తమిళంలో వై.ఎస్.ఎస్. పాఠాల ప్రారంభోత్సవం

28 జూలై, 2022

యోగదా సత్సంగ పాఠాల కొత్త సంచిక ఇప్పుడు తమిళంలో అందుబాటులో ఉందని మరియు నమోదు చేసుకోవడానికి సిద్ధంగా ఉందని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం!

22 జులై, 2022వ తేదీన, యోగదా సత్సంగ పాఠాల కొత్త సంచిక తమిళ అనువాదాన్ని చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్వామి సుద్ధానంద గిరి విడుదల చేశారు మరియు పరిచయ పాఠం మొదటి ప్రతిని ప్రముఖ నటుడు, నిర్మాత, పరోపకారి మరియు యోగదా సత్సంగ భక్తుడు అయిన పద్మవిభూషణ్ శ్రీ రజనీకాంత్ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 1600 మంది హాజరయ్యారు మరియు చాలా మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

సాంప్రదాయబద్ధంగా దీపాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.), దాని వ్యవస్థాపకులు మరియు గురుదేవులైన శ్రీ శ్రీ పరమహంస యోగానంద గురించి మరియు వై.ఎస్.ఎస్. పాఠాల గురించి స్వామి పవిత్రానంద పరిచయం చేశారు.

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి నుండి వచ్చిన లేఖను చదవడం ద్వారా స్వామి సుద్ధానంద తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తమిళంలో వై.ఎస్.ఎస్. పాఠాలను ప్రారంభించడంలో సహకరించిన స్వచ్ఛంద సేవకులకు స్వామి చిదానందగారు తన ఆశీస్సులను మరియు అభినందలను తన లేఖ ద్వారా పంపించారు. ఆ లేఖలో ఇలా ఉంది: “గురుదేవులు ఇలా అన్నారు, ‘నేను వెళ్ళిపోయినప్పుడు, బోధనలే గురువు అవుతాయి,’ మరియు తమిళ పాఠాల అనువాదం ద్వారా భారతదేశంలోని ఇంకా ఎక్కువ మందికి తన ఆత్మ-విముక్తి బోధనలు అందుబాటులోకి వచ్చినందుకు గురుదేవులు ఈ రోజున ఎంత ఆనందంగా ఉన్నారో. ఈ పవిత్ర పాఠాలలో అందించబడిన జ్ఞానం మరియు మీ హృదయాల చిత్తశుద్ధి ద్వారా, దైవంతో మీ సంబంధాన్ని మరియు అనుసంధానాన్ని గాఢంగా పెంచుకోవడం కోసం ద్వారాలన్నీ మీకు తెరిచి ఉన్నాయి.”

తన ప్రసంగంలో స్వామి సుద్ధానంద, క్రియాయోగం యొక్క ప్రాముఖ్యతను మరియు వై.ఎస్.ఎస్. పాఠాలలో ఇచ్చినట్లుగా, దాని రోజువారీ సాధన చేయడం ద్వారా, ఉన్నత చైతన్య స్థితులను మరియు చివరకు దైవ సాక్షాత్కారాన్ని మనం ఎలా పొందగలమో ప్రత్యేకంగా వివరించారు.

స్వామి సుద్ధానంద అప్పుడు తమిళ వై.ఎస్.ఎస్. పాఠాలను విడుదల చేసి, ముఖ్య అతిధి శ్రీ రజనీకాంత్ కి పరిచయ పాఠం: ‘హైయెస్ట్ అచీవమెంట్స్ త్రూ సెల్ఫ్-రియలైజేషన్’ మొదటి కాపీని అందజేశారు. ఈ పాఠం నుండి కొన్ని ఉత్తేజకరమైన భాగాలను స్వామీజీ చదివి, పాఠాల విషయసూచికను వివరించారు. వై.ఎస్.ఎస్. పాఠాల యాప్ యొక్క తాజా సంస్కరణను వివరించే చిన్న వీడియో ప్రదర్శించబడింది.

