పరమహంస యోగానందగారి రచనలలోని, ప్రసంగాలలోని అంతర్దృష్టి మరియు మార్గదర్శకత్వం

నీ సమస్యలన్నింటి పరిష్కారానికి ఈశ్వరుడి వైపే చూడు. వెల్లువెత్తే కష్టాలు హిమపాతంలా ఒక్కసారిగా నీ మీదదాడి చేసినపుడు నీలోని ధైర్యం, సమయస్ఫూర్తి స్తంభించిపోకుండా చూసుకో. నీలోని అంతర్దృష్టితో కూడిన ప్రపంచ జ్ఞానం, ఈశ్వరునిపై విశ్వాసం అప్రమత్తమై ఉండేలా చూసుకొంటూ, బయటపడడానికి కనీసం అతి సన్నని దారి అయినా దొరుకుతుందేమో కనుగొనే ప్రయత్నం చేయి, నీకది దొరుకుతుంది. అన్నీ చివరికి వస్తాయి ఎందుకంటే ఈశ్వరుడు మర్త్య అనుభవాల వైరుధ్యాలవెనుక తనలోని మంచిని దాచి ఉంచుతాడు.

— వైన్ ఆఫ్ ద మిస్టిక్ (Wine of the Mystic)

శ్రీ పరమహంస యోగానందగారి చివరి చిరునవ్వు

దేనికీ భయపడకు. తుఫానులో కెరటం పైన నీవు అల్లల్లాడుతున్నా, నీవు ఉన్నది సాగరం ఒడిలోనే అని మరవవద్దు. ఎప్పుడూ ఈశ్వరుడి సాన్నిధ్యంలోనే ఉన్నానన్న స్పృహ కలిగి ఉండు. ఎప్పుడూ సమచిత్తంతో ఉండి: “నేను నిర్భయుడిని; నేను దైవపదార్థంతో తయారయ్యాను. పరమాత్మ అనే అగ్నిలోని ఒక నిప్పురవ్వని నేను అని అనుకో. విశ్వ జ్వాలలోని ఒక పరమాణువుని నేను, ఆ తండ్రి యొక్క విశాల విశ్వ శరీరంలోని ఒక కణాన్నినేను. ‘నేను నా తండ్రి ఒక్కటే.’”

కేవలం ఈశ్వరుడిలోనే నిజమైన స్వేచ్ఛ ఉంది. కనుక ఉదయమూ, సాయంత్రమూ ధ్యానంలో ఆయనతో అనుసంధానమవడానికి ప్రయత్నం చేయండి...ఎక్కడ భగవంతుడున్నాడో అక్కడ భయమూ, దుఃఖమూ ఉండవని యోగం చెబుతుంది. చుట్టూ ప్రపంచాలు బ్రద్దలైపోతున్నా విజయుడైన యోగి కదలకుండా నిలిచి ఉంటాడు.

— పరమహంస యోగానంద

ఈశ్వరుడే ఆరోగ్యం, సంపద, జ్ఞానం మరియు నిత్యానందాల ఊట. ఆయనతో సంపర్కం వల్లనే మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలుగుతాము. ఆయన లేనిదే జీవితం పరిపూర్ణం కాదు. నిరంతరాయంగా సత్యం మీ మనసులోకి ప్రవహించాలని, నిరంతరాయమైన శక్తి మీ శరీరంలోకి ప్రవహించాలని, నిరంతరాయంగా ఆనందం మీ ఆత్మలోకి ప్రవహించాలని ప్రార్థించండి. మూసిన కళ్ళ మాటున ఉన్న అంధకారం వెనుక విశ్వం యొక్క అద్భుత శక్తులు, గొప్ప ఋషులు, అనంతుడి అపరిమితత్వం దాగి ఉన్నాయి. ధ్యానం చేయండి. అప్పుడు సర్వవ్యాపకమైన ఏకైక సత్యాన్ని గ్రహించి, మీ జీవితంలోనూ, సృష్టి వైభవంలోనూ దాని నిగూఢమైన పనితనాన్ని దర్శిస్తారు.

