ప్రేమ: మానవప్రేమ మరియు దివ్యప్రేమ

మానవ మరియు దైవిక ప్రేమను వర్ణించే ఆకాశం మరియు సముద్రాల కలయిక.ధ్యానంలోని దైవ సంసర్గంలో మీరు అత్యున్నతమైన ప్రేమను అనుభవించగలరు. ఆత్మ, పరమాత్మల మధ్య ప్రేమయే పరిపూర్ణ ప్రేమ, అదే మీరు అందరూ కోరుకుంటున్న ప్రేమ. ధ్యానం చేస్తే ప్రేమ పెరుగుతుంది. మీ హృదయం లక్షలాది సార్లు పులకరిస్తుంది….మీరు లోతుగా ధ్యానం చేస్తే, ఏ మానవ జిహ్వా వర్ణించలేని ప్రేమ మీలోకి వస్తుంది; మీరు ఆయన దివ్య ప్రేమను తెలుసుకుంటారు, మరియు ఇతరులకు మీరు ఆ స్వచ్ఛమైన ప్రేమను అందించగలుగుతారు.

దివ్య ప్రేమలో కనీసం ఒక్క లేశ మాత్రమైనా మీరు పొందగలిగితే, ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుందంటే – మీరు భరించలేనంత శక్తివంతంగా ఉంటుంది.

ఈ లోకమంతా ప్రేమ అనే పదానికి నిజమైన అర్థమే మరిచిపోయింది. ప్రేమ మనిషిచే ఎంతగా దుర్వినియోగం చేయబడింది, ఎంతగా శిలువ వేయబడింది అంటే, నిజమైన ప్రేమ అంటే ఏమిటో కూడా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆలివ్‌ కాయలోని ప్రతి భాగంలో నూనె ఉన్నట్లే, సృష్టిలో ప్రతి చోటా ప్రేమ వ్యాపించి ఉంది. కానీ, ఎట్లా అయితే నారింజ రుచిని పదాలు పూర్తిగా వర్ణించలేవో, అట్లానే ప్రేమను నిర్వచించడం చాలా కష్టం. పండు రుచిని తెలుసుకోవాలంటే దాని రుచి చూడాల్సిందే. ప్రేమతో కూడా అంతే.

ఈ విశ్వం పరంగా, ప్రేమ అనేది సృష్టిలోని దివ్యమైన ఆకర్షణ శక్తి, అది సృష్టిని అంతటినీ కలిపి, ఏకం చేసి, క్రమబద్ధం చేస్తుంది….ప్రేమ యొక్క ఆకర్షణ శక్తితో అనుసంధానంలో జీవించేవారు ప్రకృతితో మరియు వారి తోటి జీవులతో సామరస్యాన్ని సాధిస్తారు మరియు భగవంతునితో ఆనందకరమైన పునస్సమాగమానికి ఆకర్షితులవుతారు.

“సాధారణ ప్రేమ స్వార్థపూరితమైనది, కోరికలు మరియు సంతృప్తులలో గుప్తంగా వేళ్ళూనినది” [శ్రీయుక్తేశ్వర్ అన్నారు]. “దివ్య ప్రేమ బేషరతైనది, హద్దులు లేనిది, మార్పు చెందనిది. స్వచ్ఛమైన ప్రేమ యొక్క స్తంభింపజేసే స్పర్శతో మానవ హృదయం యొక్క చంచలత్వం శాశ్వతంగా పోతుంది.”

