యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పదకోశం (మ, య)

మంత్రయోగం. భక్తితో, ఏకాగ్రతతో ఆధ్యాత్మికంగా మేలు చేకూర్చే స్పందనా బలమున్న బీజాక్షర శబ్దాలను మళ్ళీ మళ్ళీ ఉచ్చరించడం ద్వారా దైవానుసంధానం పొందడాన్ని మంత్రయోగం అంటారు. యోగం చూడండి.

మనిషి. సంస్కృతంలోని “మానస్” అనే మూలం నుండి ఈ పదం ఉద్భవించింది, మనస్సు – హేతుబద్దమైన ఆలోచనకు ప్రత్యేకమైన మానవ సామర్ధ్యం. మానవ చైతన్యాన్ని యోగశాస్త్రం, అతి ముఖ్యంగా ఉభయ లైంగిక లక్షణాలు గల ఆత్మ దృక్కోణం నుండి చూస్తుంది. మితిమీరిన సాహిత్య అసహనం లేకుండా ఈ మానసిక మరియు ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేసే ఇతర పదజాలం ఆంగ్లంలో లేనందున, మనిషి మరియు సంబంధిత పదాల ఉపయోగం ఈ ప్రచురణలో ఉంచబడింది – మనిషి అనే పదం యొక్క సంకుచితమైన ప్రత్యేక అర్ధంలో కాదు, మానవ జాతిలో సగం మందిని మాత్రమే సూచిస్తుంది. కాని దాని విస్తృతమైన అసలు అర్ధంలో ఇవ్వబడింది.

మహావతార్ బాబాజీ. మరణమే లేని మహావతారులు (“గొప్ప అవతారం”). ఈయన 1861 లో క్రియాయోగ (చూ.) దీక్షను లాహిరీ మహాశయులకు ఇచ్చి, తద్ద్వారా పురాతనమయిన ఈ మోక్షదాయక ప్రక్రియను ప్రపంచం కోసం పునరుద్ధరించారు. నిత్య యవ్వనంతో తొణికిసలాడే వీరు, అనేక శతాబ్దాలుగా హిమాలయాలలో నివసిస్తూ, ఈ ప్రపంచంమీద ఎడతెగని దీవెనలు కురిపిస్తున్నారు. ప్రవక్తలు తమ ప్రత్యేకమైన దైవవిధులను నిర్వర్తించడంలో వారికి సహాయం చేయడం ఈయన చేసే పని. వీరి ఉన్నతమైన ఆధ్యాత్మికస్థితిని సూచిస్తూ అనేక బిరుదులు ఆయనకు ఇచ్చారు. కాని ఈ మహావతారులు బాబాజీ అనే సాధారణ నామాన్నే స్వీకరించారు. సంస్కృతంలో బాబా అనే పదం “తండ్రి”ని, జీ అనే చివరి చేర్పు గౌరవాన్ని సూచిస్తుంది. వీరి జీవితాన్ని గురించి, ఆధ్యాత్మిక ఉద్యమాన్ని గురించి మరిన్ని వివరాలు ఒక యోగి ఆత్మకథ లో ఇచ్చారు. అవతారం చూడండి.

మహాసమాధి. సంస్కృతంలో మహా, “గొప్ప,” సమాధి. చిట్టచివరి ధ్యానం, లేదా భగవంతుడితో సచేతనంగా అనుసంధానం పొందడం. ఇందులో, సిద్ధుడయిన గురువు తాను విశ్వనాదమయిన ఓంకారంలో కలిసిపోయి, భౌతిక శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. ఈ శరీరమనే నివాసాన్ని ఎప్పుడు వదలిపెట్టేయాలో, భగవంతుడు నిర్ణయించిన ఆ నిర్దిష్టమైన సమయాన్ని ఒక సద్గురువు ముందుగానే తెలుసుకొని ఉంటాడు. సమాధి చూడండి.

