శ్రీ శ్రీ పరమహంస యోగానంద ఆశ్రమాల నుండి శ్రీకృష్ణాష్టమి సందేశం — 2023

26 ఆగష్టు, 2023

నీ మనస్సు నా మీద స్థిరంగా నిలుపు, నా భక్తుడివిగా ఉండు; అంతులేని ఆరాధనతో భక్తిపూర్వకంగా నాకు ప్రణమిల్లు. ఆ విధంగా నీ అత్యున్నతమైన ధ్యేయంగా నాతో నిన్ను ఏకం చేసుకొని, నువ్వు నా వాడవుగా ఉందువు.

గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత

ప్రేమాస్పదులారా,

శ్రీకృష్ణభగవానుని పుట్టినరోజు అయిన ఈ ఆనందకర జన్మాష్టమి సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా —సమస్తాన్ని తన ప్రేమలో ముంచివేసే ఆయన ప్రేమవైపు, సాంత్వన నిచ్చే ఆయన జ్ఞానం వైపు తిరిగి వారి హృదయాలను మళ్లించుకొంటున్న—లక్షలాది మందితో కలిసి ప్రార్థించే పావన అవకాశం మనకు లభించింది. అపజయవాదం మరియు మాయ మీద భగవద్దత్తమైన యోగశాస్త్రం ద్వారా ఆత్మ విజయాన్ని సాధించగలదనే భగవానుని అమర వాగ్దానం మన జీవితాలను దివ్యజీవితాలుగా మలచుకొనేలా మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక నూతన ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపు గాక!

భగవద్గీతలో కరుణాసముద్రుడైన పరమాత్మ శ్రీకృష్ణ భగవానుని ద్వారా శిష్యుడైన అర్జునుడికి—అన్ని యుగాలలోని సద్భక్తులకు—సరళమైన, అయినప్పటికీ విముక్తినిచ్చే ప్రగాఢమైన సలహాను అందచేశాడు: “నీ చైతన్యాన్ని నిరంతరం నా సంరక్షక సాన్నిధ్యంలో ఉంచు.” ధ్యానం ద్వారా మన హృదయాలను మనస్సులను మరల మరల ఆ శాశ్వత-ఆశ్రయంలోకి వెనుకకు తీసుకురావడం ద్వారా ఆత్మను అణిచిపెట్టే మాయాప్రభావాన్ని, అదే విధంగా మర్త్యపరిమితులకు మనం లోబడి ఉన్నామన్న మన భ్రాంతిపూర్వక ప్రవృత్తిని మనం తగ్గించుకుంటాం. అన్నిటికంటె ముఖ్యంగా, ఆ అంతర్ముఖమైన భక్తిదేవాలయంలో మన నిజజీవితాల కురుక్షేత్ర సంగ్రామంలో మనం ఆధారపడతగిన మిత్రుడు, మార్గదర్శి మరియు శ్రేయోభిలాషి అయిన ఒక “దివ్యస్నేహితుని”తో ఎంతో తృప్తినిచ్చే బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం.

ఆ యోగేశ్వరుని బేషరతైన ప్రేమ మరియు ఆశీస్సులు—ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగినా, తాత్కాలికంగా సంభ్రమానికి గురైన—అర్జునుడిని ఏ విధంగా పైకి లేవనెత్తి జాగృతి కలిగించాయో గీత వర్ణిస్తుంది. మనం జన్మాష్టమి జరుపుకుంటున్న ఈ తరుణంలో మీ స్వంత జీవితాలు కూడా ఆ విధంగానే మార్పు చెందాలని ప్రార్థిస్తున్నాను. మన గురుదేవులు పరమహంస యోగానందగారు ఈ ఆధునిక యుగంలో భగవంతుని విశ్వవ్యాప్త కుటుంబం కోసం ఎంతో ప్రేమగా బోధించిన కృష్ణభగవానుని పవిత్ర రాజయోగ ప్రక్రియలతో పాటు ఆత్మకు పునరుజ్జీవనమిచ్చే గీతాసత్యాల మీద వారి జ్ఞానస్ఫోరకమైన వ్యాఖ్యానాన్ని మీ గుండెలలో పదిలపరచుకొని ఆచరిస్తే, అది నిశ్చయంగా అలాగే జరుగుతుంది.

మన ముందు ఉన్నటువంటి అవకాశం ఎంత గొప్పది! అది మరచిపోవద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాను. విజయసాధనలో కృష్ణుడి మేటి శిష్యుడు అయిన అర్జునుని వలె మనలో ప్రతి ఒక్కరూ మొక్కవోని ధైర్యంతోనూ, సహజావబోధక అనుసంధానంతోనూ క్రియాత్మకంగా వ్యవహరించడం నేర్చుకోగలం; నేర్చుకొని మన సమకాలీన జీవితంలోని చీకటి-వెలుగుల పెనుగులాట యుద్ధరంగంలో మన స్వంత మోక్షసాధనలో సఫలత సాధించగలం.

ఈ ప్రపంచం మనకి ఇచ్చే ప్రతీ దాని కంటె కూడా భగవంతుని ప్రేమ మరింత సత్యమైనదనీ, ఇంకా శాశ్వతమనీ—నిరంతరం అందుబాటులో ఉండే ఆయన సహాయాన్ని, నమ్మదగిన ఆయన చెలిమిని, మన పట్ల ఎంతో శ్రద్ధ చూపించే ఆయన సాన్నిధ్యాన్ని మనం ఎల్లవేళలా అందుకోవచ్చుననే—ఈ ధ్యాన-జనిత జ్ఞానాన్ని మనలో ప్రతి ఒక్కరిలోనూ ఈ కృష్ణభగవానుని జన్మోత్సవం పునఃపరిపుష్టం చేయుగాక.

జై శ్రీకృష్ణ! జై గురు!

స్వామి చిదానందగిరి

ఇతరులతో షేర్ చేయండి