ఆత్మ దృక్పథం నుండి సాఫల్యతను నిర్వచించడం — స్వామి చిదానందగిరి గారితో ముఖాముఖీ

8 జూలై, 2022

దిగువ ఇచ్చినది వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అద్యక్షులైన శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారితో ముఖాముఖీలో ఒక భాగం; శ్రీ శ్రీ మృణాళినీమాతగారి (అప్పటి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ సంస్థ అధ్యక్షులు) మానిఫెస్టింగ్ డివైన్ కాన్షియస్ నెస్ ఇన్ డైలీ లైఫ్ (Manifesting Divine Consciousness in Daily Life) అనే ఒక కొత్త పుస్తకం ప్రచురించిన కొద్దికాలం తరువాత 2014లో ఇంటిగ్రెల్ యోగా మాగజైన్ లో మొదట ఇది వెలువడింది. ఆధ్యాత్మిక మార్గంలో సఫలతను సాధించడమనే అంశం యొక్క సారాంశాన్ని ఆ పుస్తకం ఏవిధంగా పట్టుకుంది అన్న విషయంపైనే ఈ ముఖాముఖీ ప్రధానంగా దృష్టి సారించింది. 2017లో మృణాళినీమాతగారు పరమపదించిన తరువాత స్వామి చిదానంద గిరి గారు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులయ్యారు.

పూర్తి ఇంటర్వ్యూను యోగదా సత్సంగ మ్యాగజైన్ 2022 సంచికలో చదువవచ్చును. (ఈ మ్యాగజైన్ చందాదారులు ఈ సంచికను, యోగదా సత్సంగ ఆన్‌లైన్‌ లైబ్రరీలో చదువవచ్చును. రాబోయే వారాలలో పూర్వ సంచికలలోని వందలాది పేజీలు కూడా వారికి ఈ ఆన్‌లైన్‌ లైబ్రరీ ద్వారా అందుబాటులోకి వస్తాయి.)

ఇంటిగ్రెల్ యోగా మ్యాగజైన్ (ఐ.వై.ఎమ్): సఫలతను మీరెలా నిర్వచిస్తారు?

స్వామి చిదానంద గిరి గారు (ఎస్.సి): శ్రీ మృణాళినీమాతగారి కొత్త పుస్తకం, మానిఫెస్టింగ్ డివైన్ కాన్షియస్ నెస్ ఇన్ డైలీ లైఫ్ (Manifesting Divine Consciousness in Daily Life), అన్నది దీనికి ఒక అద్భుతమైన నిర్వచనం. జీవితంలో సఫలత అంటే నిస్సందేహంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో అంటే స్వయంగా మన దివ్య స్వరూపమైన ఆత్మలో స్వభావసిద్ధంగా ఉన్న గుణాలను బాహ్యంగా వ్యక్తపరచడమే.

ఐ.వై.ఎమ్: ఏమిటా గుణాలు?

ఎస్.సి: 24/7 మనం వ్యక్తపరచాలని కోరుతున్న అద్భుతమైన విషయాలు: పరమానందం, ప్రేమ, సమత్వస్థితి, శాంతి, మన ఆత్మలోని ప్రశాంత కే౦ద్రంలో సదా నెలకొని ఉండగలిగే సమర్థత. ఆ ప్రశాంత కే౦ద్రం నుండి మనం మన దైనందిన జీవితంలో వచ్చే సవాళ్ళకు ప్రతిస్పందించ గలుగుతాము. ఏ ఘటనలు సంభవించినా వాటిని దివ్యచైతన్యం, దివ్యానందం, సేవా భావం లేక దివ్యమైన నిస్వార్థ భావాలనే అంతర్వాహినులతో ఎదుర్కొనడాన్ని మనం నేర్చుకోగలము. దీనిని పరమహంస యోగానందగారు ఇలా వివరించారు: “బ్రద్దలవుతున్న లోకాల విధ్వంసం నడుమ చలించకుండా నిలబడగలగడం.”

ఐ.వై.ఎమ్: చలించకుండా మనమెలా నిలబడగలం?