మాయ. ఏకం అనేకంగా కనిపించడానికి కారణమైన సృష్టి నిర్మాణంలో అంతర్లీనంగా ఉండే భ్రాంతి జనక శక్తి. మాయ అనేది సాపేక్షత, విలోమం, వ్యత్యాసం, ద్వంద్వత, విరుద్ధ స్థితుల సూత్రం; దీనినే పాత నిబంధన ప్రవక్తలు సాతాను (వాచ్యర్థంలో, హిబ్రూలో, “విరోధి”) అన్నారు; “హంతకుడు” అని, “అబద్ధాలకోరు” అని కళ్ళకు కట్టినట్టు క్రీస్తు వర్ణించిన “దెయ్యం” ఈ మాయే. ఎందుకంటే “అతడిలో (దానిలో) సత్యం లేదు” (యోహాను 8:44, బైబిలు).

పరమహంస యోగానందగారు ఇలా వ్రాశారు:

“సంస్కృత పదమయిన మాయ అంటే ‘కొలిచేది’ (the measurer) అని అర్థం; ఇది సృష్టిలోని ఐంద్రజాలిక శక్తి; దీనివల్ల అమేయమూ, అవిభాజ్యమూ అయినదానిలో పరిమితులూ విభజనలూ గోచరమయేటట్లు ఉంటాయి. మాయ అంటే ప్రకృతే — పరమేశ్వరుని పరివర్తనారాహిత్యానికి (నిర్వికారత్వానికి) విరుద్ధంగా నిరంతర చలనంతో మారుతూండే దృశ్యగోచర ప్రపంచం.

“భగవంతుడి ప్రణాళికలోను, క్రీడ (లీల)లోను, మాయ (లేక సాతాను) చేసే ఒకే ఒక పని మానవుణ్ణి పరమాత్మ నుంచి పదార్థానికి, సత్తు నుంచి అసత్తుకు మళ్ళించడానికి ప్రయత్నించడం. ‘మొదటినుంచి దెయ్యం పాపం చేస్తూనే ఉంది. ఈ దెయ్యపు పనులను నాశనం చేసే ఉద్దేశంతోనే భగవంతుడి కుమారుడు వ్యక్తమయ్యాడు.’ (I యోహాను 3:8, బైబిలు). అంటే మానవుడి స్వంత అస్తిత్వంలో ఉన్న కూటస్థ లేక క్రీస్తు చైతన్యం వ్యక్తమయినపుడు, అది అలవోకగా భ్రాంతులను లేదా ‘దెయ్యం పనులను’ ధ్వంసం చేస్తుంది.

“మాయ, నిరంతరంగా మారుతుండే ప్రకృతి మేలిముసుగు; నిరంతరంగా జరిగే సృష్టి; దాని వెనుక నున్న ఎన్నడూ మారని నిర్వికారుడూ, శాశ్వత సత్యమూ అయిన సృష్టికర్తను దర్శించడానికి ప్రతి మానవుడు పైకెత్తవలసినది ఆ మేలిముసుగునే.”

మాస్టరు. మనో-ఆధిపత్యాన్ని సాధించిన వ్యక్తి (గురువు). పరమహంస యోగానందగారు ఇలా అన్నారు: “సద్గురువును గుర్తుపట్టడానికి వీలయిన అర్హతలు ఆధ్యాత్మికమైనవే కాని, శారీరకమైనవి కావు…. ఎవరైనా సద్గురువని చెప్పడానికి నిదర్శనం, తన సంకల్పానుసారంగా ఊపిరిలేకుండా ఉండే స్థితికి (సవికల్ప సమాధి) వెళ్ళే సామర్థ్యంలోనూ మార్పుచెందని దివ్యానందాన్ని (నిర్వికల్ప సమాధి) సాధించడంలోనూ కనిపిస్తుంది.” సమాధి చూడండి.

పరమహంసగారు ఇంకా ఇలా అంటారు: “ఈశ్వరుడు మానవుణ్ణి తన సర్వశక్తిమంతమైన రూపంలో సృష్టించాడని పవిత్ర గ్రంథాలన్నీ ఘోషిస్తాయి. విశ్వంమీద నియంత్రణ ప్రకృతికి అతీతమైనదన్నట్టు కనిపిస్తుంది; కాని నిజానికి తన పుట్టుకకు మూలం భగవంతుడనే “సరయిన స్పృహ” (సమ్యక్ స్మరణ) సాధించిన ప్రతి ఒక్కడిలోనూ అటువంటి శక్తి అంతర్గతంగా సహజంగా ఉంటుంది. అహంకారమూ వ్యక్తిగత వాంఛల రూపంలో అది తలఎత్తడమూ… భగవత్సాక్షాత్కారం పొందినవాళ్ళలో ఉండవు. నిజమైన గురువుల కార్యకలాపాలు ‘ఋతం’ అనే సహజ ధార్మికతకు అప్రయత్నంగానే అనురూపంగా ఉంటాయి. ఎమర్సన్ మాటల్లో చెప్పాలంటే, మహాపురుషులందరూ, “ధర్మపరాయణులు కావడం కాదు, వారే ‘ధర్మస్వరూపు’ లవుతారు; అప్పుడు సృష్టి లక్ష్యం నెరవేరుతుంది, ఈశ్వరుడు బాగా ప్రసన్నుడవుతాడు.”

