శ్రీ దయామాతగారి నూతన సంవత్సర సందేశం: 2010

“మన ప్రతి ఆలోచన మరియు సంకల్పం వెనుక దేవుని అనంతమైన శక్తి ఉంది. ఆయనను అన్వేషించండి, మరియు మీరు సంపూర్ణ విజయాన్ని పొందుతారు.”

—పరమహంస యోగానంద

నూతన సంవత్సరం 2010

ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు, గురుదేవులు పరమహంస యోగానందగారి ఆశ్రమాల్లోని మనమందరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆధ్యాత్మిక కుటుంబానికి మరియు స్నేహితులకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. క్రిస్మస్ సమయ౦లో మీ జ్ఞాపకాలకు, ఏడాది పొడవునా మీరు అందించిన పలు ప్రేమపూర్వక తోడ్పాట్లకు హృదయపూర్వక౦గా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దివ్య స్నేహం ఈశ్వరుని విశిష్ట ఆశీస్సులలో ఒకటి, మరియు అంతటా ఉన్న ఆయన పిల్లల జీవితాలలో మరింత శాంతి, సామరస్యాల కోసం మన ఐక్య ప్రార్థనల ద్వారా ఆ స్నేహాన్ని అందరికీ అందించడంలో మాతో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

ఈ నూతన ఆరంభాల తరుణం మన ఉదాత్తమైన కలలు మరియు ఆకాంక్షలను పునరుజ్జీవింపజేయడానికి మరియు వాటిని సాధించడానికి మన సామర్థ్యంపై నూతన విశ్వాసంతో ముందుకు సాగడానికి ఒక కొత్త అవకాశాన్ని కలిగిస్తుంది. మన జీవితాల్లో మనం చేయాలనుకునే సానుకూల మార్పులను దృఢమైన భావనతో, ఈ లోకంలో సాక్షాత్కరించుకొనేలా చూడవలసిన సమయం ఇది. ఎందుకంటే, ప్రతి విలువైన సాఫల్యం, ఆలోచనా శక్తి నుండే పుడుతుంది. మన మనస్సులో మనం ఏర్పరచుకొనే ధోరణులు మన భవితవ్యాన్ని మలచి, మన చుట్టూ ఉన్నవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. మనలో మరియు ఇతరులలో ఉన్న ఉత్తమమైన వాటిని బయటకు తీయడానికి మరియు మన ఉనికి యొక్క అనంతమైన మూలంతో అనుశ్రుతి పొందడానికి సానుకూలమైన, ప్రేమపూర్వకమైన, విశ్వాసాన్ని పెంపొందించే ఆలోచనలను స్పృహతో ఎంచుకొందాం.

మన ఉత్తమ అభిమతాలను సాకారం చేసుకోవడానికి దృఢ నిశ్చయం మరియు స్థిర సంకల్పాన్ని వినియోగి౦చడ౦ అవసర౦. ప్రతిరోజూ మరియు ప్రతి క్షణం మనం ఒక ఎంపికను ఎదుర్కొంటాము: మన ఆలోచనలను మరియు చర్యలను భగవంతుడితో కలపడం లేదా మాయ యొక్క భ్రాంతికరమైన శక్తితో కలపడం. అలవాటైన ధోరణులను పునరావృతం చేయడానికి మరియు మన అహంకారం యొక్క పరిమితులను అంగీకరించడానికి మాయ మనల్ని ప్రేరేపిస్తుంది. కానీ, మీ అధీనములోని అనంత వనరులతో మీరు ఒక ఆత్మ అని గుర్తుంచుకోండి. మీరు సరియైన, యోగ్యమైన లక్ష్యాన్ని ఎంచుకొని, మీ సంకల్పశక్తితో మీ ప్రయత్నాలను ఉత్తేజపరిచినప్పుడు, మీరు విజయం సాధించకుండా ఏదీ మిమ్మల్ని నిరోధించజాలదు. గురుదేవులు వ్యక్తపరిచిన అజేయమైన సంకల్పం ఇది. “కుదరదు” అనే పదానికి ఆయన నిఘంటువులో గాని, ఆయన చైతన్యంలో గాని చోటు లేదు. మీరు చేసుకొన్న తీర్మానాలు అమలుపరచే మానసిక బలాన్ని పెంపొందించుకోవాలని కూడా గురుదేవులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు.

మీలో పరివర్తనం కోసం మీరు చేసే ప్రయత్నాలను, పరిస్థితులు లేదా అంతర్గత ప్రతిఘటన అడ్డుకున్నప్పటికీ, మీ అత్యున్నత మేలు ఏది అని ఎంచుకునే మీ ఆత్మ యొక్క స్వేచ్ఛను మీరు నొక్కి చెప్పవచ్చు. మీరు మీపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ మానవ సంకల్పం వెనుక పరమాత్ముని సర్వశక్తిమంతమైన సంకల్పం ఉంది, మరియు ఆయన ప్రేమే మిమ్మల్ని రక్షిస్తోంది. మానవ బలహీనతలకు అతీతంగా చూసే, మీ ఆత్మ యొక్క అపరిమితమైన సామర్థ్యాలను చూసే ఆయనపై మీ నమ్మకాన్ని ఉంచండి, మరియు గురుదేవుల మాటలను హృదయానికి తీసుకోండి: “భగవంతుడు ఏదైనా చేయగలడు, మరియు ఆయన యొక్క తరగని గుణములతో తాదాత్మ్యం చెందడం నేర్చుకొంటే మీరు కూడా చేయగలరు.” అన్ని ఆలోచనలకు, భావోద్వేగాలకు అతీతమైన నిశ్చలతలో ఆయనతో అనుసంధానం పొందడానికి మీరు ప్రతిరోజూ సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు, మీరు ఆయన సాన్నిహిత్యాన్ని అనుభూతి చెందుతూ, దేవుడు అనంతమైన ప్రేమతో మీకు సాయం చేస్తున్నాడని తెలుసుకుంటారు.

మీకు, మీ ఆప్తులకు భగవంతుని నిండు ఆశీస్సులతో నూతన సంవత్సరం శుభాకాంక్షలు,

శ్రీ దయామాత

కాపీరైట్ © 2009 సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.

ఇతరులతో షేర్ చేయండి