దైవ-సాక్షాత్కారం: దేశాలు మరియు ప్రజల యొక్క దివ్యలోకపు నిధి

(ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్: ద రిసరక్షన్ ఆఫ్ ద క్రైస్ట్ విథిన్ యు, లూకా 12:22-31 లోని ఏసు పలుకులకు శ్రీ పరమహంస యోగానందగారి వ్యాఖ్యాన సారాంశం )

మరి ఆయన తన శిష్యులతో ఇట్లనెను “కాబట్టి నేను మీకు చెప్పుచుంటిని, మీరు ఏమి తినవలెనో దానిని గూర్చి, మీ బ్రతుకు గూర్చి ఆలోచించకుడి; మీరు ధరించిన శరీరము కొరకునూ కాదు. ప్రాణము శరీర మాంసములకంటే గొప్పది.

“కాకులను చూడండి: అవి విత్తనాలను నాటడం గానీ, కోయడం గానీ చేయవు; వాటికి గిడ్డంగి గానీ, ధాన్యాగారం గానీ లేవు; అయినా దేవుడు వాటిని పోషిస్తాడు; మీరు కోడిపిల్లల కంటే ఎంత మెరుగైనవారు? మరి మీలో ఎవడైననూ తన ఆలోచనతో తన స్థాయిని ఒక మూర మాత్రమైనా పెంచుకోగలడా? మీరు అత్యల్పమైన దానిని చేయలేకపోయిన యెడల, తక్కిన వాటిని గూర్చి మీరెందుకు ఆలోచించుదురు?

“లిల్లీ పండ్లు ఏలాగు ఎదుగుచున్నాయో ఆలోచించుము: అవి శ్రమించవు, మెలిపడవు; సోలొమన్ సమస్త మహిమగలవాడైనను వీటిలో ఒక దానిలా అలంకరించబడలేదని మీకు చెప్పుచున్నాను. అలా అయితే, దేవుడు ఈ రోజు పొలంలో ఉన్న గడ్డిని, రేపు పొయ్యిలో వేయబడిన గడ్డిని ఇలా ధరిస్తే, ఓ అల్పవిశ్వాసులారా, ఆయన మీకు ఇంకెంత ఎక్కువ ఆశీర్వదింపజేయును?

“మరియు మీరు ఏమి తినవలెననియు, మీరు త్రాగబోవు దానిని గాని వెదకకుడి, మీరు సందేహించు మనస్సుగలవారై యుండకుడి. ఏలయనగా ఐహిక జనులు ఈ సంగతులన్నిటినీ వెదకుచుండిరి; మరి ఈ అంశములు మీకు అవసరమని మీ తండ్రికి తెలియును. అందుకే మీరు దేవుని రాజ్యమును వెదకుడి; ఈ అంశములన్నియు మీకు చేర్చబడును” (లూకా 12:22-31).

దేవుణ్ణి జీవితపు ప్రధాన లక్ష్యంగా చేసుకోమని ఏసు ఇచ్చిన ఉపదేశాన్ని దేశాలు మరియు ప్రజలు పాటిస్తే భూమి అసలైన స్వర్గంలా ఉంటుంది. ప్రజలు రాజకీయ మరియు వ్యాపార స్వార్థంతో, దేశ, వ్యక్తిగత అధికారం కోసం మరియు ఇతరుల ఖర్చుతో విలాసాలను వెలగబెట్టుకోవడానికి దృష్టి కేంద్రీకరించినప్పుడు, సంతోషం మరియు శ్రేయస్సు యొక్క దైవ నియమం విచ్ఛిన్నమై, ప్రపంచంలో, దేశాలలో, కుటుంబాలలో, అశాంతిని మరియు పేదరికాన్ని సృష్టిస్తుంది. వివిధ దేశ నాయకులు, విరోధాలను, ఇంకా సంకుచితత్వపు దేశభక్తిని కీర్తించడానికి బదులు, తమ పౌరుల మనస్సులను అంతఃశ్శాంతి వైపు, భగవంతుని పట్ల, పొరుగువారి పట్ల ప్రేమాభిమానాన్ని, ధ్యానానందాన్ని సముపార్జించుకోవడం వైపు మళ్ళిస్తే, అప్పుడు భౌతిక సౌభాగ్యం, ఆరోగ్యం, అంతర్జాతీయ సామరస్యం అనేవి ఆ దేశాల ఆధ్యాత్మిక సంపదల్లో సహజసిద్ధంగా చేరిపోతాయి.

