యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పదకోశం (స – ఱ)

సత్-చిత్-ఆనందం. భగవంతుణ్ణి ఉద్దేశించిన సంస్కృత పదం. ఇది శాశ్వతమైన జీవి లేదా సత్యం (సత్) అనంతమైన చైతన్యం (చిత్), మరియు నిత్య నవీన ఆనందం (ఆనందం) గా పరమాత్మ యొక్క అతి ముఖ్యమైన స్వభావాన్ని వ్యక్తీకరిస్తుంది.

సత్-తత్-ఓం. సత్, సత్యం, కేవల దైవం, దివ్యానందం; తత్, విశ్వ మేధస్సు లేదా చైతన్యం; ఓం, విశ్వ మేధా సృజనాత్మక స్పందన, భగవంతుడికి అక్షర-చిహ్నం. ఓం, త్రిత్వము చూడండి.

సనాతన ధర్మం. వాచ్యార్థంలో, “నిత్యమైన ధర్మం.” వేద బోధనల సముదాయానికి ఇచ్చిన పేరు; సింధు (Indus) నదీ తీరాన నివసించిన ప్రజలను గ్రీకులు ఇందూస్ లేక హిందూస్ అని పిలిచినప్పటి నుండి ఇది హిందూయిజం (హిందూ ధర్మం) గా వ్యవహరించబడింది. ధర్మం చూడండి.

సమాధి. పతంజలి (చూ.) ఇచ్చిన అష్టాంగ యోగమార్గంలో అత్యున్నతమైన సోపానం. ధ్యానం చేసేవాడు, ధ్యాన పద్ధతి (ప్రత్యాహారం ద్వారా మనస్సును ఇంద్రియాల నుంచి వెనక్కి మళ్ళించడం), ధ్యాన లక్ష్యం (దేవుడు) ఈ మూడూ ఒక్కటయినప్పుడు సమాధి సిద్ధిస్తుంది. “దైవసంసర్గపు ఆరంభస్థితుల్లో (సవికల్ప సమాధి) భక్తుడి చైతన్యం ‘విశ్వాత్మ’లో విలీనమవుతుంది; అతని ప్రాణశక్తిని శరీరంలో౦చి లాగేసినట్టు అవుతుంది; అప్పుడా శరీరం “చచ్చిపోయి”నట్టుగా, కదలిక లేకుండానూ బిర్రబిగిసీ ఉన్నట్టు కనిపిస్తుంది. తాను చైతన్యం స్తంభించిన శారీరక స్థితిలో ఉన్నానన్న స్పృహ యోగికి పూర్తిగా ఉంటుంది. అయితే, ఉన్నత స్థితులకు (నిర్వికల్ప సమాధి) పురోగమిస్తున్నకొద్దీ అతడు, శారీరక నిశ్చలత లేకుండానే, మామూలు జాగృత చేతనావస్థలోనూ తనను నిర్భంధించే లౌకిక విధుల మధ్యలోనూ కూడా దైవానుసంధానం చేస్తాడు.” అని పరమహంస యోగానందగారు వివరించారు. రెండు స్థితుల్లోనూ పరమాత్మ నిత్య నవీన దివ్యానందంతో ఏకత్వం ఉంటుంది; కాని నిర్వికల్ప స్థితిని గొప్ప పురోగతి సాధించిన యోగులు మాత్రమే అనుభవిస్తారు.

సాతాను. వాచ్యార్థంలో, హిబ్రూ భాషలో, “విరోధి.” సాతాను సచేతనమైన, స్వాతంత్ర్యమున్న విశ్వజనీన శక్తి. ఇది ప్రతి వస్తువునూ ప్రతి ఒక్కరినీ భగవంతుడి నుండి వేరుగాఉన్న భావనతో, పరిమితపు ప్రాపంచిక చైతన్య భ్రాంతిలో ఉంచుతుంది. దీన్ని సాధించడానికి సాతాను మాయ(విశ్వభ్రాంతి), అవిద్య (ప్రతి వ్యక్తీ అనుభవించే వ్యక్తిగత భ్రాంతి, అజ్ఞానం) అనే ఆయుధాలను ఉపయోగిస్తుంది. మాయ చూడండి.

