స్వామి శ్యామానంద గిరి: దేవుడు మరియు గురువు యొక్క ఆధ్యాత్మిక యోధుడు

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్, లాస్ ఏంజిలిస్, కాలిఫోర్నియా, ఆగస్టు 31, 1971 అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్వామి శ్యామానంద స్మారక సేవలో శ్రీ దయామాత ప్రసంగం

గత పన్నెండు సంవత్సరాలుగా భారతదేశంలో (మరియు ప్రపంచవ్యాప్తంగా) పరమహంస యోగానందగారి విశ్వాస భక్తుడు మరియు కార్యక్రమాలకు ఆధ్యాత్మిక యోధుడు-రక్షకుడు స్వామి శ్యామానంద గిరి[1]కి నివాళులర్పించడానికి మేము ఈ ఉదయం సమావేశమైయ్యాము.

ధ్యానంలో శ్రీ దయామాత, రాంచీ, జనవరి, 1959

స్వామి శ్యామానంద భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ ప్రాంతంలో పరమహంస యోగనందగారు జన్మించిన తాలూకాలో జన్మించారు. చిన్ననాటి నుండి అతను దేవాలయాల ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరియు భారతదేశంలోని సాధువుల (సత్పురుషులు) సహవాసాన్ని కోరుకున్నాడు. శ్యామానందకు పదకొండేళ్ల ప్రాయంలో, ఒక గౌరవనీయుడైన సాధువు అతని ఇంటికి వెళ్ళి లోతైన ఆధ్యాత్మిక ప్రవృత్తి ఉన్న ఈ బిడ్డ పట్ల ఆసక్తి మరియు ప్రేమను వ్యక్తం చేశాడు. ప్రాపంచిక లక్ష్యాలను విడిచిపెట్టి ఆ సాధువును అనుసరించాలని శ్యామానందకు ఆ సమయంలో గొప్ప కోరిక ఉండేది. కానీ అది జరగలేదు.

అతనికి కేవలం తొమ్మిదేళ్ల వయసప్పుడు తండ్రి మరణించిన తర్వాత (అతని తల్లి మూడు సంవత్సరాల వయసులో మరణించింది), అతను కలకత్తా సమీపంలోని మహిషాదల్‌లో తన తండ్రికి అత్యంత సన్నిహితుడు రాజా బహదూర్ సతీ ప్రసాద్ గార్గా కుటుంబంతో నివసించాడు. భారతదేశంలోని రాజ కుటుంబాలలో ఇది ఒకటి, ఆ సమయంలో వారు దాదాపు ఐదు వందల గ్రామాలను కలిగి ఉండేవారు మరియు నివాసులను దయతో పరిపాలించారు. శ్యామానంద గార్గా కుటుంబానికి పెద్ద కుమారుడిగా పెరిగాడు మరియు ప్రేమించబడ్డాడు.

మహిషాదల్‌లో అతను తన విద్యను అభ్యసించాడు, అతను పరిపక్వం చెందడంతో, న్యాయ అధ్యయనం వైపు మొగ్గు చూపాడు. అతను తన ప్రియమైన బాల్య స్నేహితురాలు గార్గా కుమార్తెను వివాహం చేసుకున్నాడు. కానీ అతని మనో నేపథ్యంలో ఎల్లప్పుడూ భగవంతుడి కోసం తీవ్రమైన కోరిక ఉంది. అతను తరచుగా తనను తాను ఇలా ప్రశ్నించుకునేవాడు, “నేను ఈ ప్రత్యేక వాతావరణంలో ఎందుకు ఉన్నాను? నాకు ఉద్దేశించబడ్డ జీవితం ఇది కాదు.”

అతని వైవాహిక జీవితం ఇద్దరు కుమార్తెలతో దీవించబడింది; కానీ వారు ఇంకా శిశువులుగా ఉన్నప్పుడు అతని భార్య అనారోగ్యంతో మరణించింది. అప్పుడు ఆమె వయసు ఇరవై. అతని గురించి నేను గుర్తుంచుకునే అత్యుత్తమ లక్షణాలలో ఒకటి అతని భార్య పట్ల అంకితభావంతో కూడిన భక్తి మరియు గౌరవం. నా ప్రయాణాలన్నిటిలో, నా అనుభవంలో, నేను ఏ ఇతర వ్యక్తిలోనూ అది ఇంతగా చూడలేదు. మన గురువైన పరమహంస యోగానందగారు భారతదేశానికి ఒక ప్రత్యేకమైన ఆదర్శం అని తరచూ చెప్పే గొప్ప భార్య-భర్తల సంబంధానికి ఆయన ఖచ్చితమైన వ్యక్తీకరణ.

