శ్రీ మృణాళినీమాతగారి క్రిస్మస్ సందేశం 2014

28 నవంబర్, 2014

"క్రీస్తు యొక్క కాంతి మీలో ప్రజ్వరిల్లేలా భక్తి అనే అగ్నితో మీ హృదయమును వెలిగించండి….శరీరం, మరియు శ్వాసకు అతీతమైన క్రీస్తు శా౦తి, ఆన౦దాల నిత్య-సజీవ కాంతి మీరే."

క్రిస్మస్ 2014

ప్రియతమ ఏసు ప్రభువులో జనించిన, ప్రతి ఆత్మలో పునరావిష్కరణానికి నిరీక్షిస్తున్న క్రీస్తు చైతన్యాన్ని మనం ఆరాధిస్తూ, ఈ పవిత్ర కాంతి, ఆనందాల ఆశీర్వాద తరుణంలో మీకు ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు. ఆ ధన్య చైతన్యాన్ని మన జీవితాల్లో ఒక వాస్తవికతగా మలచుకోవడమంటే, ఈ కల్లోల ప్రపంచం యొక్క నిరంతరం మారే పరిస్థితుల, విలువల మధ్య సత్యం మరియు భద్రతల అంతర్గత పట్టు కొమ్మ అయిన ఒక దివ్య అభయమును ఆనందించడమే. మానవ ఉనికి యొక్క అన్ని అనిశ్చితులకు దేవుని కరుణాపూరిత సమాధానం క్రీస్తు వంటి దివ్య వ్యక్తుల ద్వారా వస్తుంది, మన నిత్య సంరక్షకుడు, శ్రేయోభిలాషి యొక్క సంరక్షణ, అమర ప్రేమను మనకు గుర్తు చేయడానికి ఏసు అవతరించాడు. బెత్లెహేమ్ క్షేత్రాలలోని గొర్రెల కాపరులకు వెల్లడి చేయబడినట్లుగా, భూమికి, స్వర్గానికి మధ్య, మన దైన౦దిన జీవితాలకు, అతీంద్రియ సత్యానికి మధ్య విడదీయరాని అగాధమేదీ లేదు. వినయపూర్వకమైన గ్రహణశీల హృదయానికి, దైవం ఎల్లప్పుడూ చేరువగా ఉంటుంది. మాయ యొక్క ఛాయల వెనుక భగవంతుని ఉనికి యొక్క ఆత్మ-ప్రకాశిత కాంతి ఉందని తెలుసుకోవడానికి మనం దైనందిన సంరక్షణలకు ఇంకా పదార్థ-మందకొడి ఇంద్రియాలకు అతీతంగా; కేవలం మన మానవ మతిమరుపు వెనుక — సఫలత మరియు అపరిమితమైన ఆనందంవైపు, మన దృష్టిని సారించాలి.

జీవిత కల్లోల ఉపరితలంపై మరియు తాత్కాలిక భౌతిక శరీరంపై ఎక్కువగా దృష్టి సారించే మనస్సు మనకు వ్యాకులముగాను మరియు నిస్సహాయంగాను అనిపిస్తుంది. క్రీస్తు నిదర్శనము మన అమర ఆత్మ యొక్క సహజమైన అపార సామర్థ్యాన్ని కనుగొనమని మనల్ని పిలుస్తుంది. గురుదేవులు పరమహంస యోగానందగారు ఒకసారి ఇలా అన్నారు, “బాల ఏసు తన ఊయల తొట్టిలో నిస్సహాయంగా ఉన్నాడని మనం భావిస్తున్నాము… అయితే ఆ చిన్న రూపం లోపల అనంత క్రీస్తు, విశ్వానికి వెలుగుగా ఉన్నాడు.” మనలో దాగి ఉన్నది కూడా అదే కాంతి, అదే తరగని ఆనందానికి మూలం మరియు దేవుని కృపను ప్రతిబింబించే శక్తి. క్రీస్తు-ప్రేమ యొక్క స్పందనలు మన జీవితాలను ఆధ్యాత్మికరించాలనే మన కోరిక బలోపేతమయ్యే ఈ పవిత్ర సమయంలో, మనకు స్వర్గం పంపిన అవకాశంగా, ఏసు యొక్క దివ్య లక్షణాలను, ఆయన సర్వవ్యాపక సహాయం మరియు మన స్వీయ భక్తిపూర్వక గ్రాహ్యతలతో, మన చైతన్యంలో లీనం చేసుకోవడానికి సహాయపడతాయి. అందరి పట్ల ఏసు వినమ్రత మరియు కరుణ యొక్క ప్రేరణతో మన మనస్సులను నింపుకుందాం, ఏసు ధీరత్వము మరియు దేవునిపై సంపూర్ణ విశ్వాసం నుండి శక్తిని పొందుదాం. మన దృక్పథాలను, మన సంబంధాలను, మన జీవిత దృష్టికోణాన్ని శుద్ధి చేసి మార్చే క్రీస్తు చైతన్యం యొక్క జ్యోతిని మనలో వెలిగిస్తూ, చిన్న “నేను” అనే భ్రాంతితో కూడిన దృక్పథానికి మించి మన ప్రేమను మరియు నిస్వార్థ అవగాహనను విస్తరింపజేద్దాం.

విశ్వజనీన క్రీస్తు చైతన్యాన్ని మీ ఆత్మ యొక్క నిశ్శబ్ద దేవాలయంలోకి ఆహ్వానించడానికి ఈ ఉత్సవ కాలపు కార్యకలాపాల మధ్య మీరు సమయం వెచ్చిస్తే క్రిస్మస్ యొక్క అత్యున్నత ఆశీర్వాదం మీకు దక్కుతుంది. అత్య౦త ప్రగాఢమైన ధ్యానమనే మందిర౦లో, “సమస్త వివేకమును మి౦చిన సమాధానమును” మీరు స్పృశి౦చి, తన లక్ష్యాన్ని నెరవేర్చడానికి సమస్త ఆట౦కాలను ఎదుర్కొన్నప్పుడు ఏసు వెలువరించిన సర్వ-వ్యాపక ప్రేమను, బలాన్ని అనుభూతి చెందడ౦ ప్రార౦భి౦చవచ్చు. ధ్యానంలో జనించిన ఆ చైతన్యం మీ అస్తిత్వాన్ని ముంచెత్తుతున్న కొద్దీ, మాయ మిమ్మల్ని భయపెట్టజాలదని, నిరోధించజాలదని మీరు గ్రహిస్తారు. అహం యొక్క చిన్న కోశము నుండి మీరు మీ ఆత్మ స్వాభావికమైన విశాలత్వం, స్వేచ్ఛలలోకి — భగవంతుడి యొక్క సర్వవ్యాపక కాంతితో ప్రకాశిస్తూ, ఉదయించడం కనుగొంటారు. జీవితాన్ని పరివర్తన చేసే ఆ అంతర్గత జాగృతి యొక్క కానుకను ఈ క్రిస్మస్ రోజున మీరు పొందాలని నేను ప్రార్థిస్తున్నాను.

మీకు మరియు మీ ఆప్తులకు దివ్య ప్రేమ మరియు క్రిస్మస్ ఆనందాలు,

శ్రీ శ్రీ మృణాళినీమాత

కాపీరైట్ © 2014 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.

ఇతరులతో షేర్ చేయండి