యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పదకోశం (చ – న)

చక్రాలు. యోగశాస్త్ర ప్రకారం, వెనుబాములోను, మెదడులోను ఉన్న ప్రాణశక్తి, చైతన్యాల ఏడు నిగూఢమైన కేంద్రాలు. ఇవి మానవుడి, భౌతిక, సూక్ష్మ శరీరాలను జీవంతం చేస్తాయి. ఈ కేంద్రాలను చక్రాలు అని అంటారు. ఎందుకంటే ప్రతి చక్రంలోను కేంద్రీకృతమై ఉన్న శక్తి చక్రనాభి వలె ఉండి, అక్కణ్ణించి ప్రాణదాయక తేజాన్నీ, శక్తినీ కలిగిఉన్న కిరణాలను ప్రసరింపజేస్తుంది. కిందనుంచి పైకి వెళ్ళే (ఆరోహణా) క్రమంలో ఈ చక్రాలు: వరుసగా మూలాధారం (వెనుబాము మూలంలో ఉంటుంది, అనుత్రిక); స్వాధిష్ఠానం (మూలాధారానికి రెండు అంగుళాలపైన ఉంటుంది, త్రికాస్థి); మణిపూరకం (బొడ్డుకు ఎదురుగా ఉంటుంది; నడుముకు సంబంధించి); అనాహత (గుండెకు ఎదురుగా ఉంటుంది; వెన్నుకు సంబంధించి); విశుద్ధ (మెడకు మూలస్థానంలో ఉంటుంది; కంఠ సంబంధమైన); ఆజ్ఞా (సంప్రదాయకంగా రెండు కనుబొమలకు మధ్యలో ఉంటుందని అంటారు; కాని వాస్తవానికి ధ్రువాత్మకత ద్వారా మెడుల్లాతో ప్రత్యక్షంగా కలిసి ఉంటుంది; మెడుల్లా, ఆధ్యాత్మిక నేత్రం కూడా చూడండి); సహస్రారం (పెద్దమెదడులో అన్నిటికన్నా పైనుండే ముఖ్యమైన భాగం).

ఈ ఏడు కేంద్రాలూ దైవ ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయబడ్డ బయటకు పోయే దారులు లేదా “పట్టుకొని ఉంచే ద్వారాలు.” వీటిద్వారా ఆత్మ శరీరంలోకి దిగి వచ్చింది (అవరోహణ). అదే మార్గంలో క్రమబద్ధమైన ధ్యానం ద్వారా అది తిరిగి పైకి వెళ్ళాలి (ఆరోహణ). ఏడు క్రమబద్ధమయిన సోపానాల ద్వారా ఆత్మ విశ్వ చైతన్యంలోకి తప్పించుకుపోతుంది. ఈ ఏడు తెరుచుకున్న లేదా “జాగృత” (చక్రాలు) వెనుబాము కేంద్రాల ద్వారా, సచేతనంగా పైకి వెళ్ళడం ద్వారా, ఆత్మ పరమాత్మను చేరే రహదారిలో ప్రయాణిస్తుంది. భగవంతుడితో తిరిగి ఐక్యమవడానికి ఆత్మ తప్పనిసరిగా నడవాల్సిన అసలైన మార్గం ఇది.

యోగశాస్త్ర గ్రంథాలు సాధారణంగా కేవలం ఆరు క్రింది కేంద్రాలనే చక్రాలుగా గుర్తించి; సహస్రారాన్ని విడిగా ఏడవ కేంద్రంగా పేర్కొంటాయి. ఏది ఏమయినప్పటికీ, ఈ ఏడు కేంద్రాలను తరచుగా పద్మాలతో పోలుస్తారు. మనలోని ప్రాణశక్తి, చైతన్యం వెనుబాములో ఊర్ధ్వగతిని ప్రయాణిస్తున్నప్పుడు ఈ పద్మాలు తెరుచుకుంటాయి లేదా పైకి తిరిగి ఉంటాయి.

చిత్తం. అంతర్ జ్ఞాన భావన; ఈ సమిష్టి చైతన్యంలో అంతర్హితంగా అహంకారం, బుద్ధి (తెలివి), మనస్సు (లేదా ఇంద్రియ చేతన) లు ఉంటాయి.

చెడు. మానవుడిలోను, ప్రకృతిలోను అపసామరస్యాలుగా వ్యక్తమవుతూ దేవుడి సర్వవ్యాపకత్వాన్ని సృష్టిలో మరుగుపరచే దుష్ట శక్తి. ఇంకా విశాలార్థంలో తీసుకుంటే దైవనియమాలకు వ్యతిరేకంగా ఉండేది ఏదయినా చెడు అని అనవచ్చు (చూ. ధర్మం). అది మానవుడు ముఖ్యంగా దేవుడితో తనకున్న ఏకత్వ చేతనను కోల్పోయేలా చేసి, దైవసాక్షాత్కారం పొందనీయకుండా అడ్డుపడుతుంది.