మూలకాలు (పంచ). చూ. తత్త్వాలు

మెడుల్లా. ప్రాణశక్తి (ప్రాణం) శరీరం లోపలికి ప్రవేశించే ముఖ్యమైన ద్వారం; మెదడుకు, వెనుబాముకు చెందిన ఆరవ కేంద్ర స్థానం; విశ్వశక్తి ప్రవాహాన్ని అందుకొని దాన్ని నిర్దేశించడం దీని పని. మెదడులో అత్యున్నత స్థానమైన ఏడవ కేంద్రం (సహస్రారం)లో ప్రాణశక్తి నిలవయి ఉంటుంది. ఆ కేంద్రీకృత స్థానం నుంచి అది శరీరమంతటా పంపిణీ అవుతుంది. మెడుల్లా దగ్గర ఉన్న ఈ సుసూక్ష్మ కేంద్రం ముఖ్యమైన స్విచ్ లా, ప్రాణశక్తి ప్రవాహపు ప్రవేశాన్ని, నిలువను, పంపిణీని నియంత్రిస్తుంది.

యుగం. ప్రాచీన హైందవ గ్రంథాలలో వివరించిన ఒక ఆవృతం లేదా సృష్టిలో ఒకానొక నిర్దిష్టమైన సమయం. స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు తమ కైవల్య దర్శనం [ద హోలీ సైన్స్] లో 24000 సంవత్సరాల అయన చక్రాలు (equinoctial cycle) గురించి, అందులో మానవజాతి ప్రస్తుత స్థానం గురించి వివరించారు. ఈ ఆవృత్తి పురాతన గ్రంథాలలో ఇచ్చిన మరింత పొడవైన విశ్వ ఆవృత్తి లేదా సృష్టి కల్పం లోపల వస్తుంది; దీన్ని ప్రాచీన ఋషులు లెక్కగట్టారు; దీన్ని ఒక యోగి ఆత్మకథ, 16 వ అధ్యాయంలో వివరించారు:

“ఈ గ్రంథాల్లో చెప్పిన విశ్వచక్రం కాలవిస్తృతి 4,30,05,60,000 సంవత్సరాలు. ఇది ఒక సృష్టికల్పంగా లెక్కకు వస్తుంది; అంటే ‘సృష్టికి ఒక దినం.’ ఋషులు ఇచ్చిన ఇంత పెద్దసంఖ్య సౌరసంవత్సరం పొడుగుకూ ‘పై’ (అంటే, ఒకవృత్తం చుట్టుకొలతకూ వ్యాసానికీ ఉండే అనుపాతం, 3.1416) గుణిజానికీ ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంది.

“ప్రాచీన ద్రష్టల దృష్టిలో అఖండ బ్రహ్మాండం ఆయుర్దాయం 31,41,59,00,00,00,000 సౌర సంవత్సరాలు; అంటే ‘ఒక బ్రహ్మయుగం.’ ”