“దేవుడే ప్రధానం” అనే సర్వోన్నత జ్ఞానాన్ని ఏసు వ్యక్తిగత సంతోషం కోసం మాత్రమే కాకుండా జాతీయ మరియు అంతర్జాతీయ శ్రేయస్సు కోసం ఉత్తమమైన యోగముగా సూచి౦చాడు: “ప్రపంచ దేశాలు మితిమీరిన స్వార్థంతో వస్తుస౦పదలను, అధికారాన్ని ఆశిస్తున్నాయి, ఇది అనివార్యంగా బాధాకరమైన అసమానతలకు, యుద్ధాలకు, విధ్వంసానికి దారితీస్తు౦ది. బదులుగా వారు దేవుణ్ణి అన్వేషి౦చి, పరమాత్ముని నైతిక ధర్మాన్ని తమ ప్రయత్నాలకు జోడి౦చి, అ౦తర్జాతీయ ఆధ్యాత్మిక సోదరత్వ పందిరి క్రింద సామరస్యపూర్వక౦గా జీవి౦చనివ్వండి. వసుదైక కుటు౦బానికి సహాయ౦ చేయడ౦ ద్వారా, సద్భావనతో, అ౦తర్జాతీయ వ్యాపార సహకార౦ ద్వారా పరస్పర శాంతితో జీవించే దేశాలకు, దైవ చైతన్యాన్ని అనుసరి౦చే౦దుకు ప్రయత్ని౦చే దేశాలకు తగినంత శాశ్వత సమృద్ధిని దివ్యపిత ప్రసాదిస్తాడు. విశ్వాన్నిపాలించే పరమాత్మునికి దేశాల, ప్రజల యొక్క అవసరాలు తెలుసు; కాకులను పొషించి, లిల్లీలను అలంకరించే పరమాత్ముడు, తన ఆదర్శాలకు అనుగుణంగా జీవించే దేశానికి, వ్యక్తికి, ఆయన ఇంకెత ఎక్కువ సమృద్ధిని ప్రసాదిస్తాడు!

ధన వ్యామొహంతో ఉన్న స్వార్థపూరితమైన ఆధునిక నాగరికత స్థితి దేశము యొక్క, ప్రజల యొక్క ఆనందాన్ని నాశనం చేస్తుందని స్పష్టంగా నిరూపిస్తుంది. వ్యాపార జీవితంలోని మితిమీరిన పోటీతత్వం వినాశకరమైనది, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇతరులకున్నదాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా వెయ్యి మంది ఉన్న సమాజంలో ప్రతి వ్యాపారవేత్తకు 999 మంది శత్రువులు మరియు పోటీదారులు ఉన్నారు. తమకు ఉన్నదాన్ని ప్రజలు అ౦దరితో ప౦చుకోవాలని ఏసు ఉద్బోదించాడు; ఆ నియమాన్ని పాటించినప్పుడు, వెయ్యిమంది ఉన్న సమాజంలో ప్రతి వ్యక్తికి 999 మంది సహాయకులు ఉంటారు.

