శ్రీ పరమహంస యోగానంద

శ్రీ శ్రీ దయామాత

రచన – ఫైండింగ్ ద జాయ్ వితిన్ యు (Finding the Joy Within You):
భగవత్-కేంద్రీకృత జీవనానికై వ్యక్తిగత ఉపదేశము
అనే పుస్తకం నుంచి

సంవత్సరాలు గడిచేకొద్దీ, మనస్సు క్రొత్త అనుభవాలను సేకరిస్తుంది, అయితే సాధారణంగా సమయం సుదీర్ఘకాలపు జ్ఞాపకాలను మసకబారుస్తుంది. కానీ ఆత్మను తాకిన అనుభవాలు మాత్రం ఎన్నటికీ మరుగునబడవు. అవి మనలో అమరమైన, శక్తివంతమైన భాగంగా మారతాయి. నా గురువు పరమహంస యోగానందగారితో నా సమావేశం అలాంటిది.

అప్పుడు నేను పదిహేడేళ్ళ అమ్మాయిని, జీవితం శూన్యము అగమ్యగోచరము అయిన ఒక సుదీర్ఘ వసారాలాగా తోచింది. నా అడుగులను భగవత్ అన్వేషణ మరియు సేవ అనే ఒక ప్రయోజనకరమైన ఉనికి వైపు నడిపించమంటూ భగవంతునికి ఒక నిరంతర ప్రార్థన నా చైతన్యంలో తిరుగుతూ ఉండేది.

నా తపనకు తక్షణ పరిష్కారంగా, 1931లో నేను సాల్ట్ లేక్ సిటీలోని రద్దీగా ఉన్న పెద్ద ఆడిటోరియంలోకి ప్రవేశించినప్పుడు, పరమహంసగారు వేదికపై నిలబడి ఉండటాన్ని చూశాను. నేను మునుపెన్నడూ చూడని సాధికారతతో దేవుని గురించి వారు మాట్లాడుతున్నారు. నేను పూర్తిగా నిశ్చేస్టురాలిని అయిపోయాను – నా శ్వాస, ఆలోచనలు, సమయం నిలిపి వేయబడినట్లు అనిపించింది. నాపై వర్షిస్తున్న ఆశీస్సుల పట్ల ప్రేమ-కృతజ్ఞతలతో కూడిన గుర్తింపు, నాలో పెరుగుతున్న ఒక దృఢ విశ్వాసం యొక్క ఎరుకను కలిగించింది – “ఆయన భగవంతుడిని నేను ఎప్పుడూ కోరుకున్నంతగా ప్రేమిస్తున్నారు. ఆయనకు దేవుడు తెలుసు, ఆయనను నేను అనుసరిస్తాను.”

గౌరవము మరియు సమగ్రత యొక్క ఆదర్శాలను ఉద్ధరించటం

ఒక ఆధ్యాత్మిక గురువు ఎంత ఆదర్శవంతంగా ఉండాలో నాకు ఒక అభిప్రాయం ఉండేది. అలాంటి ఉన్నత వ్యక్తిచే అలంకరింపబడటానికి నా మనోనేత్రంలో సింహాసనం పై ఒక దివ్యపీఠాన్ని ఏర్పరచుకున్నానని మీరు అనుకోవచ్చు. భక్తితో నేను నా గురువును మానసికంగా అక్కడ ఉంచాను; నేను ఆయన దివ్యసన్నిధిలో గడిపే అదృష్టం కలిగిన చాలా సంవత్సరాలలో ఎన్నడూ ఆయన, నేను ఏర్పరచుకున్న ఔన్నత్యం నుంచి స్వభావంలో కానీ లేదా చేతలలో కానీ దిగజారలేదు.

మన యుగంలో స్వార్థం యొక్క అలల క్రింద సమగ్రత, గౌరవం మరియు ఆదర్శవాదం అదృశ్యమైనప్పటికీ, గురుదేవులు శాశ్వతమైన ఆధ్యాత్మిక ఆదర్శాలను పాటించడంలో రాజీ పడకుండా జీవించి, వాటిని ఎప్పుడూ శిష్యుల దృష్టిలో ఉండేటట్లు చేశారు. 1931లో నిధులు అత్యవసరం అయిన సందర్భం ఒకటి నాకు గుర్తుకు వస్తున్నది. ఆ సమయంలో ఆర్థిక వనరులు చాలా తక్కువగా ఉండటం వల్ల గురువుగారు మరియు శిష్యులు కేవలం పలుచని సూప్ – బ్రెడ్ మీదే జీవించారు, లేదా పూర్తి ఉపవాసం ఉన్నారు. మా ముఖ్య కేంద్రం మౌంట్ వాషింగ్టన్ వాయిదా చెల్లింపులు బాకీ ఉన్నాయి. పరమహంసగారు ఆ కేంద్రం యొక్క కుదువ అధీనదారు వద్దకు వెళ్ళి చెల్లింపుల గడువు పొడిగించమని అర్థించారు. ఆ విజ్ఞత కల స్త్రీ దయతో గడువును పొడిగించింది. అయినప్పటికీ, అవసరమైన నిధులను సకాలంలో సేకరించడం అసాధ్యమే అనిపించింది.

