కొత్త నిర్ణయాలు తీసుకోండి: మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి!

శ్రీ శ్రీ పరమహంస యోగానంద 1934లో నూతన సంవత్సర పండుగ సందర్భంగా పరమహంస యోగానందగారు తాను స్థాపించిన సొసైటీ యొక్క అంతర్జాతీయ ముఖ్య కేంద్రం, సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ [యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా]లో ఇచ్చిన ప్రసంగం నుండి క్రింది సారాంశాలు ఉన్నాయి. మొత్తం వ్యాసం పరమహంస యోగానందగారి ప్రసంగాల సేకరణ మరియు వ్యాసాల మూడవ సంచిక జర్నీ టు సెల్ఫ్-రియలైజేషన్ (Journey to Self-realization) అనే పుస్తకంలో ప్రచురించబడింది. (యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురణ). రాబోయే సంవత్సరంలో మీరు ఏమి చేయబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు అనే విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకోండి. మీ కోసం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోండి; దాన్ని సరిగా కొనసాగించి చూడండి, మీరు ఎంత సంతోషంగా ఉంటారో మీరే చూస్తారు. మీ మెరుగుదల కార్యక్రమాన్ని కొనసాగించడంలో విఫలమైతే మీరు మీ సంకల్పాన్ని స్తంభింపజేసినట్లే. మీకు మీ కంటే గొప్ప మిత్రుడు లేడు, గొప్ప శత్రువు లేడు. మీతో మీరు స్నేహం చేస్తే సఫలతను కనుగొంటారు. మీరు ఉండాలనుకుంటున్న లేదా సాధించాలనుకున్న దానిని నిరోధించే దైవ నియమం ఏదీ లేదు. మీరు అనుమతిస్తే తప్ప హానికర పరిణామం ఏదీ మిమ్మల్ని ప్రభావితం చేయలేదు.

మీరు అనుకున్న విధంగా మీరు కాగలరన్న విశ్వాసాన్ని ఏదీ బలహీనపరచనివ్వకండి. మీరే తప్ప అడ్డుకునే వారు లేరు. మా గురువుగారు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారు ఆ విషయం నాకు పదే పదే చెప్పినా, మొదట నమ్మడం కష్టంగా అనిపించింది. కానీ దేవుడు ఇచ్చిన సంకల్ప శక్తిని నా జీవితంలో ఉపయోగించినప్పుడు, అది నా రక్షణగా గుర్తించాను. సంకల్పాన్ని ఉపయోగించక పోవటం అంటే, రాయి వలె నిర్జీవమైన జడ పదార్థంగా అంటే – ఒక అసమర్థపు మానవునిగా ఉండిపోవటమే.

నిర్మాణాత్మక ఆలోచన ఖచ్చితంగా, ఒక అజ్ఞాతమైన శోధక జ్యోతి లాగా, మీ విజయానికి మార్గాన్ని చూపుతుంది. మీరు తగినంతగా ఆలోచిస్తే ఎల్లప్పుడూ ఏదో ఒక మార్గం కనుగొనబడుతుంది. కొద్దిసేపటి తర్వాత ఉపేక్షించే వ్యక్తులు తమ ఆలోచనా శక్తిని మసకబారుస్తారు. మీరు విజయం పొందేందుకు, మీ లక్ష్యానికి మార్గం చూపే వరకు మీ ఆలోచనను ఉపయోగించేందుకు మీ వంతు కృషి మీరు చేయాలి.

అన్ని ప్రతికూల ఆలోచనలు మరియు భయాలను తొలగించండి. దేవుని బిడ్డగా మీరు మనుష్యులలో అత్యంత శ్రేష్ఠమైన సామర్థ్యాలను కలిగి ఉన్నారని గుర్తుంచుకోండి. ఆత్మలుగా, ఎవరూ మరొకరి కంటే గొప్పవారు కాదు. ఋషుల జ్ఞానంలో వ్యక్తీకరించబడినట్లు, భగవంతుని జ్ఞానం ద్వారా మార్గనిర్దేశం పొందేటట్లు మీ సంకల్పాన్ని అనుసంధానించండి. మీ సంకల్పం వివేకంతో జోడిస్తే, మీరు ఏదైనా సాధించగలరు.

చెడు అలవాట్లు అతి చెడ్డ శత్రువులు. ఆ అలవాట్ల వల్ల మీరు శిక్షించబడ్డారు. అవి మీతో చేయకూడని పనులను చేయించి వాటి పర్యవసానాలను అనుభవించేలా చేస్తాయి. మీ ప్రయాణంలో చెడు అలవాట్లను వెనుక విడిచిపెట్టి మీరు ముందుకు సాగాలి. ప్రతిరోజూ పాత అలవాట్ల నుండి మంచి అలవాట్లకు మారాలి. ఈ రాబోయే సంవత్సరంలో మీకు అత్యంత హితకరమైన అలవాట్లను మాత్రమే ఉంచుకోవాలని గంభీరమైన తీర్మానం చేసుకోండి.

మీ అవాంఛనీయ ధోరణులను వదిలించుకోవడానికి ఉత్తమ మార్గం వాటి గురించి ఆలోచించడం కాదు; వాటిని గుర్తించవద్దు. ఒక అలవాటుకు మీపై పట్టు ఉందని ఎప్పుడూ ఒప్పుకోకండి….మీరు తప్పనిసరిగా “వద్దు” అనే అలవాటును పెంపొందించుకోవాలి. మరియు చెడు అలవాట్లను ప్రేరేపించే వాటికి దూరంగా ఉండండి.