సాధన. ఆధ్యాత్మిక క్రమశిక్షణా మార్గం. గురువు తన శిష్యులకోసం ఇచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలు, ధ్యాన అభ్యాసాలు. వీటిని విశ్వాసపూర్వకంగా అనుసరించడం ద్వారా శిష్యులు చిట్టచివరికి భగవంతుణ్ణి సాక్షాత్కరింప చేసుకుంటారు.

స్వామి. ఎనిమిదో శతాబ్ది లేక తొమ్మిదో శతాబ్ది ప్రథమ భాగంలో స్వామి శంకరులు (చూ.) పునర్వ్యవస్థీకరించిన భారతదేశపు అతి ప్రాచీన సన్యాస వర్గానికి చెందిన వ్యక్తి. ఒక స్వామి సంప్రదాయక బ్రహ్మచర్య నియమాలను పాటిస్తానని, ప్రాపంచిక బంధాలను, వాంఛలను త్యజిస్తానని, విధివిధాయకంగా దీక్షను స్వీకరిస్తాడు. అతడు తన సమయాన్ని ధ్యానానికి, ఇంకా ఇతర ఆధ్యాత్మిక సాధనలకు, మానవజాతి సేవకు వెచ్చిస్తాడు. పవిత్రమైన సన్యాస మార్గం పది తరగతులుగా (దశనామి), గిరి, పురి, భారతి, తీర్థ, సరస్వతి ఇంకా ఇతర బిరుదులతో ఉంది. స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు, (చూ.) పరమహంస యోగానందగారు గిరి (కొండ) శాఖకు చెందినవారు. స్వామి అనే సంస్కృత పదానికి “తన ఆత్మ(స్వ)తో ఏకమయినవాడు” అని అర్థం.

స్వామి శంకరులు. కొన్నిసార్లు ఆది (“మొట్టమొదటి”) శంకరాచార్య (శంకర+ఆచార్య, “బోధకులు”) అని పిలుస్తారు; భారతదేశపు గొప్ప పేరెన్నికగన్న తత్త్వవేత్త. వారి పుట్టుక తేదీ స్పష్టంగా తెలియదు; చాలామంది పండితులు ఆయన ఎనిమిది లేదా తొమ్మిదో శతాబ్దికి చెందినవారని అంటారు. ఆయన భగవంతుణ్ణి నకారాత్మక ఊహామాత్రమైన అంశంగా కాక, సకారాత్మకమైన నిత్య, సర్వవ్యాపక, నిత్య నవీన దివ్యానందంగా వర్ణించారు. వీరు ప్రాచీన సన్యాస వ్యవస్థను పునర్వర్గీకరించి, నాలుగు గొప్ప మఠాలు (ఆధ్యాత్మిక విద్యకు ఆశ్రమ కేంద్రాలు) స్థాపించారు. తదుపరి ఆచార్యత్వం వహించే వీటి పీఠాధిపతులు, జగద్గురు శ్రీ శంకరాచార్యుల బిరుదాన్ని కలిగి ఉంటారు. జగద్గురువు అనే దానికి అర్థం “ప్రపంచ బోధకుడు,” అని.

స్వామి శ్రీయుక్తేశ్వర్. స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి (1855-1936), భారతదేశపు జ్ఞానావతారులు, “అవతరించిన జ్ఞానం”; పరమహంస యోగానందగారి గురుదేవులు, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా క్రియాయోగ సభ్యులందరికీ పరమగురువులు. శ్రీయుక్తేశ్వర్ గారు, లాహిరీ మహాశయుల శిష్యులు. లాహిరీ మహాశయుల గురువైన మహావతార్ బాబాజీగారి ఆజ్ఞ మేరకు హిందూ, క్రైస్తవ ధర్మశాస్త్రాలలో అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్ని చూపే కైవల్య దర్శనం (The Holy Science) అనే ఒక ప్రామాణిక గ్రంథాన్ని ఆయన రాశారు. పరమహంస యోగానందగారికి వారి ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక ఉద్యమమైన క్రియాయోగ (చూ.) వ్యాప్తికి కావలసిన శిక్షణనిచ్చారు. శ్రీయుక్తేశ్వరుల జీవితాన్ని గురించి పరమహంసగారు ప్రేమపూర్వకంగా వారి ఒక యోగి ఆత్మకథలో వర్ణించారు.

