స్వామి శాంతానంద గిరి: జ్ఞాపకార్థం

05 జనవరి, 2023

60 సంవత్సరాలకు పైగా పరమహంస యోగానందగారి సన్యాస శిష్యులైన మన పూజ్య స్వామి శ్రీ శాంతానంద గిరి, లాస్ ఏంజిలిస్ లోని సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో బుధవారం, జనవరి 4 (పసిఫిక్ కాలమానం ప్రకారం), 2023 నాడు ప్రశాంతంగా పరమపదించారు.

స్మారక సేవా కార్యక్రమం

అసంఖ్యాక సభ్యులకు, మిత్రులకు ప్రేరణనిచ్చి, నిస్వార్ధంగా గురుదేవుల కార్యాచరణకు అంకితమైన ఈ ప్రియతమ శిష్యుడిని సంస్మరించుకోవడానికి జనవరి 26, గురువారం నాడు స్వామి శాంతానందగారి స్మారక సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన రాంచీ ఆశ్రమం నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైన ఈ కార్యక్రమానికి స్వామి సుద్ధానంద గిరి నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో అనేకమంది వై.ఎస్.ఎస్. స్వాములతో పాటు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్న శ్రీమతి రత్నా చతుర్వేది మరియు డాక్టర్ కె.వి.రామారావు స్వామీజీ సేవలను ప్రస్తుతించారు.

“ఒక ఆనంద ఇతిహాసం”

పలు ప్రశంసల పిమ్మట, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి, స్వామి శాంతానందగారి గురించి ఉద్వేగభరితమైన విషయాలను పంచుకున్నారు. వారి నివాళిలోని కొన్ని అంశాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి:

నాతో సహా — మనలో చాలా మందికి — అత్యంత ప్రియమిత్రుడైన మన ప్రియతమ స్వామి శాంతానందగారి స్ఫూర్తి మరియు వారి దివ్య గుణాల తలంపుతో నా హృదయం నిండిపోయింది.

“స్వామీజీ జీవితం గురించి, భక్తులు పంచుకున్న అనేక కథలు, వృత్తాంతాలు, జ్ఞాపకాలను తలచుకున్నపుడు, మన దివ్య గురుదేవులు తన కార్యాచరణ అభివృద్ధి, వికాసం గురించి గుర్తుచేసుకుంటూ చెప్పిన ఒక విషయం గుర్తుకు వస్తుంది: ‘ఇది ఒక ఆనంద ఇతిహాసం.’ 1952లో శ్రీ పరమహంసగారు తన భౌతిక రూపాన్ని విడిచిపెట్టడంతో ఆ ‘ఆనంద ఇతిహాసం’ ఆగిపోలేదు. ఆ ఇతిహాసం కొనసాగింపబడుతోంది; మన ప్రియతమ స్వామీజీ చూపిన అద్భుతమైన ప్రభావానికి నివాళులు వింటున్నపుడు ఎవరైనా ఇటువంటి భావన పొందకుండా ఉండలేరు. అందుకే మన ప్రియ స్వామీజీకి ఆ ఇతిహాసంలో ఒక చిరస్మరణీయమైన స్ఫూర్తిదాయకమైన అధ్యాయం ఉంది.

“శిష్యుడిగా, క్రియాబాన్‌గా, యోగిగా, భగవంతుని ప్రేమికునిగా మరియు గురుదేవుల భక్తునిగా – ఉదాహరణగా నిలిచిన ఆయన స్ఫూర్తిని తలచుకొన్నపుడు — మన ప్రియతమ స్వామీజీని ప్రతిబింబించే జ్ఞానం, ఆనందం మరియు ప్రేరణల స్వభావమున్న ప్రతి భక్తుడు ఎంత అద్భుతమైన, అందమైన జీవితాన్ని గడపగలడో తెలుస్తుంది: స్వీయ-విస్మృతి — భగవంతుని మరియు గురుదేవుల దివ్య ప్రేమ, జ్ఞానం, ఆనందం మరియు ప్రేరణలు ప్రవహించే మార్గానికి తనను తాను ప్రక్కన పెట్టుకోవడం. స్వీయ-విస్మృతి ద్వారా వచ్చే దివ్యశక్తి కేవలం స్వామీజీలు, సన్యాసులు మాత్రమే అనుభవించగలిగేది కాదు. ఇది ఈ మార్గాన్ని అనుసరించే ప్రతి భక్తుని కోసం. మనం భగవంతునికి, గురుదేవులకు ఎంత తరచుగా: ‘నా సంకల్పం కాదు, నీ సంకల్పమే నెరవేరనీ; నీ అభీష్టం ప్రకారమే నన్ను వినియోగించు,’ అని చెబుతామో అంత ఎక్కువ అనుభూతి పొందుతాము. స్వామీజీ యావత్ జీవిత నిరంతర ప్రార్థనా ప్రామాణ్యములే వారి దివ్యజ్ఞానం యొక్క ఆధ్యాత్మిక శక్తి.”

వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో జరిగిన స్వామి శాంతానందగారి సంస్మరణ సభలో వై.ఎస్.ఎస్./ఎస్.అర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు ప్రసంగించారు.

భగవంతుని పట్ల అచంచల భక్తి మరియు శ్రీ పరమహంస యోగానందుల క్రియాయోగ బోధనల గురించి తన అనర్గళ జ్ఞాన వివరణలకుగాను స్వామి శాంతానందగారు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు మరియు సన్యాసులచే అమితంగా గౌరవించబడి, వారి హృదయాలలో స్థానం పొందారు.

భారతదేశంలోని శ్రీ పరమహంస యోగానందుల — యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) కార్యాచరణ కోసం — దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఇక్కడే నివసించి, వై.ఎస్.ఎస్. పాలనా పర్యవేక్షణ, ప్రచురణలు, విద్య, న్యాయ, కేంద్ర మరియు ఆర్థిక విభాగాలలో అచంచలమైన అంకితభావంతో సేవలందించినందుకు ఆయన విశేషముగా గుర్తించబడతారు.

ప్రారంభ జీవితం

కాలిఫోర్నియాలోని ఆంటియోచ్‌లో జూలై 28, 1932న పాల్ స్టీల్ ఫ్లీట్‌వుడ్‌గా జన్మించిన స్వామి శాంతానంద సంతోషకరమైన మరియు సామరస్యపూర్వక బాల్య జీవితాన్ని గడిపారు, 1950లో కాలిఫోర్నియాలోని కాంకర్డ్ లో ఉన్నత పాఠశాల నుండి పట్టభద్రుడయ్యారు. ఆయన 1954లో బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి రసాయన (కెమికల్) ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు మరియు కొలరాడోలోని గ్రీలీలో కొలరాడో రాష్ట్ర కళాశాల నుండి భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.

ప్రతిభావంతమైన ఉన్నత విద్య కలిగినప్పటికీ, స్వామి శాంతానంద యొక్క ప్రధానమైన ఆకాంక్ష ఏమిటంటే దైవసాక్షాత్కారం పొందిన ఒక గురువు ఆశ్రమంలో చేరడం. ఇది 1960లో లాస్ ఏంజిలిస్ లోని ఎస్.ఆర్.ఎఫ్. సన్యాస మార్గంలో చేరడానికి దారితీసింది. సన్యాసిగా మారడం కోసం ఇచ్చిన దరఖాస్తుపై ఆయన ఇలా వ్రాశారు: “నా అల్పమైన శక్తి సామర్థ్యాలతోనే నేను భగవంతుణ్ణి అన్వేషించాలి.”

భారతదేశంలోని సంవత్సరాలు

1963లో ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో బ్రహ్మచర్య ప్రమాణాలను స్వీకరించిన తరువాత శాంతానందగారిని శ్రీ దయామాతగారు వై.ఎస్.ఎస్. రాంచీ మరియు దక్షిణేశ్వర ఆశ్రమాలలో నివసించడానికి పంపారు. అక్కడ ఆయన అవిశ్రాంతంగా మరియు సంతోషంగా సేవలందించారు (2011 తరువాత, ఆయన లాస్ ఏంజిలిస్ లోని ఎస్.ఆర్.ఎఫ్. ఆశ్రమ కేంద్రాలకు తిరిగి వచ్చారు). 1971 జూలై 4న సన్యాసుల అంతిమ ప్రమాణాలను ఆయన స్వీకరించారు.

స్వామి శాంతానందగారు భారతదేశంలో ఉన్న అనేక సంవత్సరాలలో శ్రీ దయామాతగారి నుండి మార్గదర్శకత్వం మరియు దిశానిర్దేశాన్ని తరచుగా పొందేవారు. శ్రీ దయామాతగారి అనేక భారతదేశ పర్యటనల సమయంలో ఆమెతో మరియు ఇతర సహాయకులతో కలిసి ఆయన ప్రయాణించారు, మరియు శ్రద్ధాళువైన ఆయన సహాయంపైనే ఆమె ఎక్కువగా ఆధారపడేవారు. అంతేకాక, భారతదేశంలో శ్రీ పరమహంసగారి కార్యాచరణాభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను చర్చించడానికి దాదాపు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆమెను కలవడానికి ఆయన లాస్ ఏంజిలిస్ కు వెళ్ళేవారు. ఆ విధంగా స్వామి శాంతానందగారు, ఇప్పుడు వర్ధిల్లుతున్న వై.ఎస్.ఎస్. సన్యాస వ్యవస్థను దృఢమైన పునాదిపై ఏర్పాటు చేయడంలో సహాయపడ్డారు, అలాగే ఇప్పటి పటిష్టమైన ఆధ్యాత్మిక సమాజంగా వై.ఎస్.ఎస్. ను రూపొందించడంలో ఆయన ముఖ్య పాత్రను పోషించారు. దయామాతగారి మార్గదర్శకత్వంలో, ఆయన 1972 నుండి వై.ఎస్.ఎస్. బోర్డు నిర్వాహకులలో ఒకరిగా పనిచేశారు, మరియు 2011 వరకు సంయుక్త ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా కూడా పనిచేశారు. 2020 వరకూ ఆయన వై. ఎస్.ఎస్. బోర్డు డైరక్టర్లలో సభ్యునిగా పనిచేశారు.