— జర్నీ టు సెల్ఫ్-రియలైజేషన్ (Journey to Self-realization)

మీరంతా దేవుళ్లే. మీరది తెలుసుకోవాలంతే. మీ చైతన్యం అనే కెరటం వెనుక ఈశ్వర సాన్నిధ్యమనే సముద్రం ఉంది. అనేక బలహీనతలతో నిండిన శరీరమనే ఈ చిన్ని తరంగం మీద మీ దృష్టి నిలపకండి; దాని అడుగున చూడండి. కళ్ళు మూసుకోండి, ఎటుచూసినా మీ ముందు విశాలమైన సర్వవ్యాపకత్వం చూస్తారు. ఆ గోళం యొక్క కేంద్రంలో మీరున్నారు, మీరు మీ శరీరం, దాని అనుభవాల నుండి మీ చైతన్యాన్ని పైకి లేపినపుడు ఆ గోళం అంతా సంతోషభరితమై, నక్షత్రాలకు కాంతినిచ్చి, గాలులకు, తుఫానులకు బలాన్నిచ్చే బ్రహ్మానందంతో నిండి ఉండడాన్ని చూస్తారు. భగవంతుడే మన అన్ని ఆనందాలకు, సృష్టిలోని అన్ని వ్యక్తీకరణలకు మూలస్థానమయి ఉన్నాడు…

అజ్ఞానాంధకారాన్నుండి మిమ్మల్ని మీరు మేల్కొలుపుకోండి. భ్రాంతి అనే నిద్రలో మీరు కళ్ళుమూసుకొని ఉన్నారు. మేలుకోండి! కళ్ళు తెరవండి, మీరు ఈశ్వరుడి ప్రభవాన్ని దర్శిస్తారు — అన్ని వస్తువుల మీదా పరచుకొని విశాలంగా వ్యాపించి ఉన్న భగవద్ కాంతి. దివ్య యదార్థ వాది కమ్మని నేను మీకు చెబుతున్నాను, అప్పుడు మీరు అన్ని ప్రశ్నలకు ఈశ్వరుడిలో సమాధానాలు కనుగొంటారు.

— దివ్య ప్రణయం

తమకొక్కరికే సంపద కావాలనుకొనే వారు చివరికి పేదరికాన్ని పొందుతారు. లేదా మానసిక అసమతౌల్యతతో బాధపడతారు. కానీ మొత్తం ప్రపంచం తమ ఇల్లుగా భావించి, ఒక సమూహం కోసం, లేదా ప్రపంచ సంపన్నత కోసం పాటు పడే వారు సూక్ష్మ శక్తులను ఉత్తేజితం చేస్తారు. ఆ శక్తులు వారిని న్యాయంగా తమకు చెందే వ్యక్తిగత సంపద ఎక్కడ ఉంటుందో అక్కడికి చేరుస్తాయి. ఇది ఖచ్చితమైన, రహస్య సిద్ధాంతం.

— యోగదా సత్సంగ పాఠాలు

ఈ ప్రపంచంలో ఎప్పుడూ కష్టాలూ, అలజడీ ఉంటూనే ఉంటాయి. నీవు దేనిగురించి బాధ పడుతున్నావు? గురువులు ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళు, ఈశ్వరుడి నీడలోకి, ఎక్కడినుండైతే వారు ప్రపంచాన్ని చూస్తూ సహాయపడుతున్నారో. నీకు ఎప్పటికీ రక్షణ ఉంటుంది, నీకు మాత్రమే కాదు, మన తండ్రి అయిన భగవంతుడు నీ రక్షణలో ఎవరెవరిని ఉంచాడో, ఆ నీ ప్రియతములందరికీ.

— యోగదా సత్సంగ పాఠాలు

భగవంతుడిని నీ ఆత్మకు రక్షకుడిగా చేసుకో. జీవితంలో మసక చీకటి దారుల్లో నీవు ప్రయాణించేటపుడు, ఆయనను నీ దీపంగా చేసుకో. అజ్ఞానమనే రాత్రిలో ఆయన నీకు చంద్రుడు. మెలకువగా ఉన్న సమయంలో ఆయన నీ సూర్యుడు. మర్త్య జీవితంలోని అంధకార సాగర జలాల్లో ఆయన నీకు ధ్రువతార. ఆయన మార్గదర్శకత్వాన్ని కోరుకోండి. ప్రపంచం ఇలాగే పడుతూ లేస్తూ ముందుకు పోతూనే ఉంటుంది. మార్గదర్శకత్వం కోసం ఎటు చూడాలి మనం? మన అలవాట్లు, కుటుంబ వాతావరణం, దేశం, ప్రపంచం కారణంగా మనలో ఏర్పడిన దురభిప్రాయాల వైపు మాత్రం కాదు. మనకు దారి చూపగలిగిన మన లోపలి సత్యస్వరం వైపు.

