శ్రీ శ్రీ మృణాళినీమాత నుండి క్రిస్మస్ సందేశం

“సర్వవ్యాపి అయిన క్రీస్తు అందరి దేహాలయాల్లో నివసించటం చూసి మీరు అందరినీ ప్రేమించగలిగేట్లుగా మీ హృదయాన్ని క్రీస్తు-ప్రేమ మందిరంగా మార్చుకోండి.”

—పరమహంస యోగానంద

పరమహంస యోగానందగారి ఆశ్రమాల నుండి సంతోషకరమైన ఈ సెలవుల సమయంలో క్రిస్మస్ కు సద్భావనతో కూడిన శుభాకాంక్షలు. ప్రియతమ ప్రభువైన ఏసు జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జరుపుకుంటున్న ఈ శుభ సమయంలో మీ హృదయం స్వర్గలోకపు ఆత్మలు అనుభవించే విశ్వ ఆనందం మరియు శాంతితో నిండి ఉండుగాక.

ఏసు అవతారంలో విశ్వాన్ని పోషించే భగవత్ చైతన్యపు అనంతత్వం మరియు దివ్యత్వం — కూటస్థ చైతన్యం — పూర్తిగా వ్యక్తమైంది; అయినప్పటికీ, బహుశా మనల్ని వ్యక్తిగతంగా తాకేది ఏమిటంటే, సమకాల ప్రజలతో ఆయన వినయం మరియు అందరిపట్ల అపరిమితమైన కరుణతో ఆయన జీవించిన విధానం. మన మానవ అనుభవాలను పంచుకున్న, మన కష్టాలను తెలుసుకున్న వ్యక్తిగా ఆయన సానుభూతితో మరియు అవగాహనతో అందరినీ దేవుని సంతానంగా చూసారు. సాక్షాత్కారం పొందిన ఆత్మలను భూమి మీదకి పంపడంలో భగవంతుడు ఉద్దేశం, హృదయ-జ్ఞానోదయకరమైన సార్వత్రిక సూత్రాలను జీవించడంలో వారి ఉదాహరణను అనుసరించమని దేవుడు మనలను కోరుతున్నాడు, తద్ద్వారా మనం కూడా క్రీస్తువంటి సర్వ-ప్రేమమయమైన, సర్వదాయకమైన దివ్య చైతన్యాన్ని మన ఆత్మలలో గ్రహించి మన చర్యలలో వ్యక్తపరచగలము.

మన గురుదేవులైన పరమహంసగారు ఆధ్యాత్మికంగా శుభప్రదమైన సందర్భాలు మన ఆత్మ యొక్క జాగృతికి పిలుపునిస్తాయని ఉద్ఘాటించారు — ఆ సందర్భాలు భగవంతుని విశ్వప్రేమ యొక్క గుప్త శక్తి యొక్క నూతన ఆరంభానికి అనుకూలమైన అవకాశాలు. అవి మన జీవితాలను మారుస్తాయి తద్ద్వారా మనతో సాన్నిహిత్యం ఉన్న వారందరు ఆశీర్వదించబడతారు.

“మీలోని విస్తారతను సాకారం చేసుకోవడానికి అల్పత్వపు కలల నుండి మేల్కొనండి,” అని గురువుగారు మనకు చెబుతున్నారు. భగవంతునిపై మరియు మన యొక్క ప్రతీ అణువులో విస్తరించి ఉన్న సర్వవ్యాపకమైన సార్వత్రిక కూటస్థ చైతన్యంపై ఆత్మ-వికాసకరమైన భక్తిపూర్వక ధ్యానానికి ఒకరోజు కేటాయించమని, ఆ విధంగా నిజమైన క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ఆయన మనందరినీ ఆహ్వానించారు.

ఇతరులకు సానుభూతితో కూడిన మద్దతును వస్తురూపంగా కానీ లేదా సమయం, శ్రద్ధ మరియు సంరక్షణ అనే బహుమతుల ద్వారా అందజేసేటప్పుడు కానీ మన చైతన్యం తగుపాళ్లలో తన స్వార్థ సరిహద్దులను తొలగించుకుంటుంది. మనకు ఇబ్బందికరమైన వారి పట్ల కూడా మన హృదయాలలో దయను ఉంచుకొని అర్థం చేసుకునే సహనం, మరియు క్షమాపణ యొక్క మాధుర్యంతో సామరస్యం మరియు స్వస్థత కోసం మనం చేసే ప్రతి ప్రయత్నంతో, మనం ఏసులో ఆదరించే సర్వప్రేమమయమైన చైతన్యాన్ని పొందుతాము. ఈ పవిత్ర సమయంలో సాంఘిక, జాతీయ మరియు మతపరమైన సరిహద్దులు లేని ఆత్మలుగా మానవాళి యొక్క దివ్య బంధుత్వాన్ని ఆయన వలె గుర్తించటం, మన కాలంలోని అనేక సవాళ్లకు అంతిమ సమాధానం.

ధ్యానంలో దేవుని సర్వవ్యాపకత్వంతో సహవాసంలో, ఏసు ఎరిగిన దివ్యపితను మనం గాఢంగా అనుభూతి చెందుతాము. హృదయపు అనుభూతి దాని సరిహద్దులను దాటుతుంది, అన్నింటినీ దాని స్వంతవిగా అనుభూతిని చెందుతుంది; ఆ ప్రేమ నుండి ఎవరినీ మినహాయించడం మీరు భరించలేరు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ విస్తరించిన చైతన్యమే మీరు స్వీకరించే దివ్య బహుమతిగా, కొత్త సంవత్సరంలోకి మీతో పాటు కొనసాగించాలి. గురుదేవులు మనకు చెప్పారు, “ప్రతి ఒక్కరూ ధ్యానం ద్వారా ఆ లక్షణాలను తమలో తాము భాగంగా చేసుకుని, ఏసు జీవితంలో ఉదాహరించిన ఆదర్శాలను జీవిస్తే, భూమిపై ప్రశాంత సహస్రాబ్ది మరియు సోదరభావం నెలకొంటాయి.”

మీకు మరియు మీ ప్రియమైన వారందరికీ ఆనందం, శాంతి మరియు ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను,

శ్రీ శ్రీ మృణాళినీమాత

సంఘమాత మరియు అధ్యక్షురాలు, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్

కాపీరైట్ © 2011 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.

ఇతరులతో షేర్ చేయండి