చాలా మంది మానవులు ఒకరోజు “నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” అని చెప్పి, మరుసటి రోజు మిమ్మల్ని తిరస్కరిస్తారు. అది ప్రేమ కాదు. దైవ ప్రేమతో నిండిన హృదయం ఎవరినీ ఉద్దేశపూర్వకంగా బాధించదు. మీరు మినహాయింపు లేకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు, ఆయన అందరి పట్ల తన బేషరతైన ప్రేమతో మీ హృదయాన్ని నింపుతాడు. ఆ ప్రేమను ఏ మానవ జిహ్వా వర్ణించలేనిది….సాధారణ మనిషి ఇతరులను ఈ విధంగా ప్రేమించలేడు. “నా, నేను మరియు నాది” అనే స్వార్థంలో కేంద్రీకృతమైన అతని చైతన్యం తనలో మరియు అన్ని ఇతర జీవులలో నివసించే సర్వవ్యాపి అయిన భగవంతుడిని ఇంకా కనుగొనలేదు. నాకు ఒక వ్యక్తికి, మరొక వ్యక్తికి అంతరం లేదు; నేను అందరినీ ఒకే దేవుని ఆత్మ -ప్రతిబింబాలుగా చూస్తాను. నేను ఎవరినీ అపరిచితుడిగా భావించను, ఎందుకంటే మనమందరం ఒకే ఆత్మలో భాగమని నాకు తెలుసు. భగవంతుడిని తెలుసుకోవడమే మతం యొక్క నిజమైన అర్థమని మీరు తెలుసుకున్నప్పుడు ఆయన మీరేనని మరియు ఆయన అన్ని జీవులలోనూ సమంగా, నిష్పక్షపాతంగా ఉన్నాడని మీరు గ్రహిస్తారు. అప్పుడు మీరు ఇతరులను మీ వలెనే ప్రేమించగలుగుతారు.

భగవంతుని యొక్క దివ్యమైన ప్రేమలో మునిగిపోయిన వ్యక్తి యొక్క స్పృహలో మోసం ఉండదు, కులం లేదా మతం యొక్క సంకుచితత్వం ఉండదు, ఏ విధమైన సరిహద్దులు ఉండవు. ఆ దివ్యమైన ప్రేమను మీరు అనుభవించినప్పుడు, మీకు పువ్వు మరియు మృగం మధ్య, ఇద్దరు మనుషుల మధ్య తేడా కనిపించదు. మీరు ప్రకృతి అంతటితో అనుసంధానం పొందుతారు, సమస్త మానవాళిని సమానంగా ప్రేమిస్తారు.

పరమాత్మ సాక్షాత్కారానికి అన్ని జీవుల పట్ల కరుణ అవసరం, ఎందుకంటే భగవంతుడు స్వయంగా ఈ గుణంతో నిండి ఉన్నాడు. సున్నితమైన హృదయం ఉన్నవారు ఇతరుల స్థానంలో తమను తాము ఉంచుకోవచ్చు, వారి బాధలను అనుభవించవచ్చు మరియు దానిని తగ్గించడానికి ప్రయత్నించవచ్చు.

భార్యాభర్తలు, తల్లితండ్రులు మరియు బిడ్డలు, స్నేహితుడు మరియు స్నేహితుడు, తన పట్ల మరియు అందరి పట్ల స్వచ్ఛమైన బేషరతైన ప్రేమను పెంపొందించుకోవడమనే పాఠం నేర్చుకోవడానికి మనం భూమిపైకి వచ్చాము.

ప్రియమైన వ్యక్తిలో పరిపూర్ణత కోరుకోవటం, వారి ఆత్మ గురించి ఆలోచించడంలో స్వచ్ఛమైన ఆనందాన్ని పొందడమే దివ్య ప్రేమ మరియు అదే నిజమైన స్నేహం యొక్క ప్రేమ.

భగవంతుని ప్రేమ, ఆ పరమాత్మ యొక్క ప్రేమ సర్వ-క్షయకారక ప్రేమ. మీరు దానిని ఒకసారి అనుభవిస్తే, అది మిమ్మల్ని శాశ్వత తలాలలోకి నడిపిస్తుంది. ఆ ప్రేమ మీ హృదయం నుండీ ఎప్పటికీ తిరిగి వెనక్కి తీసుకోబడదు. అది అక్కడ జ్వలిస్తుంటుంది, దాని అగ్నిలో మీరు ఇతరులను మీ వైపుకు ఆకర్షించే పరమాత్మ యొక్క గొప్ప ఆకర్షణను కనుగొంటారు, అంతేకాక అది మీకు నిజంగా అవసరమైన లేదా కోరుకునే వాటిని కూడా ఆకర్షిస్తుంది.