“స్వార్థపూరితమైన దేశభక్తి మరియు పారిశ్రామిక స్వార్థంతో జాతీయ భద్రత, శ్రేయస్సులకు ఎన్నటికీ హామీ లభించదు…. శాశ్వత జాతీయ సౌభాగ్యం అనేది సహజ వనరులపైన, దేశ పౌరుల చొరవపైన మాత్రమే కాకుండా, ప్రధానంగా ప్రజల నైతిక ప్రవర్తన, సామరస్యం మరియు ఆధ్యాత్మిక జీవనంపై ఆధారపడి ఉంటుంది.”

— పరమహంస యోగానంద

ఈ రోజుల్లో ఉన్న వాణిజ్యకరమైన తీవ్ర వాతావరణం వ్యాపారవేత్తను, తన మనుగడ కోసం జీవితాన్ని గందరగోళం చేసికొని, ఆధ్యాత్మికంగా మరియు నిజమైన సంతోషంపై దృష్టి పెట్టలేని పరిస్థితిని కలిగిస్తోంది. మనిషి సంతోషం కోసమే వ్యాపారం ఉంది; వ్యాపారం కోసం మనిషి తయారు చేయబడలేదు. మనిషి యొక్క ఆధ్యాత్మిక వికాసానికి అంతరాయం కలిగించని వ్యాపారం మాత్రమే అవసరం. శాస్త్ర, సాంకేతిక రంగంలో పురోగతిని మానవజాతి అభివృద్ధి కోసం ఉపయోగించినప్పుడు ప్రశంసించవలసి ఉంటుంది; కానీ ఆచరణాత్మకంగా, ప్రపంచ దేశాలు తమ పౌరుల చైతన్యాన్ని ఉన్నత ఆలోచనలు మరియు సరళమైన జీవనం వైపు ప్రోత్సహిస్తే – వారి మనస్సులను ఆధ్యాత్మిక అభివృద్ధి, స్ఫూర్తిదాయకమైన సాహిత్యం, తత్వశాస్త్రం, సృష్టి యొక్క అద్భుతాలు మరియు పనితీరుపై జ్ఞానం గురించి మరింత ఎక్కువగానూ మరియు డబ్బు వ్యామోహాన్ని ప్రోత్సహించే ఉన్మాద సాంకేతిక పరిజ్ఞానాలపై వారి మనస్సులను తక్కువగానూ కేంద్రీకరించడం ద్వారా తమ పౌరుల ఆనందాన్ని పెంచగలుగుతాయి.

ధనిక దేశాలలో అధిక ఉత్పత్తి మరియు మితిమీరిన వినియోగానికి దారితీసే పారిశ్రామిక స్వార్థంతో ప్రపంచ దేశాలు నాగరికతను క్లిష్టతరం చేయకపోతే, బలహీన దేశాల పట్ల దోపిడీ మరియు లోభత్వాన్ని చూపకపోతే, ప్రజలందరూ తినడానికి మరియు జీవించడానికి సమృద్ధిగా ఉంటుంది. కానీ తమ పొరుగువారి అవసరాలతో సంబంధం లేకుండా, స్వార్థపూరితమైన దేశభక్తి మరియు వస్తుపరమైన ఆధిపత్యమే దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశాల లక్ష్యం అయిపోయింది. కాబట్టి, ప్రపంచమంతా సిద్ధాంతాల గందరగోళం మరియు అరాచక ఘట్టాలను అనుభవిస్తుంది, ఫలితంగా కరువు, పేదరికం మరియు యుద్ధాల నుండి తప్పించుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. స్వార్థపూరితమైన దేశభక్తి మరియు పారిశ్రామిక స్వార్థం ద్వారా దేశ భద్రత, సౌభాగ్యాలకు ఎన్నటికీ హామీ లభించబోదని, దీనివలన ఉత్పన్నమైన అనేక ఆర్థిక విపత్తులు, రెండు ప్రపంచ యుద్ధాలు, నిరుద్యోగం, భయాలు, అభద్రతాభావాలు, ఆకలి మరణాలు, భూకంపాలు, పెనుతుఫానులు, మరియు కరువులు, సహజ విపత్తులు (దేశాల, ప్రజల సంచిత దుష్ట చర్యల సామూహిక కర్మ ఫలము యొక్క పరోక్ష సంతానం) వంటి గుర్తింపు పొందిన సంఘటనలు ఈ ఇరవైయవ శతాబ్దంలో స్పష్టంగా నిరూపించాయి.

