స్వామి చిదానంద గిరి నుండి నూతన సంవత్సర సందేశం – 2021

1 జనవరి, 2021

ప్రియతమ,

గురుదేవులు పరమహంస యోగానందుల ఆశ్రమాలలో ఉన్న మేమందరము మీకు – అలాగే ఆయన ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక కుటుంబంలోని మన ప్రియతమ స్నేహితులు ప్రతి ఒక్కరికీ సంపూర్ణ సంతోషకర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ నూతన ఆరంభాల సమయంలో, మేము మీ గురించి ప్రత్యేకంగా తలచుకుంటాం మరియు మీ స్వీయ విశ్వాసం, సంకల్పం మరియు భగవంతుని సహాయంతో మీరు మీ అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్యాలను చేరుకోగలరని మా ప్రార్థనలు అందిస్తున్నాము. ఈ పర్వదిన తరుణంలో మరియు ఏడాది పొడవునా మీ శుభాకంక్షలు, సందేశాలు మరియు బహుమతులకు నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ స్నేహం మరియు మద్దతు నాకు, సన్యాసులు మరియు సన్యాసినులు అందరికీ చాలా ముఖ్యమైనవి; అంతేకాక మీ జీవితాల్లో గురుదేవుల ఆదర్శాలను మీరు వ్యక్తపరిచే అనేకమగు రీతులను మేము అభినందిస్తున్నాము.

నిస్సందేహంగా గత సంవత్సరం ప్రపంచమంతా పెను సవాలు అయ్యింది. కానీ కష్టాలలో అంతర్లీనంగా, ఆధ్యాత్మిక పాఠం స్పష్టంగా కనిపిస్తుంది – ఈ భూమిపై విభేదాలకు శాశ్వతమైన స్వస్థత, భగవంతుడితో మన అంతర్గత అనుసంధానం ద్వారా మాత్రమే కానీ అది బాహ్య పరిష్కారాలలో మాత్రం కనుగొనబడదు. గత ఏడాది నిత్య తాత్విక నియమాలతో లోతైన అనుసంధానానికి అవసరమైన ప్రేరేణలతో పాటు, ఈ సంవత్సరం, క్రియాయోగ ధ్యానం యొక్క ఆత్మ-జాగృతి శాస్త్రాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలనే మన గురుదేవుల లక్ష్యం యొక్క శతాబ్ది వార్షికోత్సవం ఏకకాలమున జరగటం “దైవిక సమయానికి” ఒక ఉదాహరణ. మన ప్రపంచ నాగరికతను సమన్వయం చేయడానికి మరియు ఏకం చేయడానికి విశ్వ జనీన ఆధ్యాత్మికతా వ్యాప్తిని ప్రోత్సహించడానికి రాబోయే రోజుల్లో మనం చేయగలిగినదంతా చేద్దాం.

మనం ఈ కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్నప్పుడు, పరమహంసగారు ప్రపంచానికి ప్రసాదించిన ఆధ్యాత్మికత జాగృతం చేసే ధ్యాన పద్ధతులు మరియు బోధల పూర్తి ప్రయోజనాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని నా ప్రార్థన. ఇది మీ జీవితంలో ఒక నూతన ప్రయాణం కానివ్వండి; లోతుగా ధ్యాని౦చే౦దుకు మీ స్వీయ ఉత్సాహ౦ మరియు ప్రయత్నాలు మన మానవ జాతికి అత్యావశ్యకమైన సామరస్యం, జ్ఞానం, దివ్య ప్రేమలకు దోహదపడనివ్వ౦డి.

ఈ తాజా ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనకు అవసరమైన దివ్య బహుమతులను: స్వేచ్ఛానిర్ణయం యొక్క కానుకను అలాగే మన లక్ష్యాలను ప్రభావంతంగా సాధించుకొనే సంకల్ప శక్తిని భగవంతుడు మనకు ఇచ్చాడు. మ౦చి పనులు, నేర్చుకున్న పాఠాలు, గెలిచిన విజయాలు, ఎదురైన సవాళ్ల ను౦డి ధైర్య౦గా పొ౦దిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాల జ్ఞాపకాలతో మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవడానికి కొ౦త సమయ౦ నిశ్చల ఆలోచనలో ప్రతిబించ౦డి. మీ చైతన్యం నుండి గత దోషాలు మరియు స్వీయ లేదా ఇతరుల గురించిన ప్రతికూల ఆలోచనల యొక్క స్వీయ-పరిమిత “సామాను”ను తొలగించండి. ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్న కొత్త అవకాశాలపై దృష్టిని కేంద్రీకరించండి – మీరు చేయాలనుకుంటున్న సానుకూల మార్పులపై దృష్టి పెట్టండి. ఆశ యొక్క ఉత్తేజకరమైన తాజా గాలిని అనుభూతి చెందండి, అన్ని ఆందోళనలు మరియు స్వీయ-సందేహాలను తుడిచివేస్తూ, మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారని నిర్ధారించుకుంటూ, మీ ప్రయత్నాలను చురుకైన సంకల్పం మరియు విశ్వాసంతో నింపండి.

మన గురుదేవులు తన చుట్టూ ఉన్న భక్తులను “కుదరదు” అనే పదాన్ని ఉపయోగించడానికి అనుమతించలేదు. ఆయనిలా అనేవారు, “‘చేయలేను’ అనే పెంకును పగలగొట్టి ‘నేను చేయగలను’ అనే స్వేచ్ఛా వాయువు పీల్చండి.” భగవంతునికి మీపై నమ్మకం ఉంది; ఆయనకు మీ మీద విశ్వాసం ఉంది; మరి మీరు పట్టుదలతో, ఇంకా మీపై, మరియు మహాత్ముల సహాయం మరియు ప్రేమపై విశ్వాసం కలిగి ఉంటే, మీరు విఫలం కాబోరు. “కొత్త ఆశలతో నూతన సంవత్సర ద్వారాల్లోకి ప్రవేశించండి,” అని గురుదేవులు మనల్ని కోరారు. “మీరు దేవుని బిడ్డ అని గుర్తుంచుకోండి…. ఆయన నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తాడు. అదే తలచుకో. అదే నమ్ము. అపుడు అకస్మాత్తుగా ఒక రోజు మీరు దేవుని అమరత్వంలో జీవిస్తున్నానని కనుగొంటారు.”

ఈ నూతన సంవత్సరంలో భగవంతుడు మిమ్మల్ని మీ ప్రియతములను సదా ఆశీర్వదించు గాక,

స్వామి చిదానంద గిరి

కాపీరైట్ © 2020 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.

ఇతరులతో షేర్ చేయండి