ఈశ్వరుడి అనంతశక్తి మిమ్మల్ని పోషిస్తుంది

పరమహంస యోగానందగారి “చొరవచేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోడం” నుండి సారాంశము. వై.ఎస్.ఎస్. ప్రచురించిన పరమహంస యోగానందగారి ప్రసంగాల, వ్యాసాల సంకలనం అయిన మొదటి సంపుటం మానవుడి నిత్యాన్వేషణలో దీనిని పూర్తిగా చదవవచ్చు.

యోగ శాస్త్రంపై వారి ప్రసంగాన్ని వినడానికి వచ్చిన ప్రేక్షకులతో నిండిపోయిన ఫిల్హార్మోనిక్ ఆడిటోరియం, లాస్ ఏంజిలిస్, వద్ద జనవరి 1925లో తీసిన పరమహంస యోగానందగారి చిత్రం

మొట్టమొదట్లో బోధకుడు కావడానికి నేను ఉత్సుకత చూపలేదు. అందులో ఉన్న చిక్కులు నన్ను భయపెట్టాయి. ఒక బోధకుడు దెబ్బలు తట్టుకొనేవాడిలా ఉండాలి. అతడు చలించిన మరుక్షణమే, తన సహాయం కోరే వాళ్ళకు అతడు సాయం చేయలేడు. ఒక నిజమయిన బోధకుడు అందరినీ ప్రేమించాలి; అతడు మానవకోటిని అర్థం చేసుకోవాలి, భగవంతుణ్ణి తెలుసుకోవాలి.

కాని శ్రీయుక్తేశ్వర్ గారు ఈ జీవితంలో నేను పోషించవలసిన పాత్ర బోధకుడిగా అని చెప్పినప్పుడు, నన్ను కాపాడవలసిందిగా ఆ ఈశ్వరుడి అనంతశక్తిని ప్రార్థించాను. నేను ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు, నేను పుస్తకాల నుంచి తెలుసుకున్నది కాకుండా అంతఃప్రేరణ నుంచే మాట్లాడాలని, నా మాటల వెనక ఆ అంతులేని సృజనాత్మక శక్తి ఉన్నదన్న ఆలోచననే అంటిపెట్టుకోవాలని మనస్సులో దృఢనిశ్చయం చేసుకున్నాను. నేనా శక్తిని ఇతర విధాలుగా, ప్రజలకు వ్యాపారంలోను ఇంకా అనేక ఇతర మార్గాల్లో కూడా సాయం చేయడానికి ఉపయోగించుకున్నాను.

ఆ అమరత్వాన్ని ప్రతిఫలించడానికి నేను మర్త్య మనస్సును వాడుకున్నాను. “తండ్రీ, నువ్వు చేయి,” అని నేననలేదు, కాని “తండ్రీ నేనది చేయాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు తప్పకుండా మార్గదర్శనం చేయాలి; నువ్వు నాకు ప్రేరణనివ్వాలి; నువ్వే నాకు దారి చూపాలి,” అని అన్నాను.

అప్రాధాన్య విషయాలను కూడా అసాధారణమయిన రీతిలో చేయండి; మీరెంచుకున్న మార్గంలో మీరు అత్యుత్తమంగా ఉండండి. మీ జీవితం సాధారణంగా గడపడానికి మీరు ఒప్పుకోకూడదు. ఎవ్వరూ చేయనిదాన్ని దేన్నయినా, ఈ ప్రపంచమంతటికీ విభ్రాంతి కలిగించేదేదయినా చేయండి. భగవంతుడి సృజనాత్మక తత్వం మీలో పనిచేస్తున్నదని చూపండి.

గతం గురించి ఆలోచించకండి. మీ తప్పులు సముద్రమంత లోతుగా ఉన్నా, ఆత్మ వాటివల్ల మునిగిపోలేదు. గతకాలపు తప్పుల హద్దులేర్పరిచే ఆలోచనలవల్ల దెబ్బతినకుండా మొక్కవోని పట్టుదలతో మీ మార్గంలో ముందుకుసాగండి.

జీవితం అంధకారబంధురం కావచ్చు, కష్టాలు రావచ్చు, ఉపయోగించుకోకుండానే అవకాశాలు చేజారిపోవచ్చు, కాని ఎన్నడూ మీలో మీరు ఇలా అనుకోకండి; “నా పని ఖాళీ. దేవుడు నన్ను వదిలేశాడు.” అలాంటి మనిషికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? మీ కుటుంబం మిమ్మల్ని వదిలేయవచ్చు; గొప్ప సంపదలు మిమ్మల్ని విడిచినట్లుగా కనపడవచ్చు; మానవుడూ, ప్రకృతిలోని అన్ని శక్తులూ కలిసికట్టుగా మీకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు. కాని మీలో ఉన్న దివ్యమైన చొరవతో గతంలో మీరు చేసిన మీ పొరబాట్ల ద్వారా సృష్టి అయిన ప్రతి దురదృష్టపు చొరబాటును మీరు జయించవచ్చు, విజయవంతంగా స్వర్గంలోకి ముందడుగు వేయవచ్చు.

మీరు వందసార్లు ఓటమి పాలయినా, అయినప్పటికీ నేను గెలవబోతున్నాననే పట్టుదలతో ఉండండి. పరాజయమనేది శాశ్వతంగా ఉండేది కాదు. పరాజయమనేది మీకొక తాత్కాలికమయిన పరీక్ష. సహజంగానే భగవంతుడు మీరు అజేయులుగా కావాలని కోరతాడు, మీలో ఉన్న మొక్కవోని సామర్థ్యాన్ని ముందుకు తీసుకురావడం ద్వారా, జీవితరంగంమీద మీ గమ్యమైన ఉన్నతమైన పాత్రను మీరు నెరవేర్చగలుగుతారు.

నూతన సంవత్సరంలో మీరు ఏమి సాధించాలనుకొంటున్నారు?

వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో పరమహంస యోగానందగారి ప్రసంగాల, వ్యాసాల సంకలనం అయిన మానవుడి నిత్యాన్వేషణ మరియు ఇతర రెండు సంపుటాలను మీరు కనుగొనవచ్చు.

ఒక వ్యక్తి జీవితంలో సంపూర్ణంగా పరివర్తన చెందడానికి తన స్వీయ సృజనాత్మక చొరవ యొక్క అనంతమైన సామర్థ్యాన్ని వినియోగించుకోవడం గురించి, ధ్యాన శాస్త్రం మరియు సంతులిత జీవన కళపై పరమహంసగారి సమగ్ర గృహ-అధ్యయన కార్యక్రమం అయిన యోగదా సత్సంగ పాఠాలు, వారి సంపూర్ణమైన బోధలను మరియు ప్రక్రియలను వివరిస్తాయి.

ఇతరులతో పంచుకోండి