నా ప్రశ్నలన్నింటికీ సమాధానం మానవుని వల్ల కాక దేవుని ద్వారా లభించింది. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఆ పరమాత్మే నా ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నది. ఆయన ప్రేమను గురించే మీతో చెబుతున్నాను. పులకింత మీద పులకింత! ఆయన ప్రేమ ఆత్మపై మలయ మారుతంలా వీస్తుంది. పగలూ, రాత్రీ, వారాల తరబడి, సంవత్సరాల తరబడి అది పెరుగుతూనే ఉంటుంది — దాని అంతం ఎక్కడో మీకు తెలియదు. మీలో ప్రతి ఒక్కరు దాని కోసమే అన్వేషిస్తున్నారు. మానవ ప్రేమ, సంపద కోరుతున్నామని మీరు అనుకుంటారు, కాని వాటి వెనుక పరమ పిత అయిన భగవంతుడే మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన ఇచ్చే వరాలన్నింటికన్నా ఆయనే గొప్పవాడని మీరు తెలుసుకొన్నప్పుడు ఆయనను కనుగొంటారు.

మన ప్రియమైనవారు మనల్ని ఎప్పటికీ ప్రేమిస్తామని వాగ్దానం చేస్తారు; ఇంకా వారు శాశ్వత నిద్రలో మునిగి భూమిపై వారి జ్ఞాపకాలు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, వారి ప్రమాణాలకు విలువ ఏమిటి? మాటల్లో చెప్పకుండా మనల్ని శాశ్వతంగా ప్రేమిస్తున్నదెవరు? అందరూ మనల్ని మరచిపోయినప్పుడు కూడా మనల్ని ఎవరు గుర్తుంచుకుంటారు? మనం ఈ ప్రపంచంలోని స్నేహితులను విడిచిపెట్టినప్పుడు ఇంకా మనతో ఎవరు ఉంటారు? దేవుడొక్కడే!

ప్రభువు ఎప్పుడూ నిశ్శబ్దంగా మీతో గుసగుసలాడుతూ ఉంటాడు:…

“ఒక మాట మాట్లాడకుండా, నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తున్నాను. నేను మాత్రమే నిజంగా చెప్పగలను, ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’; ఎందుకంటే నువ్వు పుట్టకముందే నేను నిన్ను ప్రేమించాను; నా ప్రేమ నీకు జీవాన్ని ఇస్తుంది మరియు ఈ క్షణంలో కూడా నిన్ను నిలబెడుతుంది; మరియు మృత్యువు ద్వారాలు మిమ్మల్ని బంధించిన తర్వాత నేను మాత్రమే నిన్ను ప్రేమించగలను, అక్కడ మీ గొప్ప మానవ ప్రియతములు ఎవరూ కూడా మిమ్మల్ని చేరుకోలేరు.”

మీరు చేయగల గొప్ప ప్రణయం దేవునితో ప్రణయం. మానవ ప్రేమ కొద్దిసేపట్లో పోతుంది, కానీ దేవునితో మీ ప్రేమ శాశ్వతమైనది. ఆయనను చూడకుండా ఒక్కరోజు కూడా గడపకూడదు. అందుకే నేను ఇలా వ్రాశాను, “అంతులేని అవతారాల ద్వారా నేను నీ పేరును పిలిచాను, నా వెండి కలల ప్రవాహాలన్నింటిని శోధించాను.”* నన్ను బయటకు పంపినందుకు ఆయనే కారణమని నేను ఎల్లప్పుడూ ఆయనకి చెబుతాను; కానీ జీవితంలోని భ్రమలన్నీ నేను ఆయనను మరింత మెచ్చుకునేలా చేయడానికేనని, ఆయనను వెతకడానికి నన్ను ఉత్తేజపరిచేందుకు అని నేను గ్రహించాను. నేను అనేక జన్మలుగా ఎప్పుడూ వెతికినది అందరి తండ్రుల వెనుక తండ్రి, అందరి తల్లుల వెనుక తల్లి, ప్రేమికులందరి వెనుక ఉన్న ప్రేమికుడు అయిన ఆయనను. ఆయన ప్రేమికుడు మరియు మన ఆత్మలు ప్రియమైనవి, మరియు ఆత్మ విశ్వంలోని గొప్ప ప్రేమికుడిని కలిసినప్పుడు, శాశ్వతమైన ప్రణయం ప్రారంభమవుతుంది. అన్ని మానవ ప్రేమల గుండా మీరు అనేక జన్మలుగా వెతుకుతున్న ప్రేమ చివరికి మీదవుతుంది. ఇక మీరు ఇంకేమీ కోరుకోరు.

* సాంగ్స్ ఆఫ్ ద సోల్ (Songs of the Soul)లో “డివైన్ లవ్ సారోస్ (Divine Love Sorrows)”.

మరింత చదవడానికి:

ఇతరులతో షేర్ చేయండి