యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పదకోశం (ప – భ)

పతంజలి. ప్రాచీన యోగ వ్యాఖ్యాత; ఆయన యోగ సూత్రాలు యోగ మార్గపు నియమాలను ఎనిమిది సోపానాలుగా విభజించి చూపుతాయి: (1) యమం, నైతిక వర్తన; (2) నియమం, ధార్మిక అనుష్ఠానాలు; (3) ఆసనం, శరీర చాంచల్యాన్ని పోగొట్టి నిశ్చలతను కలిగించే సరయిన భంగిమ; (4) ప్రాణాయామం, ప్రాణాన్ని — సూక్ష్మ ప్రాణ ప్రవాహాలను — అదుపులో ఉంచుకోవడం; (5) ప్రత్యాహారం, అంతర్గతీకరణం; (6) ధారణం, ఏకాగ్రత; (7) ధ్యానం; (8) సమాధి, అధిచైతన్యానుభవం. యోగం చూడండి.

పరమగురువు. వాచ్యార్థంలో, “మహోన్నతమైన గురువు” లేదా “గొప్ప గురువు”; ఒకరి గురువుగారి గురువు. యోగదా/ సెల్ఫ్-రియలైజేషన్ విద్యార్థులకు (పరమహంస యోగానందుల వారి శిష్యులకు) స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు పరమగురువులవుతారు. పరమహంసగారికి లాహిరీ మహాశయులు పరమగురువు. మహావతార బాబాజీ పరమహంసగారికి పరమ-పరమగురువు.

పరమహంస. ఒక గురువును (చూ.) సూచించే ఆధ్యాత్మిక బిరుదు. దీన్ని ఒక సద్గురువు మాత్రమే అర్హుడయిన శిష్యుడికి ప్రదానం చేయవచ్చు. వాచ్యార్థంలో పరమహంస అంటే “సర్వోత్కృష్ట హంస” అని అర్థం. హిందూ ధర్మశాస్త్రాలలో హంస ఆధ్యాత్మిక విచక్షణను సూచిస్తుంది. స్వామి శ్రీయుక్తేశ్వరులు 1935 లో తమ ప్రియశిష్యులు యోగానందగారికి ఈ బిరుదాన్ని ప్రసాదించారు.

ప్రకృతి. విశ్వ స్వభావము : సాధారణంగా, తెలివైన సృజనాత్మక ప్రకంపనా శక్తి పరమాత్మ నుండి వెలువడుతుంది మరియు అది విశ్వం యొక్క త్రిగుణాత్మక అభివ్యక్తిగాను (కారణ, సూక్ష్మ మరియు భౌతిక) మరియు మనిషి యొక్క సూక్ష్మ శరీరం, రెండింటిగాను వ్యక్తమవుతుంది.

ప్రత్యేకంగా నియమించబడినది: మహా-ప్రకృతి అనేది సనాతమైన భగవంతుడి నుండి భిన్నత్వం కాని సృజనాత్మక మేధస్సు, సృజనాత్మక మాతృ ప్రకృతి లేదా పవిత్ర ఆత్మ. దాని స్వంత స్వీయ విశ్వ ప్రకంపనల ద్వారా మొత్తం సృష్టిని సాక్షాత్కరింపజేస్తుంది. పరా-ప్రకృతి (శుద్ధమైన ప్రకృతి) మరియు అపరా-ప్రకృతి (అపరిశుద్ధమైన ప్రకృతి) – క్రైస్తవ పరిభాషలోని పవిత్రాత్మ మరియు సాతానులతో పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి, సృష్టిలో భగవంతుని ప్రకంపనా ఉనికి యొక్క అంతర్లీనతను వ్యక్తీకరించే సృజనాత్మక శక్తి మరియు పరమాత్మ సర్వవ్యాపకత్వాన్ని మరుగుపరిచే విశ్వమాయ యొక్క అంధకార శక్తి.