అప్పుడు ఒక రోజు ఒక వ్యాపార ప్రతినిధి గురుదేవుల తరగతులకు వచ్చి వారి బోధనలపై ఆసక్తి కనబరిచాడు. వారి బోధనలలో వాటి ఆధ్యాత్మిక విలువను మాత్రమే కాకుండా, లాభదాయకమైన సామర్థ్యాన్ని కూడా చూశాడు. “మీ సంస్థను ప్రోత్సహించే బాధ్యతను నేను తీసుకుంటాను, ఒక సంవత్సరంలోనే మీ సంస్థకి ప్రాముఖ్యతను తీసుకుని వస్తాను. మీకు వేలకొలదీ విద్యార్థులు వస్తారు, మీరు డాలర్లు బాగా గడిస్తారు” అని పరమహంసగారికి హామీ ఇచ్చాడు.

పవిత్రమైన బోధలను వాణిజ్యపరం చేసే తన ప్రణాళికను వివరించాడు. గురుదేవులు మర్యాదగా విన్నారు. ఆ పథకం నిజంగా తన ఆర్థిక చింతలకు ముగింపు పలికి, ఆయన ఎరుకతో ఎదుర్కొంటున్న కష్టాలను అరికడుతుంది. కానీ ఒక్క క్షణం కూడా సంకోచించకుండా ఆయన ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి, “ఎన్నటికీ జరగదు! నేను మతాన్ని ఎప్పటికీ వ్యాపారపరం చేయను. ఈ రచనలను మరియు నా ఆదర్శాలను రాజీపడి అల్పమైన కొన్ని డాలర్లు సంపాదించడం కోసం ఎన్నటికీ ఉపయోగించను, ఎంత అవసరం అయినప్పటికీ!”

రెండు నెలల తరువాత, మిస్సౌరీలోని కాన్సాస్ నగరంలో బోధన చేస్తున్నప్పుడు, అనేక పూర్వ జన్మలలో ఆధ్యాత్మికంగా ఉన్నత శిష్యుడైన రాజర్షి జనకానంద, ఎవరైతే సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ లో ముఖ్యమైన పాత్ర పోషించవలసి ఉన్నారో వారిని కలుసుకున్నారు. ఈ మహాత్ముడు, గురువుగారిని తన దైవిక గురువుగా స్వీకరించి, ఆయన బోధనలను తన రోజువారీ జీవన విధానంగా స్వీకరించి, కుదువ ధనం మొత్తం చెల్లింపు చేయటానికి నిధులు ఇచ్చారు. ఆ సందర్భంగా మౌంట్ వాషింగ్టన్ లోని టెంపుల్ ఆఫ్ లీవ్స్ దిగువన ఒక భోగి మంట చేసి కుదువను మంటలలో కాల్చినప్పుడు గొప్ప సంబరం జరిగింది. వ్యవహార దక్షులైన మా గురుదేవులు, అదే అవకాశంగా కొన్ని బంగాళదుంపలను ఆ నిప్పులలో వేయించారు. భోగి మంటలలో ఆ కుదువ పూర్తిగా కాలేంతవరకూ, చుట్టూ చేరిన శిష్యులందరూ గురువుగారితో పాటు బంగాళదుంపలను ఆస్వాదించారు.

జగన్మాత ఉనికి యొక్క హామీ

నా స్మృతిలో మరికొన్ని సంఘటనలు మరియు గురువుగారి దివ్యశక్తి యొక్క ఇతర అంశాలు నిలిచి ఉన్నాయి. అనేక మంది శిష్యుల యొక్క నివాసము, పోషణ మరియు ఇతర ఆధార అవసరాలతో పాటు అభివృద్ధి చెందుతున్న సంస్థ యొక్క భారమును అనుభవిస్తూ, తమ హృదయపు ఏకమాత్ర తపన అయిన ఎడతెగని దైవ సంసర్గం కోరుకుంటూ ఆటంకాలకు దూరంగా ఆరిజోనాలోని ఎడారికి గురువుగారు వెళ్ళారు. అక్కడ వారు సంస్థాగత బాధ్యతల యొక్క కలవరపరిచే విధుల నుంచి విముక్తికై తమ ప్రియమైన జగన్మాతను ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఏకాంతంగా ఉండిపోయారు. ఒకరాత్రి ఆయన – “ఆమె సమాధానానికై పరితపిస్తూ నా హృదయం బ్రద్దలవుతుందేమో అన్నంతగా” ధ్యానం చేస్తున్నప్పుడు ఆమె సాక్షాత్కరించి ఈ ఓదార్పు వచనాలను పలికింది అని చెప్పారు:

జీవితపు నృత్యమైనా లేదా మరణపు నృత్యమైనా,
ఇవి ఏవైనా నా నుంచే వస్తాయని తెలుసుకొని ఆనందించు.
నీకు నేనున్నాను అన్నదానికన్నా అధికంగా ఇంకేం కావాలి?

తాను ఆరాధించిన జగన్మాత జీవన-మరణాలలో ఎప్పుడూ తనతోనే ఉంటుందనే హామీవల్ల అమితానంద భరితులైన ఆయన, శాంతి మరియు సర్వ-విధేయక ప్రేమలు నింపుకున్న హృదయంతో, ఆమె తన భుజాలపై ఉంచిన లక్ష్యాన్ని స్వీకరించడానికి మళ్ళీ తిరిగి వచ్చారు.

