శ్రీ దయామాత నుండి లేఖ

దేవునితో అనుసంధానం పొందడానికి ఇతర చిత్తశుద్ధిగల అన్వేషకులతో కలవడం ఆధ్యాత్మిక మార్గంలో అమూల్యమైన ఆశీర్వాదం. గురుదేవుల ఆశ్రమాల్లో భక్తులు అనుసరించే దైనందిన దినచర్యకు కేంద్రబిందువైన సామూహిక ధ్యానాలలో నాకు దొరికిన అంతర్గత సహాయానికి, ధ్యాన పద్ధతులను అభ్యసించడానికి మరియు దైవాన్ని గాఢముగా అన్వేషించడానికి మేము చేసిన ఐక్య ప్రయత్నాల నుండి పొందిన ఆధ్యాత్మిక ప్రేరణకు, పురోగతికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలిని.

అది నిర్దిష్ట కార్యక్రమమైనా లేదా కేవలం దివ్య స్నేహితుల ఆకస్మిక పిలుపు అయినా సరే, భక్తులు ధ్యానం కోసం జతకూడినప్పుడు గురుదేవులు ఎంతగానో సంతోషిస్తారు. యుక్త వయస్సులో మంచి సహచరులతో ధ్యానం చేయమని, ఆ “ఆధ్యాత్మిక అంగరక్షకులను” తన చుట్టూ తరచుగా ఆకర్షించమని తన గురుదేవులైన స్వామి శ్రీయుక్తేశ్వర్ సలహా ఇచ్చారని ఆయన వివరించారు. కొరగాని కలవరము, చంచలత, లేదా మానసిక ఉదాసీనత దైవ అన్వేషణ నుండి మనల్ని దూరం చేస్తాయి, తద్ద్వారా మనం ఆయనను మరచిపోయేట్లు చేస్తాయి. కానీ మనం ఇతరులతో కలసి ధ్యానం చేసినప్పుడు, ఒక అద్భుతమైన భక్తి వాతావరణం ఏర్పడుతుంది, దీనిలో ప్రతి భక్తుడు మిగిలిన వారి ఉత్సాహాన్ని మరియు ఏకాగ్రతను బలోపేతం చేస్తాడు. దేవుని పట్ల మనకున్న ప్రేమ పెరుగుతు౦ది, ఆయన మనకు మరి౦త వాస్తవికమవుతాడు, నిరంతరం మారే జీవితపు బాహ్య నాటక౦లోని తాత్కాలిక ఆకర్షణల క౦టే మరి౦త స౦తృప్తికరంగా ఉంటుంది. గురుదేవులు ఇలా అన్నారు, “సామూహిక ధ్యానం అనేది కొత్త ఆధ్యాత్మిక ఔత్సాహికులను అలాగే అనుభవజ్ఞులైన ధ్యానులను రక్షించే కోట. కలిసి ధ్యానం చేయడం వల్ల సామూహిక అయస్కాంతత్వం యొక్క అదృశ్య స్పందనల మార్పిడి నియమం ద్వారా సమూహంలోని ప్రతి సభ్యుని ఆత్మ-సాక్షాత్కార స్థాయి పెరుగుతుంది.”

మీలో చాలామ౦ది మందిరాల్లో, కేంద్రాల్లో, సామూహిక ధ్యానాలకు హాజరవుతున్నారని తెలుసుకోవడ౦; మరియు మీరు పొందిన శాశ్వత ప్రయోజనాలను వివరించే లేఖలను చదవడం, నాకు ఆన౦దాన్ని కలుగజేస్తు౦ది. మీ సాధనలోని ఈ ముఖ్య అంశాన్ని మనస్ఫూర్తిగా కొనసాగించండి. మీకు మీరు సహాయం చేసుకోవడమే కాకుండా, మీరు హృదయపూర్వకంగా, బేషరతుగా, ప్రేమతో ఆయనను అన్వేషించినప్పుడు ఈ భూమ్మీద మరింత దయకు, దైవచైతన్యానికి దోహదపడతారని గుర్తుంచుకోండి. అంతేకాక కలిసి ధ్యానం చేయడం ద్వారా, మీరు పంచుకునే దైవానుసంధానం ద్వారా స్నేహం మరియు సామరస్యం యొక్క నిరంతర లోతైన బంధాన్ని ఏర్పరుస్తారు.

దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు,

 

శ్రీ దయామాత

ఇతరులతో షేర్ చేయండి