మీ లక్ష్యాలను సాధించడానికి చొరవ యొక్క శక్తిని ఉపయోగించుకోవడం గురించి పరమహంస యోగానందగారు

16 జనవరి, 2024

ఒక పరిచయం:

వాగ్దానాలతో దూసుకుపోతున్న నూతన సవంత్సరంలోకి మీరు వెళుతున్నప్పుడు — దాని తాజా సామర్థ్యాలను స్వీకరిస్తూ మరియు ఉల్లాసకరమైన ఆశా భావనను గ్రహిస్తూ — మీ విలువైన ఆధ్యాత్మిక మరియు భౌతిక లక్ష్యాలన్నిటినీ స్థిరంగా ముందుకు తీసుకువెళ్ళే రహస్యం గురించి పరమహంస యోగానందగారి వివేకవంతమైన దృష్టికోణాన్ని మేము మీకు అందించాలనుకొంటున్నాం.

తన వ్యాసం “చొరవ చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోడం” (మానవుడి నిత్యాన్వేషణ పుస్తకంలో అందుబాటులో ఉన్నది) లో, ఆయన ఇలా వ్రాశారు: విశాలమయిన ఈ ప్రపంచపు అఖండ ప్రకృతిని, తమ జీవితకాలమంతా హడావిడిగా అటూ ఇటూ పరుగులు పెడుతున్న ఈ మానవ జనసమూహాలను చూసినప్పుడు, ఇదంతా దేని గురించి అని విస్మయం చెందకుండా ఉండలేరు. మనం ఎక్కడికి వెళుతున్నాం? మన ఉద్దేశమేమిటి? మన గమ్యాన్ని చేరడానికి అత్యుత్తమయిన, కచ్చితమయిన మార్గమేమిటి?

చొరవ, మానవుడిలో ఉన్న గొప్ప గుణాలలో ఒకటి, అని ఆ వ్యాసంలో వివరిస్తున్నారు. మరియు ప్రతి ఆత్మలో ఉన్న అనంతమైన సామర్థ్యం గురించి లోతైన అవగాహనతో ఆయన పాఠకులను ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు: “ఈ దివ్య బహుమతితో మీ జీవితంలో మీరేం చేశారు? ఎంతమంది జనాలు నిజంగా తమ సృజనాత్మక సామర్థ్యాన్ని ఉపయోగించుకోడానికి ప్రయత్నించారు?”

మీరు గాఢంగా ధ్యానం చేస్తూ, మీ కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దివ్యమైన ప్రోత్సాహాన్ని మరియు తోడ్పాటును నిజంగా పొందేందుకు — చొరవ అనే ఈ కీలకమైన ఆత్మ-గుణాన్ని అలవరచుకోవడం కోసం, 2024 మొదటి వార్తాలేఖను ఉపయోగించుకోమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

పరమహంసగారు ఊహించినట్లుగా చొరవ ఉన్న వ్యక్తిగా మారడం మీ శక్తిలో ఉందని నమ్మండి: “దూసుకుపోయే నక్షత్రంలా కీర్తించదగినవాడు — ఏమీ లేనిదాన్నుంచి ఏదో ఒకటి సృష్టిస్తూ పరమాత్ముడి గొప్పదయిన ఆవిష్కారశక్తి ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు.”

పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:

మిమ్మల్ని మీరీ ప్రశ్న వేసుకోండి: “ఇంకెవ్వరూ చేయని విధంగా దేన్నయినా చేయడానికి నేనెప్పుడయినా ప్రయత్నించానా?” చొరవచేసే ప్రయత్నంలో ఆచరణాత్మకమయిన మొట్టమొదటి మెట్టు అది.

చొరవ అనేది దేన్నయినా సృష్టించగల సామర్థ్యం; సృష్టి చేయడమంటే ఇంతకు ముందు ఎవ్వరూ చేయని దేన్నయినా చేయడం అని అర్థం. పనులను కొత్త తరహాగా చేయడానికి, కొత్త వస్తువులను సృష్టించడానికి ప్రయత్నించడం. చొరవ అనేది మీరు సృష్టికర్త నుంచి సూటిగా పొందిన సృజనాత్మక సామర్థ్యం.

మీరు దేన్నయినా అద్భుతమైనదాన్ని సృష్టించాలని కోరుకుంటే, మౌనంగా కూర్చుని, ధ్యానంలోకి గాఢంగా వెళ్ళి, మీలో ఉన్న ఆ అనంత, ఆవిష్కరణ, సృజనాత్మక శక్తితో అనుసంధానం కండి. ఏదయినా కొత్తదానికోసం ప్రయత్నించండి. కాని ఆ గొప్ప సృజనాత్మక ప్రధానతత్వం మీరు చేసే ప్రతిదాని వెనకా ఉందని తప్పకుండా ఎప్పుడూ తెలుసుకోండి; ఆ సృజనాత్మక మూలకారణం మీరు చేసేది జరిగేలా చూస్తుంది.

