లాహిరీ మహాశయ

లాహిరీ మహాశయ

లాహిరీ మహాశయులు సెప్టెంబర్ 30, 1828న భారతదేశంలో, బెంగాల్ లోని ఘుర్ని గ్రామంలో జన్మించారు. ముప్పై మూడు సంవత్సరాల వయస్సులో, రాణిఖేత్ సమీపంలోని హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక రోజు నడుస్తున్నప్పుడు, ఆయన తన గురువు మహావతార్ బాబాజీని కలుసుకున్నారు. ఇది అనేక పూర్వ జన్మలలో కలిసి ఉన్న వారి ఇద్దరి మధ్య దైవికంగా జరిగిన పునఃకలయిక; మహావతార్ బాబాజీ యొక్క జాగృతపరిచే ఆశీర్వాద స్పర్శ వల్ల, లాహిరీ మహాశయులు, ఆయనని ఎప్పటికీ విడిచిపెట్టని దైవ సాక్షాత్కార ఆధ్యాత్మిక ప్రకాశంలో మునిగిపోయారు.

మహావతార్ బాబాజీ ఆయనకి క్రియాయోగ శాస్త్రంలో దీక్ష ఇచ్చారు, మరియు నిజాయితీ గల సాధకులందరికీ పవిత్రమైన ఈ క్రియా ప్రక్రియను ప్రసాదించమని ఆదేశించారు. లాహిరీ మహాశయులు ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి బనారస్‌ లోని తన ఇంటికి తిరిగి వచ్చారు. సమకాలీన ప్రపంచం కోల్పోయిన ప్రాచీన క్రియ విజ్ఞానాన్ని బోధించిన మొదటి వ్యక్తిగా, ఆయన పందొమ్మిదవ శతాబ్దం చివరి భాగంలో ఆధునిక భారతదేశంలో ప్రారంభమైన యోగ పునరుజ్జీవనంలో ఒక ప్రధాన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు, మరియు ఆ పునర్జీవనం నేటికీ కొనసాగుతూనే ఉంది.

ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానందగారు ఇలా వ్రాశారు: “పూలవాసనని ఎవ్వరూ అణచిపెట్టలేరు: అలాగే,ఆదర్శ

గృహస్థూగా ప్రశాంతంగా జీవిస్తున్న లాహిరీ మహాశయులు, సహజసిద్ధమైన తమ మహిమను దాచి ఉంచలేక పోయారు. భక్తభ్రమరాలు, ఈ విముక్త సిద్ధపురుషుల దివ్యామృతాన్ని వెతుక్కుంటూ, భారతదేశంలో ప్రతిభాగం నుంచీ రావడం మొదలుపెట్టాయి. ఆ గొప్ప గృహస్థ-గురువు యొక్క సామరస్య పూర్వక సమతుల్య జీవితం వేలాది మంది పురుషులు మరియు మహిళలకు ప్రేరణగా మారింది.”

లాహిరీ మహాశయులు యోగము యొక్క అత్యున్నత ఆదర్శాలకు దృష్టాంతంగా నిలిచారు, అది ఏమిటంటే ఆత్మ పరమాత్మలో కలవడం, ఆయన యోగావతార్ లేదా యోగా యొక్క అవతారంగా గౌరవించబడ్డారు.

పరమహంస యోగానందగారి తల్లిదండ్రులు లాహిరీ మహాశయుల శిష్యులు, మరియు ఆయన పసికందుగా ఉన్నప్పుడు ఆయన తల్లి ఆయనని తన గురువుగారి ఇంటికి తీసుకొని వెళ్లారు. శిశువును ఆశీర్వదించి, లాహిరీ మహాశయులు ఇలా అన్నారు, “చిట్టి తల్లి, నీ కుమారుడు యోగి అవుతాడు. ఆధ్యాత్మిక ఇంజిన్‌ లాగా, అతను చాలా మంది ఆత్మలను దేవుని రాజ్యానికి తీసుకొని వెళతాడు.”

లాహిరీ మహాశయులు తన జీవితకాలంలో ఏ సంస్థను స్థాపించలేదు, కానీ భవిష్యత్తు గురించి ఇలా చెప్పారు: “నేను మరణించిన దాదాపు యాభై సంవత్సరాల తరువాత, పాశ్చాత్య దేశాలలో తలెత్తే యోగాపై లోతైన ఆసక్తి కారణంగా నా జీవితానికి సంబంధించిన ఒక కథనం వ్రాయ బడుతుంది. యోగ సందేశం భూగోళాన్ని చుట్టుముడుతుంది. ఇది మనిషి యొక్క సోదర తత్వాన్ని స్థాపించడంలో సహాయపడుతుంది: ఒకే పరమ పిత గురించి అవగాహన కలిగించడానికి, మానవుల యొక్క ప్రత్యక్ష అవగాహన ఆధారంగా ఐక్యత సాధించడానికి సహాయపడుతుంది.”

లాహిరీ మహాశయులు బనారస్ లో, సెప్టెంబర్ 26, 1895న మహాసమాధి చెందారు. యాభై సంవత్సరాల తరువాత, పశ్చిమ దేశాలలో, యోగముపై పెరుగుతున్న ఆసక్తి, అమెరికాలో ఉన్న పరమహంస యోగానందగారిని ఒక యోగి ఆత్మకథ వ్రాయడానికి ప్రేరేపించినప్పుడు లాహిరీ మహాశయుల జోస్యం నెరవేరింది, ఇందులో ఆయన జీవితం యొక్క అందమైన కథనం ఉంది.

ఇతరులతో పంచుకోండి