భగవత్ సాక్షాత్కారం కలిగిన వారిలో సహజంగా అభివ్యక్తం అయినట్టుగానే, గురుదేవులకు గొప్ప ఆధ్యాత్మిక శక్తులు ఉండేవి. అలాంటి శక్తులు కేవలం ఉన్నతమైన నియమాల పనితీరులు మాత్రమేనని పరమహంసగారు వివరించారు. సంశయాత్మక సమాజాన్ని ప్రోత్సహించడానికై ఆయన ఆధ్యాత్మిక సమావేశ నిర్వహణ తొలిరోజుల్లో కొన్నిసార్లు ఆ నియమాలను బహిరంగంగా ప్రదర్శించేవారు. ఆయన అప్పటికప్పుడు స్వస్థత చేకూర్చిన చాలామందిలో నేను ఒకరిని.

తరువాతి సంవత్సరాల్లో గురుదేవులు ఇలా చెప్పారు, “దేవుడు నాకు ఇచ్చిన శక్తులను ప్రదర్శిస్తే, నేను వేలాది మందిని ఆకర్షించగలను. కానీ భగవంతుని వైపు మార్గం మహిమా-ప్రదర్శనం కాదు. నేను ఆ శక్తులను దేవునికి తిరిగి ఇచ్చేశాను, ఆయన నాకు చెప్పకపోతే నేను వాటిని ఎన్నడూ ఉపయోగించను. మనిషి యొక్క ఆత్మలో దేవుని పట్ల ప్రేమను మేల్కొల్పడమే నా లక్ష్యం. ఒక గుంపుకు బదులు ఒక ఆత్మను ఎంచుకుంటాను నేను, అలాంటి ఆత్మల సమూహాన్ని ఇష్టపడతాను.” గురుదేవులు సమూహాల నుండి వైదొలిగి, సంఖ్యాపరమైన అభివృద్ధి కంటే గుణాత్మకమైన అభివృద్ధిపై దృష్టి పెట్టడం ప్రారంభించారు. తన బోధనల యొక్క ఉన్నత ఆదర్శాలకు మరియు ఆధ్యాత్మిక లక్ష్యాలకు ప్రతిస్పందించిన “ఆత్మలను” ఆయన జన సమూహంలో వెతకసాగారు.

సేవ, జ్ఞానం మరియు దైవ ప్రేమ

ఒకసారి ఒక వార్తాపత్రిక సంపాదకుడు ఒక ఇంటర్వ్యూలో నన్ను ఇలా అడిగాడు, “పరమహంస యోగానందగారు భక్తి యోగి, జ్ఞాన యోగి లేదా కర్మ యోగి – వీరిలో ఎవరని చెపుతారు?” అప్పుడు నేను అన్నాను, “ఆయనలో చాలా వ్యక్తిత్వాలు ఉన్నాయి. అమెరికన్ ప్రజల బుద్ధిని మరియు హృదయాలను చేరుకోవడానికి అటువంటి ఉత్తమ స్వభావం, మహోన్నత స్థాయి మరియు సదవగాహన అవసరం అయ్యాయి. ఆ లక్షణాల వల్ల ఆయన అమెరికా మరియు భారతదేశపు జీవన స్థాయిల మధ్య ఉన్న అంతరానికి వారధిగా ఉండటం సాధ్యపడింది. ఆయన బోధనలు తూర్పున వర్తించినంతగా పశ్చిమ దేశాలలో కూడా వర్తించే విధంగా సార్వత్రిక తత్వమును తెలియచేస్తాయి.”

ఒక కర్మయోగిగా, పరమహంసగారు దేవునికోసం మరియు మానవజాతి అభ్యున్నతి కోసం ఈ ప్రపంచంలోనే అరుదైనంత అంకితభావంతో కృషి చేశారు. ఇతరులకు సహాయం లేదా సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు ఆయన, తనకు తాను కూడా ఎన్నడూ మినహాయింపు ఇచ్చుకోలేదు. ఆయన బాధితుల కోసం విలపించారు, అన్ని బాధలకు మూలమైన “అజ్ఞానాన్ని” నిర్మూలించడానికి అలసట లేకుండా శ్రమించారు.

ఒక జ్ఞానిగా, ఆయన జ్ఞానం తన రచనలు, ఉపన్యాసాలు మరియు వ్యక్తిగత సలహాల ద్వారా సంచికలలో ప్రవహించింది. ఆయన యొక్క ఒక యోగి ఆత్మకథ, యోగం మీద అధికారిక పాఠ్యపుస్తకంగా గుర్తించబడింది మరియు అనేక కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో వివిధ కోర్సులలో బోధన మరియు అధ్యయనం రెండింటికీ ఉపయోగించబడుతున్నది. పరమహంసగారు కేవలం మేధావి మాత్రమే అని చెప్పలేము. సాక్షాత్కారం లేని మేధస్సు తేనె లేని తేనెపట్టు వలె పనికిరానిదని ఆయన అభిమతం. మతాన్ని దాని సిద్ధాంతం మరియు సైద్ధాంతిక విశ్లేషణల నుండి విడదీసి, పరమహంసగారు సత్యం యొక్క హృదయాన్ని వెల్లడించారు; వారి బోధనా సారము మానవాళికి కేవలం దేవునిపై అవగాహనను మాత్రమే కాకుండా, ఆయనను సాక్షాత్కరించుకునే మార్గాన్ని కూడా ఇస్తుంది.