భక్తిహీన జీవనంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఆధునికమైన అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సౌభ్రాతృత్వం, పారిశ్రామిక సహకార౦, భూ సంబంధిత ఉత్పత్తుల అ౦తర్జాతీయ మార్పిడి మరియు ఆధ్యాత్మిక అనుభవాలు వంటి స్వర్గలోకపు ఆదర్శాలతో జీవించినట్లయితే స్వీయ-ఉత్పాదిత వినాశన౦ ను౦డి రక్షి౦చబడవచ్చు. స్వలాభార్జన, దోపిడీల ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ విఫలమైంది; దేశాల మద్య సోదరభావం, ఆవశ్యకమైన పరిశ్రమలు మరియు పారిశ్రామికవేత్తల మధ్య సౌభ్రాతృత్వం మాత్రమే ప్రపంచానికి శాశ్వత సౌభాగ్యాన్ని తీసుకురాగలవు.

1930వ దశాబ్దపు మహా మా౦ద్య౦ చాలామ౦ది కోటీశ్వరులను కుంగదీసి౦ది, వారు తమ బలమైన స౦పదలను కాపాడుకోవడంలో తమ సూక్ష్మబుద్ధి గురి౦చి చాలా నమ్మకంగా ఉ౦డేవారు. తెలివైన వ్యాపారవేత్తలు కూడా విధి, నిరాశల చేతుల్లో, ఎటువైపు తిరగాలో తెలియని, దిగ్భ్రమకు గురైన పిల్లలుగా మారారు. “నిస్వార్థము”, “ఇతరుల సౌభాగ్యముతో తన స్వీయ శ్రేయస్సు” అనే ఆధ్యాత్మిక నియమాలు ఉల్ల౦ఘి౦చబడ్డాయి; అందువలన ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ పతనం అయింది. బంగారం పట్ల మానవుల దురాశతో పారిశ్రామిక స్వార్థం ప్రేరేపించబడింది, ఇది అనుచితమైన స్వవినాశకర పోటీకి దారితీసింది అంతేకాక పోటీదారుడిని నాశనం చేయడానికి ధరలను పడవేసింది. భౌతిక దృక్పథం కలిగిన వ్యాపారవేత్త యొక్క బుద్ధి దురాశతో నిండిపోయినప్పుడు, అతని బుద్ధికుశలత ఒకదాని తరువాత ఒకటి విఫలమయ్యే ప్రణాళికలను రూపొందిస్తుంది. దైవ-చేతనను మరచిన భౌతిక అహంకారులందరూ ఏదో ఒక సమయంలో ఈ మూల్యం చెల్లించాల్సిందే.