ఈ యువ న్యాయవాది భార్య మరణంతో, అతని జీవితంలో ఆ అధ్యాయం ముగిసింది. అతను దేవుడిని వెతకడం పట్ల చాలా శ్రద్ధగా మారాడు. చిత్రంగా, ఈ కాలంలో (1935-36) పరమహంసగారు భారతదేశంలోనే ఉన్నారు. గురుదేవులు తన గురువు స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి మరణానికి సంతాపం చెందుతున్న ఈ కాలంలో శ్యామానంద కూడా పూరిలోనే ఉన్నారు. కానీ అప్పటికి ఇంకా వారు కలిసే సమయం బహుశా ఆసన్నం కాలేదు.

తరువాతి ఇరవై మూడు సంవత్సరాలు శ్యామానంద ప్రపంచాన్ని విడిచిపెట్టి సంచార సన్యాసిగా, సాధువులను వెతుక్కుంటూ భారతదేశంలోని ఆశ్రమాలు మరియు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అతను ఒక సాధువు కోసం ఒక ఆశ్రమం కట్టించారు, మరియు అక్కడ పది సంవత్సరాలలో ఎక్కువ కాలం గడిపారు, కానీ ఆ గురువు నుండి దీక్ష (గురు-శిష్య దీక్ష) లేదా సన్యాసం (సన్యాస ప్రమాణం) స్వీకరించలేదు.

1958లో నా భారతదేశ సందర్శన కాలంలో, శ్యామానంద మొదటిసారి నన్ను చూడటానికి వచ్చినప్పుడు, అతను ఆ మధ్యనే ‘ఒక యోగి ఆత్మకథ’ గ్రంథాన్ని చదివాడు. మా గురుదేవులు పరమహంస యోగానందగారి యొక్క అద్భుతమైన జీవితం వలన అతను చాలా ప్రభావితమయ్యాడు మరియు ఆధ్యాత్మికంగా ఉత్తేజపరచబడ్డాడు. ఆ సమయం వరకు అతను జ్ఞాన యోగాన్ని అనుసరించాడు. ప్రపంచ ప్రఖ్యాత జ్ఞాన యోగి – జ్ఞానం మరియు వివక్ష మార్గానికి నిదర్శనమైన స్వామి వివేకానంద అతనికి ఆధ్యాత్మిక ఆదర్శం. శ్యామానంద నాతో ఇలా అన్నాడు, “నేను చాలా సంవత్సరాలుగా ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాను; కానీ ఇప్పటికీ నా సాధనలో ఏదో లోటు ఉంది.” (సాధన అంటే దేవుడిని వెతకడంలో సాధకుడు స్వీకరించే ఆధ్యాత్మిక విశ్వాసాలు మరియు క్రమశిక్షణా.) శ్యామానంద తన స్వంత అన్వేషణ గురించి నాకు కొంచెం చెప్పినప్పుడు, లోపించినది ఏదో నాకు తెలిసింది. ఇది చాలా మంది మనుషులలో లేని గుణం: దేవుని పట్ల ప్రేమ. ఈ అత్యవసరమైన అంశం ప్రపంచంలోని ఏ గొప్ప మతాలలోనూ తగినంతగా నొక్కి చెప్పబడలేదు. బదులుగా, మనిషి వేడుక మరియు వేదాంత చర్చలలో తప్పిపోతాడు. పాశ్చాత్య దేశాలలో చాలామంది దేవునికి భయపడతారు. మనం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టినప్పుడు మనల్ని క్రమబద్ధీకరించి, మనం స్వర్గం లేదా నరకం యొక్క ఏ భాగానికి వెళ్తామో నిర్ణయించే గొప్ప న్యాయమూర్తిగా ఆయనను భావిస్తారు. దేవుని పట్ల మా గురుదేవుల భావన అది కాదు. ఆయన ప్రేమమయుడైన ప్రభువు, దయామయుడు మరియు కరుణామయుడైన దేవుడు. మనం ఆయన నుండి ఏదైనా ఆశిస్తూ కాక, మనం ఆయన్ని ప్రేమిస్తున్నందున, మనం ఆయనకు స్వంతమైనందున ప్రార్థిస్తాము.