స్వార్థం అనే సంకుచితత్వంతో మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి. మీ విజయాలలో మరియు ఆనందంలో ఇతరులను చేర్చుకోండి, అప్పుడు మీరు దేవుని చిత్తం ప్రకారం చేస్తున్నారు. మీరు మీ గురించి ఆలోచించినప్పుడు, ఇతరుల గురించి కూడా ఆలోచించండి. మీరు శాంతిని కోరుకునేటప్పుడు, శాంతి అవసరమైన ఇతరుల గురించి కూడా ఆలోచించండి. ఇతరులను సంతోషపెట్టడానికి మీకు సాధ్యమైనదంతా మీరు చేస్తే, జగత్పితను సంతోష పెడుతున్నారని మీరు కనుగొంటారు.

సామరస్యంగా జీవించాలంటే, మిమ్మల్ని పంపిన ఆయన సంకల్పం ప్రకారం చేయాలనే దృఢ సంకల్పంతో జీవించడంపై మాత్రమే మీకు ఆసక్తి ఉండాలి. ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోకండి, ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. మీ హృదయంలోని చిరునవ్వు మరియు మీ ముఖంపై వ్యక్తమయ్యే చిరునవ్వు పూర్తి సామరస్యంతో ఉండాలి. మీ శరీరం, మనస్సు మరియు ఆత్మ భగవత్ చైతన్యపు అంతరిక స్పృహ యొక్క చిరునవ్వును నమోదు చేసుకుంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ గురించి చిరునవ్వులను వెదజల్లవచ్చు.

మిమ్మల్ని ప్రేరేపించే వ్యక్తులతో ఎల్లప్పుడూ ఉండండి; మిమ్మల్ని ఉద్దరించే వ్యక్తులను మీ చుట్టూ ఉంచుకోండి. మీ దృఢ సంకల్పాలు మరియు సానుకూల ఆలోచనలను చెడు సాంగత్యంతో విషపూరితం కానివ్వవద్దు. మీకు స్ఫూర్తినిచ్చే సత్సంగాన్ని మీరు కనుగొనలేకపోయినా, మీరు దానిని ధ్యానంలో కనుగొనవచ్చు. ధ్యానంలో పొందే ఆనందమే మీరు పొందగల అత్యుత్తమ సత్సంగము.

లోపల మరియు వెలుపల కూడా మీ జీవితపు పాత్ర దేవుని ఉనికితో నిండి ఉంది, కానీ శ్రద్ధ లేకపోవడం వల్ల మీరు భగవంతుని అస్థిత్వాన్ని గ్రహించలేరు. రేడియోని శృతి చేసినట్టుగా, మీరు శృతిలో ఉన్నప్పుడు మీరు పరమాత్మను గ్రహించగలరు. అది ఎట్లనగా, ఒక సముద్రపు నీరు పోసిఉన్న సీసాకు బిరడా బిగించి సముద్రంలో వేస్తే, సీసా సముద్రపు నీటిలో తేలుతున్నప్పటికీ, దానిలోని పదార్థాలు సముద్ర జలాలతో కలవవు. కానీ బిరడా తెరవగానే లోపల ఉన్న నీరు సముద్రంలో కలిసిపోతుంది. అట్లే, మనము పరమాత్మతో సంపర్కము పొందుటకు ముందుగా అజ్ఞానము యొక్క బిరడాను తీసివేయాలి.

అనంతత్వం మన నిజవాసం. మనము కేవలం శరీరం అనే సత్రంలో కొద్దిసేపు మాత్రమే ఉంటున్నాము. మాయ అనే మత్తులో ఉన్నవారు భగవంతుని చేరే మార్గాన్ని ఎలా అనుసరించాలో మర్చిపోయారు. కానీ ధ్యానంలో తప్పిపోయిన పిల్లవాడిని దైవం పట్టుకున్నప్పుడు, దౌర్జన్యం ఇంక పనిచేయదు.

కొత్త ఆశతో నూతన సంవత్సరపు ద్వారంలోకి ప్రవేశించండి. మీరు దేవుని బిడ్డ అని గుర్తుంచుకోండి. మీరు ఎలా ఉండబోతున్నారనేది మీ వద్ద ఉంది. నీవు దేవుని బిడ్డవని గర్వించు. మీరు దేనికి భయపడాలి? ఏది వచ్చినా, అది మీకు ప్రభువే పంపుతున్నాడని నమ్మండి; రోజువారీ ఆ సవాళ్ళను జయించడంలో మీరు విజయం సాధించాలి. అందులోనే మీ విజయం ఉంది. ఆయన సంకల్పం ప్రకారం చేయండి; అప్పుడిక మిమ్మల్ని ఏదీ బాధించలేదు. ఆయన మిమ్మల్ని శాశ్వతంగా ప్రేమిస్తునే ఉంటాడు. అదే ఆలోచించండి, అదే నమ్మండి….అది తెలుసుకొండి. ఒక రోజు అకస్మాత్తుగా మీరు అమరత్వంతో దేవునిలో జీవిస్తున్నారని మీరు కనుగొంటారు.

ఎక్కువ ధ్యానం చేయండి మరియు ఏమి జరిగినా దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడని బలమైన స్పృహలో నమ్మకం ఉంచండి. అప్పుడు మాయ అనే ముసుగు తొలగిపోయి మీరు భగవంతునితో ఏకమవటం మీరు చూస్తారు. నా జీవితపు అత్యుత్తమ ఆనందాన్ని నేను అలానే పొందాను. నేను ఇప్పుడు దేని కోసం వెతకడం లేదు ఎందుకంటే ఆయనలో నేను అన్నిటినీ కలిగి ఉన్నాను. ఆస్తులన్నిటిలో అత్యంత సంపన్నమైన ఆస్తితో నేను ఎప్పటికీ విడిపోను.

నూతన సంవత్సరానికి ఇదే నా సందేశం.

ఇతరులతో షేర్ చేయండి