— దివ్య ప్రణయం

గుర్తుంచుకోండి. వేయి విధాల మనసులో తర్కించే కన్నా కూర్చుని నీ లోపల శాంతి అనుభూతమయ్యేవరకూ ఈశ్వరుడిపై ధ్యానం చేయడం ఉత్తమమైనది. అప్పుడు ఈశ్వరుడికి చెప్పండి. “నేను కోటి భిన్నమైన ఆలోచనలు చేసినా కూడా నా సమస్యను నేనొక్కడినే పరిష్కరించుకోలేకపోతున్నాను. కానీ దాన్ని నీ చేతుల్లో పెట్టి, ముందు నీ మార్గదర్శకత్వం కోసం ప్రార్థించి అప్పుడు వేరు వేరు కోణాల్లోతగిన పరిష్కారం కోసం ఆలోచించి ముందుకెళ్లడం ద్వారా పరిష్కరించుకోగలుగుతాను.” తమకు తాము సహాయ పడేవారికే ఈశ్వరుడు సహాయపడతాడు. ధ్యానంలో భగవంతుడికి ప్రార్థన చేశాక మీ మనసు ప్రశాంతంగాను, ఈశ్వరుడిపై విశ్వాసంతోను నిండి ఉన్నపుడు మీ సమస్యకు వివిధ పరిష్కారాలను మీరు చూడగలుగుతారు. అప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉన్నందున ఉత్తమమైన పరిష్కారాన్ని మీరు పట్టుకోగలుగుతారు. ఆ సమాధానాన్ని అనుసరించి ముందుకెళితే మీకు విజయం లభిస్తుంది. మీ నిత్య జీవితానికి మత ధర్మశాస్త్రాన్ని అన్వయించుకోవడం ఇదే.

— దివ్య ప్రణయం

భయం హృదయం నుండి వస్తుంది. ఎప్పుడైనా మీరు ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదాన్ని తలచుకొని తీవ్ర భయానికి గురైనప్పుడు, అనేకసార్లు గాఢంగా, మెల్లగా, లయబద్ధంగా ఊపిరి తీసుకొని వదలండి. ప్రతి నిశ్వాసంతోనూ సడలింపు పొందండి. దీనివల్ల రక్త ప్రసరణ సహజ స్థితికి వస్తుంది. మీ హృదయం నిజంగా ప్రశాంతమైతే మీకిక భయం ఏమాత్రం ఉండదు.

— నిర్భయంగా జీవించడం

మీరు ఏ విషయం గురించి భయపడుతున్నారో దాని మీదనుంచి మీ మనసు మరలించి దానిని ఈశ్వరుడికి వదిలేయండి. ఆయనలో విశ్వాసం ఉంచండి. చాలామట్టుకు బాధ ఆందోళన వల్లనే కలుగుతుంది. వ్యాధి ఇంకా రాకముందే ఎందుకు కష్టపడతారు? చాలా బాధలు భయం కారణంగా కలుగుతాయి, కనుక ఆ భయాన్ని వదిలితే మీరు వెంటనే స్వేచ్ఛ పొందుతారు. నివారణ తక్షణమే జరుగుతుంది. ప్రతి రాత్రీ నిద్ర పోయేముందు ఇలా దివ్యసంకల్పం చెప్పుకోండి. “పరమేశ్వరుడు నాతో ఉన్నాడు; నేను రక్షింపబడుతున్నాను.” మానసికంగా మిమ్మల్ని మీరు పరమాత్మతోనూ ఆయన యొక్క విశ్వ శక్తితోనూ పరివేష్టించుకోండి....మూడుసార్లు “ఓం” అని కానీ "ఈశ్వరా” అని కానీ జపించండి. అది మిమ్మల్ని కాపాడుతుంది. అద్భుతమైన ఆయన రక్షణ మీకు అనుభూతమౌతుంది. ధైర్యంగా ఉండండి...

మీకు ఎప్పుడైనా భయంగా అనిపించినపుడు మీ గుండెలమీది చర్మం మీద చేయి వేసుకొని ఎడమనుండి కుడికి మర్దన చేస్తూ ఇలా ఆనండి, “తండ్రీ, నేను స్వేచ్ఛగా ఉన్నాను. ఈ భయాన్ని నా హృదయమనే రేడియో నుండి బయటికి పంపివేయి.” మామూలు రేడియోలో గందరగోళం వస్తే ట్యూన్ చేసి సరిచేసినట్టే మీ గుండెను ఎడమ నుండి కుడికి ఆగకుండా మర్దన చేస్తూ మీ హృదయం నుండి భయాన్ని బయటికి తోసే ఆలోచన మీదే మీరు ఏకాగ్రత నిలిపితే, అది పోతుంది; మీరు భగవదానందాన్ని అనుభవిస్తారు.