ఎస్.సి: మొదట మనం అడ్డంకులు — మనలోనివి, మన చుట్టూరా ఉన్న ప్రపంచంలోనివి, మన జీవన విధానాన్ని ఒక సవాలుగా తయారు చేసే వీటిని గురించి చాలా వాస్తవిక దృక్పథంతో ఉండాలి. ఇదేమీ సునాయాసంగా జరిగే పని కాదు. ఆధ్యాత్మిక జీవితంలో నిజమైన పురోగతి యొక్క ఆరంభం ఏదంటే అది ఒక పోరాటమనే వాస్తవాన్ని అంగీకరించడం. జీవితంలో సఫలత అన్నది మనకు ఒక వెండిపళ్ళెంలో అందించాలని ఉద్దేశించబడినది కాదు. ఆధ్యాత్మిక చైతన్యమంటే అప్రయత్నంగా లభించడానికి లేదా తేలికగా తీసుకోడానికి ఉద్దేశించబడినది కాదు.

ఒక అర్థంలో మొత్తం భగవద్గీత అందించే సందేశం అదే; యోగాన్ని గురించిన గ్రంథాలన్నిటిలో గీతను నేను శ్రేష్ఠమైన దానిగా భావిస్తాను. జీవితంలో నిజమైన సాఫల్యాన్ని గురించి తెలిపే అతి శ్రేష్ఠమైన పవిత్ర గ్రంథం అది. గీతా సందేశం యుద్ధం చేస్తున్న రెండు తెగల గాధగా దాచి పెట్టబడింది. పరమహంస యోగానందుల వారు దానిలోని అంతరార్థాన్ని వివరించారు; యోగ దృక్పథం నుంచి గీతను వ్యాఖ్యానిస్తూ, అది స్వయంగా మన లోపలి భిన్న అంశాల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి అని చూపించారు. మనలోని ఒక భాగం సాధారణంగా అహంకారం, స్వార్థపరత్వం, అదుపులో లేని వికారమైన భావోద్వేగాలచే నడుపబడ్తూ ఉంటుంది — ఇది మన మానవ స్వభావంలోని చీకటి పార్శ్వం. ఇంకొక భాగం ఏదంటే మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న మన గుప్తమైన దివ్య సామర్థ్యాలు; ఇవి దివ్య స్వభావ చైతన్యంతో జీవించమని మనకి పిలుపునిస్తున్నాయి. ఇది మనం ప్రతిరోజూ చేయాల్సిన యుద్ధం, ఆ రోజు జరిగిన వాటన్నిటిలో మనం చేసిన పనులు, మన దృక్పధాలు, మన ప్రతిస్పందనలను పునః సమీక్షించుకుంటూ ప్రతి దినాన్ని ఆత్మ పరిశీలనతో, ఆత్మ విశ్లేషణతో మొదలుపెట్టి ముగించాలి.

కాబట్టి ఒక అంశమేమిటంటే జీవితమంటే ఒక పోరాటమని గుర్తించడం. అక్కణ్ణుంచి ఎక్కడికి వెళ్ళాలి? మన జీవితాలు వేటి చుట్టూ పరిభ్రమించాలని మనం ప్రయత్నిస్తున్నామో ఆ దివ్య గుణాలను మన రోజువారీ కార్యకలాపాలలోనూ, దృష్టి కోణాలలోనూ ఒక భాగంగా చేసుకోడానికి ప్రయత్నించడంతో మనం మొదలుపెడ్తాం. మృణాళినీమాతగారి పుస్తకంలోని విషయం అదే.

ఐ.వై.ఎమ్: మనం ఈ గుణాలను ఎలా పెంపొందించుకోవాలి?