అనుచరులు పరమహంస యోగానందగారిని, అన్నింటికన్నా అత్యున్నతంగా ఒక ప్రేమావతారులుగా, అంటే దివ్య-ప్రేమ యొక్క అవతార మూర్తిగా, ఒక పరమ భక్తునిగా ఎరుగుదురు. ఆయన వ్యక్తిత్వంలో విశిష్టంగా కనిపించేది, ఆయన భక్తితో జగన్మాతగా కొలిచే దేవునిపై ఆయనకున్న అత్యధిక ప్రేమ. ఇది ఏసు చెప్పిన మొదటి ఆజ్ఞ: “నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ మనస్సుతో ప్రేమించాలి.” అమెరికాలో తన తొలినాళ్లలో ప్రజలముందు మాట్లాడుతున్నా; లేదా అభివృద్ధి చెందుతున్న తన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ యొక్క ప్రపంచవ్యాప్త అవసరాలను నిర్వహిస్తున్నప్పుడైనా; లేదా తన వద్దకు వచ్చిన శిష్యులకు ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తున్నప్పుడైనా పరమహంసగారు అలాంటి ప్రేమను ప్రత్యక్షంగా చూపారు.

ఆధ్యాత్మిక క్రమశిక్షణ కోసం, అవసరమైనప్పుడు పరమహంసగారు తీవ్రంగా మందలించే వారు. కానీ ఓర్పు అవసరమైనప్పుడు అనంతమైన కరుణ, మరియు సహనం కలిగి ఉండేవారు. ఆయన పనిపై కొంతమంది శత్రు విమర్శకుల దాడిపై మేము కోపంగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు గుర్తుకు వస్తాయి: “ఇతర బోధకులు మరియు సమాజాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ క్రూరమైన మాట మాట్లాడకండి. ఇతరుల తలలను నరకడం ద్వారా ఎప్పుడూ ఎత్తుగా కనిపించడానికి ప్రయత్నించవద్దు. ఈ ప్రపంచంలో అందరికీ తగినంత స్థలం ఉంది, మరియు మనం నిర్దయ, ద్వేషానికి మంచితనం మరియు ప్రేమతో స్పందించాలి.”

ఆయన ప్రపంచానికి ఒక “విశ్వ ప్రార్థన” ఇచ్చారు, దీని ఇతివృత్తం ఆయన జీవిత ఆదర్శం: “ప్రియమైన దేవా, నీ ప్రేమను నా భక్తి మందిరం మీద శాశ్వతంగా ప్రకాశించనివ్వు, మరియు నీ ప్రేమను నేను అన్ని హృదయాలలోనూ మేల్కొలపనివ్వు.”

“ప్రేమ మాత్రమే నా స్థానాన్ని తీసుకోగలదు”

గురుదేవుల జీవితపు చివర్లో, ఆయన భారత రాయబారి డాక్టర్ బినయ్ ఆర్. సేన్ (ఈయన మరుసటి రోజు ఉదయం మా సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యాలయంలో గురువుగారిని సందర్శించడానికి రాబోతున్నాడు)ను ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నారు. గురుదేవులు శిష్యులను ఆశ్రమ వంటగదిలోకి పిలిచి, “ఈ రోజు మనం రాయబారి కోసం కూరలు మరియు భారతీయ మిఠాయిలను సిద్ధం చేద్దాము” అని చెప్పారు. మేము రోజంతా వంటలు తయారుచేశాము, మరియు గురువుగారు చాలా ఆనందంగా ఉన్నారు.

ఆ సాయంత్రం, గురువుగారు నన్ను తన వద్దకు పిలిచి, “రా, మనం నడుచుకుంటూ వెళదాము” అని అన్నారు. ఆశ్రమం మూడు అంతస్తుల పెద్ద భవనం. మేము మూడవ అంతస్తు హాలులో నడుస్తున్నప్పుడు, ఆయన తన గురువుగారైన స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారి చిత్ర పటం ముందు ఆగారు. ఆ చిత్రాన్ని రెప్ప కొట్టకుండా చాలాసేపు తదేకంగా చూశారు. ఆపై చాలా నిశ్శబ్దంగా ఆయన నా వైపు తిరిగి ఇలా అన్నారు: “నువ్వు గ్రహించావా, కేవలం ఇంకొన్ని గంటలలో నేను ఈ భూమిని విడిచిపెట్టబోతున్నాను.” నా కన్నీళ్ళు ధారగా ప్రవహించాయి. సహజ-స్ఫురణ వల్ల, ఆయన చెప్పినది నెరవేరుతుందని నాకు తెలుసు. కొద్దికాలం క్రితం, ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టడం గురించి నాతో మాట్లాడినప్పుడు, నేను ఆయనతో, “గురుదేవా, మీరు మా హృదయాల అంగుళియకానికి వజ్రం వంటివారు మరియు మీ సంస్థకు కూడా. మీరు లేకుండా మేము ఎలా కొనసాగించగలం?” మధురమైన ప్రేమ మరియు కరుణతో ఆయన కళ్ళు దివ్యానందపు మృదు-కొలనులై, ఇలా సమాధానం ఇచ్చారు: “నేను వెళ్ళిన తరువాత, కేవలం ప్రేమ మాత్రమే నా స్థానాన్ని తీసుకోగలదు. మీకు దేవుడు తప్ప మరేమీ తెలియనంతగా దేవుని ప్రేమతో తన్మయులై ఉండండి; మరియు ఆ ప్రేమను అందరికీ పంచండి.”