చేతనా స్థితులు. మర్త్య చేతనలో మానవుడు మూడు స్థితులను అనుభవిస్తాడు: జాగృత చేతన, నిద్రా చేతన, ఇంకా స్వప్న చేతన. కాని అతడు తన ఆత్మను, అధిచేతనను, భగవంతుణ్ణి అనుభూతి పొందడం లేదు. కాని కూటస్థ (క్రీస్తు) చేతన ఉన్న మానవుడు ఆ అనుభూతిని పొందగలడు. ఏ విధంగా అయితే మానవుడు తన శరీరాన్నంతటిని స్పృహ కలిగి ఉన్నాడో అదే విధంగా కూటస్థ(క్రీస్తు)చేతన ఉన్న మానవుడు ఈ విశ్వాన్నంతటినీ తన శరీరంగా అనుభూతి పొందుతాడు. కూటస్థ చైతన్యానికి ఆవల ఉన్నది విశ్వచైతన్యం, ఈ స్థితిలో మానవుడు ఇంద్రియగోచర ప్రపంచాలలో ఆవిష్కారమయి ఉన్న ఈశ్వరుడి సర్వవ్యాపకత్వంతో పాటు, స్పందనాత్మక సృష్టికి ఆవల శుద్ధ చైతన్యంలో ఉన్న భగవంతునితోనూ ఏకత్వాన్ని అనుభూతి పొందుతాడు.

జ్ఞానయోగం. బుద్ధికి ఉండే విచక్షణాత్మక శక్తిని ఆత్మకున్న సర్వజ్ఞత్వపు జ్ఞానంగా పరివర్తింపజేసి, భగవంతుడితో ఐక్యంచేసే మార్గం.

జీవాత్మ (ఆత్మ). వైయక్తీకృత పరమాత్మ [విడిగా ప్రత్యేకమైన రూపుదాల్చిన పరమాత్మ]. ఆత్మ లేదా జీవాత్మ అనేది మానవుడి, ఇంకా అన్ని జీవరూపాల నిజమైన, అమర స్వభావం. తాత్కాలికంగా మాత్రమే ఇది కారణ, సూక్ష్మ, భౌతిక శరీరాలనే వస్త్రాలను ధరిస్తుంది. జీవాత్మ స్వభావం, పరమాత్మ స్వభావమైన నిత్య-స్థిత, నిత్య-చైతన్య, నిత్య-నవీన ఆనందం.

తత్త్వాలు (పంచ). ఓం లేదా విశ్వ స్పందన, మానవుడి శరీరంతో సహా, ఈ భౌతిక విశ్వాన్నంతటినీ పంచ తత్త్వాల (పంచభూతాల) ఆవిష్కరణ ద్వారా నిర్మాణం చేస్తుంది. ఇవి భూమి, జలం. అగ్ని, వాయువు, ఆకాశము (ఈథర్) (చూ.). ఈ నిర్మాణాత్మక శక్తులు, మేధస్సూ, స్పందనాత్మక స్వభావమూ కలిగినవి. భూ తత్త్వం లేకుండా స్థూల పదార్థమనే స్థితి ఉండదు; జల తత్త్వం లేకుండా, ద్రవ స్థితి ఉండదు; వాయు తత్త్వం లేకుండా వాయు స్థితి ఉండదు; అగ్ని (తేజస్) తత్త్వం లేకుండా వేడి ఉండదు; ఆకాశ తత్త్వం లేకుండా ఈ విశ్వ చలనచిత్రం చూపడానికి కావలసిన నేపథ్యం ఉండదు. శరీరంలో ప్రాణం (విశ్వ స్పందనాత్మక శక్తి) మెడుల్లాలో ప్రవేశించి, ఐదు కింది చక్రాల (చూ.) లేదా కేంద్రాలైన మూలాధార (భూమి), స్వాధిష్ఠానం (నీరు), మణిపూరకం (అగ్ని), అనాహతం (వాయువు), విశుద్ధ (ఆకాశం, ఈథర్) చక్రాల చర్య ద్వారా ఐదు [ప్రాణ] ప్రాథమిక ప్రవాహాలుగా విభజింపబడుతుంది. సంస్కృత పదజాలంలో తత్త్వాలను పృథ్వి, అపః, తేజస్, ప్రాణ, ఆకాశాలని అంటారు.

