పరమహంస యోగానందగారి స్మారక నాణెం విడుదల చేసిన ఆర్థిక మంత్రి

6 నవంబరు, 2019

పరమహంస యోగానందులవారి 125 జయంతి వార్షికోత్సవం గుర్తుగా భారత ప్రభుత్వం 125 రూపాయల ప్రత్యేక స్మారక నాణాన్ని విడుదల చేసి ఆయనకు నివాళులు అర్పించింది. (భారతదేశంలో ఆయన జన్మదినం 2018 మొదట్లో ప్రారంభించి ఈ సంవత్సరంలోకి పొడిగిస్తూ గౌరవపురస్కారంగా జరుపబడింది.) అక్టోబరు 29, 2019లో న్యూఢిల్లీ లోని సెంట్రల్ సెక్రెటేరియట్ లో జరిగిన ఈ వేడుకకు ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల రాష్ట్రమంత్రి శ్రీ అనురాగ్ ఠాకుర్, సాంస్కృతిక సెక్రటరీ శ్రీ అరుణ్ గోయల్, ఇతర ప్రభుత్వ అధికారులు ఆమెతోపాటు వేడుకలో పాల్గొన్నారు.

ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ (మధ్యలో), ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల రాష్ట్రమంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ (కుడివైపు నుంచి రెండవ వారు), సాంస్కృతిక సెక్రెటరీ శ్రీ అరుణ్ గోయెల్ (కుడివైపు), స్వామి విశ్వానంద (ఎడమ నుంచి రెండవ వారు), స్వామి స్మరణానంద (ఎడమవైపు) న్యూఢిల్లీ లోని సెంట్రల్ సెక్రెటేరియట్ వద్ద అక్టోబరు 29, 2019న పరమహంస యోగానందగారి గౌరవార్థం ఒక స్మారక నాణెం విడుదల సమయంలో.

పరమహంస యోగానందగారు ప్రపంచ సామరస్యం గురించి తెలియజేసే ఒక సార్వత్రిక సందేశాన్ని అందించిన గొప్ప యోగి అని ఆర్థికమంత్రి సీతారామన్ గారు ప్రకటించారు. “మనందరి హృదయాలకు, మనస్సులకు సామరస్యాన్ని కొని తెచ్చిన ఈ గొప్ప దైవపుత్రుని గురించి భారతదేశం చాలా గర్వంగా భావిస్తో౦దని” ఆమె అన్నారు.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ వారి డైరక్టర్ల మండలిలో సభ్యులైన స్వామి విశ్వానంద, యోగదా సత్సంగ సొసైటీకి ఉపాధ్యక్షులైన స్వామి స్మరణానంద గార్లు ఆర్థిక మంత్రి సీతారామన్ నుంచి కొత్త నాణాన్ని అందుకున్నారు. భారతదేశపు గొప్ప ఆధ్యాత్మిక దిగ్గజాలలో ఒకరుగా పరమహంస యోగానందగారి పాత్రను భారత ప్రభుత్వం గుర్తించినందుకు వారిద్దరూ గాఢంగా ప్రశంసించారు. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులైన స్వామి చిదానంద గిరి గారు వ్రాసి పంపిన సందేశాన్ని కూడా స్వామి విశ్వానంద చదివారు. (కింద ఇచ్చిన పూర్తి సందేశాన్ని చదవండి.) ఈ చరిత్రాత్మక ఘటనలో పాల్గొనడానికి అనేకమంది వై.ఎస్.ఎస్. భక్తులు, సామాన్య ప్రజలు కూడా హాజరయారు.

భారత ప్రభుత్వం పరమహంస యోగానందుల వారికి అధికారికంగా మూడవసారి నివాళులర్పించడానికి గుర్తు స్మారకనాణెం. ఆయన భారతదేశానికి, ప్రపంచానికి చేసిన ఆధ్యాత్మిక సేవలను గుర్తించి భారత ప్రభుత్వం రెండుసార్లు స్మారక తపాలా బిళ్ళలను విడుదల చేసింది: 1977లో శ్రీ యోగానందుల వారి వర్థంతి యొక్క ఇరవై ఐదవ వార్షికోత్సవ సందర్భంలో, 2017లో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వారి శతాబ్ది వార్షికోత్సవం సందర్భంలో.