ఈ క్రమంలోనే నేను శ్యామానందతో మాట్లాడాను. తరువాత కొంతమంది ఆశ్రమ భక్తులతో అతను ఇలా అన్నాడు, “ఆమె సమక్షం నుంచి వచ్చేసిన తర్వాత, నేను కోరుకున్నట్టుగానే నాలో లోపించిన ఈ అంశాన్ని ఆవిడ నాకు అనుగ్రహించిందని నాకు తెలిసింది: నేను దేవుడిపై గాఢమైన కోరికను, గొప్ప ప్రేమను అనుభవించాను.”

ఆ సమయంలో భారతదేశంలో ఉన్న మా సమస్యలను క్లుప్తంగా స్పృశించాలనుకుంటున్నాను. గురుదేవులు తన శరీరాన్ని విడిచిపెట్టడానికి కొంత కాలం ముందు నాకు ఇలా చెప్పారు, “ఇక నేను భారతదేశానికి తిరిగి వెళ్లలేను. కానీ అక్కడ మనకు ఉన్న కార్యకలాపాలపై నాకున్నంత ఆసక్తిని మీరు కూడా తీసుకుంటారని, భారతదేశంలో యోగదా సత్సంగ సొసైటీ కోసం నేను చేసేటంతగా మీరు కూడా చేస్తారన్న హామీని మీనుంచి నేను కోరుకుంటున్నాను.” నేను ఆయనకు మాట ఇచ్చాను. ఆఖరుకు 1958లో నేను మన ఆధ్యాత్మిక మాతృభూమిని మొదటిసారిగా సందర్శించగలిగాను.

ఆ సందర్శన మొదటి భాగంలో నా కలలన్నీ చెదిరిపోయాయి, ఎందుకంటే గురువుగారు ఏర్పరచిన కార్యం చాలా ఘోరంగా క్షీణించింది. క్రిస్మస్ సందర్భంగా నేను ఆశ్రమంలో కొంతమంది భక్తులతో ఉన్నాను. నేను ఆశించిన స్ఫూర్తి వారిలో కనపడక నా హృదయం భారంగా ఉంది. నేను నిశ్శబ్దంగా వేడుకల నుండి వైదొలిగి, పైన ఉన్న నా చిన్న గదికి వెళ్ళాను. దుఃఖ పూరిత కన్నీళ్ళతో నేను గాఢంగా సుదీర్ఘమైన ధ్యానం చేసాను. ఎందుకంటే ఈ దేశానికి చెందిన ఎవరో ఒక దృఢమైన సమర్ధవంతుడైన భక్తుని మద్దతు లేకుండా భారతదేశంలోని గురువుగారి సంస్థకు లాభదాయకమైనదేదీ సాధించలేనని నాకు తెలుసు. ఆ రాత్రి నేను చేసిన ప్రార్థనకు జవాబు జనవరి 5న మేము మా దక్షిణేశ్వర్ ఆశ్రమంలో గురుదేవుని పుట్టినరోజును జరుపుకున్నప్పుడు వచ్చింది. కూర్చుని ఉన్న ప్రేక్షకులలో నేను శ్యామానందను చూసాను. నేను అతడిని ఒక్కసారి మాత్రమే కలుసుకుని మాట్లాడాను. కానీ ఈసారి అతను ధ్యానంలో అంతర్ముఖుడై, అందరిలో శ్రేష్ఠంగా చాలా నిశ్చలంగా, నిశ్శబ్దంగా, గుంపులో కుడి వైపున కూర్చొని ఉండడం చూసి ఇలా అనుకున్నాను “ఇతడే దేవుడిని తీవ్రంగా వెతుకుతున్న వ్యక్తి.”

శ్రీ దయామాత 1964 దక్షిణేశ్వర్‌లోని వై.ఎస్.ఎస్. ఆశ్రమంలోని ప్రార్థనా మందిరంలో క్రియాయోగ ప్రారంభ వేడుకను నిర్వహిస్తున్నారు. స్వామి శ్యామానంద కుడి వైపున కనిపిస్తారు.