ప్రాణం. జీవాన్ని నిర్మించే అణుశక్తి కన్నా సుసూక్ష్మమైన మేధాయుతమైన తేజోకణాలు. వీటిని సమిష్టిగా హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలు ప్రాణం అని అన్నాయి. దీన్ని పరమహంస యోగానందగారు “ప్రాణాణువులు” (లైఫ్ ట్రాన్లు)గా అనువదించారు. ప్రధానంగా ఇవి ఘనీభవించిన భగవంతుడి ఆలోచనలు; సూక్ష్మ ప్రపంచపు (చూ.) మూలాధార ద్రవ్యం; భౌతిక విశ్వపు జీవ నియమం. భౌతిక ప్రపంచంలో, రెండురకాలయిన ప్రాణాలు ఉన్నాయి: (1) అన్నిటినీ నిర్మించి, పోషిస్తూ, సర్వవ్యాపకమయి ఉన్న విశ్వస్పందనాశక్తి; (2) నిర్దిష్టమైన ప్రాణం లేదా శక్తి, ఇది ఐదు ప్రాణ ప్రవాహాలు లేదా చర్యల ద్వారా ప్రతి మానవ శరీరంలో వ్యాపించి, పోషించేది. ప్రాణ ప్రవాహం — స్ఫటికీకరణ; వ్యాన ప్రవాహం — ప్రసరణ; సమాన ప్రవాహం — స్వాంగీకరణ; ఉదాన ప్రవాహం — జీవాణుపాక; అపాన ప్రవాహం — విసర్జన అనే పనులను చేస్తాయి.

ప్రాణకణికలు లేదా ప్రాణాణువులు. ప్రాణం చూడండి.

ప్రాణశక్తి. ప్రాణం చూడండి.

ప్రాణాయామం. సచేతనంగా ప్రాణాన్ని (శరీరంలోని జీవానికి చురుకునిచ్చి, పోషించే సృజనాత్మక స్పందన లేదా శక్తిని) నియంత్రించడం. మానవుడిని శరీర చేతనకు కట్టిపడేసే జీవచర్యలు, ఇంద్రియానుభూతులనుంచి అతడి మనసును సచేతనగా విడదీసే సూటి అయిన యోగశాస్త్ర మార్గం ప్రాణాయామం. ఆ విధంగా ప్రాణాయామం మానవుడి చైతన్యాన్ని భగవంతుడితో అనుసంధానానికి స్వేచ్ఛనొందేలా చేస్తుంది. ఆత్మకు, పరమాత్మకు మధ్య ఐక్యతను తెచ్చే శాస్త్రీయ ధ్యాన ప్రక్రియలన్నీ యోగం కిందికే వస్తాయి. ఈ దివ్య ఐక్యతను పొందడానికి ప్రాణాయామం ఉత్కృష్టమైన యోగపద్ధతి.

పునర్జన్మ. ఈ సిద్ధాంతం ప్రకారము మానవులు పరిణామ న్యాయానికి బద్ధులై, ఉన్నతతర జన్మలకు పురోగమిస్తూ — చెడ్డ పనులు, కోరికలవల్ల వెనుకబడుతూ, ఆధ్యాత్మిక ప్రయత్నాలవల్ల పురోగమిస్తూ — ఆత్మసాక్షాత్కారం పొందేవరకు, భగవంతుడితో ఏకమయ్యేవరకూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటారు. ఆవిధంగా మర్త్యచేతనకున్న పరిమితులను, లోపాలను అధిగమించి, ఆత్మ శాశ్వతంగా బలవంతంగా పునర్జన్మ నెత్తడంనుంచి విముక్తమవుతుంది. “జయించిన వాణ్ణి నా దేవుని మందిరంలో ఒక స్తంభంగా చేస్తాను; అతను ఇంక బయటకు వెళ్ళడు.” (ప్రకటనల గ్రంథం 3:12, బైబిలు).