యోగం. సంస్కృత మూలం యుజ్ (సంధించు, కలుపు, ఏకం చేయు) నుంచి వచ్చింది. యోగం అంటే వైయక్తీకృత ఆత్మను పరమాత్మతో ఐక్యంచేయడం; అదే విధంగా, ఈ లక్ష్యాన్ని ఏ పద్ధతుల ద్వారా సాధించాలో చెప్పే శాస్త్రం. విశాల వర్ణపటం వంటి హైందవ తత్వశాస్త్రంలో యోగం ఆరు సాంప్రదాయక సిద్ధాంతాల (షడ్దర్శనాల) లో ఒకటి. అవి వేదాంతం, మీమాంస, సాంఖ్యం, వైశేషికం, న్యాయం, యోగం. వివిధ రకాలైన యోగ పద్ధతులు కూడా ఉన్నాయి. అవి హఠయోగం, మంత్రయోగం, లయయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం మరియు రాజయోగం. రాజయోగం, “రాజోచిత” లేదా సంపూర్ణ యోగాన్ని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/ సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ బోధిస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు తన శిష్యుడయిన అర్జునుడితో యోగానికున్న గొప్పతనాన్ని ఇలా ప్రశంసించాడు: “క్రమశిక్షణ ద్వారా శరీరాన్ని అదుపు చేసుకునే తపస్వులకన్న, జ్ఞానమార్గాన్ని అనుసరించేవారికన్న, కర్మ మార్గాన్నవలంబించే వారికన్న, యోగిని ఉన్నతుడుగా భావిస్తున్నారు. కాబట్టి ఓ అర్జునా, నువ్వు యోగివి అవు!” (భగవద్గీత VI:46). యోగశాస్త్ర వ్యాఖ్యాతలలో అగ్రగణ్యుడైన పతంజలి మహర్షి, ఎనిమిది నిర్దిష్టమయిన సోపానాల ద్వారా రాజయోగి సమాధిని లేదా భగవంతుడితో ఐక్యతను పొందుతాడని వివరించాడు. అవి (1) యమం, నైతిక ప్రవర్తన; (2) నియమం, ధర్మ అనుష్ఠానాలు; (3) ఆసనం, శారీరక చాంచల్యాన్ని అరికట్టి నిశ్చలత్వం ఇచ్చే సరయిన భంగిమ; (4) ప్రాణాయామం, సూక్ష్మ ప్రాణ ప్రవాహాలను నియంత్రించడం; (5) ప్రత్యాహారం, అంతర్ముఖమవ్వడం; (6) ధారణ, ఏకాగ్రత; (7) ధ్యానం; (8) సమాధి, అధిచేతనానుభూతి.

యోగదా సత్సంగ పత్రిక. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వారు, పరమహంస యోగానందగారి ప్రసంగాలు, రచనలనుంచి ప్రత్యేక శీర్షికలను, ఇంకా వర్తమాన ఆసక్తులకు తగినటువంటి, శాశ్వతమయిన విలువగల ఆధ్యాత్మిక, ఆచరణాత్మక, విజ్ఞానదాయకమైన వ్యాసాలను కలిగిన పత్రికను ఆంగ్లంలో, హిందీలో, బెంగాలీలో ప్రచురణ చేస్తున్నారు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పూర్వ అధ్యక్షులైన శ్రీ దయామాతాజీ, శ్రీ మృణాళినీమాతాజీ ప్రవచనాలతో బాటు ప్రస్తుత అధ్యక్షులైన శ్రీ స్వామి చిదానంద గిరి గారి ప్రవచనాలు కూడా ఇందులో ఒక క్రమం తప్పకుండా వచ్చే శీర్షిక.

యోగదా సత్సంగ పాఠాలు. శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి బోధలు, ఇంట్లో చదువుకొనేందుకు వీలుగా సమగ్రమయిన పాఠాల-క్రమంగా సంకలితమై, భారత ఉపఖండంలోని వారందరికీ లభ్యమవుతున్నాయి. ఈ పాఠాలలో పరమహంస యోగానందగారు బోధించిన యోగ ధ్యాన ప్రక్రియలు, ప్రాథమిక షరతులు పూర్తిచేసి అర్హత సంపాదించుకున్న సాధకులకు క్రియాయోగ (చూ.) శాస్త్ర పాఠాలు ఉన్నాయి.