ఆ కార్యక్రమం తర్వాత అతను ముందుకు వచ్చాడు, తనను తాను తిరిగి పరిచయం చేసుకుని “మీరు రాంచీకి వెళ్ళినప్పుడు మీ బృందంతో పాటు నేను కూడా రావాలని చాలా కోరుకుంటున్నాను” అని చెప్పాడు. అప్పుడు రాంచీకి అదే నా మొదటి పర్యటన, అక్కడ గురుదేవులు బాలుర పాఠశాలను స్థాపించారు. అతను మా వెంట రావడాన్ని నేను అంగీకరించాను.

తరువాతి రోజుల్లో, అతని ఆలోచన నా మనో నేపధ్యంలో ఉండిపోయింది. అతను తన సొంత కారులో రాంచీకి వెళ్ళాడు, అతను చేరిన కొన్ని గంటల తర్వాత మేము అక్కడికి చేరుకున్నాము. మరుసటి రోజు ఉదయం నేను లేచి ఆశ్రమం మైదానంలో నడుస్తున్నాను. గురుదేవులు ఈ పాఠశాలను స్థాపించి, ఇక్కడ నివసిస్తూ మార్గ నిర్దేశం చేస్తూ ప్రభావితం చేసిన రోజుల గురించి నేను ఆలోచించాను. ఆరుబయట పాఠాలు నేర్చుకుంటూ ఆ రోజుల్లో వెయ్యి మంది విద్యార్థులు ఉండేవారు. దానితో పోల్చితే నేను వచ్చినప్పుడు – చాలా కొద్దిమంది విద్యార్థులు మరియు దుఃఖకరంగా నిర్లక్ష్యం చేయబడిన ఆశ్రమం. నా గుండె భారంగా ఉంది. అప్పుడు అవతల వైపు నుండి నా ఆలోచనల్లోని మనిషి నా వైపు రావడం చూశాను. మేము ఒకరినొకరు పలకరించుకుని ఆ తరువాత మైదానం చుట్టూ నడుస్తూ మాట్లాడుకున్నాము. పరమహంసగారు భారతదేశంలో తన కార్యం కోసం కన్న కలలు మరియు కొన్ని ఇబ్బందుల గురించి చెప్పడం ప్రారంభించాను. నేను అలా చేస్తున్నప్పుడు, ఒక అపరిచితుడితో నేను ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నానో అని ఆశ్చర్యపోతూ ఉండగా అతను నాకు అపరిచితుడు కాదని అనిపించింది. గురుదేవులను గురించిన ప్రతి మాట జీర్ణించుకుంటూ ప్రతిస్పందిస్తూ కనిపించాడు అతను. నేను మోస్తున్న గొప్ప భారాన్ని కూడా అతను అర్థం చేసుకున్నట్లు అనిపించింది.

అతను ఒక రోజు ఆశ్రమానికి వచ్చాడని, అప్పటికి నేను దాదాపు ఒక సంవత్సరంగా భారతదేశంలో ఉండి ఏమీ సాధించని కారణంగా మందిరం ముందు ధ్యానంలో కూర్చొని చెక్కిళ్ళపై కన్నీళ్లు ప్రవహిస్తూ మార్గదర్శకత్వం కోసం దేవుడిని ప్రార్థిస్తుండటం చూశాడని తెలుసుకున్నాను. తాను అన్నింటినీ విడిచిపెట్టి ఈ మార్గాన్ని అనుసరిస్తానని ఆ సమయంలో ప్రతిజ్ఞ చేశానని ఆయన చెప్పాడు.