పారిశ్రామిక ఉత్పత్తికి కృత్రిమ ఆర్ధిక విలువను ఇవ్వడం ద్వారా, మానవుడు పెట్టుబడి, శ్రమల మధ్య కలహాన్ని సృష్టించి, క్రమపద్ధతిలో పునరావృతమయ్యే ద్రవ్యోల్బణాలు మరియు మాంద్యాలకు కారణమయ్యాడు. శ్రమ మరియు మూలధనం, ఒకరితో ఒకరు పొరాడి పరస్పర వినాశనాన్ని చేకూర్చుకోకుండా, మెదడు మరియు అవయవాలు ఒకదానితో మరొకటి సహకరించుకొనే విధంగా, దేశం యొక్క దేహం మరియు ఆత్మల మొత్తం సంక్షేమం కోసం సహకరించాలి. శరీరాన్ని నిర్వహించడానికి మరియు కడుపులో ఆహారాన్ని పంచుకోవడానికి మెదడు మరియు చేతులు రెండూ సహకరిస్తాయి; అదేవిధంగా పెట్టుబడి (సమాజం యొక్క మెదళ్ళు) మరియు శ్రమ (దాని చేతులు మరియు కాళ్ళు) జీవితాన్ని సుసంపన్నం చేయడానికి మరియు అవి ఉత్పత్తి చేసే బహుమానాలను పంచుకోవడానికి సహకరించాలి. సామ్రాజ్యవాద, సామ్యవాద ప్రభుత్వ పాలనలోని లోటుపాట్లును తప్పించి పెట్టుబడికి గానీ, శ్రమకు గానీ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకూడదు.పెట్టుబడికి, శ్రమకు ప్రతిదీ దాని దృఢమైన స్థానాన్ని కలిగి ఉంటుంది మరియు రెండూ తమ తమ విధులను సమానంగా నిర్వర్తించాలి. జాతీయ సంపదను పంచుకోవడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆహారం, దుస్తులు, నివాసం, విద్య మరియు వైద్య సంరక్షణ అందించాలి; లేదా అనివార్యమైన ప్రకృతి వైపరీత్యాల ద్వారా పేదరికం వచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ సమానంగా పేదరికం యొక్క భారాన్ని భరించాలి. ప్రగతిశీల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక ఉనికి కోసం అవసరమైన ప్రాథమిక అవసరాల అసమాన పంపిణీ ఉండకూడదు. కలిమి ఉన్నవారిపట్ల లేనివారికున్న విరోధమే నేరానికి, దురాశకు, స్వార్థానికి, మరియు ఇతర చెప్పలేని సామాజిక దురాచారాలకు మూలకారణం.

అనారోగ్యానికి లేదా అంగవైకల్యానికి గురైన కుటు౦బ సభ్యుడు దాతృత్వానికి స౦బ౦ధి౦చిన లక్ష్యం కాదు, కాని కుటు౦బ ఆహార, ఆర్థిక విషయాల్లో గౌరవప్రద౦గా పాల్గొ౦టాడు. అదే మంచి ప్రప౦చ కుటు౦బ౦లోని ప్రతి సభ్యునికి అందాలి. ఒక వ్యక్తి ఉపాధిని పొందలేకపోవడం వల్లనో లేదా ముసలితనం వల్లనో లేదా వికలాంగుడు అయినందువల్లనో ఆకలితో అలమటించకూడదు. భూమి మీద దేశాలు దేవుణ్ణి స౦తోషపెట్టాలనుకు౦టే, క్రీస్తువ౦టి సూత్రాల ప్రకార౦ జీవిస్తూ, ప్రప౦చ౦లోని సంయుక్త రాష్ట్ర సహోదరులుగా, కొరత, కరవు, పేదరిక౦ వ౦టివాటితో ఏ వ్యక్తీ బాధపడకు౦డా ఉత్పత్తులు ఇచ్చిపుచ్చుకుంటారు..