చివరి రోజు, ఆయన లాస్ ఏంజిలిస్ దిగువన రాయబారి కోసం విందులో మాట్లాడవలసి ఉంది. ఆయనకు సేవ చేసే మేము కొందరం తెల్లవారుజామున లేచి ఆయనకు ఏదైనా సేవ చేయగలమా అని చూడటానికి ఆయన తలుపు దగ్గరకు వెళ్ళాము. మేము ప్రవేశించినప్పుడు, ఆయన చాలా నిశ్శబ్దంగా కుర్చీలో కూర్చొని ఉన్నారు, అందులో ఆయన తరచూ ధ్యానం చేసేవారు మరియు తరచూ పారవశ్యంలో ఉండేవారు. నిశ్శబ్దం కోరుకున్నప్పుడు ఆయన ఎప్పుడూ చేసే తీరుగా, తన పెదవులపై వేలు పెట్టి సూచిస్తూ – “నేను నిశ్శబ్దంలో ఉన్నాను” అని తెలిపారు. ఆయన అలా సూచించిన క్షణం, ఆయన తన ఆత్మను ఉపసంహరించుకోవడం నేను చూశాను, ఆత్మను ఆయన శరీరానికి బంధించే ప్రతీ అంతర్లీనమైన సంబంధాన్నీ క్రమంగా త్రుంచుతున్నారు. దుఃఖంతో నా హృదయం నిండింది. కానీ బలంగానే ఉంది, ఎందుకంటే ఆయన పట్ల నాకున్న భక్తి ద్వారా ఏమి జరిగినా నా గురువు గారు ఎప్పుడూ నా హృదయాన్ని విడిచిపెట్టరు అని నాకు తెలుసు.

రోజంతా ఆయన ఆ అంతర్ముఖ స్థితిలోనే ఉన్నారు. సాయంత్రం మేము ఆయనతో కలిసి విందు నిర్వహించాల్సిన పెద్ద హోటల్‌కు వెళ్ళాము. తొందరగా చేరుకున్న గురువు గారు నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ మేడమీద ఒక చిన్న గదిలో వేచి ఉన్నారు. మేము శిష్యులం నేలపై ఆయన చుట్టూ కూర్చొన్నాము. కొంత సమయం తరువాత, ఆయన మాలో ప్రతి ఒక్కరినీ చూశారు. ఆయన నన్ను చూస్తున్నప్పుడు – “నా ప్రియమైన గురువుగారు నాకు వీడ్కోలు దర్శనం ఇస్తున్నారు” అని నేను అనుకోవడం నాకు గుర్తుంది. ఆ వెంటనే ఆయన విందు జరిగే హాల్‌కి వెళ్ళారు.

పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నారు, ఇందులో నగర, రాష్ట్ర మరియు భారత ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. నేను వక్తల బల్లల నుండి కొంత దూరంలో కూర్చున్నాను, కాని నా మనస్సు మరియు చూపులు గురువుగారి దివ్య ముఖాన్ని వదలలేదు. చివరగా, ఆయన మాట్లాడే సమయం వచ్చింది. సభలో రాయబారి సేన్ ప్రసంగించే ముందు చివరిగా గురువుగారు మాట్లాడాల్సి ఉంది. గురువుగారు తన కుర్చీలోంచి లేచినప్పుడు, నా గుండె గతి తప్పి నేను ఇలా అనుకున్నాను “ఓహ్, ఇదే ఆ క్షణం!”

దేవుని పట్ల అత్యంత ప్రేమతో ఆయన మాట్లాడటం ప్రారంభించినప్పుడు ప్రేక్షకులందరూ ఒక్కరైనట్టు ఎవ్వరూ కదలలేదు. ఆయన తన హృదయం నుండి వారందరిపై వర్షిస్తున్నవిపరీతమైన ప్రేమ శక్తికి వారు పరివర్తన చెందారు. ఆ దైవిక అనుభవం కారణంగా ఆ రాత్రి చాలా మంది జీవితాలు మార్చబడ్డాయి – వాళ్ళలో కొందరు ఆ తరువాత ఆశ్రమంలో సన్యాసులుగా ప్రవేశించినవారు మరియు సంస్థలో సభ్యులు అయినవారు మరికొందరు. ఆయన చివరి మాటలు ఆయన ఎంతో ప్రేమించిన భారతదేశం గురించి:

“గంగానది, అడవులు, హిమాలయ గుహలు, మరియు భగవంతునికై కలగనే మనుషులు ఉన్నచోట —
నేను పునీతుడనైనాను; నా దేహం ఆ నేలను తాకింది.”

ఈ మాటలు పలికి ఆయన కూటస్థ కేంద్రంలోకి దృష్టి సారించారు, ఆయన శరీరం నేలమీద పడిపోయింది. ఒక్క క్షణం పాదాల క్రింద భూమి జారిపోయినట్టు అనిపించింది మాకు – ఇద్దరం శిష్యులం (దయామాత మరియు ఆనందమాత) ఆయన ప్రక్కనే ఉన్నాము. ఆయన సమాధిలోకి వెళ్ళారేమో అనుకుంటూ ఆయన కుడి చెవిలో “ఓంకారాన్ని” ఉచ్చరించాము. (సమాధిలోకి వెళ్ళినప్పుడు కొంతసేపటికి ఆయన చైతన్యం దేహంలోకి తిరిగి రాకపోతే, కుడిచేవిలో “ఓంకారం” ఉచ్చరించి ఆయనను ఆ స్థితి నుండి బయటకు తీసుకురాగలమని చాలా ఏళ్ళుగా ఆయన మాకు చెప్పారు.)