ఈ గత పన్నెండు సంవత్సరాలలో అతను ఆ ప్రమాణం నెరవేర్చడం కంటే ఎక్కువే చేశాడు; అతను ఈ మార్గాన్ని అనుసరించడమే కాకుండా విశ్వసనీయంగా సేవ చేశాడు. భారతదేశంలో మా సంస్థ 1920లో పరమహంసగారు అమెరికాకు బయలుదేరినప్పటి నుండి నెమ్మదిగా విచ్ఛిన్నమవుతున్న స్థితి నుంచి, దేశవ్యాప్తంగా అనేక శాఖలు-ధ్యాన కేంద్రాలు, యువత విద్య కోసం శిశు-విద్యాలయం నుండి కళాశాల వరకూ అనేక పాఠశాలలను కలిగి ఉన్న గొప్ప గౌరవనీయమైన సంస్థగా నిర్మించాడు. పిల్లలు విద్యను పొందే అవకాశం లేని మారుమూల గ్రామాల్లోనూ మేము పాఠశాలలను ప్రారంభించాము.

భారతదేశ వ్యాప్తమైన మా కార్యాభివృద్ధికి స్వామి శ్యామానంద వెన్నెముక వంటి వారు. సంస్థ సేవలో ప్రయాణిస్తూ భారతదేశంలో కానీ విదేశాలలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రజల గౌరవాన్ని మాత్రమే కాకుండా వారి యొక్క గాఢమైన ప్రేమను కూడా పొందారు. ఆయన గొప్పగా ప్రేమించగలిగి ఉండేవారు; అందువలన అందరూ ఆయనను తిరిగి సహజంగా ప్రేమించేవారు.

శ్యామానంద సాధుస్వభావులైన మా రెండవ అధ్యక్షులు రాజర్షి జనకానంద జీవితం నుండి చాలా ప్రేరణ పొందారు, రాజర్షి ఆయనకు ఆదర్శం అయ్యాడు. తనదైన రీతిలో అతను రాజర్షి యొక్క భారతీయ ప్రతిరూపం అని నేను చెబుతాను.

స్వామి శ్యామానంద గురువు మరియు దైవ కార్యం కోసం మాత్రమే జీవించారు. అంతటి సేవా-సామర్థ్యం మరియు సేవ పట్ల ఉత్సాహం ఇతరులలో నేను అరుదుగా చూశాను. తన జీవితంలో చివరి రోజుల వరకు కూడా, అతను భారతదేశంలో ఇంకా చేయాల్సిన పని గురించే మాట్లాడేవారు. ఈ కార్యాభివృద్ధికి అతను అనేక లక్ష్యాలను నిర్దేశించారు. ఆయన అనారోగ్యంగా ఉన్న సమయంలో ఒక సాయంత్రం మేము ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, మాతో ఇలా అన్నారు, “నేను ఇప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెడితే, నేను దానిని ఒకే ఒక్క కోరికతో వదిలేస్తాను: గురు కార్యార్ధమై నా సేవను కొనసాగించడానికి నేను త్వరగా ఈ భూమికి తిరిగి వస్తాను, అదే జ్వలిస్తున్న నా హృదయ వాంఛ.”

స్వామి శ్యామానంద చివరి ఫోటోలలో ఒకటి, మదర్ సెంటర్, 1970

ఒక సందర్భంలో, అతను ఆసుపత్రిలో ఉన్నప్పుడు, నేను అతని గదిలోకి వెళ్ళాను, అతని చెంపల నుండి కన్నీళ్లు ప్రవహించడాన్ని నేను గమనించాను. అతను సులభంగా కన్నీళ్లు పెట్టుకునే వ్యక్తి కాదు. నేను పడక దగ్గరకు వెళ్ళి, “ఏమిటి విషయం?” అని అడిగాను. నేను దగ్గరగా వెళ్లి అతని ముఖంలో పారవశ్య భావాన్ని గమనించినప్పుడు, ఆ కన్నీళ్లు దుఃఖానివి కావు ఆనందానివి అని నాకు తెలిసింది. అతను నా ఉనికిని ఆలస్యంగానే తెలుసుకున్నాడు, అంతగా మనస్సు అంతర్ముఖమై ఉంది. ఆపై అతను నాతో ఇలా అన్నాడు, “ఓ అమ్మా, నేను చాలా అద్భుతమైన అనుభవాన్ని పొందాను. నాకివి చివరి రోజులని, ఈ అనారోగ్యం నుండి నేను కోలుకోవడం దేవుని చిత్తం కాకపోవచ్చని నాకు బాగా తెలుసు. నేను ఈ మంచం మీద పడుకున్నప్పుడు నా హృదయంలో ఒకే ఒక్క ప్రార్థన ఉంది: ‘దేవుడా, నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను. ఆ కోరికను తీర్చండి! నేను నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను.’ నేను ప్రార్థించినప్పుడు, అకస్మాత్తుగా అలాంటి ప్రేమ, అలాంటి ఆనందం నన్ను ముంచెత్తింది–ఓ అమ్మా, అలాంటి ఆనందం! ఆపై బాబాజీ వచ్చారు. ఆయన అంతా ప్రేమయే; ఓహ్, చాలా ప్రేమమయం! నేను ఆ ప్రేమతో పూర్తిగా నిండిపోయాను. ఎంత ఆనందం, ఓహ్, నాది ఎంత ఆనందం! జీవితానికి ఇది మాత్రమే లక్ష్యం అని నాకు తెలుసు.”