— మానవుడి నిత్యాన్వేషణ

భగవంతుడు మనకు ఒక అద్భుతమైన రక్షణ పరికరాన్ని ఇచ్చాడు—అది మెషీన్ గన్, విద్యుత్తు, విషవాయువు లేక వైద్యుడు అన్నిటినీ మించి శక్తివంతమైనది—అది మన మనసు. మనం బలోపేతం చేసుకోవాల్సింది మన మనస్సు.....జీవితమనే సాహస యాత్రలో ముఖ్యమైన భాగం మనసును అదుపు చేయగలగడం, అలా అదుపులోకి తెచ్చుకొన్న మనసును సదా ఈశ్వరుడితో అనుసంధానించి ఉంచడం. ఇదే ఒక ఆనందకరమైన, విజయవంతమైన జీవన రహస్యం....ఇది మనోశక్తిని వినియోగంలోకి తేవడం ద్వారా, ధ్యానం ద్వారా మనస్సును ఈశ్వరుడితో అనుసంధానంలో ఉంచడం ద్వారా సాధ్యమౌతుంది....వ్యాధిని, నిరాశను, విపత్తులను అధిగమించగలిగే అత్యంత తేలికైన మార్గం నిరంతరం ఈశ్వరుడితో అనుశ్రుతిలో ఉండటం.

— మానవుడి నిత్యాన్వేషణ

నిజమైన ఆనందం, శాశ్వతానందం ఈశ్వరుడిలోనే ఉంది, “ఎవరిని పొందిన తరువాత ఏ ఇతర లాభమూ అంతకు మించినది కాదో.” ఆయనలోనే కేవలం రక్షణ, నీడ, మన అన్ని భయాలనుండి విముక్తి. ఈ ప్రపంచంలో నీకు మరొక రక్షణ లేదు, మరొక స్వేచ్ఛ లేదు. కేవల సత్యమైన ఆనందం ఈశ్వరుడిలోనే ఉంది. కాబట్టి ధ్యానంలో ఆయనతో సంపర్కం పొందడానికి ఉదయమూ, రాత్రీ సాధన చేయండి. అలాగే రోజంతా మీరు నిర్వహించే కర్తవ్యాలలో, చేసే పనుల్లో కూడా. ఎక్కడైతే భగవంతుడున్నాడో, అక్కడ భయం, దుఃఖం ఉండవని యోగం బోధిస్తుంది. విజయుడైన యోగి తనచుట్టూ బ్రహ్మాండాలు బద్దలౌతున్నా చలించకుండా ఉండగలడు. “ఈశ్వరా నేనెక్కడ ఉన్నానో, నీవు అక్కడికే రావాలి” అన్న గ్రహింపు కలిగినవాడై భద్రంగా ఉంటాడు.

— దివ్య ప్రణయం

మన మనస్సుల్లో ఆత్మల సమాఖ్య, సమైక్య ప్రపంచం కోసం ప్రార్థిద్దాం. మనం జాతి, తెగ, రంగు, వర్గం, రాజకీయ దురభిమానము, మొదలైన వాటితో విభజించబడినట్టు కనిపించినా, ఒకే భగవంతుడి బిడ్డలుగా మన ఆత్మలలో సోదరభావం, ప్రపంచ ఐక్యత అనుభూతి చెందగలం. భగవంతుడి మార్గదర్శకత్వంలో మానవుడి జాగృత చైతన్యం ద్వారా ప్రతీ దేశమూ ఒక ఉపయోగకరమైన పాత్ర పోషించే సమైక్య ప్రపంచాన్ని సృజించడానికి మనం కృషి చేయాలి. మన హృదయాలు ద్వేషం, స్వార్థం నుండి విముక్తమవడాన్ని మనం నేర్చుకోవాలి. దేశాల మధ్య సామరస్యత నెలకొని అవి చేయి చేయి కలిపి ఒక నవీన నాగరికత వైపు అడుగులువేయాలని మనం ప్రార్థిద్దాం.

— మెటాఫిజికల్ మెడిటేషన్స్ (Metaphysical Meditations)

అన్నిటికన్నా నేను గట్టిగా చెప్పేదేమిటంటే ధ్యానం ద్వారా ఈశ్వరాన్వేషణకు మీరు ఎడతెరిపి లేకుడా ప్రయత్నించాలని....ఈ జీవితపు నీడల క్రింద ఆయన అద్భుత కాంతి ఉంది. ఈ విశ్వమంతా ఆయన సాన్నిధ్యం నిండి ఉన్నవిశాల దేవాలయం. మీరు ధ్యానం చేసినపుడు సర్వత్రా ఆయన వైపుకే తలుపులు తెరుచుకొంటాయి అని మీరు చూస్తారు. ఈశ్వరుడి సంసర్గంలో ఉన్నపుడు ప్రపంచంలోని ఎంతటి విధ్వంసాలు కూడా మీలోంచి ఆ ఆనందాన్ని, శాంతిని తీసివేయలేవు.

— వరల్డ్ క్రైసిస్

ఇతరులతో పంచుకోండి