పుంగనూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో PHDUని ఏర్పాటు చేసిన — యోగదా సత్సంగ ధ్యాన మండలి, (Y.S.D.M) తిరుపతి, ఆంధ్రప్రదేశ్

13 మే, 2022

ఏప్రిల్ 28, 2022న పుంగనూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో యోగదా సత్సంగ ధ్యాన మండలి — తిరుపతి (YSDM — తిరుపతి) వారు ఏర్పాటు చేసిన 10 పడకల ప్రత్యేక పీడియాట్రిక్ హై డిపెండెన్సీ యూనిట్ (PHDU)ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంధన, అడవులు, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగారు ప్రారంభించారు. ఈ ఆరోగ్య సంరక్షణ సదుపాయాన్ని రూపొందించడంలో చురుకైన పాత్ర పోషించిన భక్తులు, పుంగనూరు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ, ఆంధ్రప్రదేశ్‌ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

మార్చి 2020 నుండి, భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి, వై.ఎస్.ఎస్. దేశవ్యాప్తంగా అనేక సహాయ కార్యక్రమాలను నిర్వహించింది. వీటి గురించిన సంక్షిప్త వివరణ ఇక్కడ ప్రత్యేక బ్లాగులో చదవవచ్చు.

పిల్లల చికిత్స కోసం ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేయవలసిన అపారమైన ఆవశ్యకతను గ్రహించి, అంతకుముందు రాంచీలో వై.ఎస్.ఎస్. స్థాపించిన అటువంటి PHDU వార్డుల విజయవంతమైన ప్రభావాన్ని గమనించి, YSDM – తిరుపతి, పుంగనూరులో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోని ఒక విభాగాన్ని ప్రత్యేక 10 పడకల పీడియాట్రిక్ హై డిపెండెన్సీ యూనిట్ (PHDU) వార్డుగా మార్చడం జరిగింది. 2022 ప్రారంభంలో కోవిడ్-19 మూడవ దశ సమయములో , పిల్లలకు అధిక ప్రమాదమని అంచనా వేసి ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడము జరిగింది.

పుంగనూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రత్యేక హై డిపెండెన్సీ పీడియాట్రిక్ విభాగాన్ని ఏర్పాటు చేసిన YSDM - తిరుపతి

PHDU వార్డులో ఇప్పుడు అధిక-ఆధారిత పర్యవేక్షణ యూనిట్లు మరియు ప్రత్యేక ఆక్సిజన్ సరఫరాకు అనుసంధానించబడిన సెమీ-ఫౌలర్ బెడ్‌లు ఉన్నాయి. YSDM — తిరుపతి వారు, వార్డుకు అధిక నాణ్యత గల పరికరాలను అందించారు, ఇందులో పిల్లల ప్రాణాధారాలను ట్రాక్ చేయడానికి మల్టీపారా మానిటర్లు; సిరంజి పంపులు; నెబ్యులైజర్లు; పోర్టబుల్ సక్షన్ ఉపకరణం; ఒక ఆటోక్లేవ్ యంత్రం; ప్రత్యేక ఆక్సిజన్ మాస్కులు; వీల్ చైర్లు; స్ట్రెచర్స్; పరికరముల కొరకు ట్రాలీలు; పడకల పక్కన అల్మరాలు మరియు తెరలు ఉన్నాయి.

వార్డులో అధునాతన ఆరోగ్య పర్యవేక్షణ పరికరాలను అమర్చారు
పిల్లలకు అనుకూలంగా ఉండడం కోసం వార్డు గోడలపై రంగురంగుల పెయింటింగ్స్ వేయబడ్డాయి

YSDM — తిరుపతి, చిన్నపిల్లల వార్డు కలిగి ఉన్న భవనంపై విస్తృతమైన పునర్నిర్మాణాలను చేపట్టింది. సీపేజ్ నిరోధించడానికి పైకప్పుకు వాటర్ ప్రూఫ్ పూత పూయబడింది. వార్డుకు ఆనుకుని ఆటస్థలం జోడించబడింది. నర్సుల సౌకర్యాల గది పునరుద్ధరించబడింది మరియు పరిచారకులకు ఇండక్షన్ హీటింగ్ ప్లేట్లు అందించబడ్డాయి. మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లను కూడా పునరుద్ధరించారు. గోడలపై పిల్లలకు అనుకూలమైన పెయింటింగ్‌లు, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌లు, టెలివిజన్ మరియు ఎయిర్ కండిషనింగ్‌లతో వార్డు పూర్తి స్థాయిలో పునఃనిర్మించడం జరిగింది.

మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ, నిరాడంబరమైన ఆసుపత్రి స్థలాన్ని అధిక నాణ్యతతో, సాంకేతికతతో కూడిన వార్డుగా మార్చడంలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు దాని సభ్యుల కృషికి, గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, కృతజ్ఞతలు తెలిపారు. పుంగనూరు మరియు దాని పరిసర ప్రాంతాలలో తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలలో నివసించే పిల్లలకు మెరుగైన వైద్య సదుపాయాలను విస్తరించడంలో ఇది చాలా దోహదపడుతుందని ఆయన అన్నారు.

కార్యక్రమానికి గౌరవ అతిథిగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎన్. రెడ్డప్ప, ప్రత్యేక అతిథిగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి. వెంగమ్మ హాజరయ్యారు. ఇతర అతిథులలో ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగమునకు చెందిన వివిధ అధికారులు ఉన్నారు.

28 ఏప్రిల్ 2022వ తేదీన సదుపాయాన్ని ప్రారంభించేందుకు రిబ్బన్‌ను కత్తిరిస్తున్న ముఖ్య అతిథి.
8 ఏప్రిల్ 2022వ తేదీన సదుపాయాన్ని ప్రారంభించేందుకు రిబ్బన్‌ను కత్తిరిస్తున్న ముఖ్య అతిథి
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను CHC అధికారులకు అందజేసిన YSDM - తిరుపతి భక్తులు

YSDM — తిరుపతికి చెందిన ఒక వై.ఎస్.ఎస్. భక్తుడు, ధార్మిక కార్యకలాపాలపై సంస్థ దృష్టిసారించిన వివరాలను పంచుకున్నారు. పుంగనూరులోని పిల్లల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశం కల్పించినందుకు వై.ఎస్.ఎస్.కి కృతజ్ఞతలు తెలిపారు.

వార్తను సేకరించిన పత్రికలు

ఇతరులతో షేర్ చేయండి