి విరాళం ఇవ్వడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీరు సహకారం అందించాలనుకుంటే, దయచేసి వై.ఎస్.ఎస్. విరాళం వెబ్‌పేజీలో ఇవ్వబడ్డ ఎంపికల నుండి “గురుపూర్ణిమ విరాళం (Guru Purnima Donation)” ఎంపిక చేసుకోండి. పరమహంసగారి క్రియాయోగ సందేశాన్ని నిజమైన మార్గాన్ని కోరుకునే వారికి వ్యాప్తి చేయడంలో మీ అమూల్యమైన మద్దతు కీలకపాత్ర పోషిస్తుంది.

మీ ఆధ్యాత్మిక మరియు భౌతిక తోడ్పాటును మాత్రమే కాకుండా గురుదేవుల బోధనలను అనువర్తింపచేస్తున్న మీ సహకారానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదనంగా, ప్రపంచంలో శాంతి మరియు సామరస్యం కోసం మీ ఆలోచనలు మరియు ప్రార్థనలు మరింత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మనందరం కలిసి, సానుకూలమైన మార్పును కొనసాగిస్తూ గురుదేవుల జ్ఞానవెలుగును పంచుకుందాం.

ఈ శుభసందర్భాన్ని జరుపుకోవడానికి మనం సంసిద్ధమవుతున్న వేళ, పరమహంసగారి మాటలను స్మరించుకుందాం: “మానవులందరిలో గురువు గొప్ప దాత. ఈశ్వరుడి వలె ఆయన దాతృత్వానికి హద్దులు లేవు.”

గురుదేవుల ఆశ్రమాల్లో, ధ్యాన కేంద్రాల్లో సేవలందించే మేమందరం మీ అందరి ఆరోగ్యం, శ్రేయస్సుల కోసం మా దైనందిన ప్రార్థనల్లో మిమ్మల్ని ఎక్కువగా తలుస్తాము. మీ దివ్యస్నేహాన్ని మేము ఎంతో గౌరవిస్తాము మరియు మీకు ఆధ్యాత్మికసేవ చేసే అవకాశం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

భగవంతుని శాశ్వత రక్షణ సాన్నిధ్యాన్ని మరియు గురు పరంపర యొక్క ఆశీస్సులను మనమందరం అనుభూతి పొందెదము గాక!

దివ్య స్నేహంలో,

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా

ఇతరులతో షేర్ చేయండి