అలా నేను ఉచ్చరిస్తున్నప్పుడు నాకు ఒక అద్భుతమైన అనుభవం కలిగింది, దానిని మీకు ఎలా వర్ణించాలో నాకు తెలియదు. నా దివ్య గురువు సన్నిధిలో మోకరిల్లినపుడు, ఆయన ఆత్మ ఆయన శరీరాన్ని విడిచిపెడుతున్నట్లు నేను చూడగలిగాను; వెంటనే ఒక బ్రహ్మాండమైన శక్తి నాలోకి ప్రవేశించింది. నేను “బ్రహ్మాండమైన” అని ఎందుకు చెప్తున్నాను అంటే – ఇది ప్రేమ, శాంతి మరియు అవగాహన యొక్క అత్యధికమైన ఆనందకర-శక్తి. “ఇది ఏమిటి?” అని నేను అనుకోవడం నాకు గుర్తుంది. దుఃఖ రహితంగా ఉండగలిగేటట్లు నా చైతన్యం ఎంతగా ఉద్ధరించబడింది అంటే, నేను ఇంక కన్నీళ్లు పెట్టుకోలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకూ నేను అదే స్థితిలో ఉన్నాను, ఎందుకంటే ఆయన నిజంగా నాతో ఉన్నారని నాకు నిస్సందేహంగా తెలుసు.

ఆయనపై ఆధిక్యం చూపలేకపోయిన మరణం

ఎవరో నన్ను అడిగారు, “మన గురువుగారు తన శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత మీకు కనిపించారా?” అవును, ఆయన కనిపించారు. దీని గురించి ఇంకా మాట్లాడుతూ నేను కథని కొనసాగిస్తాను. చివరిసారిగా గురువుగారి యొక్క మర్త్య దేహాన్ని చూడటానికి వేలాది మంది వచ్చారు. ఆయన చర్మం స్వర్ణకాంతిలో స్నానం చేసినట్లుగా బంగారు వర్ణంలో ఉంది; మరియు అత్యంత మధురమైన అంశం, ప్రతీ ఒక్కరినీ ఆశీర్వదిస్తున్నట్టు చాలా ప్రసన్నమైన చిరునవ్వు ఆయన పెదవులపై ఉంది. గురువుగారు తన శరీరాన్ని విడిచిపెట్టినప్పటినుంచి ఇరవై ఒక్క రోజుల పాటు ఆయన శరీరం పరిపూర్ణ సంరక్షక స్థితిలో ఉంది. క్షిణించు చిహ్నాలు స్వల్పంగా కూడా లేవు. ఈ అద్భుత సంఘటనపై పశ్చిమార్ధగోళం మొత్తం కూడా వార్తాపత్రికలు ముఖ్యాంశాలు మరియు నివేదికలతో నిండి ఉన్నాయి. ఆయన శరీరాన్ని గమనించిన అంత్యక్రియా నిర్వాహకులు “పరమహంస యోగానంద కేసు మా అనుభవంలో ప్రత్యేకమైనది” అని పేర్కొన్నారు.

ఆ తరువాత కొద్దికాలానికే గురుదేవులు సంకల్పించిన పనులయొక్క నాయకత్వ పూర్తి బాధ్యత నా భుజాలపై పడింది.

గొప్ప గురువులు ప్రపంచాన్ని వదిలినప్పుడు, ఆ గురువు ప్రారంభించిన కార్యము ఎలా నడిపించాలి అన్నదానిపై తరచుగా కొన్ని భిన్న అభిప్రాయములు ఉద్భవిస్తాయి. నేను నాయకురాలిని అయిన మరుసటి ఉదయం కార్య నిర్వహణ గురించిన చర్చలలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. కార్య నిర్వహణ గృహస్థుల చేతిలో ఉండాలా లేక సన్యాసుల చేతిలోనా? అది ఆయనలాంటి హృదయపూర్వక పరిత్యాగులతోనే ఉండాలని గురువుగారు చెప్పారు; కానీ ఆ ఆదేశాన్ని కొంతమంది సభ్యులు సవాలు చేస్తున్నారు. నిజమే, గురువుగారికి భక్తులందరి పట్ల ఉన్న ప్రేమ సమానమే. నాకు కూడా ఏ తేడా అనిపించలేదు; బాహ్య విషయాలతో ఎందుకు కట్టుబడి ఉండాలి? ఒక భక్తుడు దేవుణ్ణి ప్రేమిస్తాడు కనుక భక్తుడు, అతను కాషాయ వస్త్రం ధరించినందువల్ల కాదు. కానీ నా మనసు కలవరపడింది.