నిజానికి, మనం ప్రపంచంలో ఉన్నా లేదా మఠాలలో ఉన్నా జీవితం యొక్క అంతిమ లక్ష్యం దేవుడి కోసం పనిచేయడం మరియు మన కార్యకలాపాలన్నింటినీ ఆయనకు అంకితం చేయడం మాత్రమే కాదు–మనము దేవుడిపై ఎంత ప్రేమను పెంపొందించుకోవాలంటే, మన ప్రతి ఆలోచనలోనూ ఆయన మన రోజువారీ సహచరుడుగా అయిపోవాలి. ఈ ఆదర్శం స్వామి శ్యామానంద గిరిలో పూర్తిగా విరిసింది, దాన్ని అతి కొద్దిమంది మాత్రమే ఆచరించగలిగినంత ఉన్నతంగా ఆయన జీవించాడు. అతని కార్యకలాపాలన్నీ ఈ ఆలోచన చుట్టూ కేంద్రీకృతమై ఉండేవి: “నా ప్రభూ, నేను నీకు ఎలా సేవ చేయగలను?”

స్వామి శ్యామానంద గిరి అతనిని ఎరిగిన మనందరి హృదయాలలో గొప్ప శూన్యతను మిగిల్చాడు. ఇక్కడ మరియు భారతదేశంలో మా కార్యంలో అతను గొప్ప శూన్యతను మిగిల్చాడు. మీ అందరికీ తెలిసినట్లుగా, అతను పరమహంస యోగానందగారి సంస్థ యొక్క అంతర్జాతీయ ప్రధాన కార్యాలయమైన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు, మరియు భారతదేశంలోని మా సంస్థ యోగదా సత్సంగ సొసైటీకి జనరల్ సెక్రటరీ/కోశాధికారి. ఏదో ఒక రోజు మనలో ప్రతి ఒక్కరూ దేవుని ఆ పిలుపుకు సమాధానం ఇవ్వాలని మనందరికీ తెలుసు, ఇది బాధాకరమైన సమయం కాదు. ఒక శూన్యత ఉంది, కానీ అతను ఎంతో ప్రేమగా పూజించి తన బాల్యం యొక్క తొలి నాళ్ల నుండి తన జీవితాన్ని అంకితం చేసిన మధురమైన జగన్మాత చేతుల్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు మాకు తెలుసు కనుక మనం గొప్ప శాంతి మరియు ఆనందాన్ని అనుభవిస్తున్నాము.

ఇప్పుడు మనం ఆరోహణ వేడుకతో ముందుకు వెళ్తాము, ఇది భారతదేశంలో శరీరం నుండి ఆత్మ నిష్క్రమణ తర్వాత నిర్వహించబడే కార్యక్రమము మరియు దహన సమయంలో నిర్వహించిన పురాతన వేద ఆచారాలలో భాగం. భారతదేశం యొక్క గ్రంథాలు అగ్నిని గొప్ప శుద్ధీకరణ మాధ్యమం అని బోధిస్తున్నాయి. మీ ముందు మండుతున్న మంట మృత దేహాన్ని దహనం చేయడాన్ని సూచిస్తుంది, తద్వారా అమరమైన ఆత్మ శరీర బంధనం నుండి విముక్తి అయ్యి దేవునిలోని తన నిజావాసం అనే స్వర్గం వైపుకు చేరుకుంటుంది.