త్రిత్వము. పరబ్రహ్మం సృష్టిని వ్యక్తపరచినప్పుడు, పరబ్రహ్మమే త్రిత్వముగా అవుతుంది: సత్, తత్, ఓం లేదా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా అయింది. సత్ (తండ్రి) గా భగవంతుడు సృష్టికి ఆవలగా నున్న సృష్టికర్త. తత్ (కుమారుడు) సృష్టిలో ఉన్న భగవంతుడి సర్వవ్యాప్త మేధస్సు. ఇక ఓం (పరిశుద్ధాత్మ) సృష్టిగా రూపొందిన భగవంతుడి స్పందనాత్మక శక్తి.

అనంతంలో (యుగం చూడండి) అనేక పర్యాయాలు విశ్వసృష్టి, ప్రళయాలు వచ్చి, వెళ్ళాయి. విశ్వప్రళయం సంభవించినప్పుడు, త్రిత్వము ఇంకా సృష్టిలోని ఇతర సాపేక్షతలన్నీ తిరిగి కేవల పరబ్రహ్మం లోకే కరిగిపోతాయి.

దర్శనం. “పవిత్ర దృష్టి,” ఒకరి గురువులాగా ; అనగా దైవ సాక్షాత్కారం పొందిన వారి దర్శనం వలన లభించే అనుగ్రహం.

దివ్య జనని (జగన్మాత). సృష్టిలో క్రియాశీలకంగా పనిచేసే సృష్టికి అతీతంగా ఉన్న భగవంతుడి శక్తి రూపం. ఈ దివ్యత్వపు భావనకున్న ఇతర పేర్లు ఏమంటే ప్రకృతి, ఓం, పరిశుద్ధాత్మ, మేధాయుత విశ్వ ప్రకంపన. ఇంకా, భగవంతుడి సగుణ రూపంలో తల్లిగా, ఈశ్వరుడి ప్రేమ, కరుణలనే గుణాల మూర్తీ భావం.

హైందవ ధర్మ శాస్త్రాలు భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాతీతుడు, సాకారుడు, నిరాకారుడు కూడా అని బోధిస్తాయి. ఆయన్ని కేవల ఏకైక దైవంగా అన్వేషించవచ్చు; లేదా ఆయన శాశ్వత లక్షణాలయిన ప్రేమ, జ్ఞానం, దివ్యానందం, ప్రకాశాలలో ఒక రూపంగా; ఇష్టదైవంగా (మూర్తిగా); లేదా జగత్పిత, జగన్మాత, స్నేహితుడి వంటి భావనలతో కొలవవచ్చు.

దీక్ష. ఆధ్యాత్మిక దీక్ష; దీక్ష్ (అంటే ఒకరు తమను తాము సమర్పించుకోవడం) అనే సంస్కృత క్రియా-మూలం నుంచి వచ్చింది. శిష్యుడు, క్రియాయోగం కూడా చూడండి.

ధర్మం. సృష్టినంతటినీ నిలిపి ఉంచే శాశ్వతమైన ధార్మిక నియమాలు; ఈ నియమాలతో సామరస్యపూర్వకంగా జీవించడం మానవుడి అంతర్హితమైన విధి. సనాతన ధర్మం కూడా చూడండి.

ధ్యానం. భగవంతుడి మీద మనస్సు ఏకాగ్రం చేయడం. ధ్యాసను అంతర్ముఖంచేసి దాన్ని భగవంతుడి ఏదో ఒక అంశంపైన కేంద్రీకరించడానికి సాధన చేసే ఏ ప్రక్రియనైనా సూచించడానికి సర్వసాధారణంగా వాడే పదం. నిర్దిష్టమైన అర్థంలో, అలాంటి ప్రక్రియల సఫలవంతమైన అభ్యాసాల చివరిగా లభించే — సహజావబోధం ద్వారా — భగవంతుని ప్రత్యక్షానుభూతిని ధ్యానం సూచిస్తుంది. పతంజలి (చూ.) ద్వారా వివరించబడిన అష్టాంగ యోగ మార్గంలో ఇది (ధ్యానం) ఏడవ సోపానం, బాహ్య ప్రపంచం నుంచి వచ్చే ఇంద్రియ ప్రభావాలకు ఎంతమాత్రం లోనుకాకుండా స్థిరమైన ఆంతరిక ఏకాగ్రతను సాధించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. గాఢమైన ధ్యానంలో యోగమార్గంలోని ఎనిమిదో స్థాయిని: సమాధిని (చూ.), కలయికను, భగవంతుడిలో ఏకత్వాన్ని అనుభూతి పొందుతారు. యోగం కూడా చూడండి.

ఇతరులతో పంచుకోండి