ఎస్.సి: ప్రతిరోజూ ధ్యాన సాధన చేయవలసిన పరమావశ్యకత గురించి పరమహంస యోగానందగారు ఎంతగా నొక్కి చెప్పేవారో, దాని గురించి ఆమె మాట్లాడారు. ధ్యానం అన్న పదం — యోగం వలెనే — అనేక విధాలుగా విస్తృతంగా వాడబడుతో౦ది. ధ్యానం యొక్క వాస్తవమైన పరివర్తన కారకశక్తిని మీరు అర్థం చేసుకున్నప్పుడు అది ప్రశాంతతను, సామరస్యాన్ని అనుభూతి చెందుతూ నెమ్మదిగా ఒకచోట కూర్చొనే సమయం కంటే ఎంతో ఎక్కువైనదని మీరు తెలుసుకుంటారు. ధ్యానం అంటే మనలో ప్రతి ఒక్కరిలో అజ్ఞాతంగా దాగున్న సహజసిద్ధమైన దైవత్వంతో సంపర్కం పెట్టుకుని, దానిని వ్యక్తపరచడం కోసం అత్యంత క్రమశిక్షణతో మనస్సు, ఆత్మల ఏకాగ్రతా శక్తిని ఉపయోగించడం. మనం మనస్సు, హృదయం, అనుభూతులు, మన మానవ స్వభావంలో పైపైన ఉండే భావోద్వేగాలు, నిరంతరమూ ప్రతిక్రియ గురించి ఆలోచించడం, ఆందోళన, ఇష్టాఇష్టాలు — వీటన్నిటితో నిండిన స్థితిలో ఉంటే, ఈ ఎడతెరపిలేని వాగుడు మనం సంపర్కం పెట్టుకోవాలనుకుంటున్న దివ్య చైతన్యపు ప్రశాంత లోతులను కప్పివేసి, మరుగు పరుస్తుంది. ధ్యానమన్నది మన ఎరుకను అశాంతి, పరస్పరవిరుద్ధమైన భావోద్వేగాల స్థాయి నుంచి మరింత లోతైన చేతనాస్థితికి — ఎక్కడ కాంతి, దైవత్వం, ప్రశాంతత మరియు అన్నీ పరిపూర్ణంగా ఉన్న ఒక ఉన్నత స్థాయి వాస్తవికతను గురించిన స్పృహ ఉంటాయో ఆ చేతనాస్థితికి మన ఎరుకను తీసుకెళ్ళడానికి చేసే ఒకానొక క్రమశిక్షణతో కూడిన సాధన. మన మనస్సులు, నైపుణ్యాలు, దృష్టికోణం, ఇంద్రియాలనే భౌతిక ఉపకరణాల ద్వారా మాత్రమే పనిచేస్తూ ఉన్నప్పుడు, ఈ భౌతిక ప్రపంచమే సత్యమని భావించేలా మనము మోసగించబడి భ్రాంతికి లోనవుతాము. మాయ మనల్ని అతి తీవ్రమైన, భయాన్ని కలిగించే భావోద్వేగాలలోకి లాగుతుంది. బాహ్యనాటకంపై దృష్టిని కే౦ద్రీకరించిన బాహ్యే౦ద్రియాల నుంచి ప్రాణశక్తిని ఉపసంహరించడం ద్వారా మన లోపల ఏముందో, ఏది ఒడుదుడుకులతో కూడిన ఈ అశాశ్వతమైన జగన్నాటకం కన్నా ఎక్కువ వాస్తవమూ, గణనీయమైనదో దానిని మనం మెల్ల మెల్లగా తెలుసుకునేలా ధ్యానం చేస్తుంది. అప్పుడు ఈ తాత్కాలిక నాటకం కన్నా మన ఆంతరంగిక జీవితాలు మరింత వాస్తవంగా మారతాయి. “బ్రద్దలవుతున్న లోకాల విధ్వంసం మధ్య చలించకుండా ఉండడం” నేర్చుకోవడం గురించి పరమహంస యోగానందగారు మాట్లాడినప్పుడు సరిగ్గా ఆ చేతనాస్థితిలో నెలకొని ఉండాలనే ఉద్దేశించారు. స్వామి చిదానంద గిరి గారితో పూర్తి ఇంటర్వ్యూ యోగదా సత్సంగ మ్యాగజైన్ 2022 సంచిక లో మీకు లభిస్తుంది. “శరీరం, మనస్సు, ఆత్మలకు స్వస్థత చేకూర్చడానికే అంకితమైన,” యోగదా సత్సంగ మ్యాగజైన్ ఏడాదికి ఒకసారి ప్రచురించబడ్తో౦ది. ముద్రితమైన సంచికకు అదనంగా పత్రిక చందాదారులకు యోగదా సత్సంగ ఆన్‌లైన్‌ లైబ్రరీ ద్వారా డిజిటల్ పత్రిక కూడా అందుబాటులో ఉంటుంది. రాబోయే వారాలలో పరమహంస యోగానందగారు, గత, వర్తమాన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు, ఇతర ప్రియమైన రచయితలు రచించిన వందలాది పేజీల రచనలు దీనిలో లభిస్తాయి.

ఇతరులతో షేర్ చేయండి