మిమ్మల్ని మీరు విశ్వశక్తితో అనుసంధానం చేసుకోండి, మీరు పరిశ్రమలో పనిచేస్తున్నా, వ్యాపార ప్రపంచంలో ప్రజలతో కలిసి తిరుగుతున్నా, ఎల్లప్పుడూ ప్రతిజ్ఞ చేయండి: “నాలో అనంతమైన సృజనాత్మక శక్తి ఉంది. ఏదో ఒకటి సాధించకుండా నేను మరణించను. నేను భగవంతుడి మనిషిని, ఆయన వివేకమున్న జీవిని. నేనా పరమాత్ముడి సామర్థ్యాన్ని, నా ఆత్మ చొచ్చుకుపోయే స్వభావపు మూలాధారాన్ని. వ్యాపార ప్రపంచలోను, భావనా ప్రపంచలోను, విజ్ఞాన ప్రపంచంలోను నేను కొత్త ఆవిష్కరణలను చేస్తాను. నేను నా తండ్రి ఒక్కటే. నా సృజనాత్మకమూర్తి అయిన తండ్రిలా నేను కోరిన దేన్నయినా నేను సృష్టిస్తాను.”

గొప్పవాళ్ళవడానికి, చొరవ అనే ఈ అసాధారణ సామర్థ్యాన్ని పెంపోందించుకోడానికి ఒక మార్గం ఉంది. జ్ఞానం ద్వారా, సరయిన శిక్షణ ద్వారా, సెల్ఫ్-రియలైజేషన్ (యోగదా సత్సంగ) బోధలను అభ్యాసం చేయడం ద్వారా మీరు చొరవచేసే సామర్థ్యాన్ని వృద్ధి చేసుకొని అది పూర్తిగా ప్రాధాన్యమున్న పాత్ర వహించేలా మీరు దాన్ని చేయగలరు.

మా గురుదేవులు, స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు, తరచుగా అంటూండేవారు: “దీన్ని గుర్తుంచుకో: మీలో గనక నిజంగా ఆ దివ్యమైన విశ్వాసం ఉన్నట్లయితే, మీరు కోరుకున్నది ఈ విశ్వంలో గనక లేనట్లయితే, మీ కోసం అది సృష్టింపబడుతుంది.” ఆ అంతఃశక్తిమీద, నా సంకల్పపు ఆధ్యాత్మిక శక్తిమీద నాకు మొక్కవోని విశ్వాసముంది. నేను కోరిన వస్తువులను ఇవ్వడానికి ఏవో కొత్త అవకాశాలు రావడం నేనెప్పుడూ గమనించాను.

మీరు మీ సంకల్పశక్తిని అభ్యసించాలి. మీరు నిశ్చయమైన మనస్సుతో ఒక జ్వాలలా ముందుకుసాగితే, మీ మార్గంలోని ప్రతి అడ్డంకి దగ్ధమైపోతుంది.

ఏది మంచిదో, దాన్ని నెరవేర్చడం కోసం అవసరమైతే సముద్రాన్నే ఇంకింపజేయగలిగేటటువంటి సంకల్పశక్తిని మీరు తప్పకుండా అభివృద్ధి చేసుకోవాలి. ధ్యానం చేయడానికి అధికమైన సంకల్పశక్తిని ఉపయోగించాలి. మనం మన దివ్య సంకల్పాన్ని కనుగొనాలని, ఆయన్ని అన్వేషించడానికి దాన్ని ఉపయోగించాలని భగవంతుడు కోరతాడు. భగవంతుణ్ణి అన్వేషించే ఈ కార్యసాధక సంకల్పశక్తిని పెంపొందించుకోండి. గంభీరమయిన మాటలు మీకు విముక్తిని ప్రసాదించలేవు, కాని ధ్యానం ద్వారా మీరు చేసే స్వప్రయత్నాలు మీకు మోక్షాన్నిస్తాయి.

జ్ఞానాన్ని బోధించే సద్గురువుగా ఉండాలని వారి గురుదేవులు ఆయనతో చెప్పినప్పుడు, చొరవ యొక్క దివ్య శక్తిని పరమహంస యోగానందగారు ఏ విధంగా ఉపయోగించుకున్నారనే కథనాన్ని, వై.ఎస్.ఎస్. బ్లాగ్ లో మీరు చదవవచ్చు. పరమహంసగారి వ్యక్తిగత వృత్తాంతం మరియు ఈ కథనంలో ఆయన ఇచ్చిన సలహా — మీ స్వీయ ప్రయత్నాలలో విజయం సాధించడానికి అవలంబించవలసిన వైఖరులు — సదా స్ఫూర్తిదాయకం.

ఇతరులతో పంచుకోండి