ప్రజలు మరియు దేశాలు పరస్పర దేహ పోషణకు మరియు సాధికారతకు స్వార్థాన్ని విడిచిపెట్టడం ఇప్పుడు అత్యావశ్యకం. దేశ పౌరులు స్వప్రయోజనాలపట్ల మక్కువను జయించి, జ్ఞాన సముపార్జన, ధ్యానంతో పరమాత్మునితో అనుసంధానమవడం నేర్చుకోవాలి. తద్ద్వారా వారు సమిష్టిగా జాతీయ ఆత్మను సర్వతోముఖానందంతో పోషిస్తారు. భగవంతుని ఆదర్శాలయిన శాంతి మరియు సోదరభావాలకు అనుగుణంగా జీవించే దేశాలు, శతాబ్దాల పాటు యుద్ధాలు లేదా కరువు లేకుండా, శాశ్వతమైన శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక ఆనందంతో నిలిచి ఉంటాయి. శ్రేయస్సుతో సమృద్ధిగా ఉన్నపటికీ దైవజ్ఞానం మరియు దైవ ఆనందం లేని దేశాలు, అంతర్యుద్ధాలతో, పెట్టుబడికి శ్రమకు మధ్య జరిగే పోరాటాలతో మరియు తమ శ్రేయస్సును చూసి అసూయపడే పొరుగువారితో ఇబ్బందుల వంటి వాటి వల్ల తమ అత్యున్నత భౌతికత్వాన్ని కోల్పోవచ్చు. ఒక దేశం ఆకలితో మరణిస్తూ, ప్రక్కనే మరో దేశం సమృద్ధిగా ఉ౦డడ౦ భూమిపై శా౦తిని ఉత్పత్తి చేసే సూత్ర౦ కాజాలదు.

దేశాలు పరస్పర సహకారం అందించుకోవాలి లేదా అవి నాశనమవుతాయి. అ౦దుకే ఏసు భూమిపై ఉన్న దేశాలతో ఇలా అంటున్నాడు: “ఓ దేశస్థులారా, స్వార్థపరులై ఆహారమును గూర్చియు పరిశ్రమ, వస్త్రములను గూర్చియు మాత్రమే ఆలోచించినట్లయితే; సహోదరత్వాన్ని, సర్వ ప్రధాత అయిన భగవంతుణ్ణి పూర్తిగా మరచిపోతారు, లేక మీ అజ్ఞానమువలన, దాని సంభందిత యుద్ధములవలన, పీడలవలన ఇతర దుఃఖములవలన సృజి౦చుకున్న విపత్తును మీపై మీరే కొనితెచ్చుకొంటారు.”

సంపద తరచుగా సాంఘిక వివేకాన్ని మొద్దుబారుస్తు౦ది: “ఇతర దేశాల పట్ల మనమెందుకు సంరక్షణ చూపిస్తా౦: మేము మా శ్రేయస్సును సృష్టించేందుకు కృషిచేశాము! వారు కూడా అలా ఎందుకు చేయకూడదు?” కఠినమైన అహంకారం చిన్న చూపుకలిగి ఉంటుంది. జాతీయ సౌభాగ్యం కొనసాగడమనేది సహజ వనరులపైనా, దేశ పౌరుల చొరవపైన మాత్రమే కాకుండా, ప్రజల నైతిక ప్రవర్తన, సామరస్యం మరియు ఆధ్యాత్మిక జీవనంపై ఆధారపడి ఉంటుంది. ఒక దేశం ఎంత విజయవంతమైనప్పటికీ, అది దుర్మార్గంగా, స్వార్థపూరితంగా, అధర్మంగా మారితే, దాని అల్పసంతోషాన్ని, అదృష్టాన్ని ధ్వంసం చేయడానికి అంతర్యుద్ధాలు, వంచనలు, విదేశీ దురాక్రమణలు జరుగుతాయి.

అ౦దుకే, ఏ వ్యక్తి లేదా దేశము స్వార్థపరులై ఉ౦డకూడదని, ఆహార౦, వస్త్ర౦ లేదా భూ సంబ౦ధమైన సంపదని స౦పాది౦చుకోవడ౦ గురి౦చి పూర్తిగా ఆలోచించకూడదని, కానీ వినమ్ర౦గా ఉ౦టూ, తమ నిరుపేద సోదరులతో సౌభగ్యాన్ని పంచుకోవాలని, ధరిత్రిలోని అన్ని సంపదలకు ఈశ్వరుడే ఏకైక యజమానిగా, దాతగా భగవంతుణ్ణి గుర్తి౦చాలని ఏసు ఉపదేశి౦చాడు.

ఇతరులతో పంచుకోండి