பரமஹம்ஸ-யோகானந்தர்-நினைவு நாணயம்_SRN9105-1

పరమహంస యోగానందగారి 125వ జయంతి వార్షికోత్సవం స్మారక చిహ్నంగా విడుదల చేయబడిన 125 రూపాయల విలువ కలిగిన కొత్త నాణెం ముందు, వెనుక దృశ్యము. భారతదేశంలో పరమహంసజీ సందేశం, బోధనల ప్రయోజనకరమైన ప్రభావాన్ని మరింత పెంచడం కోసం భారత ప్రభుత్వం 2018 మొదలు అనేక ప్రాజెక్టులకు విరాళాలివ్వడానికి పెద్ద మొత్తాన్ని మంజూరు చేసి ఈ వార్షికోత్సవాన్ని గౌరవించింది. గత సంవత్సరం ఈ స్మారకనాణెం కోసం ప్రణాళికలు వేయడం జరిగింది; అక్టోబరు 29, 2019న నాణెం విడుదలతో అవి విజయవంతంగా నెరవేరాయి.

స్మారకనాణెం కొనుగోలుకై అందుబాటులో ఉంచడం

కొనుగోలుకై పరిమిత సంఖ్యలో స్మారకనాణాలు తొందరలోనే అందుబాటులోకి వస్తాయి. అవి అందుబాటులోకి రాగానే వాటిని ఏ విధంగా కొనుగోలు చేయాలన్న సమాచారాన్ని వీలైనంత తొందరలో మీతో పంచుకుంటాము.

అక్టోబరు 29, 2019వ తేదీ స్వామి చిదానందజీ ఇచ్చిన పూర్తి సందేశం

నాణేల విడుదలపై స్వామి చిదానందగారి సందేశం

“మనమందరమూ ఒకే భగవంతుని సంతానమని, మనందరి శ్రేయస్సు కోసం మనం స్నేహంగా, శాంతితో, సామరస్యంతో జీవించాల్సిన అవసరం ఉందనే నిత్యసత్యం ఆధారంగా జనులందరిలో ఒక సౌభ్రాతృత్వ భావాన్ని వ్యాపింపజేయాలని పరమహంసజీ కోరుకున్నారు.” — స్వామి చిదానంద గిరి

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి 125వ జయంత్యోత్సవాన్ని జరుపుకోడం కోసం ఒక స్మారక నాణాన్ని విడుదల చేస్తున్న శుభసందర్భంలో మీకందరికీ సాదర అభినందనలు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థలకు చెందిన భక్తులందరి తరఫున, “వసుధైవ కుటుంబం” (“ప్రపంచమంతా ఒకే కుటుంబం”) అనే ఆదర్శాన్ని నమ్మిన వారందరి తరఫున సనాతన భారతదేశపు ఆధ్యాత్మిక నిధులను ప్రపంచంలోనికి తీసుకురావడానికి భగవంతుడిచే నిర్దేశించబడిన గొప్ప సాధు పుంగవులలో ఒకరికి ఈ విధంగా నివాళులర్పించిన పూజనీయులైన ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సంస్థల స్థాపకులు, గురుదేవులు, పడమటి దేశాలలో యోగానికి తండ్రిగా పిలువబడుతున్న పరమహంసజీ ఎటువంటి జగద్గురువుల పరంపరకు చెందిన వారంటే, వారి సందేశం సార్వజనీనమైనది, భారతదేశపు అన్నిటినీ కలుపుకునే స్ఫూర్తికి, హృదయానికి ప్రాతినిధ్యం వహిస్తూ దేశ, మతాల సీమలన్నిటికీ చేరువయింది.