ఆ రాత్రి, నేను గాఢ ధ్యానంలో ఆయన్ను ప్రార్థించి గురువుగారి సమాధానం కోసం అర్థించాను. ఈవిధంగా చాలా ఆలస్యం అయినప్పటికీ నేను ఇంకా ధ్యానిస్తూనే ఉండగా అకస్మాత్తుగా నా శరీరం మంచం మీద నుండి లేచి, హాల్ నుండి నడుస్తూ, గురుదేవుల గదిలోకి ప్రవేశించడం చూశాను. అదే సమయంలో, సన్ననిగాలికి ఊగుతున్నట్టుగా ఆయన చద్దర్ రెపరెపలాడటం క్రీగంట చూశాను. అటు తిరగగా, అక్కడ నా గురువు నిల్చుని ఉన్నారు! అమితానందంతో ఆయన వద్దకు పరుగెట్టి, ఆయన పాద ధూళిని స్పృశించడానికి పాదాలకు మోకరిల్లాను.

“గురుదేవా, గురుదేవా” అంటూ అరిచాను, “మీరు మరణించలేదు మీరు వెళ్ళిపోలేదు! మరణానికి మీపై అధికారం లేదు.” అప్పుడు ఆయన ఎంతో ప్రేమతో క్రిందికి వంగి నా నుదుటిని స్పృశించారు. ఆయన అలా చేయగానే, తక్షణమే నాకు మరుసటి ఉదయం నేను ఇవ్వాల్సిన జవాబు తెలిసిపోయింది. గురువుగారు నన్ను ఆశీర్వదించగా, నన్ను నేను మళ్ళీ మంచంపై కూర్చుని ఉండటం చూశాను.

ఆ మరుసటి ఉదయం, సొసైటీ డైరెక్టర్లను కలిసి గురువుగారు నాకు తెలియజేసిన సమాధానం ఇచ్చాను; అప్పటి నుంచీ గురువుగారి సంస్థ ఐక్యంగా ఉండి దినదిన ప్రవర్థమానం అవుతూ ఉన్నది. భగవంతుని ఆశీర్వాదం అలాంటిది.

శాశ్వతమైన గురువు

పరమహంస యోగానందగారు ఎప్పటికీ సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క గురువు మరియు అత్యున్నత ఆధ్యాత్మిక అధ్యక్షులు. ఆయన ప్రారంభించిన పనిని కొనసాగించే మేమందరం ఆయన శిష్యులుగా వినయంగా పనిచేస్తాం. ఈ దారికి వచ్చే అందరి దృష్టిని, భక్తిని దేవుని వైపు, మరియు వాళ్ళను దేవునికి పరిచయం చేయగల మన దివ్య-గురువు వైపుకు మళ్లించడమే మా ఏకైక కోరిక. అంతిమ కోణంలో, దేవుడు మాత్రమే గురువు అని గురుదేవులు మాకు గుర్తుచేసేవారు. గురుదేవుల ఏకైక అభీష్టం ఏమిటంటే, తాను దేవుని సాధనంగా మన ఆత్మలను వాటియొక్క దివ్య-మూలం వైపుకు ఆకర్షించటమే, అది మాత్రమే మన ఆత్మల యొక్క ఏకైక అన్వేషణ మరియు ఆధారం. గురువుకు విధేయత చూపడం అంటే దేవునికి విధేయత చూపించడం. గురు-సేవ మరియు గురువుగారి కార్యము నందు పాల్గొని సేవచేయటం దేవుని సేవయే, ఎందుకంటే మన మొదటి విధేయతను దేవునికి మాత్రమే ఇస్తాము. దైవికంగా నియమించబడిన ఆధ్యాత్మిక మార్గమే గురువు, ఆయన ఆశీర్వాదం మరియు ప్రేరేపిత బోధనల ద్వారానే మనం దేవుని తిరిగి చేరే మార్గమును తిరిగి కనుగొంటాము.

గురువుగారు ఈ భౌతిక తలం నుంచి నిష్క్రమించిన తరువాత శిష్యులకు గురు-శిష్య సంబంధాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం అవుతుందేమోనని నేను అనుకునేదాన్ని. ఈ సందేహాన్ని నేను గురువుగారికి ఎప్పుడు చెప్పలేదు; కానీ తరచుగా ఆయన మనం బయటికి చెప్పని ఆలోచనలకు సమాధానం ఇచ్చేవారు. ఒకనాడు సాయంత్రం ఆయన పాదసన్నిధిలో కూర్చుని ఉన్నప్పుడు ఇలా అన్నారు: “ఎవరైతే నన్ను దగ్గరగా తలుస్తారో వాళ్ళకు నేను దగ్గరగా ఉంటాను. ఈ శరీరం ఏమీ లేదు. మీరు నా భౌతిక రూపంతో అనుబంధం పెట్టుకుంటే, నన్ను అనంతత్వంలో కనుగొనలేరు. కానీ శరీరానికి అతీతంగా నా నిజ-స్వరూపాన్ని చూస్తే, అప్పుడు నేను మీతో ఎప్పుడూ ఉన్నానని మీరు తెలుసుకుంటారు.”