పునర్జన్మ సిద్ధాంతం ప్రత్యేకంగా ప్రాచ్య దేశపు వేదాంతానికి చెందింది మాత్రమే కాదు, అనేక ప్రాచీన సమాజాలు దీన్నొక ప్రాథమిక సత్యంగా భావించాయి. తొలుతటి క్రైస్తవ చర్చి పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించింది; దీన్ని తొలుతటి క్రైస్తవ జ్ఞేయవాదులూ (నాస్టిక్స్), క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా, ఓరిజన్, సెయింట్ జెరోమ్ తో సహా అనేకమంది చర్చి ఫాదర్లు దీనిపైన వ్యాఖ్యానించారు. క్రీస్తు శకం 553 లో కాన్ స్టాంటినోపిల్ లో జరిగిన రెండవ పరిషత్తులో అధికారికంగా ఈ సిద్ధాంతాన్ని చర్చి బోధలనుంచి తొలగించారు. ఈనాడు అనేకమంది పాశ్చాత్య ఆలోచనాపరులు కర్మ సిద్ధాంతాన్ని(చూ.), పునర్జన్మను, జీవితంలో అసమానతలుగా కనబడేవాటివల్ల కలిగిన భయాన్నీ, శంకనూ తొలగించే ఒక గొప్ప వివరణగా చూస్తూ, ఈ సిద్ధాంతాన్ని అంగీకరించడం మొదలుపెట్టారు.

బ్రహ్మన్ (బ్రహ్మం). కేవల పరమాత్మ.

బ్రహ్మ-విష్ణువు-శివుడు. సృష్టిలో అంతర్లీనంగా ఉన్న భగవంతుడి మూడు రూపాలు. క్రీస్తు మేధస్సు (తత్) చేసే మూడు పనులయిన — విశ్వ ప్రకృతి కార్యాలయిన — సృష్టి, స్థితి, లయాలకు ప్రతినిధులు. త్రిత్వము చూడండి.

బాబాజీ. మహావతార్ బాబాజీ చూడండి.

భక్తియోగం. సంపూర్ణ శరణాగతితో కూడిన ప్రేమనే భగవంతుడితో ఐక్యతకు, అనుసంధానానికి ప్రధానమయిన మార్గంగా చాటిచెప్పే భగవంతుని చేరే ఆధ్యాత్మిక మార్గం. యోగం చూడండి.

భగవద్గీత. “భగవంతుడి పాట.” మహాభారత ఇతిహాసంలోని పద్ధెనిమిది అధ్యాయాలున్న భారతీయ ప్రాచీన పవిత్ర గ్రంథం. చారిత్రాత్మకమయిన కురుక్షేత్ర యుద్ధం ప్రారంభించే ముందు అవతార (చూ.) పురుషుడయిన కృష్ణ భగవానులకు ఆయన శిష్యుడయిన అర్జునుడికి మధ్య జరిగిన సంవాద రూపంలో ఉంది. యోగశాస్త్రం మీద (భగవంతుడితో ఐక్యత) అపారమైన జ్ఞానాన్నిచ్చే ప్రమాణ గ్రంథం ఇది. నిత్య జీవితంలో సంతోషాన్ని, సఫలతను పొందడానికి చక్కటి సలహాలను ఇస్తుంది. గీత మానవుడి మంచి, చెడు సంస్కారాల మధ్య జరిగే అంతర్యుద్ధంమీద ఇచ్చిన ఒక ఆధ్యాత్మిక వ్యాఖ్యానము, అన్యాపదేశంగా చెప్పబడిన నీతికథ, అదే విధంగా చారిత్రాత్మకం కూడా. సందర్భానుసారంగా, కృష్ణుడు గురువుకు, పరమాత్మకు లేదా భగవంతుడికి ప్రతీక అయితే, అర్జునుడు శ్రద్ధగల భక్తుడికి ప్రతినిధి. ఈ సార్వజనీన ధర్మశాస్త్రం గురించి మహాత్మాగాంధీ ఇలా రాశారు: “ఎవరైతే గీతమీద ధ్యానిస్తారో వాళ్ళు దానినుంచి మునుపెరుగని ఆనందాన్ని, కొత్త అర్థాలను ప్రతిరోజూ కనుక్కొంటారు. గీత విప్పలేని ఆధ్యాత్మిక చిక్కుముడి ఒక్కటి కూడా లేదు.”

ప్రత్యేకంగా పేర్కొంటే తప్పించి, ఈ వై.ఎస్.ఎస్. పాఠాలలో భగవద్గీత నుంచి ఉదహరించినవి, పరమహంస యోగానందగారి సమగ్రమైన అనువాదం, వ్యాఖ్యానం అయిన గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత — రాయల్ సైన్స్ ఆఫ్ గాడ్-రియలైజేషన్ (యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురణ) అనే పుస్తకం నుండి తీసుకొన్నవి.

ఇతరులతో షేర్ చేయండి