మనమందరమూ ఒకే భగవంతుని సంతానమని, మనందరి శ్రేయస్సు కోసం మనం స్నేహంగా, శాంతితో, సామరస్యంతో జీవించాల్సిన అవసరం ఉందనే నిత్యసత్యం ఆధారంగా జనులందరిలో ఒక సౌభ్రాతృత్వ భావాన్ని వ్యాపింపజేయాలని పరమహంసజీ కోరుకున్నారు. ప్రతి ఆత్మలోనూ, ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని చూడడంలోని, భగవంతుని సృష్టిలోని వారందరినీ గౌరవంతో పూజ్యభావంతో చూడడంలోని ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఆ ఆదర్శాన్ని అనుసరిస్తూ, మానవాళిని తన పెద్ద స్వరూపంగా భావిస్తూ సేవించమని మనం శ్రద్ధ వహించే సమూహాన్ని పెంచుకుంటూ తద్ద్వారా స్వయంగా మన చైతన్యాన్ని విస్తరింప జేసుకోమని ఆయన తన శిష్యులను ప్రోత్సహించారు. వై.ఎస్.ఎస్. భక్తులు చేపడ్తున్న అనేక ధార్మిక కార్యక్రమాలు — ఆస్పత్రులు, క్లినిక్ లు, స్కూళ్ళు, కాలేజీలు, ప్రకృతి వైపరీత్యాలకు గురైన వారికి సహాయాన్ని అందించడం వంటివి — ఈ ఆదర్శం యొక్క ప్రత్యక్ష నిదర్శనాలు.

మానవాళికి మన గురుదేవులు అందించిన అతి గొప్పసేవ ఏదంటే, భారతదేశపు సనాతనము, పవిత్రము అయిన క్రియాయోగ శాస్త్రాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేయమని ఆయనకు ఇవ్వబడిన బృహత్కార్యము; దానిని విశ్వసనీయంగా సాధన చేయడం ద్వారా భూగోళమంతా విస్తరించిన ఆధ్యాత్మిక పిపాసులు ప్రత్యక్షంగా దైవానుసంధానం చేయడమనే అనుభవాన్ని పొందగలరు. ఆయన బోధలు జాతి, కుల, మత, జాతీయతలనే బేధభావం లేకుండా ఆసక్తి గల సాధకులందరికీ అందుబాటులో ఉన్నాయి, ఎందుకంటే మనం భిన్న మతములకు చెందిన వారమైనప్పటికీ, అన్ని గొప్ప మతముల పరమార్థం మన సమిష్టి లక్ష్యమైన దైవసాక్షాత్కారం వైపు నడిపించడమే. ధ్యానంలో భగవంతునితో ఆంతరిక అనుసంధానం వల్ల లభించే దైవచైతన్యపు సంయోగం ద్వారా ఆయన సంతానం, తమలో ఒకరితో ఒకరికి గల అనుబంధాన్ని మరింత బాగా అర్థం చేసుకోగలరని, ఆ విధంగా ఈ ప్రపంచంలో గొప్ప సామరస్యంతో నిండిన యుగాన్ని ఆవిర్భవింప జేయవచ్చునని పరమహంసజీ ముందే గ్రహించారు.

పూజనీయులైన ఆర్థికమంత్రిగారిచే ఈ స్మారకనాణెం విడుదల, అందరి హృదయాలలో ఉన్న భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకోడమనే లక్ష్యం వైపు చేసే ప్రయాణంలో ఒక మైలురాయిగా సకాలంలో గుర్తించడమే.

ప్రపంచ వ్యాప్తమైన భగవంతుని కుటుంబంలో ఆయన సామరస్య పూర్వక ప్రభావాన్ని వ్యాప్తి చేసున్న వారందరినీ భగవంతుడు దీవించును గాక!

స్వామి చిదానంద గిరి

అధ్యక్షులు, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్

ఇతరులతో షేర్ చేయండి