ఆ వాక్యంలోని సత్యాన్ని ఆ తరువాత కొంతకాలం వరకూ నేను పూర్తిగా గ్రహించలేదు. ఒక నాటి సాయంత్రం, నేను ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ ఆలోచన నాకు వచ్చింది: ఏసు క్రీస్తు భూమిపై జీవించిన కొద్ది సంవత్సరాలలో ఆయన చుట్టూ గుమిగూడిన శిష్యులందరినీ పరిశీలించండి. కొందరు ఆయన గురించి ఎక్కువగా ఆలోచించారు; కొందరు ఆయనకు నిస్వార్థంగా సేవ చేశారు. కానీ జనంలో ఎంతమంది నిజంగా అర్థం చేసుకున్నారు మరియు చివరిదాకా ఆయనని అనుసరించారు? ఆయన గొప్ప విచారణ సమయంలో మరియు ఆఖరి సమయంలో ఎంతమంది ఆయన పక్కన నిలబడి ఆయనకి మద్దతు ఇచ్చారు? ఏసును ఎరిగి, ఆయనను అనుసరించే అవకాశం ఉన్న చాలామంది ఆయన జీవితకాలంలో ఆయనని విడిచిపెట్టారు. అయినప్పటికి ఏసు క్రీస్తు ఈ భూమిని విడిచిపెట్టిన పన్నెండు వందల సంవత్సరాల తరువాత విధేయుడు, ప్రేమమయుడు, నిరాడంబరుడైన ఒక భక్తుడు వచ్చాడు. అతని అందమైన జీవితం, క్రీస్తుతో పరిపూర్ణ అనుసంధానం మరియు సంసర్గం ద్వారా క్రీస్తు బోధనలు అన్నింటికీ ఆదర్శ ఉదాహరణగా నిలిచి తద్వారా దేవుణ్ణి కనుగొన్నాడు. మా గురువుగారికి ఎంతో ఇష్టుడైన ఆ నిరాడంబర వ్యక్తి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి. సెయింట్ ఫ్రాన్సిస్ కి, ఏ అధ్యాత్మిక నియమం ద్వారా తన కన్నా పన్నెండు శతాబ్దాల పూర్వం భూమిపై నడయాడిన తన గురువుతో పరిపూర్ణ అనుసంధానం ఉండేదో, ఆ నియమం ఈనాటికీ మనందరికీ పనిచేస్తుంది.

నిజమైన దైవ-నియమిత సద్గురువు మరణం లేని అమరుడు. ఒకే లోకంలో ఉన్నా లేకపోయినా ఆయన తన శిష్యులను తెలుసుకొని వారికి సహాయం అందించగలడు. ఏ శిష్యుడైనా భక్తితో మరియు గురువుగారు బోధించిన గాఢమైన ధ్యానం ద్వారా గురువుగారితో అనుసంధానం ఏర్పరచుకోవడం కోసం కృషి చేస్తే, గురువుగారు భౌతికంగా ఉన్నప్పటితో సమానంగా ఇప్పటికీ, భవిష్యత్తులోనూ ఎప్పటికీ కూడా ఆయన మార్గదర్శకత్వం, ఆశీర్వాదం యొక్క హామీ ఉంటుంది. పరమహంస యోగానందగారి తరువాత వచ్చినవారు అందరికీ ఇది వూరట కలిగించి ఉండాలి. ఈ దివ్య-వ్యక్తిని ఆయన భూమిపై అవతరించినప్పుడు తెలుసుకునే అవకాశం కలగలేదని విలపిస్తున్న వారు అందరికీ: మీరు ధ్యానంలో నిశ్శబ్దంగా కూర్చొన్నప్పుడు ఆయనను తెలుసుకోవచ్చు. మీ భక్తితో మరియు ప్రార్థనతో మరింత గాఢంగా లోతులకు వెళ్ళండి, ఆయన పవిత్రమైన ఉనికిని అనుభవిస్తారు. ఆయనకు బదులు నిర్వహించడానికి మిగిలిన మేము ఎవరమూ, ఆయనని తెలుసుకుని అనుభవించలేకపోతే ఆయన కార్యాన్ని నిర్వహించుటకు నిస్సహాయులు అయ్యేవాళ్ళము. ఆయన ఆశీర్వాదములు మరియు మార్గదర్శకత్వం వలన, మాంస దేహంతో ఆయన మాతో ఉన్నతంగా ఇప్పుడు కూడా ఆయన మాతో ఉన్నారని తెలిసినందున, సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయటంలో మా పాత్ర పోషించడానికి మాకు బలం, సంకల్పం, ఉత్సాహం, భక్తి మరియు విశ్వాసం ఉన్నాయి.

పరమహంసగారి జీవితం మరియు రచనలు ప్రపంచ అభివృద్ధిని ప్రభావితం చేయడానికి ఇప్పటికే చాలా చేశాయి, ఇంకా ఆ ప్రభావానికి ఇది ప్రారంభం మాత్రమేనని నేను నమ్ముతున్నాను. మానవజాతి యొక్క మార్గాన్ని ప్రకాశవంతం చేయడానికి సత్య-కాంతి యొక్క అవతారాలుగా ఈ భూమిపై జీవించిన దైవిక ఆత్మల సమూహంలో పరమహంసగారు చేరారు. ప్రపంచం ఎప్పటికైనా ఆ కాంతి వైపుకు తిరగాలి, ఎందుకంటే దేవుని సంకల్పం మనిషి తన అజ్ఞానం వల్ల తానే నశించడం కాదు. మానవజాతి తన కళ్ళు తెరిచి మెరుగైన రేపటి ఉదయాన్ని చూడటానికై వేచి చూస్తూ ఉండాలి. పరమహంస యోగానందగారు మరియు దివ్య-ప్రకాశాన్ని ప్రతిబింబించిన ఇతరులు ఆ క్రొత్త రోజుకు కాంతి స్వరూపులైన మార్గదర్శకులు.

Finding the Joy Within You పుస్తకం కొఱకు ఆర్డరు చేయండి

ఇతరులతో పంచుకోండి