యోగదా సత్సంగ సన్యాస పరంపర. యోగ ఆదర్శాలయిన ధ్యాన మరియు కర్తవ్య కార్యకలాపాల ద్వారా భగవంతుణ్ణి అన్వేషిస్తూ మరియు సేవిస్తూ తమ జీవితంలో సంపూర్ణ పరిత్యాగం యొక్క పిలుపునందుకున్నట్లుగా భావించే వారి కోసం ఆదిశంకరాచార్యులచే స్ధాపించబడిన పురాతన స్వామి పరంపరలో భాగం, సంస్ధ యొక్క ఆశ్రమ కేంద్రాలలో సన్యాసులు నివసిస్తారు మరియు పరమహంస యోగానందగారి ప్రపంచవ్యాప్త కార్యంలోని అనేక సామర్ధ్యాలలో తమ సేవను అందిస్తారు, వీటిలో : ఏకాంత ధ్యానవాసాలు, తరగతులు మరియు ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహించడం ; ప్రతి నెల బోధనల కోసం వచ్చే వేలాది విధ్యార్ధులకు ఆధ్యాత్మిక సూచనలు మరియు మార్గదర్శకత్వాన్ని అందించడం ; మరియు సంస్థ యొక్క వివిధ ధార్మిక కార్యకలాపాలను నిర్వహించడం. అనేక విభిన్న నేపథ్యాలు మరియు వయస్సు గల సన్యాసులు దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రావడం జరుగుతుంది.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా. శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి సంస్థను భారతదేశంలో ఈ పేరుతో పిలుస్తారు. ఈ సంస్థ 1917లో వారి ద్వారా స్థాపితమైంది. దాని కేంద్ర కార్యస్థానం, యోగదా మఠం, కోల్ కతాకు దగ్గరలోని దక్షిణేశ్వర్ దగ్గర గంగా తీరాన్ని ఆనుకొని నెలకొని ఉంది. దీని ఇతర ఆశ్రమాలు రాంచీ (ఝార్ఖండ్); ద్వారాహాట్ (ఉత్తరాఖండ్); నోయిడా (ఉత్తర ప్రదేశ్) లో ఉన్నాయి. భారతదేశమంతటా ఉన్న ధ్యాన కేంద్రాలు, మండలులతో పాటుగా, జనహితమైన అవసరాలు తీర్చడానికి యోగదా సత్సంగ సొసైటీ ఆధ్వర్యంలో బాలబాలికల కోసం అనేక విద్యా సంస్థలు, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ లలో డిగ్రీ కార్యక్రమాలతో ఒక కళాశాల, అనేక వైద్యశాలలు, వైద్యవసతులు పరమహంస యోగానంద పేరు, స్ఫూర్తిని నిలిపేలా నడుస్తున్నాయి. శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు సృష్టించిన “యోగదా” అనే పదం యోగ, “ఐక్యత, సామరస్యం, సంతులత”; దా, “అది ప్రసాదించేది” అనే వాటినుంచి సంగ్రహించినది. సత్సంగ అంటే “దివ్య సాంగత్యం” లేదా “సత్యంతో సహవాసం.” పశ్చిమ దేశాల వారి కోసం ఆయన ఈ భారతీయ నామాన్ని “సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్” (చూ.) అని అనువదించారు.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/ సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ గురువులు. కృష్ణ భగవానులు, జీసస్ క్రైస్ట్, ఇంకా నేటి కాలానికి చెందిన ఘనత వహించిన గురుపరంపర: మహావతార్ బాబాజీ, శ్రీ శ్రీ లాహిరీ మహాశయ, స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు, శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు. కృష్ణ భగవానుల యోగ బోధలకు, జీసస్ క్రైస్ట్ బోధలకు మధ్యనున్న ముఖ్యమైన ఏకత్వాన్ని, సామరస్యాన్ని చూపడం వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. విధి విధానాలలో ఒక ప్రధాన భాగం. ఈ గురువులందరూ తమ మహనీయమైన బోధల ద్వారా దివ్య ఉపకరణాలుగా పనిచేసి, దైవసాక్షాత్కారానికి ఒక ఆచరణీయమైన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మానవ జాతి కంతటికీ అందుబాటులోకి తీసుకురావాలనే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/ సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ వారి కర్తవ్యాన్ని నెరవేర్చడానికి దోహదంచేస్తున్నారు.

యోగి. యోగాన్ని (చూ.) అభ్యాసం చేసేవాడు. దైవసాక్షాత్కారం కోసం శాస్త్రీయమైన ఒక పద్ధతిని సాధన చేసేవారు ఎవరయినా యోగే. యోగులు పెళ్ళయినవారు కావచ్చు, పెళ్ళికానివారు కావచ్చు; లౌకిక బాధ్యతలు కల గృహస్థులు కావచ్చు, ఔపచారికమయిన మతసంబంధాలు గల సన్యాసులు కావచ్చు.

ఇతరులతో షేర్ చేయండి