[ఈ సందర్భంగా పవిత్ర వేద ప్రోక్తమైన ప్రార్థనతో శ్రీ దయామాత సూచనాత్మకమైన అగ్నిని వెలిగించి ఆరోహణ వేడుకను నిర్వహించారు. ధ్యానంతో ఈ కార్యక్రమము కొనసాగింది; అప్పుడు “దౌ అండ్ ఐ ఆర్ వన్ (Thou and I Are One)” అనే పరమహంస యోగానందగారి పద్యం యొక్క పఠనం, జగన్మాత భక్తి గీతం, మరియు ముగింపు ప్రార్థన:]

పరమేశ్వరా, జగన్మాతా, సఖా, ప్రియదైవమా, భగవాన్ కృష్ణ, జీసస్ క్రైస్ట్, మహావతార బాబాజీ, లాహిరీ మహాశయా, స్వామి శ్రీయుక్తేశ్వర్ జీ, పూజ్య గురుదేవ పరమహంస యోగానందజీ, అన్ని మతములకు చెందిన మహాత్ములారా మీ అందరికీ మేము నమస్కరిస్తున్నాము.

జగన్మాత, నీవే మా జీవితం, నీవే మా ప్రేమ, నీవే సర్వ మానవజాతి కోరుకునే అత్యున్నత లక్ష్యం. మా భక్తి అనే గర్భగుడిలో, నీ ప్రేమ సదా ప్రకాశించుగాక, అందరి హృదయాలలో, మేము నీ ప్రేమను మేల్కొలప గలిగెదము గాక.

స్వామీ శ్యామానంద గిరి ఆత్మను ఆశీర్వదించు. నీ అనంత ప్రేమలో ఆయనను ఐక్యం చెయ్యి. దివ్యధామానికి ఎగురుతున్న అతని ఆత్మను రక్షించి దారిచూపు. కరుణ, సౌమ్యత మరియు అవగాహన నిండిన నీ చేతుల్లో అతను విశ్రాంతి తీసుకోనివ్వు. అతను నీ బిడ్డ, ఎల్లప్పుడూ అతనితో ఉండు. మా ప్రేమ, చిత్తశుద్ధి మరియు సంతోషం (దేహ పంజరం నుండి అతను పొందిన స్వేచ్ఛకు సంతోషిస్తూ) అనే రెక్కలపై అతనిని పంపుతున్నాము. నీవే మా ఆత్మల యొక్క అత్యున్నతమైన ప్రేమ, నీలో ఎప్పటికీ స్థిరంగా ఉండగలిగేటట్లు అతని చైతన్యాన్ని ఉద్ధరించండి.

ఈ మర్త్య లోకంలో మిగిలిపోయిన మేము కూడా ఆయన వలె కర్తవ్యం నిర్వహించగలుగునట్లు, వాటిని విధులవలె కాక తోటి వ్యక్తులకు సేవ చేయడం ద్వారా నీకు సేవ చేయడం అనే ఆశీర్వచనంగా స్వీకరించగలిగేటట్లు ఆశీర్వదించు.

జగన్మాతా, మీ దివ్య ప్రణాళిక ప్రకారం మా జీవితాలను మలుచు. మా ప్రేమ మరియు భక్తి అనే పుష్పాలను సర్వవ్యాపకత్వం అనే తమ పాదాల వద్ద ఉంచుతున్నాము. మేము నీకు నమస్కరిస్తున్నాము.

ఓం. శాంతి. శాంతి. శాంతిః

[1] శ్రీ దయామాత అతని సన్యాసి పేరుతో సూచించినప్పటికీ స్వామి శ్యామానంద చాలా మంది వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సభ్యులకు అతని ఇంటి పేరు బినయేంద్ర నారాయణ్ దూబేగా తెలుసు. దయామాత అతనికి యోగాచార్య (యోగా గురువు) అనే బిరుదును ప్రదానం చేసినప్పటి నుండి యోగాచార్య బినయ్ నారాయణ్ గా తెలుసు. అక్టోబర్ 1970లో అతను శ్రీ దయామాత నుండి అధికారిక సన్యాస దీక్ష (సన్యాస ప్రమాణం) తీసుకున్నాడు; అప్పుడు ఆమె అతనికి స్వామి శ్యామానంద గిరి అనే పేరును ప్రదానం చేశారు.

ఇతరులతో షేర్ చేయండి