స్వామి శివానంద గిరి (1936-2022) గారి జ్ఞాపకార్థం

22 జనవరి, 2022

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సీనియర్ సన్యాసి అయిన మన ప్రియతమ స్వామి శివానంద గిరి గారు జనవరి 18, 2022న ఉదయం 6 గంటల ప్రాంతంలో నిద్రలో ప్రశాంతంగా స్వర్గస్తులయ్యారు.

సెప్టెంబరు 20, 1936న పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లా కులబహల్‌లోని హులుంగ్ అనే మారుమూల గ్రామంలో శ్రీ దుర్గా చరణ్ మహతోగా జన్మించిన స్వామి శివానందగారు నిరాడంబర నేపధ్యం నుండి రావడం జరిగింది.

స్వభావసహజంగా ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగిన స్వామీజీ చాలా చిన్న వయస్సులోనే యోగదా సత్సంగ క్షీరోదమోయీ విద్యాపీఠం, లఖన్‌పూర్ విద్యార్ధిగా ఆధ్యాత్మిక జీవితానికి సంబందించిన పరిచయం పొందారు. ఉత్కృష్టమైన జీవితంగా పరివర్తన కలుగజేసే మన ప్రియ గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి క్రియాయోగ బోధనలలో మునిగిపోయారు.

1962లో 26 ఏళ్ల వయస్సులో ఆయన వై.ఎస్.ఎస్ సన్యాసిగా ఆధ్యాత్మిక మార్గానికి పూర్తిగా అంకితం కావాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఫిబ్రవరి 3, 1968న బ్రహ్మచర్య ప్రమాణాలను మరియు డిసెంబర్ 14, 1972న సన్యాస ప్రమాణాలను వై.ఎస్.ఎస్ /ఎస్.ఆర్.యఫ్. మూడవ అధ్యక్షులు మరియు సంఘమాత అయిన శ్రీ శ్రీ దయామాత గారి నుండి స్వీకరించారు.

ఆయనలో ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైన వినయము మరియు సరళత్వమే వ్యక్తమయ్యేది. తమకు ఎదురయ్యే ఇబ్బందులను ఆయన కలవరపడని సమదృష్టితో ఎదుర్కొనేవారు. ఆయన జీవితంలోని తరువాతి సంవత్సరాలలో ఆరోగ్యానికి సంబంధించిన సవాళ్లు ఎదురైనప్పటికీ, ఆయన విశేషమైన ధైర్యాన్ని మరియు ధృడత్వాన్ని చూపించేవారు.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSS) ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల సమూహంలోని యోగదా సత్సంగ విద్యా సంస్ధ(YSEI)లలో భాగమైన కులబహల్ మరియు లఖన్పూర్ ప్రాధమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా స్వామి శివానందగారు 37 సంవత్సరాలపాటు సేవ చేశారు. ఆయన పూర్వపు సహోద్యోగులలో కొందరు గుర్తుచేసుకున్నట్లుగా స్వామి శివానందగారు, తమ విద్యార్థులు క్రమశిక్షణ మార్గానికి దూరం కాకుండా చూసేందుకు వారి పట్ల కఠినంగా వ్యవహరించేవారు. ఆయనకు క్రీడల పట్ల కూడా అపారమైన ఆసక్తి ఉండేది.

కులబహల్‌లోని మారుమూల ప్రాంతాలలోను మరియు పేదరికం ఉన్న ప్రాంతాలలోను సమాజంలోని అణగారిన వర్గాల మధ్య ప్రాథమిక విద్యా వ్యాప్తికోసం, తద్వారా వారు క్రమంగా పైకి వచ్చి జాతీయ స్రవంతిలో చేరేందుకు స్వామి శివానందగారు కీలక పాత్ర పోషించారు. అపారమైన ఓర్పు మరియు దూరదృష్టితో, స్వామీజీ హులుంగ్, హతిబారి, కులబహల్, మరియు లఖన్‌పూర్ గ్రామాల్లోని దిగువ మరియు మధ్యతరగతి వర్గాలవారు ప్రాథమిక విద్యకు దూరం కాకుండా చూశారు.

తమ జీవితంలోని చాలా ముందు రోజుల్లో స్వామీజీ హఠ యోగ సాధనకు ఆకర్షితులయ్యారు. ఆయన చాలా కష్టమైన ఆసనాలు వేయగలిగేవారు. ఆయన ప్రకృతి ప్రేమికులు మరియు ఆసక్తిగల తోటమాలి కూడా. మధ్యాహ్నం తోటపని పూర్తి చేసిన తర్వాత, స్వామీజీ అప్పుడప్పుడు ఆశ్రమ సిబ్బందిని మరియు కార్మికులను లఖన్‌పూర్‌లోని ధ్యాన మందిరంలో సమీకరించి, ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవడం కోసం వారికి ప్రాధమిక హఠ యోగ భంగిమలను నేర్పించేవారు.

స్వామీజీ తమ చివరి రోజు వరకు, గురుదేవులు పరమహంస యోగానందగారు ప్రసాదించిన క్రియా యోగ సాధనను త్రికరణశుద్ధిగా విధేయతతోను మరియు క్రమబద్ధంగాను కొనసాగించారు. ఆయన ఆదర్శప్రాయమైన సన్యాస జీవితాన్ని గడిపారు మరియు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో పురూలియా జిల్లాలోని వై.ఎస్.ఎస్. శాఖా కేంద్రం కులబహల్లోను మరియు లఖన్‌పూర్‌లోని వై.ఎస్.ఎస్ శాఖా ఆశ్రమంలోను వివిధ హోదాల్లో పని చేయడం ద్వారా యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు తమ సేవలనందించారు.

స్వామి శివానందగారు తమ సంతోషకరమైన మరియు వినయపూర్వకమైన స్వభావంతో ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు. అంతిమ లక్ష్యమైన సంపూర్ణ ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయాణం కొనసాగిస్తున్న ఆయనకు మనమందరం మన ప్రేమను మరియు ప్రార్థనలను పంపిద్దాం.

ఇతరులతో షేర్ చేయండి