స్వామి శాంతానంద (ఎడమ వైపు చివర) 1972లో స్వామి శరణానంద, శ్రీ దయామాత, శ్రీ ఆనందమాత, స్వామి అచలానందలతో (ఎడమ నుండి కుడికి) కలసి హిమాలయ శిఖరాలను వీక్షించారు.
శ్రీ దయామతగారు మరియు వై.ఎస్.ఎస్. ప్రధాన కార్యదర్శి శ్రీ సోవెన్ సి. రాయ్ తో శ్రీ స్వామి శాంతానంద. భారతదేశంలో శ్రీ పరమహంస యోగానందగారి బోధనల వ్యాప్తికి సంబంధించి చర్చించేందుకు, అంతర్జాతీయ ప్రధాన కార్యాలయములో ఆరు వారాల పాటు నివసించినప్పుడు, శ్రీ దయామాత మరియు ఇతర ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. బోర్డు డైరెక్టర్ల సభ్యులతో సమావేశమయ్యారు.

భారతదేశంలో శ్రీ పరమహంసగారి కార్యాచరణాభివృద్ధిని గుర్తు చేసుకుంటూ, స్వామి శాంతానందగారు ఇలా అన్నారు, “దృఢమైన పునాదిపై వై.ఎస్.ఎస్. ను స్థాపించడమే దయామాతగారి ఐదు సందర్శనల యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అయితే, దయామాతగారు భారతదేశంలో [1959లో] అడుగుపెట్టినప్పుడు ఈ ఉదాత్తమైన ప్రయత్నానికి విజయం చాలా దూరంలో ఉంది. కొన్ని వారాల్లోనే అనేక పరిపాలనా సమస్యలు పరిష్కరించడం కోసం సరైన వ్యక్తులను కనుగొనాల్సి ఉందని ఆమె గ్రహించారు.”

దయామాతగారి నిరంతర ప్రేరణ మరియు మార్గదర్శకత్వంలో వై.ఎస్.ఎస్. ను పునరుద్ధరించిన హంస స్వామి శ్యామానంద గిరి (1911 – 1971) అని పిలవబడే శ్రీ వినయ్ నారాయణ్ దుబే “సరైన వ్యక్తి”గా కనుగొనబడ్డారని స్వామి శాంతానందగారు వివరించారు. ఆ సమయంలో, స్వామి శ్యామానంద పరమపదించిన తర్వాత వై.ఎస్.ఎస్. పరిణామంలో తాను పోషించబోయే అమూల్యమైన పాత్రను స్వామి శాంతానందగారు గ్రహించలేదు: “మాలో కొంతమంది యువకులు యోగాచార్యగారికి [స్వామి శ్యామానంద] సహాయకులుగా ఉన్నాము. ఆయన దార్శనికత మరియు లక్ష్యం పట్ల వారి అంకితభావం నుండి మేము చాలా నేర్చుకున్నాము. 1971లో ఆయన పరమపదించిన పిమ్మట కూడా, వై.ఎస్.ఎస్. విజయ సాధనకు ఆయన ప్రారంభించిన మరియు నిర్దేశించిన మార్గాన్ని మాత్రమే అమలు చేయాలని మాకు తెలుసు.”

స్వామి శ్యామానందగారు పరమపదించిన తర్వాత, వై.ఎస్.ఎస్. దైనందిన కార్యకలాపాలు మరియు పరిపాలన యొక్క ప్రధాన బాధ్యతలు, ఇద్దరు యువ సన్యాసులైన స్వామి భావానందగారు (2010లో పరమపదించారు) మరియు స్వామి శాంతానందగారి భుజాస్కందాలపై పడ్డాయి.