ఈ కార్యక్రమంలో శ్రీ రజనీకాంత్ మాట్లాడుతూ, అనేక సంస్థలు వై.ఎస్.ఎస్. లాగా 100 ఏళ్ళు పైబడినవే అయినా, వై.ఎస్.ఎస్. బోధనలలో ఉన్న సత్యం మాత్రమే దానిని దీర్ఘకాలిక సంస్థగా మార్చిందని వ్యాఖ్యానించారు. ఆయన ఇలా చెప్పారు, “భగవద్గీత మరియు పతంజలి యోగ సూత్రాలలో కూడా ధ్యానం యొక్క పద్ధతులు వివరించబడలేదు; కాని పరమహంస యోగానందగారు తన యోగదా సత్సంగ పాఠాలలో వాటి గురించి సవివరమైన వివరణ ఇచ్చారు.” ఎంత తీరిక లేకుండా ఆయన ఉన్నప్పటికీ ధ్యానం మాత్రం మాననని చెప్పడం ద్వారా ప్రేక్షకులకు స్ఫూర్తిని కలిగించారు. మనకు సహాయం చేయడానికి గురువులందరూ ఎదురుచూస్తున్నారని, అయితే వారి సహాయాన్ని అందుకోవాలంటే మనం సిద్ధంగా ఉండాలని, అందుకు మార్గం ఈ క్రియాయోగ బోధనల్లో మనకు అందించబడిందని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని పంచే వై.ఎస్.ఎస్. పాఠాలను చదవాలని ఆయన కోరారు.

తరువాత, కార్యక్రమానికి హాజరైన చాలా మంది తమిళ పాఠాల కోసం నమోదు చేసుకున్నారు, మరియు వేదిక వద్ద తమిళంలో వై.ఎస్.ఎస్. సాహిత్యాన్ని పలువురు కొనుగోలు చేశారు.

తమిళంలో వై.ఎస్.ఎస్. పాఠాల కోసం నమోదు చేసుకోవడానికి, దయచేసి సందర్శించండి:

22 జులై, 2022వ తేదీన తమిళంలో పాఠాల ప్రారంభోత్సవం సందర్భంగా చదువబడిన, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి సందేశం

ప్రియతములారా,

మన ప్రియతమ గురుదేవులు శ్రీ పరమహంస యోగానందగారి, కొత్తగా విస్తరించబడిన వై.ఎస్.ఎస్. పాఠాల సంస్కరణ మొదటిసారిగా తమిళ భాషలో అందుబాటులోకి వస్తున్నందున, ఈ ముఖ్యమైన సందర్భంలో, నా హృదయంలో మీతో పాటు నేనూ ఆనందిస్తున్నాను. ఇది సాధ్యమయ్యేలా చేయడానికి చాలా ప్రేమపూర్వకమైన ఆలోచన మరియు కృషి జరిగింది. వీటిని అనువాదం చేయడంలోను మరియు పంపిణీ చేయడంలోను అంకితభావంతో పని చేసిన వారందరికీ నా హృదయపు లోతుల్లో నుండి ధన్యవాదాలు.

గురుదేవులు ఇలా అన్నారు, “నేను వెళ్ళిపోయినప్పుడు, బోధనలే గురువు అవుతాయి,” మరియు తమిళ పాఠాల అనువాదం ద్వారా భారతదేశంలోని ఇంకా ఎక్కువ మందికి తన ఆత్మ-విముక్తి బోధనలు అందుబాటులోకి వచ్చినందుకు గురుదేవులు ఈ రోజున ఎంత ఆనందంగా ఉన్నారో. ఈ పవిత్ర పాఠాలలో అందించబడిన జ్ఞానం మరియు మీ హృదయాల చిత్తశుద్ధి ద్వారా, దైవంతో మీ సంబంధాన్ని మరియు అనుసంధానాన్ని గాఢంగా పెంచుకోవడం కోసం ద్వారాలన్నీ మీకు తెరిచి ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ ఉన్న మీలో ప్రతి ఒక్కరికీ మరియు మన గొప్ప గురువుల పవిత్ర బోధనలను స్వీకరించడానికి భవిష్యత్తులో వచ్చే వారందరికీ నా ప్రార్థనలు మరియు ఆశీస్సులు చేరుకుంటాయి. మీరు ఈ ఆశీర్వాద మార్గంలో పురోగమిస్తున్నప్పుడు దేవుడు మరియు మన గురుదేవుల ప్రేమ మరియు ఆశీస్సులు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆవరించాలి.

వారి దివ్యప్రేమ మరియు స్నేహంలో,

స్వామి చిదానంద గిరి

ఇతరులతో షేర్ చేయండి