సిద్ధుడు. వాచ్యార్థంలో, “సఫలుడయినవాడు.” ఆత్మసాక్షాత్కారం పొందినవాడు.

సూక్ష్మ శరీరం. వెలుగు, ప్రాణం లేదా ప్రాణాణువు (లైఫ్ ట్రాన్లు)లతో కూడిన మానవుడి సూక్ష్మ శరీరం; ఆత్మను వరుసగా కప్పి ఉన్న మూడు తొడుగులయిన కారణ శరీరం, సూక్ష్మ శరీరం, భౌతిక శరీరాలలో ఇది రెండోది. ఒక బల్బుకు విద్యుచ్ఛక్తి ఏ విధంగా చైతన్యాన్నిస్తుందో అదే విధంగా సూక్ష్మ శరీరపు శక్తులు భౌతిక శరీరానికి జీవాన్ని ఇస్తాయి. సూక్ష్మ శరీరానికి పందొమ్మిది మూలకాలు (తత్త్వాలు) ఉన్నాయి: అవి బుద్ధి, అహం, చిత్తం (అనుభూతి), మనస్సు (ఇంద్రియ చైతన్యం); ఐదు జ్ఞానేంద్రియాలు (చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శలను తెలియజేసే శారీరక అవయవాలలోని సంవేదనాత్మక శక్తులు); ఐదు కర్మేంద్రియాలు (పునరుత్పత్తి, విసర్జన, మాట్లాడడం, కదలడం, శారీరక నైపుణ్యాల కార్యప్రవర్తన మొదలగు పనులను నిర్వర్తించే శారీరక అవయవాలలోని నిర్వహణా శక్తులు); ప్రాణశక్తికి చెందిన ఐదు ఉపకరణాలు — స్ఫటికీకరణ, ప్రసరణ, స్వాంగీకరణ, జీవాణుపాక, విసర్జన నిర్వహించేవి.

సెల్ఫ్-రియలైజేషన్ (Self-Realization with capital R). సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ను సంక్షిప్తంగా పిలిచే పేరు. ఈ సంస్థను పరమహంస యోగానందగారు స్థాపించారు. తరచుగా ఆయన “సెల్ఫ్-రియలైజేషన్ (Self-Realization) బోధనలు”; “సెల్ఫ్-రియలైజేషన్ (Self-Realization) మార్గం”; “లాస్ ఏంజిలిస్ లో ఉన్న సెల్ఫ్-రియలైజేషన్ (Self-Realization) కేంద్ర కార్యస్థానం”; అని, ఇంకా ఇతర సందర్భాల్లోనూ ఆయన [ఈ పేరును] తాము ఇష్టాగోష్ఠిగా మాట్లాడేటప్పుడు వాడేవారు.

సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి సహాయం చేయడానికి, ప్రయోజనం కలిగించడానికి, ఆధ్యాత్మిక నియమాల, క్రియాయోగ (చూ.) ధ్యాన ప్రక్రియల వ్యాప్తికి 1920 లో శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు స్థాపించిన సంస్థ (1917 లో భారతదేశంలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా అనే పేరుతో దీనిని ప్రారంభించారు). దీని అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానం, మదర్ సెంటర్ (మాతృ కేంద్రం), కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిలిస్ లో ఉంది. “ఆత్మసాక్షాత్కారం ద్వారా భగవంతుడితో సహవాసం, సత్యాన్వేషకులందరితోను స్నేహం” అనేది సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పేరు సూచిస్తుందని పరమహంస యోగానందగారు వివరించారు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఆశయాలు, ఆదర్శాలు కూడా చూడండి.

హిందూమతం: చూ. సనాతన ధర్మం

హోలీ ఘోస్ట్. పరిశుద్ధాత్మ; ఓం, త్రిత్వము చూడండి.

ఇతరులతో పంచుకోండి