క్రియాయోగం — నిత్య నవీన ఆనందానికి సాధనం అనే అంశంపై శ్రీ పరమహంస యోగానంద

16 ఆగస్టు, 2023

ఒక పరిచయం:

జ్ఞాన నేత్రాలతో చూసినప్పుడు — మనలోని ప్రతి ఒక్కరి జీవితాలు ఎంతో భిన్నంగా కనిపించినప్పటికీ, మనమందరం అన్వేషిస్తున్నది ఒక్కటే. “ఆహ్లాదకరమైన ఆ ఆనందం భిన్నంగా ఉన్నప్పటికీ దాని స్వభావంలో మార్పు ఉండదు,” పరమహంస యోగానందగారు ఇలా అన్నారు, “ప్రతి ఒక్కరూ కోరుకునే అంతర్గత అనుభవం ఇదే.”

సమస్య ఏమిటంటే, మనము ఎక్కువగా ఆ రకమైన శాశ్వతానందం కోసం తగని స్థానాలలో అన్వేషిస్తున్నాము. ఒక కోరికను మనం తీర్చుకోగానే దానితో పాటు వచ్చే ఆనందం క్షీణించగానే కొత్త కోరిక మరొకటి ఉద్భవిస్తుంది. మనము గొప్ప సంపదని లేక విజయాన్ని సాధించవచ్చు. కాని అప్పుడు కూడా “ఇంకేదో కావాలి” అనే మన లోతైన వాంఛ అలాగే ఉందని గ్రహిస్తాము.

ఈ జీవితంలో ఆ ఆశ తీరుతుందా? అన్ని ఆధ్యాత్మిక మార్గాలకు చెందిన మహాత్ములు ఆనందం మన జన్మహక్కని తెలిపారు, ఎప్పటికీ విసుగు చెందని ఆ ఆనందాన్ని పొందడం నిజంగా సాధ్యమేనా?

ప్రతిరోజూ ధ్యానానికి సంబంధించిన శాస్త్రాన్ని — క్రియాయోగం — సాధన చేయడం ద్వారా మీకు మీరే ఆ శాశ్వతమైన ప్రశ్నకు ఎలా ఖచ్చితంగా సమాధానం పొందగలరో పరమహంసగారు వివరిస్తున్నారు. ఈ ఆధునిక యుగంలో వారి ప్రఖ్యాత గురుపరంపర ద్వారా క్రియాయోగం పునరుద్ధరించబడింది.

ఆంతరికంగా వెళ్ళే ఆ దశల వారీ పద్ధతి ద్వారా, చంచలమైన ఆనందాల యొక్క దీర్ఘకాల తప్పుడు వాగ్దానాలను మించి కోరుకునేవారు ఆత్మను నిత్యనవీన ఆనందంగా క్రమంగా నిరూపించుకుంటారు — ఆ తరువాత ఆ ఆనందం జీవితంలోని అన్ని రంగాలలోకి వెల్లువలా ప్రవహింపజేస్తారు.

పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:

మనమందరం ఆనందాన్ని కోరుకుంటున్నాం, వచ్చి వెళ్ళిపోయే ఆనందం కాదు. మనం శాశ్వత ఆనందాన్ని కోరుకుంటున్నాము — ఎల్లప్పుడూ నూతనమైనది మరియు మనతో నిత్యమూ ఉండే ఆనందం. పాతబడే ఆనందం మనకు అవసరం లేదు. నిత్యనవీన ఆనందమే మనకు కావాలి.

క్రియాయోగంలో పొందే గొప్ప ఆధ్యాత్మిక ఆనందాన్ని మించిన ఏ ఆనందమూ ఈ ప్రపంచంలో నేను పొందలేదు. పశ్చిమ దేశాలలోని సుఖాలన్నిటి కోసం లేదా ప్రపంచంలోని బంగారం అంతటి కోసమైనా కూడా నేను దానిని వదులుకోలేను. నా ఆనందాన్ని ఎల్లప్పుడూ నాతో తీసుకువెళ్ళడం క్రియాయోగం ద్వారా సాధ్యమేనని నేను కనుగొన్నాను.

క్రియాయోగాన్ని, గాఢంగా సాధన చేసినప్పుడు, శ్వాసను మనస్సులో, మనస్సుని సహజావబోధంలో, సహజావబోధాన్ని ఆత్మ యొక్క ఆనందకరమైన అనుభూతిలో, మరియు ఆత్మను పరమాత్ముడి విశ్వానందంలో లయం చేస్తుంది.

మీరు చేసే ప్రతి మంచి చర్య, మీ చైతన్య నేలను ఒక గునపములా తవ్వి దేవుని ఆనందపు ఊట నుండి కొద్దిగా ఆనందాన్ని వెదజల్లుతుంది. కాని మంచి చర్య యొక్క అత్యున్నత రూపం అయిన ధ్యానం యొక్క గునపం, మన చైతన్యం యొక్క అంతర్గత ఉపరితలాన్ని తెరచి మన జీవితం యొక్క ఆనందాన్నంతా వెదజల్లుతుంది.

ఆత్మను పరమాత్మతో ఏకం చెయ్యడమే యోగం — ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆ గొప్ప ఆనందంతో పునఃకలయిక. ఇది అద్భుతమైన నిర్వచనం కాదా? పరమాత్మ యొక్క నిత్యనూతన ఆనందంలో మీరు అనుభవించే ఆనందం, మరే ఇతర ఆనందం కంటే కూడా గొప్పదని మీరు నమ్ముతారు, మరియు మిమ్మల్ని ఏదీ ఇక పడదోయదు.

నేను న్యూయార్క్‌లో ఒక గొప్ప సంపన్న వ్యక్తిని కలిశాను. తన జీవితం గురించి నాతో సుదీర్ఘంగా మాట్లాడుతూ ఆయన ఇలా అన్నాడు, “నేను వెగటు పుట్టేటంత ధనం సంపాదించాను, వెగటు పుట్టేటంత ఆరోగ్యంగా ఉన్నాను,” — ఆయన పూర్తి చేయక ముందు నేను ఇలా అన్నాను, “అయితే మీరు వెగటు పుట్టేటంత సంతోషంగా లేరు! నిత్యము సంతోషంగా ఉండటానికి నిరంతరం ఆసక్తిగా ఎలా ఉండాలో నేను మీకు నేర్పించగలను.” ఆయన నా విద్యార్థి అయ్యాడు. క్రియాయోగాన్ని అభ్యసించడం ద్వారా, మరియు సమతుల్య జీవితాన్ని గడపడం ద్వారా, ఆంతరికంగా ఎప్పుడూ దేవుని యందు భక్తి కలిగి ఉండి, నిత్యనవీన ఆనందంలో ఓలలాడుతూ ముసలితనం పండే వరకు ఆయన జీవించాడు.

పరమహంస యోగానందగారి ప్రసంగం నుండి ఒక సారాంశాన్ని చదవమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము, సాధారణ చైతన్య స్థితులకు మరియు ఆంతరికంగా అనుభవించే ఆత్మ యొక్క నిత్యనవీన ఆనందానుభవం మధ్య వ్యత్యాసాన్ని అది మరింతగా వివరిస్తుంది.

నిజమైన ఆనందం మరియు సంపూర్ణ చైతన్య పరివర్తన తీసుకువచ్చే క్రియాయోగ శక్తి గురించి పరమహంస యోగానందగారి సందేశాన్ని వినండి.

ఇతరులతో షేర్ చేయండి