వై.ఎస్.ఎస్. ప్రధాన కార్యదర్శిగా స్వామి శాంతానందగారికున్న అనేక బాధ్యతలతో పాటు భారత ప్రభుత్వం మరియు అనేక ఇతర సంస్థలతో అసంఖ్యాకమైన అధికారిక చర్చలలో వై.ఎస్.ఎస్. ప్రతినిధిగా సేవలందించారు.

అటువంటి సంఘటనలో ఒకటి కలకత్తాలోని మదర్ థెరిసా 1993లో జరిగిన అల్లర్లలో పేదరికంలో ఉన్న బాధితుల సహాయం కోసం బహిరంగంగా విజ్ఞప్తి చేయడం. స్వామి శాంతానందగారి మార్గనిర్దేశంలో, అల్లర్లలో దెబ్బతిన్న అనేక ఇళ్లను బాగు చేయడం ద్వారా వై.ఎస్.ఎస్. ప్రతిస్పందించింది. వై.ఎస్.ఎస్. సహాయ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మదర్ థెరీసా, సెయింట్ ఫ్రాన్సిస్ యొక్క చక్కని ప్రార్థనను చదవమని స్వామి శాంతానందగారిని అభ్యర్థించారు, “ప్రభూ, నన్ను నీ శాంతి ఉపకరణముగా చెయ్యి” (పై ఫోటో చూడండి).

దాదాపు వంద ఇళ్లకు కొత్త పైకప్పులను వై.ఎస్.ఎస్. నిర్మించిన తరువాత మదర్ థెరిసా ఈ క్రింది ప్రశంసా పత్రాన్ని పంపించారు: “ప్రియమైన స్వామి శాంతానంద గిరి, తంగ్రాలోని మన పేదవారి ఇళ్లను బాగు చేయడం ద్వారా మీరు వారి పట్ల చూపించిన ప్రేమకు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీకు మరియు మీకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎం. థెరీసా, ఎం. సి.”

“అందరికీ ప్రేమను అందించడానికి నా వంతు కృషి నేను చేశాను”

ఆశ్రమంలో స్వామీజీ 50వ వార్షికోత్సవం సందర్భంగా 2010లో శ్రీ దయామాత ఇలా అన్నారు: “మీరు భగవంతుడిని, గురుదేవులను అచంచల ఉత్సాహంతో, విశ్వాసంతో ప్రేమిస్తూ సేవ చేశారు, ఇన్నేళ్లుగా పూర్తి చిత్తశుద్ధితో మరియు నిబద్ధతతో ఆశ్రమ జీవితాన్ని గడిపినందుకు మిమ్మల్ని వారు సదా ఆశీర్వదిస్తున్నారని నాకు తెలుసు.”

ఎస్.ఆర్.ఎఫ్. ఉపాద్యక్షులు, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. బోర్డు డైరక్టర్లలో ఒకరైన స్వామి విశ్వానంద మాట్లాడుతూ, “వై. ఎస్.ఎస్. ఇంత గొప్పగా అభివృద్ధి చెందడానికిగల కొన్ని ప్రధాన కారణాలను గుర్తించేందుకు, స్వామి శాంతానందతో సహా అనేక మంది వై.ఎస్.ఎస్. అగ్ర సన్యాసులను తమ అభిప్రాయాలను తెలుపమని కోరాను. వై.ఎస్.ఎస్. పాలనా వ్యవహారాలలో, దాదాపు అన్ని రంగాలలో ఆయనకున్న అపార అనుభవంతో సుదీర్ఘమైన, సవివరమైన విశ్లేషణ ఆయన ఇస్తారని ఆశించాను. బదులుగా, ఆయన ప్రతిస్పందన ఇది:

“‘మన గురుదేవుల ఆదేశానుసారం, అందరికీ ప్రేమను పంచడానికి, దేవుని ప్రేమను అనుభవించడానికి మరియు ప్రతి ఒక్కరిలో దేవుని ఉనికిని చూడటానికి నేను నా వంతు కృషి చేశాను. ఇన్నేళ్ళూ జగన్మాత మరియు గురుదేవుల క్రియాశీల భాగస్వామ్యంతోనే ఇంత అందంగా ఇది సాధ్యమయ్యింది.’

“ఎంతో అందంగా ఉంది కదా? ‘ప్రేమ మాత్రమే నా స్థానాన్ని భర్తీ చేయగలదు’ అనే గురుదేవుల వాక్కులలో, అంతర్లీనంగా ఉన్న సూచనను ఆయన హృదయానికి తీసుకున్నారు.”

శాంతి, నిత్యానందపు భగవంతుని ఆవాసములో తన గురుదేవులలో ఐక్యమైన మన ప్రియతమ స్వామి శాంతానందకు మన ప్రగాఢమైన ప్రేమ, కృతజ్ఞతలను తెలియజేసేందుకు దయచేసి మాతో చేరండి.

ఇతరులతో షేర్ చేయండి